భానోదయం: ఈ సన్నివేశం ఎంతో రియాలిటీ గా ఉంటుంది. డైరెక్టర్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Home

10, జులై 2022, ఆదివారం

ఈ సన్నివేశం ఎంతో రియాలిటీ గా ఉంటుంది. డైరెక్టర్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే..!




 


   ఈ సన్నివేశం చూస్తే ఎంత రియాలిటీ గా తీశారు అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడికి హాట్సాప్ చెప్పాలనిపిస్తుంది.

ఆ డైలాగులు మాత్రం చాలా సహజంగా ఉంటాయి..


      ఈ సినిమాలో హీరో పేపర్ బాయ్ హీరోయిన్ ధనవంతుడి కూతురు ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమిస్తే సరిపోతుందా వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా. హీరోయిన్ కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. హీరో తల్లి దండ్రులు ఒప్పుకుంటారు ఎందుకంటే ధనవంతుల అమ్మాయి మనలాంటి పేదవాడి అబ్బాయిని ప్రేమించిందని గొప్పగా భావిస్తారు. మరీ డబ్బున్న వాళ్ళు తమ అమ్మాయి ఒక పేదవాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకుంటారా ససేమిరా ఒప్పుకోరు. ఆ స్థానంలో ఎవరున్నా ఒప్పుకోరు.  ఈ సినిమాలో కూడా హీరోయిన్ కుటుంబ సభ్యులకు తమ అమ్మాయిని ఒక పేపర్ బాయ్ కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. కాని హీరోయిన్ మాత్రం అతన్నే పెళ్ళి చేసుకుంటానని పట్టుబడుతుంది. దింతో కూతురి మీద ప్రేమతో హీరోయిన్ తండ్రి అతనితో పెళ్లికి  ఒప్పుకుంటాడు.. 


కాని హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు. ఆఫ్ట్రాల్ ఒక పేపర్ బాయ్ కి నా చెల్లినిచ్చి పెళ్ళి చెయ్యాలా అంటూ కోపంతో ఊగిపోతారు.  ఇలాంటి సన్నివేశాల్లో వేరే ఏ సినిమాలో అయిన పెద్ద పెద్ద ఫైట్లు భారీ భారీ డైలాగులు ఛాలెంజ్ లు ఉంటాయి. కాని ఇక్కడ అవేమి ఉండవు. కేవలం హీరోయిన్ అన్నయ్యలు ఇద్దరు హీరో ఇంటికి వెళ్ళి నాలుగు మాటలు చెబుతూ బాధ పడుతుంటారు అంతే హీరోకి ఒక్క మాట కూడా రాదు. అవును ఇది నిజం రియాలిటీ ఇలాగే ఉంటుంది. 


వాళ్ళు ఏమాట్లాడుతారంటే...


హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలు హీరో ఇంటికి వస్తారు.

వాళ్ళు రాగానే హీరో అమ్మానాన్నలు కంగారు పడుతూ రండిబాబు మీరా రండి రండి కూసోండి, కూసోండి అంటు అదరా బాదరా పడుతుంటారు.


  ఈ టైం లో వచ్చారు ఏంటండీ.? అంటుంది హీరో అమ్మగారు.

  పొద్దున్నుండి పెళ్ళి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయ్యిందాంటీ అంటాడు హీరోయిన్ అన్నయ్య. అలా అంటూనే నాన్న గారు ఇది ఇమ్మాన్నారని చేతిలో ఒక కవర్ పెడతాడు. దాన్ని చూసి ఏంటి బాబు ఇది అని అంటారు హీరో తండ్రి. 


''డబ్బండీ'' అంటారు హీరోయిన్ అన్నయ్యలు.

మా పద్దతి ప్రకారం  మగపెళ్ళి వారి బట్టలకు ఆడపెళ్ళి వారే డబ్బులు ఇస్తారు అంటారు.

 అందుకు వద్దు బాబు ఉన్నంతలో మేం కొనుక్కుంటాం అంటు,  ఇంత బరువు మేం మోయలేమని అంటుంది హీరో అమ్మగారు.


"5లక్షలే మేయలేమని అంటున్నారు రేపు మీ ఇంటికి మా ఇంటి మహాలక్ష్మి రాబోతుంది ఎలా మోస్తారు" అంటాడు హీరోయిన్ అన్నయ్య.


"నా కూతురులా చూసుకుంటాను అయ్యా" అంటుంది హీరో అమ్మగారు.


ఇంతలో మాటల సంగతి తర్వాత ముందు పొయ్ ఛాయ్ పెట్టు అంటాడు హీరో నాన్న..


ఈ టైంలో ఛాయ్ ఏంటీ అంకుల్ పదవుతుంది పొద్దన్నుండి షాపింగ్ లో పడి అన్నమే తినలేదు ఉంటే అన్నమే పెట్టండి అంటారు హీరోయిన్ అన్నయ్యలు.


ఉండండి రెండు నిమిషాల్లో తయారు చేస్తాను అంటుంది హీరో అమ్మగారు..


"ఆంటీ ఉన్నదే పెట్టండి రేపు పెళ్లయ్యాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా" అంటారు.


ఇదంతా చూస్తూ హీరో ఒక్క మాట కూడా మాట్లాడడు.


ఇక వాళ్ళిద్దరికి రెండు కంచాల్లో అన్నం, పప్పు చారు వడ్డిస్తుంది హీరో అమ్మగారు.


అది చూస్తే మనకే అనిపిస్తుంది డబ్బున్న వాళ్ళు ఇలా అన్నం చారు తింటారా అని..? 


నాకు తెలిసి ధనవంతుల ఇళ్ళల్లో డైనింగు టేబుల్ మీద ప్రతిరోజు నాలుగైదు కూరలు, సాంబారు, పెరుగు, నెయ్యి, అప్పడాలు, నాలుగు రకాల పచ్చళ్లు, వేపుళ్లు ఇలా మెను పేద్దగా ఉంటుంది. ఇలాంటి ఆహారం పేదవారికివిందుభోజనం... కాని ధనవంతులకుమాత్రం రోజు సాధారణ భోజనమే... అలాంటిది కేవలం అన్నం చారు తినాలంటే వాళ్ళు తింటారా... ముద్ద దిగదు కదా...




 ఇక వాళ్ళు అన్నాన్ని కలుపుతూ ఉంటారు. ఇంతలో ఒకడు ఏంట్రా అలా కలుపుతున్నావ్ ఆంటీ నాలుగు ఇళ్ళల్లో వంట పని చేస్తుందని నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? అని అంటాడు అది చూసి హీరో ఫ్యామిలీ తెల్ల మోహం వేస్తారు ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు అని.


మళ్ళీ ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువగా వేసుకుంటారు అని అంటాడు.. ఇలాంటి గొడ్డు కారం ముద్ద తినడం నాకు అలవాటు లేదురా. ఇది తింటుంటే గొంతులో మంటగా ఉందిరా కాని మన చెల్లి కి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి అంటాడు.. దాంతో హీరో అవమానంతో ఏమి అనకుండా అలా చూస్తుండిపోతాడు..


 హీరోయిన్ అన్నయలు ఒకరినొకరు చూసుకుంటూ హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ హేలనగా మాట్లాడుతుంటారు.

 

 ఏంట్రా అలా చూస్తున్నావు ఒకటే రూం ఉందనా..?

ఇక్కడే పడుకుంటారు. 


 ఫస్ట్ నైట్ ఎలా అనా? వాళ్ళు బయట పడుకుంటారు. ఆ తర్వాత అందరు కలిసే పడుకుంటారు.  వీళ్ళు ఇటు తిరిగి వాళ్ళు అంటు తిరిగి...


అలా అనేసరికి హీరో ఫ్యామిలీ నోటివెంట మాటరాదు కదా అయోమయంలో పడిపోతారు.


మన చెల్లి అపోలో హాస్పిటల్ లో పుట్టింది.


 ఇప్పుడు మనం చెల్లి పిల్లలు ఆ గాంధీ హాస్పిటల్ లో పుడతారు.


మన పిల్లలు ఆక్రిడ్జ్ లో చదువుతారు. 

మన చెల్లి పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అని హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ  హేళనగా మాట్లాడుతాడు...


ఆ మాటలకు హీరో ఫ్యామిలీ అవమానంతో ఏం అనాలో అర్థం కాక అలానే చూస్తుండి పోతారు..


అలాగే హీరోని ఉద్దేశిస్తూ "రవి నీకే గనుక ఒక చెల్లి ఉంటే తానొక చిత్తు కాగితాలు ఏరుకునే వాడ్ని ప్రేమిస్తే పరువలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారు అని పెళ్ళి చేస్తావా" అని అంటాడు.


మరియు" ప్రేమంటే ఇద్దరు వ్యక్తుల ప్రమాణం. పెళ్ళంటే రెండు కుటుంబాల ప్రయాణం".  ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికొస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వచ్చేస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే భవిష్యత్తులో రెండువైపులా ఉంటుంది..

నాలుగు ఇళ్ళల్లో పని చేసుకుని బతికేవారు గద్వాల్ రెడ్డి గారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతిలో ఉంది. అంటూ బాధపడుతూ పరోక్షంగా హెచ్చరించి 5 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టి వెళ్లి పోతారు.


ఆ 5 తీసుకుని వాళ్ళ చెల్లిని మర్చిపొమ్మని పరోక్షంగా చెప్తారు...


వాళ్ళు వెళ్ళిపోయాక హీరో అమ్మగారు హీరోని చూస్తు రవి నీకు అర్ధం అయ్యిందారా..?  ఆ పిల్లాడు అడిగాడు చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి మీ పిల్లను ఇస్తారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీ తో పోలిస్తే  మన స్థాయి అదే కాదరా? మరీ వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి కాదరా? అని అంటుంది.


ఈ పెళ్లి జరిగితే నీకు గొప్ప జీవితం వస్తుందని ఊహించామే కాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేక పోయాం రా.. అని అంటాడు హీరో నాన్న..


 ఈ పెళ్లి చేయడం ఇష్టం లేక పోతే మన ఆటోకు యాక్సిడెంట్ చేయోచ్చు, ఇంకా ఏమైనా చేయోచ్చు కాని వాళ్ళు అలా ఏమి చేయలేదురా. రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళిపోయారు. ఆ కన్నీటికి విలువనిద్దాం రా అంటుంది హీరో అమ్మగారు.. దాంతో హీరో బాధతో సరేనంటు తలూపుతాడు.. 


ఈ సన్నివేశం లో హీరో కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు..


వాళ్ళు చెప్పిందాంట్లో తప్పు లేదు కాబట్టి హీరో ఏమీ అనడు. ప్రేమంటే ప్రేమించడానికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక జీవితం ఉంటుంది. అది సాగాలంటే డబ్బు ఉండాలి. ఒక ధనవంతుల అమ్మాయి అప్పటి వరకు ఏ కష్టం తెలియకుండా పెరిగింది ఇప్పుడు ప్రేమ పేరుతో పేదరికంలోకి వెళ్లి కష్టాలు పడటమే తప్ప మరోటి కాదు. 


చాలా సినిమాల్లో హీరోయిన్ అన్నయ్యలు ఇలాంటి సన్నివేశాల్లో హీరో ఇంటికి వెళ్ళి దాడి చేయడం, దాడిని హీరో తిప్పి కొట్టడం పదిమందిని గాల్లోకి ఎగరేసి కొట్టడం లాంటి సీన్స్ ఉంటాయి. అలాగే హీరో శపథాలు చేసి నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి నీ చెల్లిని పెళ్ళి చేసుకుంటా..!! అంటూ భారీ డైలాగులు, ఛాలెంజ్ లు ఉంటాయి. అలా నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి కూడా చూపిస్తారు మన హీరోలు. కాని ఇక్కడ అవేమి ఉండవు హీరో అసలు ఒక్క మాట కూడా మాట్లాడడు. వాళ్ళు అన్నది నిజమే కదా అని అర్థం చేసుకుని తను చేసేది తప్పు అని తెలుసుకుని  ఫ్యామిలీ తో సహా ఊరొదిలి వెళ్లి పోతారు..


 ఇది చాలి రియాలిటీ గా ఉంటుంది.. సీనిమా వేరు జీవితం వేరు సినిమాలో ఏదైనా జరుగుతుంది కానీ జీవితంలో అలా జరగదు ఎన్నో అడ్డంకులు, బాధలు ఉంటాయి. ఇక్కడ ప్రేమిస్తే సరిపోదు దానికి ఒక స్థాయి ఉండాలి అని అదిలేకుంటే తర్వాత ఏమవుతుందో చెప్పారు. చాలా బాగుంది ఈ సన్నివేశం..


చాలా మంది ప్రేమికులను ఆలోచింప చేసేలా ఉంటుంది.


ప్రేమి ఇద్దరు వ్యక్తుల ప్రమాణం, పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం. 


ఆ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా.


అలా కుటుంబంలోని వారికి వీళ్ళ ప్రేమలు నచ్చక పోతే ఏమవుతుందో మనం నేడు సమాజంలో చూస్తూనే ఉన్నాం. తమ కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని, తమ పరువు పోయిందని, అమ్మాయి వాళ్ళ నాన్నలు, అన్నయ్యలు తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడిని అంతం చేస్తున్నారు.


కాబట్టి ఎవరైనా ప్రేమించే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే మనం అమ్మాయి ప్రేమించాలంటే ఆ అమ్మాయి స్థాయి కి తగ్గట్టు ఉండాలా?? అని అడగొద్దు. తప్పకుండా అలా ఉండాల్సిందే. లేదంటే ఒక పేదవాడు ధనవంతుల అమ్మాయి ని ప్రేమించి ఏ ధనవంతుల కూతుర్లకు పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా అంటు సినిమా డైలాగులు కొడితే బయట పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సినిమాలు చూసి ప్రేమ ప్రేమ అని పాకులాడే వారికి నేను చెప్పేది ఏంటంటే..


ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేకాని ప్రేమే జీవితం కాదు. నిన్ను నమ్మి నీకుటుంబ సభ్యులు ఉంటారు ముందు వారి గురించి అలోచించి ప్రేమల గురించి అలోచించండి..


ప్రేమ లేకుండా బతకొచ్చు కాని డబ్బు లేకుండా బతకలేం..


చదువుకునే వయసులో ప్రేమించడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత జీవితం చాలా కష్టంగా ఉంటుంది.


ఎందుకంటే చదువుకుని ఒక స్థాయి కి వెళ్ళకుండా ప్రేమ అంటు పార్కుల వెంబడి తిరిగితే పెళ్ళైయ్యాక ఒకరి చేతికింద జీవితాంతం వెట్టిచాకిరి చేసి కుటుంబాన్ని పోషించాల్సి ఉంటుంది..


అందుకే ప్రేమ అనేది అంత ముఖ్యం కాదు మన కేరీర్ ముఖ్యం. ఈ వయసులో ప్రేమ అంటు తిరిగితే జీవితాంతం బాధ పడుతూ బతకాల్సి ఉంటుంది.


అలాగే మీపై ఆధారపడిన మీక కుటుంబ సభ్యులను బాధ పడేలా చేయకండి...


ఇక ప్రేమ చాలా గొప్పది విలువైనది అంటారు నిజమే ప్రేమ అనేది చాలా గొప్పది అమ్మ నాన్నల ప్రేమ గొప్పది,తోట బుట్టిన వాళ్ళ ప్రేమ గొప్పది. ఈ ప్రేమను ఎవరు పట్టించుకోరు కేవలం అమ్మాయి ప్రేమ మాత్రమే గొప్పది అని తెగ ఎమోషన్స్ చేస్తూ  విరహ  గీతాలు పాడుతూ, ప్రేమ లేకపోతే జీవితమే లేదు అన్నట్టు సినిమా వాళ్ళు చూపిస్తుంటారు.  దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొందరు జీవితాలను పాడుచేసుకుంటారు. సినిమా వాళ్ళు సినిమాలో మాత్రమే ప్రేమ గురించి గొప్పగా నీతులు చెబుతుంటారు. కాని వాళ్ళ నిజ జీవితాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అది రోజు మనకు కనపడుతూనే ఉంది... 


కాబట్టి సినిమా వేరు జీవితం వేరు. సినిమాల్లో మాదిరి జీవితంలో జరుగుతుందనుకుంటే ఇక అంతే జీవితం తలకిందులుగా అవుతుంది...


ఈ సినిమాలో ఈ సన్నివేశం చాలా రియాలిటీ గా అనిపించింది.. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో మార్పు వస్తుంది అని నేను భావిస్తున్నాను..


అలా కాకుండా ప్రేమ గొప్పది ప్రేమించిన అమ్మాయిని లేపుకపోయి పెళ్ళి చేసుకోవాలని చెబితే ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. తమ కుటుంబం పరువు కోసం ఎంతకైనా తెగించే వాళ్ళను చూస్తున్నాం..


వాళ్ళు రాక్షసులు అనొచ్చు కాని వాళ్ళు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ అమ్మాయిని ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి మూడు నెలలు ప్రేమించిన అనే ఒకే ఒక్క అధికారంతో లేపుకపోయి పెళ్ళి చేసుకుంటే ఎవరి ఫ్యామిలీ కైనా కోపం రాక మంచి పని చేసారని సన్మానం చేస్తారా....? ఇరవై ఏళ్ల ప్రేమ కంటే మూడు నాలుగు నెలల ప్రేమ గొప్పదా..!!






 అందుకే ఇంత పెద్ద పోస్టు రాస్తూ లెక్చర్ ఇచ్చాను. ఇంత ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు

..



అవును సినిమా పేరు చెప్పడం మర్చిపోయాను. 

సినిమా పేరు "పేపర్ బాయ్".








 





 




4 కామెంట్‌లు:

  1. మీరు చెప్పింది చాలా బాగుంది కానీ ప్రాక్టికల్ గ ఆచరించటం ఎలా ? ప్రేమకి హద్దులు ఉంచటం చాలా మందికి ఇష్టం ఉండదు అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రేమకి హద్దులు ఉంచటం ఇష్టం లేకుంటే ఎవరికి నష్టం.. తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించి ప్రేమిస్తే బాగుంటుందని అని అభిప్రాయం...

      తొలగించండి
  2. అట్లా అయితే అది అరేంజ్డ్ ప్రేమ అవుతుందేమోనని నా బాధ.

    రిప్లయితొలగించండి