భానోదయం: ఫిబ్రవరి 2019

Home

28, ఫిబ్రవరి 2019, గురువారం

విందు భోజనాలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు

       
       విందు భోజనాలతో పర్యావరణ కాలుష్యం ఎలా ఏర్పడుతుంది అనుకుంటున్నారా.!! విందులో వాడే పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులతో పర్యవరణాన్ని కలుషితం చేస్తున్నారు.
 
     ఒకప్ఫుడు మోదుగ ఆకులతో తయారు చేసిన ఇస్తారాకులలో మరియు అరటి ఆకుల్లో వడ్డించేవారు. ఇవి కొన్ని రోజుల తర్వాత భూమిలో కలిసిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. కాని ప్లాస్టిక్ పేపర్ భూమిలో కలిసిపోవడాని ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. వీటిని తగలబెడితే పొగవల్ల గాలి కలుషితం అవుతుంది. డ్రైనేజీల్లో పారేస్తుంటారు అలా వర్షాకాలం వచ్చేసరికి నీరు కలుషితం అవుతుంది. అన్ని రకాలుగా కలుషితమే.

          ఇప్పుడు ఏ ఫంక్షన్ లో చూసిన పేపర్ ప్లేట్లు దర్శనమిస్తాయి. పెళ్ళిళ్ళు మొదలు చిన్న చిన్న ఫంక్షన్ల వరకు అందరూ వీటినే వాడుతున్నారు. పేపర్ ప్లేట్లు పేపరే అయిన పైన ఒక పొర మాత్రం ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. వేడి వేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లో తినవద్దని అందరికి తెలిసిన విషయమే అయిన సరే వాటినే ఉపయోగిస్తారు. వాటిని రిసైకిల్ పేపర్ తో తయారు చేస్తారు కాబట్టి దుర్వాసన కూడా వస్తుంటాయి కానీ వాటినే వాడుతుంటారు.వాటితో పాటు ప్లాస్టిక్ గ్లాసులను కూడా విచ్చలవిడిగా వాడుతుంటారు ఒకరు రెండు మూడు గ్లాసుల చొప్పున వృధా చేస్తుంటారు. తిన్న తర్వాత డ్రైనేజిల్లో వేస్తుంటారు. కొందరైతే కుప్పగా పోసి కాల్చేస్తుంటారు. అలా కాలుష్యాన్ని మరింత పెంచుతుంటారు. చదువుకోని వాళ్ళు తెలియక చేస్తుంటారు మరీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఇలా చేస్తే పర్యావరణానికి హానికరం అని చెప్పరు. కొంచెం కూడా పర్యావరణ స్పృహ లేని చదువులెందుకు. పర్యావరణ పరిరక్షణ భాద్యత ఎవరికి లేదు.

   ..  పేపర్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లు లేదా పింగాణీ ప్లేట్లు వాడాలి. ఇప్పుడు చాలా కార్పోరేట్ కంపెనీలు తమ సంస్థల్లో స్టీల్ ప్లేట్లనే ఉపయోగిస్తున్నారు. వీటిని కడగడానికి యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని కడిగేందుకు వేడి నీరు కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే ప్లాస్టిక్ గ్లాసులకి బదులు రాగి గ్లాసులు వాడండి పెళ్ళిలో రిచ్ గా ఉంటుంది. కుదరకపోతే టప్పర్ వేర్ ప్లాస్టిక్ గ్లాసులను వాడండి. వీటిని కూడా వేడి నీటితో శుభ్రపరుస్తారు కాబట్టి ఏ సమస్యలుండవు.

     ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు విందుభోజనం అంటే అందరూ నేలమీద కూర్చుని తృప్తిగా భోజనం చేసేవారు. వడ్డించేవారు అటు ఇటు తిరిగి వడ్డించేవారు. ఈ రోజుల్లో నిలబడి తినడం  ఫ్యాషనయిపోయింది. వడ్డించేవారు ఒకదగ్గర నిలబడి వడ్డిస్తున్నారు తినేవారు అటుఇటు తిరుగుతు తింటున్నారు. భోజనం చేసేటప్పుడు నిలబడి తినవచ్చా. పద్దతిగా కూర్చుని తినవచ్చుగా .? అంత ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేస్తారు భోజనానికి మాత్రం కూర్చుని తినే ఏర్పాటు చేయలేరా.?

   ఇప్పటికైనా ఆలోచించండి ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులను వాడడం మానేద్దాం. స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం.

అలాగే విందుభోజనం కూడా కూర్చుని తిందాం.

 మార్పు అనేది మన నుండే ప్రారంబిద్దాం మనం చేసి చూపుదాం ఇతరులు కూడా మనను చూసి మారుతారు.

25, ఫిబ్రవరి 2019, సోమవారం

ప్రేమ కాదు కామం

   
         ప్రేమ ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక అందమైన అనుభూతి. ఎవరైనా ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడడం సహజమే. తనకు నచ్చిన వారిని ప్రేమించి భాగస్వామిని చేసుకునేవారు కొందరైతే, మోసం చేసేవారే అధికం. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం ప్రేమ పేరుతో పార్కులు, శికార్లు అంటూ తిరగడం హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.
ఏ పార్కులోకి వెళ్ళిన ప్రేమపక్షులు కాదు కామపక్షుల దృశ్యాలే కనిపిస్తాయి. ఈ దెబ్బకి చిన్న పిల్లలతో పార్కులకు వెళ్ళడం మానేశారు జనాలు. ఈ విషయం పక్కన పెడితే నూటికి తొంబై శాతం ప్రేమలు అసలైన ప్రేమలు కావు. ఆ పది శాతం కూడా డౌటే మోసం చేసేవరకు తెలియదు.
అబ్బాయిల విషయానికి వస్తే చాలా మందికి ప్రేమ అంటే ఎమిటో తెలియదు కేవలం తమ శారీరక అవసరాల కోసం ప్రేమను వాడుకుంటున్నారు. వారి శారీరక సుఖాలు తీరాక అమ్మాయిలను వదిలించుకుంటారు ఒప్పుకోకుంటే అంతమొందించడాననికి కూడా వెనకాడటం లేదు.
ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయిన అమ్మాయిలు ఇలాంటి వారిని నమ్మి మోసపోతునే ఉన్నారు.

            ఇంటర్ చదివే వయసులో ప్రేమ అనేది అవసరమా చెప్పండి. వయసు ప్రభావం అనుకుంటే ఓకే వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు.? తమ పిల్లలు ఏం చేస్తున్నారు కాలేజికి వెళ్తున్నారా లేదా అని ఎప్పుడైనా గమనిస్తారా. తల్లిదండ్రులు పిల్లలపై ఒక కన్నేసి ఉంచితే మంచిది. తమ పిల్లలు ప్రేమ పేరుతో తిరుగుతున్నారని తెలిస్తే వెంటనే బుద్ది చెెప్పండి. ఇప్పుడే ఇలా తిరిగితే చదువు ఏమైపోతుంది  భవిష్యత్ లో ఎలా బతుకుతారు? చదువులు అటకెక్కుతాయి ఒకవేళ పెళ్ళి చేసుకున్న మీరు చదివిన చదువుకి ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం దేనికి సరిపోదు. ఆ తర్వాత గోడవలు కొట్లాటలు మొదలు విడిపోవడం జరుగుతుంది. అని ముందే వారి తమ భవిష్యత్ గురించి చెప్పండి అర్థం చేసుకునేవారైతే మారుతారు అర్థం చేసుకోలేని వారు అనుభవిస్తారు వారిని వదిలేయండి. చెప్పితే వినని వాళ్ళని చెడంగా చూడాలి అని అంటారు.
   
         యువతకు నేను చెప్పేది ఎంటంటే  ప్రేమించటం తప్పుకాదు ప్రేమ పేరుతో మోసం చేయడం తప్పు.
చిన్న వయసులో ప్రేమించడం తప్పు. మీరు ప్రేమించే వ్యక్తి ఎలాంటివాడో తెలియకుండా ప్రేమించడం తప్పు. మీ తల్లిదండ్రులు మీపై ఉంచిన  ఆశలు, నమ్మకాలను వమ్ముచేయకండి.   బుద్దిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడ్డాక ప్రేమలో పడండి ఈ వయసులో మెచ్యూరిటీ వస్తుంది ఒకరినొకరు అర్థం చెసుకుంటారు. జీవితంలో స్థిరపడుతారు కాబట్టి ఏ లోటు లేకుండా జీవితాంతం  హాయిగా ఉంటారు.

       నిజమైన ప్రేమికులు ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితాంతం తోడునీడగా ఉంటారు. శారీరక సుఖాలు తీరిపోగానే వదిలించుకునేది ప్రేమకాదు కామం. ఇలాంటి కామా ప్రేమికుల మాయమాటలు నమ్మి మోసపోకండి. అందమైన జీవితాన్ని ఆదిలోనే నాశనం చేసుకోకండి. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చెసుకోండి పెళ్ళి తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు. 

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఇంటి భోజనం కేరాఫ్ "హారిక మెస్"

       

              ఇంటి నుండి  పనిమీద బయటకు వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తామో తెలియదు. ఒకవైపు సమయానికి ఆకలి దంచేస్తుంటుంది. మనం వెళ్ళిన చోట మంచి ఆహారం అసలు ఆహారం దొరుకుతుందో లేదో తెలిదు. అలా ఒకరోజు అన్నయ్యకి హెల్త్ ప్రాబ్లం వల్ల  సొమాజిగూడలోని యశోద హాస్పిటల్ కి వెళ్ళడానికి నేను మాఅన్నయ్య, మా అల్లుడు ముగ్గురం వెళ్ళాం.
నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో ట్రైన్ దిగి అక్కడ నుండి యశోద హాస్పిటల్ దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాం. హాస్పిటల్ లో డాక్టర్ ను కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్లు తీసుకుని బయటకు వచ్చేసరికి మద్యాహ్నం రెండు అయ్యింది.
                  ఆకలి దంచేస్తుంది. రోడ్డు పక్కన ఏదైనా హోటల్ ఉంటే భోజనం చేద్దామని అనుకుంటు చుట్టూ చూసుకుంటు నడుస్తున్నాం ఆ దారి వెంబడి అంటే యశోద హాస్పిటల్ నుండి నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ వరకు ఒక్క హోటల్ లేదు. అలా నడుకుంటు వస్తుంటే ఒక కమాన్ పక్కన "హారిక మెస్" అని ఒక బోర్డు కనిపించింది. లోపలికి వెళ్ళాం అక్కడ ఒక రెండస్తుల ఇల్లు బాగా రద్దీగా ఉంది. దాని ముందు ఒక గుడి ఉంది.  కింద జనాలు ఎక్కువగా ఉన్నారు. మెట్లెక్కి పైకి వెళ్ళాం.
               
