భానోదయం: మే 2023

Home

హైదరాబాద్ కు మరో రెండు హుస్సేన్ సాగర్ లు రాబోతున్నాయి.

 హైదరాబాద్ కు అభివృద్ధిలో భాగంగా మరో రెండు హుస్సేన్ సాగర్ లు రాబోతున్నాయి. అందులో ఒకటి గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువులు హుస్సేన్ సాగర్ లా అభివృద్ధి చెందబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జలాశయాల‌ నీరు స్వచ్ఛంగా ఉంది. ఇకపై హుస్సేన్ సాగర్ నీటిలా పవిత్రంగా మార్చేస్తారు. 


111 జీవో రద్దుతో ఈ రెండు జలాశయాలు మురికి కూపంలా మారబోతున్నాయి. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ జీవోను రద్దు చేస్తున్నట్లు పాలకులు చెబుతున్నారు. పాలకులకు ప్రజలపై ఎంత ప్రేమ ఉందో కదా. ప్రజల కష్టాలను తీర్చడం కోసం మీ పాలకులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 111 జీవో వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు అందుకోసం ఈ జీవోను రద్దు చేశారు. ఇక్కడ భూముల విలువలు తక్కువగా ఉండటంతో రైతులు నష్టపోతున్నారు అని చెబుతున్నారు. అక్కడ  ఇదివరకే తక్కువ  ధరకు భూములు కొన్న పెద్ద రైతులు నష్టపోతున్నారు. అలాగే అక్కడ ఫామ్ హౌస్ లు కట్టుకున్న రైతులు నష్టపోతున్నారు అందుకోసం ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి 111 జీవోను రద్దు చేస్తుంది. ప్రభుత్వానికి రైతులంటే ఎనలేని ప్రేమ. 

2000 రూపాయల నోట్లను రద్దు చేయడం మంచిదే. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బంది ఉండదు.

 2000 రూపాయలు నోటు ఉపసంహరణ వలన సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర 2000 రూపాయల నోటు లేదు. అసలు ఈ నోటు చూసి చాలా రోజులైంది. బ్యాంకుల్లో, ఏటిఎమ్ లో కూడా ఈ నోటు రావడం లేదు. ఎవరో ఈ నోట్లను ఇంట్లో దాచుకుంటే తప్ప ఎవరి వద్ద ఈ నోట్లు లేవు. పెద్ద మొత్తంలో డబ్బును ఎవరు ఇంటిలో దాచుకోరు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకుంటారు కాబట్టి సామాన్య ప్రజలకు 2000 రూపాయల నోటు రద్దు వలన ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 


2016 లో లాగా బ్యాంకుల్లో వరుసలో నిలబడి నోట్లను మార్చుకునేందుకు పడిన అవస్థలు ఇప్పుడు ఉండవు. ఎందుకంటే అప్పుడు 1000, 500 నోట్లు రద్దు చేసారు తమ డబ్బు ఎక్కడ చెల్లుబాటు కాదో అని తమ దగ్గర ఉన్న నోట్లను ప్రజలు మార్చుకునేందుకు బ్యాంకులకు పరిగెత్తారు.అప్పుడు కూడాఏలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఎవరు కూడా పెద్ద మొత్తంలో డబ్బును తమ ఇంట్లో ఉంచుకోరు. బ్యాంకులోనే దాచుకుంటారు. 


ఇక అప్పుడు బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో జనాలు పరిగెత్తి ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచుకున్న బడాబాబుల వల్లే బ్యాంకుల వద్ద హడావిడి పెరిగింది.

తమ వద్ద ఉన్న కోట్ల రూపాయల నోట్లను సామాన్య ప్రజలకు ఇచ్చి మార్చుకునే ప్రయత్నం చేసారనిపిస్తుంది. అందువల్ల కొంత ఇబ్బంది కలిగింది. సామాన్యుల వద్ద మహా అయితే ఓ పదివేలు ఉంచుకుంటారు లక్షలు, కోట్లు ఇంట్లో ఉంచుకోరు కదా.

ఇబ్బందులు కలిగేదల్లా అక్రమార్కుల వల్లే ఎలాగైనా నోట్లు మార్చుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అందుకు సామాన్య ప్రజలకు కొంత డబ్బు ఆశ చూపించి పాతనోట్లను వారి ఖాతాల్లో జమ చేయించడం వలన బ్యాంకుల వద్ద జనాలు బారులు తీరారు. 


ఇప్పుడు కూడా 2000 రూపాయల నోటు రద్దుతో  ఇలాంటి ఘటనలు జరుగుతాయి. కోట్ల రూపాయల నల్లధనాన్ని సామాన్య ప్రజలకు ఇచ్చి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కాని అందుకు పరిమితి ఉంది రోజుకు ఇరవై వేలు మాత్రమే ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది జనాల చేత నోట్ల మార్పిడి చేయించే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఎవరి దగ్గర కూడా ఒక్క 2000 రూపాయల నోటు లేదు. ఉంటే రాజకీయ నాయకుల వద్ద మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద మాత్రమే ఈ నోట్ల కట్టలు ఉంటాయి.


2019  నుండే 2000 రూపాయల నోటును ముద్రించడం ఆపేసారు. అలాగే బ్యాంకులకు  డిపాజిట్ రూపంలో వచ్చిన నోట్లను తిరిగి జనాలకు ఇవ్వలేదు. అప్పటి నుంచి జనాల్లో 2000 నోటు అందుబాటులో లేకుండా పోయింది. కేవలం వందల కోట్లు అక్రమంగా సంపాదించిన వారివద్దే ఈ నోట్ల కట్టలు  ఉంటాయి. 


వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో ఈ నోట్లను పంచడానికి రాజకీయ నాయకులు దాచి ఉంటారు. ఇలాంటి వారికి పెద్ద సమస్యే. కాని ఎలాగోలా వారు నోట్లను మార్చుకుంటారు. ఎలాగంటే రాజకీయ నాయకులు అంటే అవినీతికి నిలువెత్తు నిదర్శనం. ఏ రూపంలో అయినా అవినీతి చేస్తూనే ఉంటాడు. అసలు రాజకీయం చేసేదే అవినీతి అక్రమ సంపాదన కోసం. వారికి ఎన్నో దారులు ఉంటాయి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసైనా తమ అవినీతి కొనసాగిస్తారు.  ఇక నోట్ల మార్పిడి వారికి సులువే తమ పలుకుబడి ఉపయోగించి చేసుకుంటారు. లేదంటే కార్యకర్తలకు, జనాలకు తలా ఇంత డబ్బు ఇచ్చి మార్చుకుంటారు అది వీలుకాకుంటే  దౌర్జన్యం చేసి అయినా మార్చుకుంటారు.


ఇక మొత్తానికి 2000 రూపాయల నోటను రద్దు చేయడం మంచి పనిచేసారు. అదికూడా ఈ సమయంలో. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేదు. అక్రమంగా సంపాదించిన అవినీతి పరులకే ఇబ్బంది..


నల్లధనాన్ని అరికట్టాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. చాలామంది అక్రమార్కులు 2016 నోట్లు రద్దు తర్వాత జాగ్రత్తలు పడుతున్నారు డబ్బును నిలువ ఉంచుకోకుండా భూములు కొనడం మొదలు పెట్టారు. ఇలా తమ అక్రమ సంపాదనతో వందల ఎకరాల భూమి కొంటున్నారు. ఇలా వందల ఎకరాల భూమి కొనే వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అసలు ఒక వ్యక్తికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కొనే హక్కు ఇవ్వకూడదు. అప్పుడే నల్లధనాన్ని కొంతవరకు అరికట్టగలం...


19, మే 2023, శుక్రవారం

ఏమి ఎండలు దేవుడా! దీనికి కారణం ఎవరు?

 ఎండలు మండిపోతున్నాయి ఏం ఎండలు దేవుడా ఇవి అని అంటున్నారు. బయట తిరగాలంటేనే భయం వేస్తుంది. మా గ్రామంలోనే 38 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇక నగరాల్లో అయితే 45 నుండి డీగ్రీలు ఉంటుంది.

 మరో పది ఏళ్ళలో 50 నుండి 55డిగ్రీలు దాటిపోతుంది. ఇందుకు కారణం ఎవరో కాదు అందరు కారణమే.  చెట్లు, అడవులను నరికేస్తున్నారు. కొండలు, గుట్టలు తవ్వేస్తున్నారు. సామాన్య ప్రజలు ఎవరు కొండలు, గుట్టలు తవ్వేయ్యరు కదా అనొచ్చు.

 

 కొండలను తవ్వేది ఇప్పుడు సామాన్యుల కోసమే. ఇంటి నిర్మాణంలో ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు ఇంటి ఫ్లోరింగ్ కి గ్రానైట్ వాడాల్సిందే. డబ్బు ఎంతైనా పర్వాలేదు. అప్పు చేసైనా గ్రానైట్ వాడాల్సిందే. మరి ఆ గ్రానైట్ కావాలంటే కొండలను కోయాల్సిందే. కంకర, డస్ట్ ఇలా అన్ని ఈ కొండలనుండే తయారు అవుతాయి కదా. ఒకప్పుడు ఈ కొండలు పచ్చని చెట్లతో అంత్తెత్తునా ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ ప్రాంతంలో ఎంత ఎండాకాలంలో అయినా చల్లగా ఉండేది. మరి ఇప్పుడో ఆ ప్రాంతంలో క్రషర్లతో కొండలను పిండి చేస్తున్నారు. పచ్చని ప్రాంతం అంతా వెలవెలబోతోంది దుమ్ము ధూళితో విపరీతమైన వేడితో అక్కడ చుట్టు పక్కల నిలవలేని పరిస్థితి.


ఇళ్ళు కట్టుకోవాలంటే కొండలను తవ్వాల్సిందే వేరే దారి లేదంటే అక్కడ జరుగుతున్న విద్వంసానికి మరోచోట చేట్లను పెంచితే కొంతవరకైనా పర్యావరణం కాపాడవచ్చు. 


ఎక్కడ చూసినా కాంక్రీటు మయం అయిపోయింది ఎండాకాలం వచ్చిందంటే కాంక్రీటు వలన  వేడి ఇంకా పెరిగిపోతుంది. వానాకాలం నీరు భూమిలోకి ఇంకిపోక వరదలు వస్తున్నాయి అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి కరువు ఏర్పడుతుంది.



మనకు ఎవరికి ఇవి  పట్టవు మనకు కావలసింది అభివృద్ధి మాత్రమే. ప్రకృతి ఏమైతే మాకేంటి. ఎండలు మండిపోయి, త్రాగడానికి నీరులేని దుస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది పర్యావరణం విలువ.


ఇలా పచ్చని ప్రకృతి అందాలు ద్వంసం అవడానికి కారణం ఏ ఒక్కరో కాదు అందరు కారణమే. మనం వాడుతున్నాం కాబట్టి వాడు కొండలు తవ్వేస్తున్నాడు. మరీ ఇప్పుడు ఇళ్ళు కాంక్రీటుతో కట్టకుండా ఎలా కడతాం అనుకోవచ్చు. ఇప్పుడు ఇళ్ళు కట్టుకోవడానికి కాంక్రీటు తప్ప వేరే దారిలేదు కాబట్టి అలా కొండలను తవ్వుతూ వెళ్ళాల్సిందే చివరకు ఎప్పుడో అప్పుడు ప్రకృతే సమతుల్యం చేస్తుంది. 

17, మే 2023, బుధవారం

రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి...

  టెక్నాలజీ మారుతున్న కొద్ది కొన్ని రంగాలు కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. ఇప్పుడు సినిమా థియేటర్లు మూత పడుతున్నాయి. దాదాపుగా దాశాబ్ధం క్రితం నుండే చిన్న చిన్న పట్టణాల్లో థియేటర్లను తీసేసి వాటినే ఫంక్షన్ హాల్స్ గా మార్చేసారు. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు కూడా తమ థియేటర్లను మూసేస్తున్నాయి. కారణం టెక్నాలజీ లో వచ్చిన మార్పు.
   ఒకప్పుడు వినోదం అంటే సినిమా థియేటర్లలో సినిమా చూడటమే ఒక సినిమా ను నాలుగైదు సార్లు చూసేవారు అప్పుడు థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతూ ఉండేవి. మరి ఇప్పుడు ఒక సినిమాని చూడాలంటే పదిసార్లు ఆలోచిస్తూ ఉన్నారు జనం. రెండున్నర గంటలు సినిమా చూసే ఓపిక ఇప్పుడు ఎవరికిలేదు, ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సినిమా అయినా చూసే వీలుంది. అదికూడా నచ్చిన సన్నివేశాలు చూస్తూ నచ్చని సన్నివేశాలు దాటవేస్తూ చూసే అవకాశం ఉంది. ఇంత సౌలభ్యం ఉండగా సినిమా థియేటర్లలో ఎవరు సినిమా ఎవరు చూస్తారు. రెండున్నర గంటలు సమయం, డబ్బు వృథా అని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి కొత్త కొత్త సినిమాలు చూడడానికి ఓటిటి యాప్స్ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉండగా ఇంకా థియేటర్లో సినిమాలు ఎందుకు చూస్తారు. 

 ఒకప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చూడాలంటే థియేటర్ వరకు వెళ్లి పెద్ద పెద్ద లైన్లో నిల్చుని టికెట్ల కోసం తొక్కిసలాటలో యుద్ధం చేసి టికెట్లు సంపాదించి, అక్కడ దొరకకుంటే బ్లాక్ లో ఎంత ధర అయినా కొని థియేటర్ లోపలికి వెలితే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ డబుల్ రేట్లకు కొని జెబుకు చిల్లు పెట్టుకోవాలి. ఇంత చేసినా థియేటర్ లోపల పోకిరీల హంగామా మరో తలనొప్పి. ఫ్యామిలీ తో వెళ్తే అంతే చుక్కలు కనిపిస్తాయి. 

 ఇన్ని ఇబ్బందులు పడి ఈ రోజుల్లో సినిమాలు ఎవరు చూస్తారు. ఎంచక్కా ఇంట్లోనే చిన్న థీయేటర్ లాంటి టీవీలు, సౌండ్ సిస్టం ఉన్నాయి. ఏ ఇబ్బందీ లేకుండా ఇంట్లోనే సినిమాలు చూసేయోచ్చు మీ వీలున్నప్పుడు.

ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్కు వెళ్ళేవారు. ఇప్పుడు సినిమాలే ఇంటికి వస్తున్నాయి. అంతా టెక్నాలజీ వల్లే. 

ఇప్పుడు జనాలు సినిమాలు చూడటం తగ్గించేసారు. షార్ట్ ఫిలిమ్స్, వ్లాగులు ఇవ్వే ఎక్కువగా చూస్తున్నారు. అరచేతిలో ఎంటర్టైన్మెంట్ ఉండగా సినిమా థియేటర్లు ఎందుకు దండగా అన్నట్టు ఉంది. ఆ విడియోలు కూడా స్కిప్ చేస్తూ చూస్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం వీడియో చూడడం గొప్ప కేవలం 15 సెకండ్ల వీడియోలు చూస్తారు అంతే. 15 క్షణాలు ఎక్కడ, మూడు గంటలు ఎక్కడ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో థియేటర్ లో మూడు గంటలు సినిమాలు చూసే ఓపిక ఎవరికి లేదు.  కాబట్టి రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి...