భానోదయం: సామాజికం
సామాజికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సామాజికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఆగస్టు 2022, శుక్రవారం

ఓవరాక్షన్ స్టార్ల ఓవర్ యాక్షన్-లిగర్

 ఏమి ఓవరాక్షన్ అది మామూలుగా కాదు బాహుబలి, అవతార్ రికార్డులను బద్దలు కొడుతుంది అన్నట్టు బిల్డప్ లు ఇచ్చారు. నగ్నంగా బోకె పట్టుకుని పోస్టర్స్. ఇది చూసి కొందరు హీరోయిన్స్ అదిరిపోయిందంటూ పోస్టులు. ఆహా ఏమి ప్రమోషన్స్ అవి తెలుగు సినిమా రికార్డులే కాదు అసలు ప్రపంచ సినిమా చరిత్రలోనే రికార్డులను తిరగరాస్తుంది అన్నట్టు ఫోజులు కొట్టారు. ఇప్పుడు ఏమయ్యింది ఓవరాక్షన్ కి దిమ్మతిరిగిపోయి సినిమా ఫ్లాప్ అయ్యింది. 


ఏ సినిమా గురించి అనుకుంటున్నారా అదేనండి మన ఓవరాక్షన్ స్టార్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ సినిమా లిగర్ గురించి. 

లిగరా.. లైగర్ అనుకుంటా.. ఏదోటి ఫ్లాప్ సినిమా టైటిల్ ఎలా ఉంటే ఏంటి?. అర్థం పర్థం లేని పేర్లు..


అసలు వీళ్ళు ఎందుకు సినిమాలు తీస్తారో అర్థం కాదు.

పూరీ సినిమాల్లో అసలు కథ తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ దీనికి తోడు విజయ్ దేవరకొండ ఇద్దరు ఇద్దరే. ఇద్దరు ఉద్దండులు కలిసి సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది. 


ఈ సినిమా ఎలా ఉంటుందంటే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా+లోఫర్  ఈ రెండు సినిమాలను మిక్స్ చేసి ఒక కొత్త కళాఖండాన్ని తీసాడు. 

ఈ కళాఖండాన్ని ప్రచారం చేయడానికి నగ్న ప్రదర్శనలు చేయడం. అసలు సినిమాలో ఏమి లేదని తెలిసే ఇలాంటి చెత్త ప్రచారాలు చేసి సినిమాలో ఏదో ఉందని గొప్పలు చెప్పడం.



విజయ్ దేవరకొండ ఈయన గురించి అందరికీ తెలిసిందే. నేనే గొప్ప నేను చేసేదే కరెక్టు, నేను నాఇష్టం వచ్చినట్టు చేస్తేనే జనాలకు ఇష్టం అనుకుంటాడు. అర్జున్ రెడ్డి ఎలా హిట్టు అయ్యిందో కాని అప్పటి నుండి ఈయన యాక్షన్ ఓవరాక్షన్ మామూలుగా లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవ్వరిని లెక్క చేయకుండా, నేనే గొప్ప నటుడిని నా అంత గొప్ప నటుడు ఎవరు లేరన్నట్టు ఫీలవుతుంటాడు..


ఇక పూరీ గారు ఈయనకెందుకో ఈ సమాజం అన్నా ఈ దేశం అన్నా చాలా కోపం అనుకుంటా ఈయన సినిమాల్లో డైలాగులు చూస్తే అర్థమవుతుంది.

సమాజం చాలా భయంకరమైనది అన్నట్టు డైలాగులు చెబుతాడు. ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు  నాకే  ఉన్నాయి అంటు చెబుతూ ఆయన అభిమానులను ఏడిపిస్తుంటాడు. ఈయనకు తోడు ఛార్మీ గారు మామూలుగా ఉండదు వీళ్ళతో...

ప్రపంచంలో వీళ్ళకె కష్టాలు ఉన్నట్లు కెమెరాల ముందు ఏడుస్తుంటారు. పబ్బులు, ఫారిన్ టూర్లు తిరిగుతూ ఎంజాయ్ చేస్తు చాలా కష్టపడుతున్నాం జీవితంలో అన్ని కోల్పోయాం అంటారు‌. ఏంటో వీళ్ళ కష్టాలు..?

వీళ్ళవే కష్టాలు అంటే రైతులవి, రోజువారి కూలీలవి ఏంటో మరి??


చెత్త సినిమాలు తీసి యువతను చెడగొడుతున్నారు.

పైగా మేము చాలా కష్టపడుతున్నాం అంటారు.

ఎందుకు అండీ మీ కష్టం మీ సినిమాల ద్వారా సమాజాన్ని రెచ్చగొట్టడం, చెడగొట్టడం కోసమా?..


నాకు ఆ లిగర్ గలీజు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే అనుకున్నా ఈ సినిమాలో ఏమి లేదని. అట్టర్ ఫ్లాఫ్ అవుతుందని. అలాగే జరిగింది..


ఆ పేరొకటి లిగర్ సాలా క్రాస్ బీడ్ అంటా. ఏంట్రా ఈ టైటిల్ అనుకున్నా..  దీని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు.. గూగుల్ ట్రాన్స్ లేట్ చేస్తే తెలిసింది ఆడపులికి మగ సింహనికి పుట్టిన జంతువుట.. ఏంటో ఈ పేర్లు..

క్రాస్ బీడ్ లేంటో, ఈ జంతువులేంటో,ఈ సినిమాలేంటో నాకైతే అర్థం కాలేదు..


పూరీ గారు సమాజానికి పనికొచ్చే ఒక్క సినిమా అయినా తీసారా.. ఇడియట్, పోకిరి, దేశముదురు, లోఫర్, లిగర్ క్రాస్ బ్రీడ్ మొత్తం ఇవే సినిమాలు. ఇలాంటి సినిమాలు తీసి యువతను రెచ్చగొట్టడం, సమాజాన్ని నిందించడం. ఏంటో ఈ సినిమాలు..


సినిమాలంటే బింబిసారా, కార్తికేయ-2, సీతారామం లా ఉండాలి. ఈ సినిమాలకు పెద్దగా ప్రచారం చేయలేదు కదా. అయినా పెద్ద విజయం సాధించాయి.. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద విజయం సాధించాయి.


సినిమాలో కథ ఉండాలి ప్రేక్షకులే పబ్లిసిటీ చేస్తారు.