             మెస్ చాలా చిన్నగానే ఉంది. నాలుగైదు డైనింగ్ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. డైనింగ్ టేబుల్స్ సరిపోక చాలా మంది నిల్చునే తింటున్నారు. ఏం చేస్తాం ఇప్పుడు మనకు కుర్చొని తినడం ముఖ్యం కాదు ఆకలి ముఖ్యం కాబట్టి కౌంటర్లో మూడు ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాం. 80రూపాయలో  100రూపాయలో అనుకుంట ఫుల్ మీల్స్. ఈ మెస్ లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సర్వర్ ‌లు ఉండరు ఎవరికి వారే వడ్డించుకుని తినాలి. మేం కూడా వడ్డంచుకున్నాం ఇక్కడ భోజనం చేస్తున్న వారంతా చాలా పద్దతిగా భోజనం చేస్తున్నారు. అసలు  టేబుల్స్ లేవని  ఏమాత్రం విసుక్కోకుండా నిల్చునే తింటున్నారు.
మెను కూడా చాలా బాగుంది అన్నం తో పాటు రెండు రకాల కర్రీలు,పప్పు, సాంబారు, చట్నీలు , పెరుగు , దొండకాయ పకోడి మరియు చిప్స్ నాకైతే చాలా బాగా నచ్చేసాయి వంటలు. తృప్తిగా కడుపునిండా తిన్నాం.
     
               ఇక్కడ నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఎవ్వరు కూడా ఆహారం వేస్ట్ చేయడం లేదు.ఆహారం వడ్డించడానికి సర్వర్ లు ఉండరు కాబట్టి ఎవరికి వారే వడ్డించుకోవాలి. అందువలన ఎవ్వరు కూడా అన్నం వృథా చేయడం లేదు ఎందుకంటే ఎవరికి సరిపోయెంత వారు వడ్డించుకుంటారు కాబట్టి ఆహారం వృథా చేయడం లేదు. ఈ పద్దతి నాకు చాలా బాగా నచ్చింది ఇంట్లో భోజనం చేసినట్టే అనిపించింది. ఇక్కడ భోజనం చేసేవారిలో   అబ్బాయిలు ప్లస్ అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళంత సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ అనుకుంటా ఎందుకంటే ఇంత పద్దతిగా ఏ ఇబ్బంది లేకుండా అడ్జస్ట్ అయ్యి భోజనం చేస్తున్నారు. బయట ఎక్కడైనా హోటల్లో  ఇలా ఉంటుదా చెప్పండి ? బయటనుండి హోటల్లోకి కస్టమర్ వచ్చి రావడమే తరువాయి ఒరేయ్ ఇక్కడ "టేబుల్ లేవురా" నీళ్ళేవిరా 'కర్రీ ఏదిరా' అది ఏదిరా ఇది, ఏదిరా అంటూ, సర్వర్లకి ఓనర్ లకి చుక్కలు చూపిస్తారు. వాళ్ళెవరైనా ఎమోగాని.
 
          సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవడంలో వీళ్ళకు వీళ్ళేసాటి.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చిన్న మెస్ అయిన ఇంతమంది తినడానకి వస్తున్నారంటే దానికి కారణం ఇక్కడ పరిశుభ్రత, రుచికరమైన,  ఆరోగ్యకరమైన ఆహారం. ఇలా ఉంటే ఎంతదూరం నుండి అయిన వచ్చి భోజనం చేస్తారు.
ఇక నాకు ఈ "హారిక మెస్" ఎప్పటికి గుర్తుంటుంది మంచి భోజనం తో పాటు మంచి జ్ఞాపంకం మిగిల్చింది.

4, ఫిబ్రవరి 2019, సోమవారం

గూగుల్ ప్లస్ షట్ డౌన్

ఎప్రిల్ 2 నుండి గూగుల్ ప్లస్ ఉండదు షట్ డౌన్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ లో ఈ విషయాన్ని గూగుల్ అనౌన్స్ చేసింది. కొన్ని సాంకేతికపరమైన కారణాలవలన యూజర్ల డేటా
ఇతర వ్యక్తులకు చేరుతున్నట్టు గూగుల్ గుర్తించింది. అందువలన గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేస్తుంది. యూజర్లు తమ డేటాను ఎప్రిల్ 2లోపు బ్యాకప్ తీసుకోవలసిందిగా గూగుల్ చెబుతుంది.