మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేసాడు అవి మానవాలికి ఉపయోగంతో పాటు కీడు కూడా చేస్తాయి. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ అయిన రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని సరియైన విధంగా ఉపయోగిస్తే అందరికి శ్రేయస్కరం. కాని వాటిని చాలా మట్టుకు వినాశనం ఉండే విధంగానే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తే మేధావులు తమ అతి తెలివితో వినాశనానికి దారితీస్తున్నారు.
ఏ ఆవిష్కరణ అయిన తరువాత వ్యాపారం అయిపోతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారాలతో ప్రకృతిని నాశనం చేస్తారు.
మనిషి ఆవిష్కరించిన వాటిలో అత్యంత చెత్త ఆవిష్కరణ "ప్లాస్టిక్". ఇది ఎంత చెత్త ఆవిష్కరణ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెత్తే కనిపిస్తుంది.
నేలపై, నదుల్లో, సముద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ చెత్తే కనిపిస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.. ఇన్ని రోజులు బయట మాత్రమే ఉండే ఈ చెత్త ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరంలో రక్తంలోకి కూడా చేరింది... ఇన్నాళ్లు పర్యావరణాన్ని చెత్తగా మార్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరాన్ని చెత్తగా మారుస్తుంది.
ఆవిష్కరణలు మనిషి జీవన విధానాన్ని ఎంత సులభతరం చేస్తయో అంతకంటే ఎక్కువగా నాశనం కూడా చేస్తాయి. ఆవిష్కరణలు రెండు వైపుల పదును వున్న కత్తుల్లాంటివి వాటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది విచ్చలవిడిగా వాడితే ముప్పు తప్పదు..
ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మానవ శరీరంలో రక్తంలోకి ఎలా చేరింది.?
ఎలా చేరిందంటే మనిషి విచ్చలవిడిగా వాడడం వలనే.
అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది.
అందులో కొన్ని నాకు తెలిసినవి:-
ఉదయం నుంచే మన పరుగు ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది.
ఉదయము కూరగాయలకు వెళ్తారు ఖాళీ చేతుల్తో. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు నింపుకుని వస్తారు.
పాలు ప్లాస్టిక్ కవర్లో.
కిరాణా సరుకులు ప్లాస్టిక్ కవర్లో.
బయట ఎక్కడైన టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో నే.
భోజనం ప్లాస్టిక్ ప్లేట్లలో నే.
ఆహారం ప్యాక్ చేయడం ప్లాస్టిక్ కవర్లో నే.
టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు.
అసలు ప్లాస్టిక్ వాడకం అనేది మామూలుగా లేదు అవసరం ఉన్నా లేకపోయినా వాడడం మాత్రం పక్కా.
అంతలా వాడితే మనిషి రక్తంలో ఏంటి ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ అయిపోయి "ప్లాస్టిక్ మనుషులు" గా మారిపోయిన ఆశ్చర్యం లేదు..!!!
ఉదయం లేవగానే కూరగాయలకు ఒక సంచి తీసుకుని వెళ్తే ఏమవుతుంది.? చాలామందికి చేతిలో సంచి తీసుకుని బయిటకు వెళ్తే నామోషో లేక బద్ధకమో తెలియదు కాని అస్సలు తీసుకెళ్ళరు.
ఖాలీ చేతుల్తో కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళి గంపెడు ప్లాస్టిక్ చెత్తను తీసుకువస్తారు. సరే తెచ్చారు వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా చేస్తారా అంటే అదిలేదు. ఇష్టం వచ్చినట్టు బయట పారేయడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఇలా కాల్చడం వలన ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసి ఆ గాలి పీల్చునప్పుడు శరీరం లోకి ప్రవేశిస్తున్నాయి.
ఇంకొందరు మహానుభావులు వేడి వేడి 'టీ' ని కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు. టీ కొట్టు వాడికి తెలియక పోవచ్చు వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయోద్దని చదువుకున్న వాళ్ళుకూడా తెలియదా అలాగే తాగుతున్నారు. అంత వేడి టీ ని ప్లాస్టిక్ కవర్లో పోస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి టీలోకి వెళ్ళి అది తాగినవారి శరీరం లోకి వెళుతుంది.
అలా చేయకుండా ఒక ప్లాస్క్ వాడితే సరిపోతుంది కదా. ప్లాస్క్ వాడడానికి బద్దకం, ఆ ప్లాస్క్ ను కొట్టు వరకు తీసుకువెళ్ళడానికి నామోషి.
ఇక నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో.
పల్లెటూళ్ళలో అయితే ఒకసారి తాగిపడేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ని పదే పదే నీళ్ళు నింపుకుని వాడుతుంటారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో ఎక్కువ రోజులు నీళ్ళు తాగితే అందులోని ప్లాస్టిక్ కణాలు అందులోని నీటిలోకి వెళ్తాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాడుతూ ఉంటారు. తెలిసిన
ఎవరూ చెప్పరు, చెప్పిన ఎవరూ వినరు...
ఇంకా పెళ్ళిళ్ళు, దావత్ లకు అప్పట్లో మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో భోజనం వడ్డించేవారు. ఆ విస్తరాకుల్లో తృప్తి గా భోజనం చేసేవాళ్ళం. వాటిని తీసుకెళ్ళి పెంటలో వేసే వాళ్ళు అవి ఎరువుగా మారేవి... ఇప్పుడు పేపర్ ప్లేట్లో వడ్డిస్తున్నారు ఈ పేపర్ ప్లేటునుంచి ఏదో దుర్గంధం వస్తుంది. పైగా వాటిపై ప్లాస్టిక్ కవర్ ఉంటుంది వేడి పదార్థాలు అందులో తింటే ప్లాస్టిక్ శరీరంలోకి చేరకుండా ఉంటుందా..?
ఎంత చక్కనివండి అప్పట్లో మన పల్లెల్లో "మోదుగ ఆకులతో" తయారు చేసిన విస్తరాకులు. అందులో భోజనం చేస్తే అమోఘం. వీటి వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా అవి ఎరువుగా ఉపయోగపడుతాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ విస్తరాకుల వలన అన్ని విధాలుగా నష్టమే ఎక్కువ...
మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని మరిచిపోయి ప్లాస్టిక్ వెంట పరిగెత్తి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం...
ప్లాస్టిక్ వలన ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం ఎక్కువగా వాడుతున్నారు. కాని పరోక్షంగా దీని నష్టాలు గమనించడం లేదు.
ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది..
కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళినప్పుడు జనపనార (జ్యూట్ )బ్యాగులు కాని కాటన్ బ్యాగులు కాని వెంట తీసుకెళ్ళాలి.
పేపర్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాని, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకులు వాడాలి.
బయట నుండి పార్శిల్ తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకోవడం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.....