భానోదయం: వ్యవసాయం మీద ప్రేమతో ఎకరం విస్తీర్ణంలో బావిని తవ్వించిన రైతు భగీరథుడు.

Home

2, ఏప్రిల్ 2022, శనివారం

వ్యవసాయం మీద ప్రేమతో ఎకరం విస్తీర్ణంలో బావిని తవ్వించిన రైతు భగీరథుడు.


 ఆలోచన అంటే ఇది, అభివృద్ధి అంటే ఇది, పర్యావరణ పరిరక్షణ అంటే ఇది..


   


    ఒక సామాన్య రైతు గొప్ప పని చేసాడు కాదు కాదు భగీరథ ప్రయత్నం చేశాడు. చేసి సాధించాడు. 


మహారాష్ట్ర బీడ్ జిల్లా పదల్షింగి గ్రామానికి చెందిన రైతు  మారుతి బాజ్గుడే సాధించిన విజయం చూస్తే గర్వంగా ఉంది.. 


బీడ్ జిల్లా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండడం వలన నీళ్ళ కరువుతో పంటలు పండేవి కావు.  మారుతి అనే రైతుకు 12 ఎకరాలు పొలం ఉంది ఎంత పొలం ఉంటే ఏంటి లాభం నీళ్ళు లేకుంటే..


అప్పుడు ఆ రైతు ఆలోచన ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే తన పొలంలో నీళ్ళ కరువే లేకుండా చేయాలనుకుని ఒక ఎకరం విస్తీర్ణంలో, నలబై అడుగుల లోతుగా  బావిని తవ్వాలనుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం అంటే మామూలు విషయం కాదు అదికూడా ఒక రైతు.


 ఇది జరిగే పనేనా!


ఇంత విశాలమైన బావిని తవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది. 


తవ్వినాక నీళ్ళు రాకుంటే పరిస్థితి ఏంటి?



ఇవేవి మారుతి పట్టించుకోలేదు.

కేవలం తాను అనుకున్నది సాధించాలి అంతే.

తన పొలం ఎప్పుడు పంటలతో  కళకళలాడుతూ ఉండాలి. 


తను అనుకున్నట్టుగానే బావిని తవ్వించాడు. బావిచుట్టు కాంక్రీటు తో గోడ నిర్మించాడు.

 అందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర రూపాయలు..

అంత ఖర్చా ..! అది నీళ్ళ కోసం..!


అని అందరూ నోరెళ్ళబెడతారు. ఇది పిచ్చి పని అనికూడా అంటారు.

అదే కోటిన్నర తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అంటారు..


కాని మారుతి గారు ఇవేమి పట్టించుకోకుండా వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేసాడు.


తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఎకరం విస్తీర్ణంలో ఉన్న బావిలో పుష్కలంగా నీరు ఉంది. ఆ నీటితో తన పదకొండు ఎకరాల పొలానికి నీరు అందుతుందని అంటున్నాడు. అందులో అన్నిరకాల పండ్ల మొక్కలు, అన్నిరకాల పంటలు వేస్తానంటున్నాడు.


"నీవు ప్రయత్నం చేయి ఫలితం భగవంతుడు చూసుకుంటాడు అన్నట్టు"..

మన ఆలోచన మంచిదైతే మన ప్రయత్నంతో ఏ పని చేసిన ఫలితం సాధించవచ్చు అని నిరూపించారు మారుతి గారు. ఆయన పేరు మారుతి అంటే హనుమాన్. ఆనాడు ఆ హనుమాన్ కొండను పెకిలించి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మారుతి బీడు భూముల్లో బావిని తవ్వి గంగమ్మను తీసుకొచ్చాడు.. తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు.




చాలా మంది అనుకుంటారు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం ఎందుకు.

అదే డబ్బు తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అని..


అదే మనదగ్గర అయితే ఈ పాటికి అలాంటి భూమి ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకునేవాళ్ళు.

ఉన్న నీటి వనరులను కాలుష్యం చేస్తారు.


కాని మారుతి గారు వ్యవసాయం మీద ప్రేమతో ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా తాను అనుకున్నది సాధించాడు.


మారుతి గారు కోటిన్నర ఖర్చు పెట్టిన దానికి ఆయన పొందే ఆనందానికి ఎన్ని వేల కోట్ల డబ్బుతో వెలకట్టలేనిది.


అప్పటి వరకు బీడుగా ఉన్న పొలం తన ప్రయత్నంతో పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంది. విశాలమైన బావిలో పుష్కలంగా నీరు ఉంది. తను పెంచుకున్న వివిధ రకాల పండ్లు మొక్కలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో తన పొలం గట్టు మీద నీటి కాలువ పక్కన ఉన్న ఒక పచ్చని చెట్టుకింద నులక  మంచం వేసుకుని ఒక కునుకు తీస్తుంటే ఆ ఆనందం ఎన్ని లక్షల కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి..


 చుట్టూ పచ్చని పంటపొలాలు,

 పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, 

 పొలం గట్టున కాలువలో  చిన్నగా పారే నీటి సవ్వడి, ఆకాలువ నీటితో తడిసిన మట్టి సువాసన,

 ఈ వేసవిలో   మద్యాహ్నం వీచే పిల్లగాలులు. వీటన్నింటిని ఆస్వాదిస్తూ ఆ చెట్టు కింద కూర్చుని ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఆనందానికి ఎన్ని కోట్లు వెల కట్టగలం.


మారుతి గారు ఏడాది పొడవునా పంటలు పండిస్తూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. 


 ఆయన తను పెట్టిన ఖర్చు తిరిగి సంపాదిస్తాడా అంటే? సంపాదిస్తాడు. 

  

ఎందుకంటే మనదగ్గర వ్యవసాయం తగ్గిపోయింది త్వరలో ఆహార సంక్షోభం తలెత్తుతుంది. అప్పుడు మారుతి లాంటి రైతులు వద్దే ఆహార ధాన్యాల ఉంటాయి కాబట్టి వారు అప్పుడు కోట్లు సంపాదిస్తారు.


ఆయన కోట్లు సంపాదించడం కంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాడు అది చాలు ఆయనకు ఈ జన్మకు సంతృప్తి..












 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి