అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.
పచ్చటి పంటపొలాలను నాశనం చేసి ఫ్లాట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు మా ఊరి భూముల్లో పంటలు
పండేటివి.కాని ఇప్పుడు ఫ్లాట్లు పండుతున్నాయి.
హైదరాబాద్ కు చుట్టుపక్కల 100 కి.మీ దూరంలో ఎక్కడ చూసినా పొలాలు లేవు ఫ్లాట్లు, వెంచర్లే కనిపిస్తాయి. అక్కడక్కడ కొంత పొలాలు ఉన్న ఇంకొన్ని రోజుల్లో అవి కనుమరుగైపోతాయి.
ఎవరి నోట విన్న వెంచర్లు,ప్లాట్లు,కోట్లు ఇవే మాటలు.
రైతులకు లక్షలు,కోట్లు ఆశ చూపించి భూములు కొనుగోలు చేయడం వెంచర్లు వేయడం ఇదేపని.
పాపం రైతులు ఎప్పుడు అంతడబ్బు చూసి ఉండరు ఒకేసారి ఎకరం కోటి రూపాయలు అనేసరికి ఎగిరిగంతేసి భూములు అమ్మేసుకుంటున్నారు.
భూములు అమ్మని రైతులను ఎలాగోలా అమ్మేలా చేస్తున్నారు. రైతుల భూములకు దారిలేకుండా చేసి భూములు అమ్ముకునేలా చేస్తున్నారు.
రోడ్డు ప్రక్కన భూమి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ గ్రద్దలు అక్కడ వాలిపోతాయి. ఆభూమిని ఎలాగోలా ఎన్ని డ్రామాలు ఆడైనా కొనేస్తారు. ముందుగా రోడ్డు ప్రక్కన ఉన్న భూమిని కొనేస్తే వెనకాల ఉన్న పొలాలను కొనడం వారికి తేలికవుతుంది. ఎందుకంటే వారికి దారి ఇవ్వకుండా చేసి భూములు అమ్మేలా చేస్తారు. పచ్చని పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకోవడం. మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారు,అవుతున్నారు. వేలిముద్రలు (అంగూటి) వేసేవాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు.
మద్యలో బ్రోకర్లు అబ్బో వీళ్ళగురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారులదైతే ఆచరణ బ్రోకర్లది. వీళ్ళు ఏలాగైనా సరే రైతులను భూములు అమ్ముకునేలా చేస్తారు. ఎలాగైనా సరే....!
వాళ్ళ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు...
నా చిన్నప్పుడు పంటపొలాల్లో అన్నిరకాల పంటలు పండేవి. రాను రాను పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు అవికూడా లేవు 50% పంటపొలాలు ప్లాట్లుగా మారాయి. ఎందుకు ఈపరిస్థితి దాపురించింది అంటే.నా చిన్నప్పుడు పంటలు బాగా పండేవి పాడిపశువులు ప్రతీ ఇంటికి ఉండేవి. వాటి పేడ ఎరువుతోనే పంటలు పండేవి. చీడపీడలు ఉండేవి కావు. రసాయన మందులు అసలు ఎవరికి తెలియదు.కృత్రిమ ఎరువులు, విత్తనాలు వాడలేదు. అప్పుడు రెైతులు అన్నిరకాల అపరాలు,జొన్నలు,వరి, మిరప, కొర్ర, సజ్జలు, రాగులు,పసుపు వంటి ఆహార పంటలే పండించేవారు.
వ్యవసాయం అంటే పెట్టుబడి ఉండేదే కాదు కేవలం రైతు శ్రమే వ్యవసాయానికి పెట్టుబడి. విత్తనాలు సొంతంగా తయారు చేసుకునేవారు,ఎరువులు పశువుల పేడ. అలా వ్యవసాయం చేసారు కాబట్టి దిగుబడులు బాగా వచ్చేవి.
