భానోదయం: సెప్టెంబర్ 2019

30, సెప్టెంబర్ 2019, సోమవారం

పల్లీలు నువ్వుల లడ్డు





పల్లీలు నువ్వుల లడ్డు

కేవలం మూడు పదార్థాలతోనె చాలా సులువుగా రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే లడ్డు తయారుచేసే విధానం..

కావలసిన పదార్థాలు:-

పల్లీలు       - 1 కప్పు
నువ్వులు  - 1 కప్పు
బెల్లం            - అరకప్పు


తయారి విధానం:-
పల్లీలు, నువ్వులను దోరగా వేయించుకోవాలి.వేయించిన పల్లీలు,నువ్వులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకోని ఉండలు కట్టుకోవాలి.
అంతే రుచికరమైన లడ్డు తయారవుతుంది.


నువ్వుల లడ్డు



ఈ లడ్డు చూడటానికి అంత ఆకర్షనీయంగా లేకపోయినా తింటే మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది.
పల్లీలు,నువ్వుల లడ్డులో కాల్షియం అధికంగా ఉంటుంది ఈ లడ్డు తినడం వలన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి.

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

గోధుమ గడ్డి



wheatgrass
గోధుమ గడ్డి

       



గోధుమ గడ్డి పెంచే విధానం:-

ఒక కప్పు గోధుమలు తీసుకుని కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి 12 గంటలు నానబెట్టాలి.

12 గంటలు నానిన తర్వాత నీళ్ళు ఒంపేసి ఒకసారి కడిగి ఒక కాటన్ గుడ్డలో మూటకట్టి ఒకరోజు ఉంచాలి.

తర్వాత ఒక ప్లాస్టిక్ ట్రే తీసుకుని దానికి అడుగు భాగంలో రంధ్రాలు చేయాలి. అందులో సగం వరకు  మట్టిని పోయాలి. ఈ మట్టిలో  వర్మీ కంపోస్టు ఎరువు కలుపుకుంటే గడ్డి బాగా వస్తుంది.

మట్టి పోసిన తర్వాత మొలకెత్తిన గోధుమలను ప్లాస్టిక్ ట్రే లో ఒత్తుగా వేయాలి. అలా వేసిన తర్వాత పైనుండి  గోధుమలు మునిగేలా మట్టిని పోసి నీళ్ళు పొయ్యాలి.

ఈ ట్రేను నీడలో ఉంచాలి.
ఉదయం సాయంత్రం వేళల్లో నీటిని చిలకరించాలి.


 గోధుమ గడ్డి  పది రోజులతర్వాత ఆరు అంగుళాలకు మించి పెరుగుతుంది.




wheatgrass

25, సెప్టెంబర్ 2019, బుధవారం

ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా...?

 


 ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా...




             సరదాగా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు స్క్రోల్ చేసుకుంటు వెళ్తున్న ఒక వీడియో దగ్గర ఆగాను ఆ విడియో థంబ్నెల్ చూస్తే ఎవరికైనా చూడాలనిపిస్తుంది ఎందుకంటే అందులో "ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా?"!!! అని ఉంది. ఇదేదో బాగుందే అని ఓపెన్ చేసా "హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు" అంటూ ఓ వ్యక్తి తన నటచాతుర్యాన్నంత రంగరించి యూట్యూబ్ చూసే వాళ్ళంతా తన స్నేహితులు అన్నట్టు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాపేరు బికారి అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో లక్షలు  సంపాదించడం ఎలాగో తెలుసా!!! అంటూ కొశ్ఛన్ వేశాడు. అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే. ఆన్లైన్లో లక్షలు సంపాందించవచ్చు. మీ దగ్గర ఒక కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు డబ్బు సంపాదించవచ్చు అని, డబ్బు చెట్లకు కాస్తుంది కేవలం మనం వాటిని తెంపుకుని తెచ్చుకోవడమే అన్నంతగా ఈజీ అన్నట్టు చెబుతున్నాడు. ఆన్లైన్లో ఎలా డబ్బు  సంపాదించవచ్చు అని ఫేవరేట్ హీరో సినిమాని ఫస్ట్ డేట్ ఫస్ట్ షో చూస్తున్న ఫ్యాన్స్ లా ఆత్రుతతో చూస్తున్న ఆ వీడియోను నేను . ఏం లేదు ఫ్రెండ్స్ మీరు చేయవలసిందల్లా సింపుల్ గా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎర్రిపప్ప అని టైప్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చే ఎర్రిపప్ప  ఆప్ ఓపెన్ చేసి నా రిఫరల్ కోడ్ తో  సైన్ అప్ చేయండి. అలా సైన్అప్ అయిన తర్వాత మీరు మరి కొంతమందికి ఈ  ఆప్ ను రిఫర్ చేయండి అంతే సిపుల్ మీకు డబ్బులే డబ్బులు బావిలో బకెట్ వేసి నీళ్ళు తోడినట్టు ఈ ఆప్లో డబ్బులు తోడుకోవచ్చు అని చెప్పాడు. ఆహా! ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఇంత సులువా నేను సంపాదిస్తాను అని అతను చెప్పిన ఆప్ డౌన్లోడ్ చేసి అతని రిఫర్ కోడ్ ఎంటర్ చేసా అంతే 50రూపాయలు వచ్చాయి. మరో ఇద్దరి ద్వారా ఈ ఆప్ డౌన్లోడ్ చేయించా 2 రూపాయలు వచ్చాయి. అతికష్టం మీద ఓ పదిమంది చేత ఆప్ డౌన్లోడ్ చేయించా. 10 రూపాయలు వచ్చాయి. ఇంకా చాలా మంది చేత ఈ ఆప్ డౌన్లోడ్ చేయించాలని తెలిసిన వారికి రిఫర్ చేసా. ఒక్కరు కూడా డౌన్లోడ్ చేయలేదు కదా పైగా నాకే రిఫర్ చేస్తున్నారు. అప్పటికే వారు కూడా ఈ ఆప్ డౌన్లోడ్ చేసుకున్నారు. నాకు ఈ ఆప్లో 60రూపాయలు వచ్చాయి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుందామనుకుంటే 200 పూర్తయితే గాని ఈ ఆప్ లోనుండి డబ్బు తీసుకోలేరు అని మేసేజ్ వస్తుంది. నాకు 200రూపాయలు రావాలంటే ఇంకా 140 మంది చేత డౌన్లోడ్ చేయించాలి.  అంతమంది చేత డౌన్లోడ్ చేయించడం అసాధ్యం.
ఈ ఆప్ లో లక్షలు సంపాదించడం కూడా అసాధ్యం అని ఇదంతా ఫేక్ అనుకున్న.

కాని  ఈ ఆప్ లో ఎక్కువ డబ్బు సంపాదించిన వారి వివరాలు ఉన్నాయి అందులో  యూట్యూబ్ లో ఈ ఆప్ గురించి చెప్పి నాచేత ఈ ఆప్ డౌన్లోడ్ చేయించిన వ్యక్తి వివరాలు ఉన్నాయి అందులో అతని సంపాదన లక్షల్లో ఉంది. జనాలని ఎర్రిపప్పలని చేసి అతడు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి వారు యూట్యూబ్ లో చాలానే ఉన్నారు   జనాలకు  పెద్ద సేవ చేస్తున్నట్టు, డబ్బు సంపాదించేందుకు దారి చూపిస్తున్నట్టు బిల్డప్ కొడుతుంటారు.

నిజమే ఈ ఆప్లో లక్షలు సంపాదించవచ్చు కాని వారు చెప్పిన విధంగా కాదు.  ఎలాగంటే మనం కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో  రిఫర్ చేస్తే డబ్బులు ఇచ్చే ఏదో ఒక ఆప్ గురించి అద్దిరిపోయే వీడియో చేసి డౌన్లోడ్ చేసుకునేలా మసాలా దట్టించి పెట్టండి. వీడియో థంబ్నెల్ మాత్రం "ఆన్లైన్లో లక్షలు సంపాదించడం ఎలా" , "ఇంట్లో కూర్చుని  రోజుకి పదివేలు సంపాదించడం ఎలా" , "ఈ ఆప్ మిమ్మల్ని కోటీశ్వరులని చేస్తుంది" , "ఈ ఆప్ డౌన్లోడ్ చేసి వదిలేయండి మీరు వద్దన్నా డబ్బు వస్తుంది" అంటూ వీడియో థంబ్నెల్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అంతే మీరు వద్దన్నా డబ్బు వస్తూనే..... ఉంటుంది....