ఎవరి ఇంట్లో చూసినా గుమ్ములకు, గుమ్ములు జొన్నలు,బియ్యం,కందులు,కొర్రలు, పెసలు ఉండేవి.
డబ్బు ఎక్కువగా ఉండేదికాదు. అయినా సంతోషంగా ఉండేవాళ్ళు.
ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి వ్యవసాయం నాశనం అవుతూ వచ్చింది. డబ్బు ఆశ చూపించి ఈ పంటలు వేస్తే ఇంత దిగుబడి వస్తుంది ఇంత ధర ఉంటుంది అంటు రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్ళేలా చేసారు. ముఖ్యంగా పత్తిపంట. మొదట్లో దిగుబడులు బాగా వచ్చే సరికి చాలామంది రైతులు పత్తిపంట వేయడం ప్రారంభించారు. పత్తి విత్తనాలు రైతులు తయారు చేసుకోలేరు విత్తన కంపేని వారు తయారు చేసే విత్తనాలే వాడాలి. అలా విత్తన కంపెనీలు విత్తనాన్ని తమగుప్పిట్లోకి తీసుకుని వ్యాపారం మొదలెట్టాయి.
ఏం భూమిలో అయినా ఎన్ని రోజులు దిగుబడులు వస్తాయి ఒకే పంట వేస్తుంటే? మొదట్లో దిగుబడులు వచ్చినా రాను రాను దిగుబడులు తగ్గాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యాపారం మొదలైంది ఎరువుల వ్యాపారం ఈ ఎరువులు వాడండి దిగుబడి పెరుగుతుంది అని ఎరువులు కొనేలా చేసారు. తరువాత పురుగుమందులు ఇలా మొత్తం వ్యవసాయాన్ని పెట్టుబడి లేనిదే చేయలేమనే స్థాయికి తీసుకొచ్చారు.
ఒకప్పుడు రైతులు స్వయంగా తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసుకునేవారు. పురుగుమందుల వాడకం అసలే ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడి లేనిదే చేయలేని స్థితికి తీసుకొచ్చారు.
వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొచ్చారు.
ఒకప్పుడు ఆహారం పంటలు మనదగ్గరే పండేవి కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి ఆహార పంటలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గాయి.పశుసంపద తగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్ని కొనుక్కోవలసిందే.విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనిదే ఏమి తినలేం. పంటలు ఎలాగు పండవు అందుకని భూములు అమ్ముకొంటున్నారు.
అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు తిని హాయిగా ఆరోగ్యంగా జీవించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, పురుగుమందులు వేసి పండించిన పంటలు తిని రోగాల పాలు అవుతున్నారు.
ఇదా అభివృద్ధి అంటే...???
మనిషికి కావలసింది ఏంటి కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యకరమైన జీవితం. అంతే కాని డబ్బు కాదు.
కాని డబ్బు డబ్బు అని ఆశ చూపించి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని నాశనం చేస్తున్నారు.
దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చేను కంచె చేసినట్టు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నరు. ఎందుకు ఈ కోట్లు డబ్బులు తింటారా, ఆరోగ్యం పాడైనాక ఎన్నికోట్లు ఉండి ఏం లాభం. పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నాశనం చేసే కోట్ల రూపాయల డబ్బు ఎందుకు...? పర్యావరణం నాశనం అయ్యాక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి మునుపటి స్థితికి రాదు.
111 జీవోను ఎత్తేసి రెండు నదుల పరివాహక ప్రాంతంలోని రైతులను కోటీశ్వరులను చేస్తాం అని సారు చెప్తున్నాడు. జీవో ఎత్తేస్తే ఏమవుతుంది ఆ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలు, అపార్ట్ మెంట్లు పరిశ్రమలు వస్తాయి.పరిశ్రమలనుండి విడుదలయ్యే కాలుష్యం తో రెండు నదులు, రెండు జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో గాలి,నీరు,నేల అన్నిరకాలుగా కలుషితమే. ఇప్పుడు జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుంది. జీవో ఎత్తేస్తే అటుపక్కకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది.
ఎలాగంటారా ఆ సుగంధాన్ని భరించలేం మరి....!!!
2018 లో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, బుద్దుని విగ్రహం చూద్దామని నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగాను. అక్కడ నుండి ప్రారంభం అయ్యింది ఏదో దుర్గంధం ఎంటీ వాసన అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను. అప్పటికే ఆ వాసనకి తల పట్టేసింది ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సువాసన పెరిగిపోయింది. ఈ లోపు హుస్సేన్ సాగర్ కనబడింది. అందులో నీళ్ళు చూసేసరికి అర్థం అయింది ఆ దుర్గంధం ఈ సాగర్ నుండే వస్తుందని. ఆ నీళ్ళల్లో కూడా బోటు షికారు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుండే ఆ వాసన భరించలేక తల తిరుగుతోంది అలాంటిది హుస్సేన్ సాగర్ మద్యలో బోటు షికారు చేస్తున్నారు అంటే నిజంగా మీకు దండం పెట్టాలి..🙏🙏🙏🙏
అంతటి దుర్గంధభరితమైన నీటిలో బోటు షికారు చేసే వారిని చూసినపుడు నాకు ఆశ్చర్యం,జాలి, అసహ్యం, అన్ని ఒకేసారి అనిపించాయి..
అతిపెద్ద సాహసం అది.....!!!
5నిమిషాలు కూడా అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కు వెళితే అక్కడకు కూడా సాగర్ సువాసన వస్తూనే ఉంది..
నేను చాలా సార్లు విన్నా ట్యాంక్ బండ్,బుద్దుని విగ్రహం ఆ చుట్టుపక్కల పార్కులు బాగుంటాయి అని గొప్పలు చెప్పెవారు. నాకు అక్కడకు వెళ్ళి చూడాలని కుతూహలంగా ఉండేది. ఇక్కడకు వచ్చి చూసాక తెలిసింది ఈ కాలుష్యం గురించా ఇంత గొప్పగా చెప్పారని. ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో నిండిన ఆ ప్రాంతంలో10నిమిషాలు కూడా ఉండలేం.. అందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని...
ఇది చూసిన తర్వాత నేను ఒకటి బలంగా చెప్పగలను
దీనికంటే లక్షరెట్లు మా ఊరి చెరువులు గొప్పవని..
స్వచ్చమైన గాలి, నీరు, నింగి,నేల ఉన్న నా పల్లెటూరు గొప్పది...
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి సరస్సే కదా మరి ఇప్పుడు కాలుష్య సాగర్ గా మారింది. దీనికి కారణం అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వ్యర్థాలను సాగర్ లోకి వదిలి పెట్టి, కనీసం ఆనీటిని తాకడానికి కాదుకదా చూస్తేనే, అటునుండి వెళ్తేనే వాంతికొచ్చెలా చేసారు....
అభివృద్ధి వద్దనడం లేదు కాని ప్రణాలిక లేని అభివృద్ధి మానవాళికి చేటు.. ప్రపంచంలో హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు నదుల పక్కనే ఉన్నాయి అక్కడ ఇలాంటి కాలుష్యం లేదే... మరి మన దగ్గర ఎందుకిలా అంటే మన నాయకుల స్వార్థ రాజకీయాల వలన ఇలా ఉంది..
ఎందుకు ఇది చెబుతున్నానంటే రోడ్లు, బిల్డింగ్స్ కట్టేసి సహజ వనరులను మురికి కూపంగా మార్చడం అభివృద్ధి కాదు.. హుస్సేన్ సాగర్ బాగు చేయడం ఈ జన్మలో జరగదు. సరే వదిలేద్దాం.. ఇప్పుడు 111 జీవో ఎత్తేసి జంట జలాశయాలను కూడా హుస్సేన్ సాగర్ లా మార్చాలనుకుంటున్నారు.... సారు..
ఇప్పుడు రెండు జలాశయాలు స్వచ్చమైన నీటితో శుభ్రంగా ఉన్నాయి.. వాటి చుట్టుపక్కల పరిశ్రమలు, బిల్డింగ్స్ కట్టేసి వాటిని కూడా మురికి కూపంగా మార్చేయాలి... ఇదేందయ్యా ఇది అంటే అభివృద్ధి..
అప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను హుస్సేన్ సాగర్ 2, హుస్సేన్ సాగర్ 3అని అనాలి...
ఇప్పటికీ మూసీ నది గండిపేట చెరువు వరకు స్వచ్ఛమైన నీటితో జూన్ లో వర్షాలు ప్రారంభం నుండి డిసెంబర్ వరకు ప్రవహిస్తుంది. మన నాయకుడు అభివృద్ధి చేసిన తర్వాత మురికి కూపంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది వ్యర్ద జలాలతో.
ఎవరు 111 రద్దు చేయమని చెప్పింది. ఈ జీవో వలన భూముల ధరలు లేక రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. రైతుల నష్టం ఏమో కాని నాయకుల లాభం కోసం అని అందరికి తెలిసిందే... నిజంగా ఏ నాయకుడికి రైతులపై, ప్రజలకు మంచి చేయాలని ఉండదు. కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇన్ని డ్రామాలు. ఆ ఓట్లను నోట్లతో కొనాలి. మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇలా అభివృద్ధి పేరిట దోచుకుంటే వస్తుంది..
అయ్యా మీరు ప్రజలను కోటీశ్వరులను చేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను నాశనం చేయకుంటే చాలు అదే పదివేలు....🙏🙏😌😌..
సొంత లాభం కొంత మానుకోని
పరుల సేవకు పాటుపడవోయ్.
ప్రజల సేవకు పాటు పడకపోయినా పర్వాలేదు.
పర్యావరణాన్ని నాశనం చేయకండి..
chakkagaa teliya cheppaaru.
రిప్లయితొలగించండిఅసలు మూసీనదిని ఒక మురికికూపంగా మార్చింది ఈఅద్భుతమైన అభివృద్ధి మాత్రమే కదా!
రిప్లయితొలగించండిఅవును. ప్రణాళిక లేని అభివృద్ధి వలన మూసీ నది మురికి కూపంగా మారింది.
తొలగించండి>>అసలు మూసీనదిని ఒక మురికికూపంగా మార్చింది ఈఅద్భుతమైన అభివృద్ధి మాత్రమే కదా!
రిప్లయితొలగించండిమరి అభివృద్దంతా చంద్రబాబు పుణ్యమేకదా. :P
ఏం నాయకుడైనా ఎలా పదవిలోకి రావాలి, పదవిలోకి వచ్చాక మళ్లీ గెలవడానికి ఏం చేయాలి. అనే ఆలోచిస్తాడు కాని ప్రజలకు మంచి చేయాలని ఏ నాయకుడికి ఉండదు..
తొలగించండిప్రజలను ఓటు బ్యాంకుగానే చూస్తారు..
అవుననుకుంటా నండీ. 1995 వరకూ మూసీనీళ్ళను ఇంటింటికీ త్రాగునీటిగా సరఫరా చేసేవారట!
తొలగించండిమంచి వ్యాసం వ్రాశారు. పంటలు పండే భూములు ప్లాట్లు గా మారిపోయాయి. Regional Ring Road వచ్చిందంటే మరింత ' అభివృద్ధి ' జరుగుతుంది. ఆంధ్ర లో 54000 వేలు ఎకరాలు సారవంతమైన వ్యవసాయ భూమి రాజధాని పేరుతో సేకరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల తెలుగు రాష్ట్రాలలో ఆహార ధాన్యాలు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
రిప్లయితొలగించండిఅవును. ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతూనే ఉంది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే.!
తొలగించండిఔనండీ. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేదాకా.
రిప్లయితొలగించండి