 మన వీడియోలు ఎవరు చూస్తారు అంటారా? ఇప్పుడు అందరు  గూగుల్ లో ఎక్కువగా
సెర్చ్ చేసేది ఏంటో తెలుసా.! how to earn money online అని.

ఆహా ఏమి ఐడియా గురూ ....!


21, సెప్టెంబర్ 2019, శనివారం

ఆరోగ్యానికి మొలకలు




          ఆరోగ్యానికి మొలకలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు, శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతాయి.

      లావుగా ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల సన్నపడతారు. ఇందుకు ఉదాహరణ మా స్నేహితుడు ఒకప్పుడు 100కేజీల కంటే ఎక్కువ బరువు ఉండేవాడు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఎలాగైనా బరువు తగ్గాలని కఠినంగా ఆహార నియమాలు పాటించడం మొదలు పెట్టాడు ఒక సంవత్సరం లో బరువు తగ్గి 60కేజీలకు వచ్చేసాడు. ఏ డాక్టర్ ను సంప్రదించలేదు ఏ మందులు వాడలేదు. కేవలం టీవీలో వచ్చే ప్రోగ్రముల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గే విధానాలను చూసి ఆహారంలో మార్పులు చేసుకున్నాడు. రోజుకు 5లీటర్ల నీరు రెండుపూటల ఆహారం మాత్రమే తినడం. అందులో ఒక పూట మొలకలు ఆహారంగా తీసుకునే వాడు. ముడిబియ్యం మాత్రమే తింటాడు. ఎందుకంటే పాలీష్ బియ్యం తింటే షుగర్ వస్తుంది అందులో పోషకాలు కూడా ఉండవు. ఉప్పు, కారం , నూనె, పంచదార తినడు. ఇలా కఠినంగా ఆహార నియమాలు పాటించడం వలన బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బరువు తగ్గాలనుకునే వారు ఒక మంచి డైటీషీయన్ ని కలిసి బరువు తగ్గడానికి కావలసిన డైట్ ను తెలుసుకుని ఆహారనియమాలని పాటించడి.



    పెసలు,శనగలు,బెబ్బర్లు వంటి గింజలను విడివిడిగా 12గంటలు నీటిలో నానబెట్టి ఒకరోజు కాటన్ గుడ్డలో మూటకట్టి ఉంచితే మొలకలు వస్తాయి అందులో దానిమ్మ పండు గింజలు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనే వారే కాకుండా ఎవరైనా వీటిని తినొచ్చు. చిన్న పిల్లలకి బయట దొరికే  చిప్స్ , జంక్ ఫుడ్ తినిపించే బదులు మొలకలు తినడం అలవాటు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఇక మొలకలను ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనే తినాలి రాత్రి పూట తినకూడదు.గ్యాస్ ప్రాబ్లెం ఉన్నవారు తినకూడదు.




 
పెసలు,శనగలు,బెబ్బర్లు,అవిశ లు, వంటివి తొందరగా మొలకలు వస్తాయి.








Sprouts maker 

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఒక CFLబల్బుల కంపెనీలో ఉద్యోగం



ఒక  చిన్న   కంపెని అందులో CFL బల్బులు తయారు చేస్తారు. కంపెనీలో ఉద్యోగులు 200 వరకు ఉంటారు. అందులో పని చేయడానికి నేను వెళ్ళాను. కంపెనీలో 2 షిఫ్ట్ లు మాత్రమే అంటే ఒక షిఫ్ట్ 12 గంటలు. చాలా కంపెనీల్లో 3 షిఫ్ట్ లు ఒక్కో షిఫ్ట్ 8గంటలు ఉంటాయి. కాని ఈ కంపెనీలో 2 షిఫ్ట్ లు మాత్రమే. 12 గంటలు అయినా సరే ఉద్యోగం చేయాల్సిందే ఎందుకంటే ఉద్యోగం తప్పితే వేరే దారి లేదు. ఉండేది సిటీలో రూమ్ రెంటు కట్టాలి. అన్ని కొనాలి. ఈ పరిస్థితుల్లో ఏ ఉద్యోగం అయినా చేయాల్సిందే తప్పదు.

        కంపెనీలో కి వెళ్ళిన తరువాత అక్కడ పని ఏంటంటే ఒక కన్వేయర్ బెల్ట్ దాని చుట్టూ డజను కుర్చీలు అవి కుర్చీలు అంటే లగ్జరీ కుర్చీలు అనుకునేరు కేవలం కూర్చుని పనిచేసే విధంగా  చెక్క తో తయారు చేసిన బల్లులు. వాటిపై కూర్చుని కన్వేయర్ బెల్ట్ పై నుండి వచ్చే CFL బల్బులను చెక్ చేయడం వాటికి ఉన్న వైర్లు కత్తిరించడం, వాటికి PCB  లు పెట్టడం, క్యాప్ లు పెట్టడం, సోల్టరింగ్ చేయడం ఆ తర్వాత వాటిని డబ్బాలో జాగ్రత్త గా పెట్టాలి. ఇదే పని
అలా కన్వేయర్ బెల్ట్ పై వస్తున్న బల్బులను మిషన్ వేగంతో, తోటి కార్మికుల వేగంతో పని చేయాలి ఎవరు నెమ్మదించిన బెల్ట్ పై బల్బులు వెళ్ళపోతూనే ఉంటాయి మిషన్ మాత్రం ఆగదు. ఒకవేళ ఆపితే అంతే సంగతులు సూపర్వైజర్ తో నానా తిట్లు, రిమార్కులు, జీతంలో కోతలు. అన్నింటికంటే మించి అందరిముందు అవమానం తప్పదు.

      అలా ఉదయం 7 గంటలకి మొదలైన పని సాయంత్రం 7 గంటలవరకు చేయాలి. మధ్యలో ఓ అరగంట మాత్రమే భోజన విరామం ఉంటుంది. ఉదయం 7 గంటలకి కంపెనీకి వెళితే మధ్యాహ్నం 12 గంటలకి భోజనానికి వెళ్ళాలి అదికూడా కేవలం 30 నిమిషాల్లోనే భోజనం చేసి రావాలి. 30 నిమిషాల కంటే ఒక్కో నిమిషం ఆలస్యం అయినా సూపర్ వైజర్ తో తిట్లు తప్పవు వాళ్ళు మామూలుగా తిట్టరు అందుకని ఎవరు నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేస్తారు.
 మధ్యాహ్నం తిని వచ్చిన తర్వాత మళ్ళీ కన్వేయర్ బెల్ట్ పై బల్బుల పని చేస్తూనే ఉండాలి సాయంత్రం 7 గంటల వరకు. 12 గంటలు ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

     అలా వారం రోజులు పగలు డ్యూటీ పూర్తి అయ్యింది. తర్వాత వారం నైట్ డ్యూటీ చేయాలి. సాయంత్రం 7 గంటలకి కంపెనీకి వెళితే ఉదయం 7 గంటలవరకు డ్యూటీ చేయాలి. నైట్ డ్యూటీ కూడా సేమ్ రాత్రి 12 గంటలకి భోజనానికి వెళ్ళాలి అదికూడా కేవలం 30 నిమిషాల్లోనే తినేసి రావాలి. ఒక్కో నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. నైట్ డ్యూటీ కదా కాసేపు పడుకుంటాం అంటే కుదరదు.
ఉదయం అయినా రాత్రి అయిన 12 గంటలు పని చేయాల్సిందే. కేవలం 30 నిమిషాలు మినహాయించి.  నిద్ర వస్తుంది అంటే కుదరదు పని చేయాల్సిందే లేదా ఉద్యోగం మానేయాలి. నాముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు అక్కడి పని చేయలేక.  కంపెనీలో కి అడుగు పెడితే చాలు అక్కడ కార్మికులకు, యంత్రాలకు పెద్ద తేడా ఉండదు. కంపెనీల్లో కార్మికులను యంత్రాల్లాగే చూస్తారు. ఇలాంటి కంపెనీల్లో కార్మికులను అస్సాం, బీహార్ లాంటి రాష్ట్రాల నుండి తీసుకువస్తారు.


నాకు ఒకరితో మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ పని చేసి అందరి మన్ననలు పొందాను. కొందరు అసూయ కూడా పడ్డారు ఎందుకంటే నాతో పాటు పనిలో పోటీ పడలేక పోయేవారు సూపర్ వైజర్ లతో నానా తిట్లు తినేవారు. నేనేప్పుడు మాట పడలేదు కాని ఈ కంపెనీలో ఉద్యోగం అంటే అది 12 గంటలు, వారం రోజులు, పగలు, రాత్రి తేడా లేకుండా డ్యూటీ చేయాలి. ఫ్రీడమ్ అనేది లేదు, యంత్రాలకు, మనుషులకు తేడాలేదు.  12గంటలు పని 2 గంటలు ప్రయాణం,10 గంటలు నిద్ర ఇదేనా జీవితం ఇలాంటి బానిస జీవితం వేస్ట్ అనిపించింది కంపెనీకి దండం పెట్టి వచ్చేసా.



ఇక కంపెనీలో CFL బల్బు తయారు చేసే విధానం ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సన్నని గాజు గొట్టాన్ని వివిధరకాల ఆకృతుల్లో ఒక బల్బు గా తయారు చేసే టెక్నాలజీ అద్భుతం.

ఈ CFL కంపెనీలో నేను గమనించిన ఒక పెద్ద విషయం ఏంటంటే మనం మార్కెట్లో  కొనే బల్బుల పై వివిధ రకాల కంపెనీలో బ్రాండ్ లా పేర్లు ఉంటాయి కదా అంది చూసి మనం ప్రతీ బ్రాండ్ కి ఒక కంపెనీ ఉంటుంది అనుకుంటాం.కాని ఏ బ్రాండ్ కి కూడా కంపెనీ ఉండదు. ఒక కంపెనీ బల్బు తయారు చేస్తే వివిధ రకాల బ్రాండ్ల పేరుతో వాటిని ప్యాక్ చేసి మార్కెట్లో విడుదల చేస్తారు.
అంటే ఒకే బల్బు పేర్లు మాత్రం వేరు‌.


ఇప్పుడు LED బల్బులు వచ్చాయి ఇప్పుడు ఆ కంపెనీ మూతపడింది.

11, సెప్టెంబర్ 2019, బుధవారం

హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేస్తే ఎం జరుగుతుంది.




   
హైదరాబాద్ ను  ఈ దేశానికి రెండో రాజధానిగా చేస‌్తే ఏం జరుగుతుంది.

డిల్లీ తరహాలో మరో రాష్ట్రంగా ఏర్పడుతుందా?

అలాగే గవర్నర్,ముఖ్యమంత్రులతో కూడిన అసెంబ్లీ ఏర్పడనుందా?

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తారా? లేదా వేరే ఇతర నగరాన్ని రాజధానిగా చేస్తారా?



   




హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస‌్తే ఇక్కడ పార్లమెంటు ను ఏర్పాటు చేసి పరిపాలన చేస్తారా?
సంవత్సరం లో ఆరు నెలలు డిల్లీ నుండి ఆరునెలలు హైదరాబాద్ నుండి పరిపాలన చేస్తారా?

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేస‌్తే ప్రయోజనం ఏమిటి?

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఏమవుతుంది?

అసలు ఎందుకు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారు.







4, సెప్టెంబర్ 2019, బుధవారం

రిమోట్ లేకుండా టీవి ఆపరేట్ చేయడం ఎలా






                  


                                మొబైల్ ఫోన్ తో టీవీని కంట్రోల్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో రిమోట్ ఆప్స్ చాలానే ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే సరి రిమోట్ తో పనిలేకుండా మొబైల్ తో చానెల్స్ మార్చుకోవచ్చు. అలాగే  టీవీ సెట్ అప్ బాక్స్ ను కూడా  రిమోట్ తో కంట్రోల్ చేయవచ్చు. ఏ కంపెని సెట్ అప్ బాక్స్ కి సంబందించిన రిమోట్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నాయి. డిష్ టీవి, సన్ డైరెక్ట్, బిగ్ టీవి, ఎయిర్ టెల్ ఇలా ఏ కంపెని సెట్ అప్ బాక్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్ లో వీటికి సంబందించిన రిమోట్స్ ఆప్స్ ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్ తో ఆపరేట్ చేసుకోవచ్చు.


రిమోట్ ఎక్కడైనా మర్చిపోయిన లేదా రిమోట్ పాడైపోయిన సమయంలో ఈ ఆప్స్ ఉపయోగపడుతాయి.