అంతేకాని కథ లేకుండా ఎంత పెద్ద తోపు డైరెక్టర్, తోపు హీరో ఉన్నా సినిమాలు చూడరు.







10, జులై 2022, ఆదివారం

ఈ సన్నివేశం ఎంతో రియాలిటీ గా ఉంటుంది. డైరెక్టర్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే..!




 


   ఈ సన్నివేశం చూస్తే ఎంత రియాలిటీ గా తీశారు అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడికి హాట్సాప్ చెప్పాలనిపిస్తుంది.

ఆ డైలాగులు మాత్రం చాలా సహజంగా ఉంటాయి..


      ఈ సినిమాలో హీరో పేపర్ బాయ్ హీరోయిన్ ధనవంతుడి కూతురు ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమిస్తే సరిపోతుందా వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా. హీరోయిన్ కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. హీరో తల్లి దండ్రులు ఒప్పుకుంటారు ఎందుకంటే ధనవంతుల అమ్మాయి మనలాంటి పేదవాడి అబ్బాయిని ప్రేమించిందని గొప్పగా భావిస్తారు. మరీ డబ్బున్న వాళ్ళు తమ అమ్మాయి ఒక పేదవాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకుంటారా ససేమిరా ఒప్పుకోరు. ఆ స్థానంలో ఎవరున్నా ఒప్పుకోరు.  ఈ సినిమాలో కూడా హీరోయిన్ కుటుంబ సభ్యులకు తమ అమ్మాయిని ఒక పేపర్ బాయ్ కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. కాని హీరోయిన్ మాత్రం అతన్నే పెళ్ళి చేసుకుంటానని పట్టుబడుతుంది. దింతో కూతురి మీద ప్రేమతో హీరోయిన్ తండ్రి అతనితో పెళ్లికి  ఒప్పుకుంటాడు.. 


కాని హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు. ఆఫ్ట్రాల్ ఒక పేపర్ బాయ్ కి నా చెల్లినిచ్చి పెళ్ళి చెయ్యాలా అంటూ కోపంతో ఊగిపోతారు.  ఇలాంటి సన్నివేశాల్లో వేరే ఏ సినిమాలో అయిన పెద్ద పెద్ద ఫైట్లు భారీ భారీ డైలాగులు ఛాలెంజ్ లు ఉంటాయి. కాని ఇక్కడ అవేమి ఉండవు. కేవలం హీరోయిన్ అన్నయ్యలు ఇద్దరు హీరో ఇంటికి వెళ్ళి నాలుగు మాటలు చెబుతూ బాధ పడుతుంటారు అంతే హీరోకి ఒక్క మాట కూడా రాదు. అవును ఇది నిజం రియాలిటీ ఇలాగే ఉంటుంది. 


వాళ్ళు ఏమాట్లాడుతారంటే...


హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలు హీరో ఇంటికి వస్తారు.

వాళ్ళు రాగానే హీరో అమ్మానాన్నలు కంగారు పడుతూ రండిబాబు మీరా రండి రండి కూసోండి, కూసోండి అంటు అదరా బాదరా పడుతుంటారు.


  ఈ టైం లో వచ్చారు ఏంటండీ.? అంటుంది హీరో అమ్మగారు.

  పొద్దున్నుండి పెళ్ళి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయ్యిందాంటీ అంటాడు హీరోయిన్ అన్నయ్య. అలా అంటూనే నాన్న గారు ఇది ఇమ్మాన్నారని చేతిలో ఒక కవర్ పెడతాడు. దాన్ని చూసి ఏంటి బాబు ఇది అని అంటారు హీరో తండ్రి. 


''డబ్బండీ'' అంటారు హీరోయిన్ అన్నయ్యలు.

మా పద్దతి ప్రకారం  మగపెళ్ళి వారి బట్టలకు ఆడపెళ్ళి వారే డబ్బులు ఇస్తారు అంటారు.

 అందుకు వద్దు బాబు ఉన్నంతలో మేం కొనుక్కుంటాం అంటు,  ఇంత బరువు మేం మోయలేమని అంటుంది హీరో అమ్మగారు.


"5లక్షలే మేయలేమని అంటున్నారు రేపు మీ ఇంటికి మా ఇంటి మహాలక్ష్మి రాబోతుంది ఎలా మోస్తారు" అంటాడు హీరోయిన్ అన్నయ్య.


"నా కూతురులా చూసుకుంటాను అయ్యా" అంటుంది హీరో అమ్మగారు.


ఇంతలో మాటల సంగతి తర్వాత ముందు పొయ్ ఛాయ్ పెట్టు అంటాడు హీరో నాన్న..


ఈ టైంలో ఛాయ్ ఏంటీ అంకుల్ పదవుతుంది పొద్దన్నుండి షాపింగ్ లో పడి అన్నమే తినలేదు ఉంటే అన్నమే పెట్టండి అంటారు హీరోయిన్ అన్నయ్యలు.


ఉండండి రెండు నిమిషాల్లో తయారు చేస్తాను అంటుంది హీరో అమ్మగారు..


"ఆంటీ ఉన్నదే పెట్టండి రేపు పెళ్లయ్యాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా" అంటారు.


ఇదంతా చూస్తూ హీరో ఒక్క మాట కూడా మాట్లాడడు.


ఇక వాళ్ళిద్దరికి రెండు కంచాల్లో అన్నం, పప్పు చారు వడ్డిస్తుంది హీరో అమ్మగారు.


అది చూస్తే మనకే అనిపిస్తుంది డబ్బున్న వాళ్ళు ఇలా అన్నం చారు తింటారా అని..? 


నాకు తెలిసి ధనవంతుల ఇళ్ళల్లో డైనింగు టేబుల్ మీద ప్రతిరోజు నాలుగైదు కూరలు, సాంబారు, పెరుగు, నెయ్యి, అప్పడాలు, నాలుగు రకాల పచ్చళ్లు, వేపుళ్లు ఇలా మెను పేద్దగా ఉంటుంది. ఇలాంటి ఆహారం పేదవారికివిందుభోజనం... కాని ధనవంతులకుమాత్రం రోజు సాధారణ భోజనమే... అలాంటిది కేవలం అన్నం చారు తినాలంటే వాళ్ళు తింటారా... ముద్ద దిగదు కదా...




 ఇక వాళ్ళు అన్నాన్ని కలుపుతూ ఉంటారు. ఇంతలో ఒకడు ఏంట్రా అలా కలుపుతున్నావ్ ఆంటీ నాలుగు ఇళ్ళల్లో వంట పని చేస్తుందని నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? అని అంటాడు అది చూసి హీరో ఫ్యామిలీ తెల్ల మోహం వేస్తారు ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు అని.


మళ్ళీ ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువగా వేసుకుంటారు అని అంటాడు.. ఇలాంటి గొడ్డు కారం ముద్ద తినడం నాకు అలవాటు లేదురా. ఇది తింటుంటే గొంతులో మంటగా ఉందిరా కాని మన చెల్లి కి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి అంటాడు.. దాంతో హీరో అవమానంతో ఏమి అనకుండా అలా చూస్తుండిపోతాడు..


 హీరోయిన్ అన్నయలు ఒకరినొకరు చూసుకుంటూ హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ హేలనగా మాట్లాడుతుంటారు.

 

 ఏంట్రా అలా చూస్తున్నావు ఒకటే రూం ఉందనా..?

ఇక్కడే పడుకుంటారు. 


 ఫస్ట్ నైట్ ఎలా అనా? వాళ్ళు బయట పడుకుంటారు. ఆ తర్వాత అందరు కలిసే పడుకుంటారు.  వీళ్ళు ఇటు తిరిగి వాళ్ళు అంటు తిరిగి...


అలా అనేసరికి హీరో ఫ్యామిలీ నోటివెంట మాటరాదు కదా అయోమయంలో పడిపోతారు.


మన చెల్లి అపోలో హాస్పిటల్ లో పుట్టింది.


 ఇప్పుడు మనం చెల్లి పిల్లలు ఆ గాంధీ హాస్పిటల్ లో పుడతారు.


మన పిల్లలు ఆక్రిడ్జ్ లో చదువుతారు. 

మన చెల్లి పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అని హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ  హేళనగా మాట్లాడుతాడు...


ఆ మాటలకు హీరో ఫ్యామిలీ అవమానంతో ఏం అనాలో అర్థం కాక అలానే చూస్తుండి పోతారు..


అలాగే హీరోని ఉద్దేశిస్తూ "రవి నీకే గనుక ఒక చెల్లి ఉంటే తానొక చిత్తు కాగితాలు ఏరుకునే వాడ్ని ప్రేమిస్తే పరువలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారు అని పెళ్ళి చేస్తావా" అని అంటాడు.


మరియు" ప్రేమంటే ఇద్దరు వ్యక్తుల ప్రమాణం. పెళ్ళంటే రెండు కుటుంబాల ప్రయాణం".  ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికొస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వచ్చేస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే భవిష్యత్తులో రెండువైపులా ఉంటుంది..

నాలుగు ఇళ్ళల్లో పని చేసుకుని బతికేవారు గద్వాల్ రెడ్డి గారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతిలో ఉంది. అంటూ బాధపడుతూ పరోక్షంగా హెచ్చరించి 5 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టి వెళ్లి పోతారు.


ఆ 5 తీసుకుని వాళ్ళ చెల్లిని మర్చిపొమ్మని పరోక్షంగా చెప్తారు...


వాళ్ళు వెళ్ళిపోయాక హీరో అమ్మగారు హీరోని చూస్తు రవి నీకు అర్ధం అయ్యిందారా..?  ఆ పిల్లాడు అడిగాడు చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి మీ పిల్లను ఇస్తారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీ తో పోలిస్తే  మన స్థాయి అదే కాదరా? మరీ వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి కాదరా? అని అంటుంది.


ఈ పెళ్లి జరిగితే నీకు గొప్ప జీవితం వస్తుందని ఊహించామే కాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేక పోయాం రా.. అని అంటాడు హీరో నాన్న..


 ఈ పెళ్లి చేయడం ఇష్టం లేక పోతే మన ఆటోకు యాక్సిడెంట్ చేయోచ్చు, ఇంకా ఏమైనా చేయోచ్చు కాని వాళ్ళు అలా ఏమి చేయలేదురా. రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళిపోయారు. ఆ కన్నీటికి విలువనిద్దాం రా అంటుంది హీరో అమ్మగారు.. దాంతో హీరో బాధతో సరేనంటు తలూపుతాడు.. 


ఈ సన్నివేశం లో హీరో కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు..


వాళ్ళు చెప్పిందాంట్లో తప్పు లేదు కాబట్టి హీరో ఏమీ అనడు. ప్రేమంటే ప్రేమించడానికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక జీవితం ఉంటుంది. అది సాగాలంటే డబ్బు ఉండాలి. ఒక ధనవంతుల అమ్మాయి అప్పటి వరకు ఏ కష్టం తెలియకుండా పెరిగింది ఇప్పుడు ప్రేమ పేరుతో పేదరికంలోకి వెళ్లి కష్టాలు పడటమే తప్ప మరోటి కాదు. 


చాలా సినిమాల్లో హీరోయిన్ అన్నయ్యలు ఇలాంటి సన్నివేశాల్లో హీరో ఇంటికి వెళ్ళి దాడి చేయడం, దాడిని హీరో తిప్పి కొట్టడం పదిమందిని గాల్లోకి ఎగరేసి కొట్టడం లాంటి సీన్స్ ఉంటాయి. అలాగే హీరో శపథాలు చేసి నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి నీ చెల్లిని పెళ్ళి చేసుకుంటా..!! అంటూ భారీ డైలాగులు, ఛాలెంజ్ లు ఉంటాయి. అలా నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి కూడా చూపిస్తారు మన హీరోలు. కాని ఇక్కడ అవేమి ఉండవు హీరో అసలు ఒక్క మాట కూడా మాట్లాడడు. వాళ్ళు అన్నది నిజమే కదా అని అర్థం చేసుకుని తను చేసేది తప్పు అని తెలుసుకుని  ఫ్యామిలీ తో సహా ఊరొదిలి వెళ్లి పోతారు..


 ఇది చాలి రియాలిటీ గా ఉంటుంది.. సీనిమా వేరు జీవితం వేరు సినిమాలో ఏదైనా జరుగుతుంది కానీ జీవితంలో అలా జరగదు ఎన్నో అడ్డంకులు, బాధలు ఉంటాయి. ఇక్కడ ప్రేమిస్తే సరిపోదు దానికి ఒక స్థాయి ఉండాలి అని అదిలేకుంటే తర్వాత ఏమవుతుందో చెప్పారు. చాలా బాగుంది ఈ సన్నివేశం..


చాలా మంది ప్రేమికులను ఆలోచింప చేసేలా ఉంటుంది.


ప్రేమి ఇద్దరు వ్యక్తుల ప్రమాణం, పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం. 


ఆ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా.


అలా కుటుంబంలోని వారికి వీళ్ళ ప్రేమలు నచ్చక పోతే ఏమవుతుందో మనం నేడు సమాజంలో చూస్తూనే ఉన్నాం. తమ కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని, తమ పరువు పోయిందని, అమ్మాయి వాళ్ళ నాన్నలు, అన్నయ్యలు తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడిని అంతం చేస్తున్నారు.


కాబట్టి ఎవరైనా ప్రేమించే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే మనం అమ్మాయి ప్రేమించాలంటే ఆ అమ్మాయి స్థాయి కి తగ్గట్టు ఉండాలా?? అని అడగొద్దు. తప్పకుండా అలా ఉండాల్సిందే. లేదంటే ఒక పేదవాడు ధనవంతుల అమ్మాయి ని ప్రేమించి ఏ ధనవంతుల కూతుర్లకు పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా అంటు సినిమా డైలాగులు కొడితే బయట పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సినిమాలు చూసి ప్రేమ ప్రేమ అని పాకులాడే వారికి నేను చెప్పేది ఏంటంటే..


ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేకాని ప్రేమే జీవితం కాదు. నిన్ను నమ్మి నీకుటుంబ సభ్యులు ఉంటారు ముందు వారి గురించి అలోచించి ప్రేమల గురించి అలోచించండి..


ప్రేమ లేకుండా బతకొచ్చు కాని డబ్బు లేకుండా బతకలేం..


చదువుకునే వయసులో ప్రేమించడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత జీవితం చాలా కష్టంగా ఉంటుంది.


ఎందుకంటే చదువుకుని ఒక స్థాయి కి వెళ్ళకుండా ప్రేమ అంటు పార్కుల వెంబడి తిరిగితే పెళ్ళైయ్యాక ఒకరి చేతికింద జీవితాంతం వెట్టిచాకిరి చేసి కుటుంబాన్ని పోషించాల్సి ఉంటుంది..


అందుకే ప్రేమ అనేది అంత ముఖ్యం కాదు మన కేరీర్ ముఖ్యం. ఈ వయసులో ప్రేమ అంటు తిరిగితే జీవితాంతం బాధ పడుతూ బతకాల్సి ఉంటుంది.


అలాగే మీపై ఆధారపడిన మీక కుటుంబ సభ్యులను బాధ పడేలా చేయకండి...


ఇక ప్రేమ చాలా గొప్పది విలువైనది అంటారు నిజమే ప్రేమ అనేది చాలా గొప్పది అమ్మ నాన్నల ప్రేమ గొప్పది,తోట బుట్టిన వాళ్ళ ప్రేమ గొప్పది. ఈ ప్రేమను ఎవరు పట్టించుకోరు కేవలం అమ్మాయి ప్రేమ మాత్రమే గొప్పది అని తెగ ఎమోషన్స్ చేస్తూ  విరహ  గీతాలు పాడుతూ, ప్రేమ లేకపోతే జీవితమే లేదు అన్నట్టు సినిమా వాళ్ళు చూపిస్తుంటారు.  దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొందరు జీవితాలను పాడుచేసుకుంటారు. సినిమా వాళ్ళు సినిమాలో మాత్రమే ప్రేమ గురించి గొప్పగా నీతులు చెబుతుంటారు. కాని వాళ్ళ నిజ జీవితాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అది రోజు మనకు కనపడుతూనే ఉంది... 


కాబట్టి సినిమా వేరు జీవితం వేరు. సినిమాల్లో మాదిరి జీవితంలో జరుగుతుందనుకుంటే ఇక అంతే జీవితం తలకిందులుగా అవుతుంది...


ఈ సినిమాలో ఈ సన్నివేశం చాలా రియాలిటీ గా అనిపించింది.. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో మార్పు వస్తుంది అని నేను భావిస్తున్నాను..


అలా కాకుండా ప్రేమ గొప్పది ప్రేమించిన అమ్మాయిని లేపుకపోయి పెళ్ళి చేసుకోవాలని చెబితే ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. తమ కుటుంబం పరువు కోసం ఎంతకైనా తెగించే వాళ్ళను చూస్తున్నాం..


వాళ్ళు రాక్షసులు అనొచ్చు కాని వాళ్ళు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ అమ్మాయిని ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి మూడు నెలలు ప్రేమించిన అనే ఒకే ఒక్క అధికారంతో లేపుకపోయి పెళ్ళి చేసుకుంటే ఎవరి ఫ్యామిలీ కైనా కోపం రాక మంచి పని చేసారని సన్మానం చేస్తారా....? ఇరవై ఏళ్ల ప్రేమ కంటే మూడు నాలుగు నెలల ప్రేమ గొప్పదా..!!






 అందుకే ఇంత పెద్ద పోస్టు రాస్తూ లెక్చర్ ఇచ్చాను. ఇంత ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు

..



అవును సినిమా పేరు చెప్పడం మర్చిపోయాను. 

సినిమా పేరు "పేపర్ బాయ్".








 





 




18, అక్టోబర్ 2019, శుక్రవారం

ఎందుకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు.?






మనదేశంలో ప్రజలు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు ఎందుకు..? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు..

ఎందుకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు.?

ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని కారాణాల వల్ల గ్రామీణ ప్రాంతాలవారు ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతుంటారు.

అందులో రెండు రకాల కారణాలున్నాయి.

అందులో మొదటి కారణాలు:-

:- ప్రజలకు సేవ చేయడానికి.

:- స్వప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజల సమస్యలు తీర్చడానికి.

:- ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేయడానికి‌.


రెండవ కారణాలు:-


:- ప్రభుత్వ ఉద్యోగం వస్తే సమాజంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది.

:- జీతాలు, ఇంక్రిమెంట్ లు ఎక్కువగా ఉంటాయి.

:- రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది.

:- పెళ్ళికి ముందే ప్రభుత్వ ఉద్యోగం వస్తే కట్నం ఎక్కువగా వస్తుంది.

:- ప్రభుత్వ ఉద్యోగం వస్తే రిటైర్మెంట్ అయ్యేవరకు గ్యారంటీగా ఉద్యోగం ఊడకుండా ఉంటుంది.

:- పని తక్కువ,సెలవులు ఎక్కువగా ఉంటాయి.

:- రెండు చేతులా సంపాదించవచ్చు.


 అందరూ రెండవ కారణాల కోసమే ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారు.

ఇన్ని సౌకర్యాలు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలవారు ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుంటారు.






11, అక్టోబర్ 2019, శుక్రవారం

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కు ప్రజల మద్దతు లభిస్తుందా.?




ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ప్రజల మద్దతు లభిస్తుందా?? 

కొన్ని కారణాల వల్ల ప్రజల మద్దతు లభించకపోవచ్చు.

:- తెలంగాణలో పెద్ద పండుగ దసరా పండుగకు మూడు నాలుగు రోజుల ముందు తర్వాత మూడు నాలుగు రోజుల వరకు ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఆ సమయంలో సమ్మె చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసారు.

ఇలా పండుగ పూట జనాలను ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారు. మద్దతు పక్కనపెడితే ప్రజలు  ఆర్టీసీ ఉద్యోగులపై కోపంగా ఉన్నారు..

:- ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా కండక్టర్లు ప్రయాణికులతో అమర్యదాపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటారు.

ప్రతీరోజూ ఆర్టీసీ లో ప్రయాణం చేసే ప్రయాణికులతో ఆర్టీసీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తుండటం వలన ప్రజలు వీరికి ఎలా మద్దతు ఇస్తారు..?

ప్రయాణికులే సంస్థకు నిధి అంటారు అలాంటి ప్రయాణికులు పట్ల మర్యాదపూర్వకంగా మెలగాల్సిన ఉద్యోగులు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇందుకా వీళ్ళకు ప్రజలు మద్దతివ్వాల్సింది.?

పండుగ పూట సమ్మె చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాక, ప్రతీరోజు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తుండటం వలన ప్రజలు వీరికి మద్దతు ఇవ్వరు..

వీళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేసిన ప్రజలు ఇబ్బంది పడరు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతారు. ఆటోలు,క్యాబ్ లు, ట్రైన్ లలో ప్రయాణం చేస్తారేకాని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రజల మద్ధతు మాత్రం లభించదు..





20, జులై 2019, శనివారం

బిగ్ బాస్ షో

       
BIGBOSS show



              బిగ్ బాస్ షో అసలు ఈ షోలో ఏముందో అర్థం కాదు.  ఎంటర్టైన్మెంట్ కోసం ఈ షో అంటారు. ఓ పది మంది కాంట్రవర్సీటీ, ఇంకొంత మంది సెలెబ్రెటీలను ఒక హౌస్ లో ఉంచి షో చేస్తారట. ఇందులో వారు ఏం చేసిన  ఎంటర్టైన్మెంటేనట.
వారు నిల్చున్న, కూర్చున్న, నవ్విన, ఏడ్చిన ఏం చేసిన ఎంటర్టైన్మెంటే. ఇదో పనికి మాలిన షో. ఇలాంటి షోలను పనికి మాలిన వాళ్ళే చూస్తారు. ఇది పనికి మాలిన షో అని అందరికి తెలుసు పైగా అందులోని సెలెబ్రెటీలకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడాను.!!
అది కూడా మామూలు ఫాలోయింగ్ కాదు ఆర్మీ అంట అందులో ఒక సెలెబ్రెటీకి ఒక ఆర్మీ అంట. ఆయన ఆర్మీ  పెద్ద బ్యానర్లు వేయించడం, రోడ్లపై ర్యాలీలు తీయడం చూసాం. ఎంత పిచ్చి అండీ జనాలకి హైదరాబాద్ వంటి నగరంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదా జనాలకి. వాటిపై ఎవ్వరు నోరు మెదపరు కాని పనికి రాని షో కోసం ర్యాలీలు తీయడం సిగ్గుచేటు. పైగా ఆర్మీ అని పేరు పెట్టడం. దేశం కోసం ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపాలా కాసే జవాన్ల కోసం ర్యాలీలు తీయరు కాని బోడి పనికిమాలిన షోల కోసం ఏమైన చేస్తారు.

      ఇప్పుడు బిగ్ బాస్ 3 సీజన్ అంట మొదట
 జూ.ఎన్టీఆర్,  తర్వాత నాని ఇప్పుడు నాగార్జున ఈ షోలకి హోస్ట్ లు. అసలు ఇంత మంచి పేరున్న నటులు కూడా ఇలాంటి చెత్త షోలు చేయడం చూస్తుంటే ఆశ్ఛర్యం వేస్తుంది.
ఇలాంటి షో లు సమాజానికి అవసరమా చెప్పండి. దీని ద్వారా ఏం చెప్పిలనుకుంటున్నారు జనాలకి ఈ షో నిర్మాతలు. అయిన నిర్మాతల తప్పేం లేదు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు తీస్తారు చూసే జనాలకి ఉండాలి. పనికిమాలిన షోని కూడా జనాలు పాపులర్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నారంటే ఇంకేం కావాలి నిర్మాతకి కాసుల పంటే. జనాలు గొర్రెలు నిర్మాతల దృష్టిలో మామూలు గొర్రెలు కాదు కాసులు కురిపించే బంగారు గొర్రెలు. ఇలాంటి గొర్రెలు ఉన్నంత కాలం బిగ్ బాస్ లాంటి షోలు నడుస్తూనే ఉంటాయి....


27, మే 2019, సోమవారం

పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!

పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!


     ఎక్కడైనా పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాస్తుంటారు. కాని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వారికి చదువు చెప్పిన టీచర్లకే పరీక్ష పెట్టాలని నిర్ణయించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆ రాష్ట్రంలో 700 పాఠశాలల్లో  30% మంది  విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో అక్కడి ఉపాద్యాయుల విషయపరిజ్ఞానాన్ని పరీక్షించాలని మధ్యప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్షలకు కూడా విద్యార్థులకు పెట్టే పరీక్షలవలే ప్రశ్నపత్రాలు రూపొందిస్తారట. పరీక్ష జూన్ 12   జరుగనుంది.
 
      ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని స్వచ్ఛందంగా పదవి విరమణ చేయించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారట. పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థులదే బాధ్యత అంటారు. కానీ మధ్యప్రదేశ్ లో ఉపాద్యాయుల బాధ్యత కూడా ఉంటుందని వారికి పరీక్ష పెట్టి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.
     
             ఏదో మొక్కుబడిగా చదువులు చెప్పి నెల నెల జీతాలు తీసుకోవడం అలవాటయిపోయింది నేటి ప్రభుత్వ ఉపాధ్యాయులకి. విద్యార్థులు చదివిన చదవకపోయిన మాకేంటి మా జీతాలు మాకు వస్తాయి అనే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికి అనేక ప్రభుత్వ పాఠశాలల్లో   చదవడం రాయడం కూడా రాని విద్యార్థులు ఉన్నారు. వారు చదవకపోవడానికి కారణం ఎవరు?? ఇందులో  ఉపాధ్యాయుల బాధ్యత ఏమి లేదా..
పైగా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థినులపట్ల  అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచానికి దిగజారుతున్నారు.. ఇలాంటి వారి వలన మిగితా ఉపాధ్యాయులకు చెడ్డపేరు వస్తుంది.  ఇలాంటి నీచమైన ఉపాధ్యాయులను ఎవరు ప్రశ్నించకపోవడం వలన వారు ఆడిందే ఆట పాడిందే పాట. మమ్మల్ని ఎవరు ఏం పీకలేరని వారి ధీమా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అప్పుడేె విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అలాగే విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్థించే ఉపాధ్యాయులని ఉద్యోగాల నుండి తీసేసి కఠిన శిక్షలు వేయాలి. అలాగే వారి కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేకుండా చేయాలి.

                 
           ఒక ప్రభుత్వ ఉద్యోగానికి వేలల్లో పోటిపడుతున్నారు. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటిది టీచర్  ఉద్యోగం చేసుకుంటు అర లక్ష జీతాలు తీసుకుంటు విద్యార్థినులను లైగికంగా వేదిస్తున్నారు.  ఇలా నీచంగా ప్రవర్తించడం చాలా ధారుణం. ఇలాంటి వారిని ఉద్యోగం నుండి తొలగించి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి.


పవిత్రమైన ఉపాధ్యాయవృత్తిలో కీచక టీచర్లు.

https://youtu.be/ZDFdUNojDIY

https://youtu.be/SSK11ezwnTc


https://youtu.be/vA2Pt_FaBno





     


1, ఏప్రిల్ 2019, సోమవారం

ఏప్రిల్ ఫూల్ కాదు ఏప్రిల్ కూల్ చేద్దాం.


           ఏప్రిల్ 1 అంటే అందరికి తెలుసు ఏప్రిల్ ఫూల్ డే. అసత్య కథనాలతో అందరూ   ఆటపట్టిస్తూ ఫూల్ చేస్తుంటారు. ఇలా ఆటపట్టించడం సరదాగానే ఉంటుంది కాని కొందరు నిజమే అనుకుని కంగారుపడుతుంటారు. ఇలాంటివి చేయడం కొందరికి సంతోషం కలిగిన ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అందరిని ఫూల్స్ చేసామని సంతోషిస్తుంటారు. ఏప్రిల్ 1 ఫూల్స్ డే ఇదొక్క రోజే ఫూల్స్ ని చేయడం అనుకుంటారు. ప్రతిరోజు చాలా మంది ఫూల్స్ని చేస్తునే ఉంటారు.
ఇ‌లా కొత్తగా ఒకరోజు ఫూల్స్ చేయడం ఏంటి ప్రతిరోజు కొందరు కొందరిని ఫూల్స్ చేస్తూనే ఉంటారు.

ఉదా: కాలేజికి వెళ్ళిన విద్యార్థులు సినిమాలకి షికారులకు వెళ్ళి తల్లిదండ్రులను ఫూల్స్ చేస్తుంటారు.

ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు ఒక రోజులో అయిపోయే పనులు చేయడానికి రోజుల తరబడి తిప్పుతూ ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.

ఎన్నికల్లో రాజకీయ నాయకులు హామీలిచ్చి ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.

విత్తన కంపెని వాడు నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను ఫూల్స్ చేస్తాడు.

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ కు వెళితే ధళారులు రైతులను ఫూల్స్ చేస్తారు.


  • కొందరు డాక్టర్లు రోగులను ఫూల్స్ చేస్తారు.


దొంగ బాబాలు అమాయక భక్తులను ఫూల్స్ చేస్తారు.

కొందరు క్రైస్తవ ఫాదర్ లు తమ గారడీలతో ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.

ఆకరికి రోడ్లమీద పండ్లు అమ్మేవారు కూడా వినియోగదారులకు మంచి పండ్లు చూపించి పాడైపోయిన పండ్లు ఇచ్చి ఫూల్స్ చేస్తుంటారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏప్రిల్ ఫూల్ డేనే ఇంకా కొత్తగా ఎందుకండి ఏప్రిల్ ఫూల్ డే.

సరే ఈ విషయాలన్ని వదిలేయండి ఇవి రోజు జరిగేవే వీటిని ఎవరు మార్చలేరు. ఎందుకంటే మనది భారతదేశం.

మనకు సంవత్సరమంతా ఏప్రిల్ ఫూల్స్ డేనే కనుక ఈ  ఒక్కరోజు అయిన అందరూ ఒక మొక్క నాటి
   "ఏప్రిల్ ఫూల్ కాదు ఏప్రిల్  కూల్ చేద్దాం".





25, ఫిబ్రవరి 2019, సోమవారం

ప్రేమ కాదు కామం

   
         ప్రేమ ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక అందమైన అనుభూతి. ఎవరైనా ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడడం సహజమే. తనకు నచ్చిన వారిని ప్రేమించి భాగస్వామిని చేసుకునేవారు కొందరైతే, మోసం చేసేవారే అధికం. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం ప్రేమ పేరుతో పార్కులు, శికార్లు అంటూ తిరగడం హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.
ఏ పార్కులోకి వెళ్ళిన ప్రేమపక్షులు కాదు కామపక్షుల దృశ్యాలే కనిపిస్తాయి. ఈ దెబ్బకి చిన్న పిల్లలతో పార్కులకు వెళ్ళడం మానేశారు జనాలు. ఈ విషయం పక్కన పెడితే నూటికి తొంబై శాతం ప్రేమలు అసలైన ప్రేమలు కావు. ఆ పది శాతం కూడా డౌటే మోసం చేసేవరకు తెలియదు.
అబ్బాయిల విషయానికి వస్తే చాలా మందికి ప్రేమ అంటే ఎమిటో తెలియదు కేవలం తమ శారీరక అవసరాల కోసం ప్రేమను వాడుకుంటున్నారు. వారి శారీరక సుఖాలు తీరాక అమ్మాయిలను వదిలించుకుంటారు ఒప్పుకోకుంటే అంతమొందించడాననికి కూడా వెనకాడటం లేదు.
ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయిన అమ్మాయిలు ఇలాంటి వారిని నమ్మి మోసపోతునే ఉన్నారు.

            ఇంటర్ చదివే వయసులో ప్రేమ అనేది అవసరమా చెప్పండి. వయసు ప్రభావం అనుకుంటే ఓకే వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు.? తమ పిల్లలు ఏం చేస్తున్నారు కాలేజికి వెళ్తున్నారా లేదా అని ఎప్పుడైనా గమనిస్తారా. తల్లిదండ్రులు పిల్లలపై ఒక కన్నేసి ఉంచితే మంచిది. తమ పిల్లలు ప్రేమ పేరుతో తిరుగుతున్నారని తెలిస్తే వెంటనే బుద్ది చెెప్పండి. ఇప్పుడే ఇలా తిరిగితే చదువు ఏమైపోతుంది  భవిష్యత్ లో ఎలా బతుకుతారు? చదువులు అటకెక్కుతాయి ఒకవేళ పెళ్ళి చేసుకున్న మీరు చదివిన చదువుకి ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం దేనికి సరిపోదు. ఆ తర్వాత గోడవలు కొట్లాటలు మొదలు విడిపోవడం జరుగుతుంది. అని ముందే వారి తమ భవిష్యత్ గురించి చెప్పండి అర్థం చేసుకునేవారైతే మారుతారు అర్థం చేసుకోలేని వారు అనుభవిస్తారు వారిని వదిలేయండి. చెప్పితే వినని వాళ్ళని చెడంగా చూడాలి అని అంటారు.
   
         యువతకు నేను చెప్పేది ఎంటంటే  ప్రేమించటం తప్పుకాదు ప్రేమ పేరుతో మోసం చేయడం తప్పు.
చిన్న వయసులో ప్రేమించడం తప్పు. మీరు ప్రేమించే వ్యక్తి ఎలాంటివాడో తెలియకుండా ప్రేమించడం తప్పు. మీ తల్లిదండ్రులు మీపై ఉంచిన  ఆశలు, నమ్మకాలను వమ్ముచేయకండి.   బుద్దిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడ్డాక ప్రేమలో పడండి ఈ వయసులో మెచ్యూరిటీ వస్తుంది ఒకరినొకరు అర్థం చెసుకుంటారు. జీవితంలో స్థిరపడుతారు కాబట్టి ఏ లోటు లేకుండా జీవితాంతం  హాయిగా ఉంటారు.

       నిజమైన ప్రేమికులు ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితాంతం తోడునీడగా ఉంటారు. శారీరక సుఖాలు తీరిపోగానే వదిలించుకునేది ప్రేమకాదు కామం. ఇలాంటి కామా ప్రేమికుల మాయమాటలు నమ్మి మోసపోకండి. అందమైన జీవితాన్ని ఆదిలోనే నాశనం చేసుకోకండి. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చెసుకోండి పెళ్ళి తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు. 

24, జనవరి 2019, గురువారం

టిక్ టాక్ పిల్లలు


                  ఒకరోజు సాయంత్రం స్కూలు పిల్లల బస్ లో ఎక్కాను. వెళ్ళి వెనుక సీట్లో కూర్చున్న. బస్ లో పిల్లలందరు 5వ తరగతి లోపు వారే ఉన్నారు. స్కూల్లోనే వీళ్ళ అల్లరి భరించలేం  బస్ లో ఊరుకుంటారా స్కూల్లో కంటే  రెట్టింపుతో అల్లరి చేస్తున్నారు. వీళ్ళను బస్సులో ఎక్కించే వ్యక్తి ఎంత అరుస్తున్నా అల్లరి మాత్రం తగ్గడం లేదు.
  పిల్లలంటే  అంతేగా మరీ అల్లరే అల్లరి ఒకరిద్దరు ఉంటేనే వాళ్ళ అల్లరి భరించలేం బస్ నిండా ఉంటే తేనే తెట్టును కదిలించినట్టే ఉంటది.

    వీళ్ళతో మనకెందుకులే అని నా మానాన నేను మొబైల్ లో వార్తలు చదువుకుంటున్నా. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి అంకుల్ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. వార్తలు చదువుతున్నా అని చెప్పా ఎప్పుడు వార్తలేనా కొంచెం సేపు టిక్ టాక్ పెట్టు అంకుల్ అంటు రిక్వెస్ట్ చేసాడు. టిక్ టాకా ఎంటిదిరా అది అన్నాను. టిక్ టాక్ అంటే తెల్వదా అంకుల్ మస్తు జోకుంటది పెట్టంకుల్ అంటు మళ్ళి రిక్వెస్ట్ చేసేసరికి నాకు కొంచెం దాని గురించి తెలుకోవాలనిపించింది. యూట్యూభ్ లో టిక్ టాక్ అని టైప్ చేసా లేటెస్ట్ టిక్ టాక్ వీడియోస్ అంటు కొన్ని వీడియోస్ వచ్చాయి. ఓపెన్ చేసా ఆ వీడియోకు అందులోని  మాటలకు ఏ సంబంధం లేకుండా ఉన్నాయి ఇక పంచులకు కొదవే లేదు పటాస్ పంచులు, పోరగాళ్ళ ఒయలు కలగలిపితే టిక్ టాక్ అని అప్పుడు అర్థమయ్యింది. వాడితో పాటు బస్ లో ఉన్న ఇంకొంత మంది పిల్లలు చుట్టు చేరారు. అంకుల్ టిక్ టాక్ అంటే ఇది కాదంకుల్ అది యాప్ ప్లే స్టోర్ నుండి  డౌన్లోడ్ చేయ్యు అన్నాడు. అది యాప్ కూడా ఉందా అని అడిగాను ఆ.. ఉంది నేను రోజు చూస్తా అన్నాడు. అరే  వీడు  వేలెడంతా లేడు ఇప్పుడే వీడికి ఈ యాప్ లు ఇవన్ని ఏలా తెలుసబ్బా అనుకుంటు వాడిని అడిగా బాబు ఏం చదువుతున్నావ్ రా అని 3rd క్లాస్ అంకుల్ అని చెప్పాడు. మూడో తరగతి అంటే ఎడెనిమిది సంవత్సరాలు ఈ వయస్సులోనే ఈ పిల్లలకి స్మార్ట్ ఫోన్ దాని లోని యాప్స్ మొత్తం తెలుసు వాళ్ళ తల్లిదండ్రులకంటే ఎక్కవగా మొబైల్ గురించి తెలుసు.
      ఇంకా నీకు ఎం తెలుసురా మొబైల్ లో అడిగాను యూట్యూభ్ తెలుసు ఫేస్బుక్ తెలుసు వాట్సాప్ తెలుసు అంటు మొబైల్ లో ఉన్న అరడజను యాప్ ల గురించి గడ గడ చెప్పేసాడు. ఇవన్ని నీకు ఎలా తెల్సురా అని అడిగా మా డాడి ఫోన్ లో నేను రోజు చూస్తాను అని చెప్పాడు. ఓ అలాగా మరీ ఎప్పుడు చదువుకుంటావురా అంటే హోంవర్క్ అయిపోయిన తర్వాత చూస్తాను అన్నాడు. అబ్బా ఈ పిల్లలు ఎంత స్పీడో కదా నా చిన్న తనంలో అయితే హోం వర్క్ అయిపోయిన తర్వాత అందరం కలిసి బయట గ్రౌండ్ కి వెళ్ళి ఆటలాడుకునే వాళ్ళం. ఇప్పటి పిల్లలకి ఆటలాడే సమయం లేదు, ఆటలమీద ఆసక్తి లేదు మొబైల్ ఫొన్ ఉంటె చాలు టిక్ టాక్ అంటారు అది బోర్ కొడితె PUBG గేమ్ అంటారు. ఇక వాడు బయటికి వెళ్ళి ఏం ఆటలాడుతారు.
   
    టిక్ టాక్ లో కేవలం కామెడీ మాత్రమే ఉండదు పంచులే పంచులు అందులో నాన్ వెజ్ పంచులు కూడా ఉంటాయి.
 ఈ వయసులోనే వీళ్ళకి నాన్ వెజ్ పంచులకి అలవాటుపడితే తొమ్మిది పది తరగతి వచ్చేలోపు
తల్లిదండ్రుల మాటలు వింటారా అసలు చదువుకుంటారా ప్రేమలు అంటారు తర్వాత తాగుడు సిగరేటు మందు అన్ని అలవాట్లు హైస్కూల్ ఏజ్ లోనె అలవాటుపడి అడ్డదిడ్డంగా తయారువుతారు. తల్లిదండ్రులు మావాడు ఇప్పుడే మొబైల్ మొత్తం తెలుసు అన్నీ యాప్ లు తెలుసు అంటు మురిసిపోతున్నారు. కాని వాళ్ళు ముందు ముందు ఎలా తయారవుతారోనని ఆలోచించడం లేదు. ప్రతీ తల్లిదండ్రులు  ఇలా పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చి వారికి  చెడుమార్గంలోకి దారి చూపిస్తున్నారు. ఈ టిక్ టాక్ లు వీడియో గేమ్ లు అవసరమా చెప్పండి. పిల్లలను ఆరు బయట ఆటలాడేందుకు ప్రోత్సహించండి క్రికెట్ ,వాలిబాల్, బాస్కెట్ బాల్, కబాడ్డీ లాంటి వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా ప్రోత్సహించండి దాని వలన ఆరోగ్యానికి మంచిది. అలాకాకుండా మొబైల్ ఫోన్ ఇచ్చి వీడియో గేమ్ ఆడిపిస్తే వాడు ఆ గేమ్ లో లీనమై బయట కూడా అలాగె ప్రవర్తిస్తాడు. మొత్తంగా సైకోల్లాగా తయారవుతారు పిల్లలు.

దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకు స్మార్ట్  ఫోన్ ఇవ్వకండి. ముందు చదువుకోమనండి ఆ తర్వాత ఆటలు ఆడించండి.. మంచి భవిష్యత్ ను అందించండి. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు ఇప్పటి నుండె సరైన క్రమశిక్షణతో పెంచితే పెద్దవాళ్ళయ్యాక ప్రయోజకులు అవుతారు.

1, జనవరి 2019, మంగళవారం

తాగుబోతుల దినోత్సవం


        తేది మారిపోతే ఏం ఉంది ప్రత్యేకత నిన్న నేడు రేపు తేడా ఏముంది? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. పడమరనే అస్తమిస్తాడు. ప్రతీ రోజు అందమైన రోజే కదా.
మరీ ఏంటీ ఈ 31 డిసెంబర్ అర్దరాత్రి సంబరాలు.
ఎందుకు ఈ సంబరాలు అసలు ఇవి సంబరాల?
తాగి తందనాలు ఆడడం.
 ఏం సాదించారని ఇంత హడావిడి.

 ఓ ...పేద్ద పేద్ద శబ్ధాలతో బాణాసంచా పేలుళ్ళు. అది కూడా అర్దరాత్రి.

తాగడానికేగా హ్యాపీ న్యూఇయర్.

రోజు తాగతూనే ఉంటారుగా మళ్ళీ ఈ రోజు కూడానా! ఇంకో విషయం ఏంటంటే తాగనోడు కూడా ఈ రోజు తాగుతాడు.!!
ప్రతిరోజు తాగుతూనే ఉంటారు కాని తాగడానికి కూడా ఓ రోజు ఉండాలిగా! అందుకే 31 డిసెంబర్ తాగుడు దినోత్సవం.
హ్యపీ న్యూఇయర్ కాదు "డ్రింకర్స్ న్యూసెన్స్ ఇయర్".
 ఈ రోజుని మధ్యపాన దినోత్సవంగా గుర్తించాలి.
   
                     "తాగుబోతుల దినోత్సవం"
                              శుభాకాంక్షలు


17, జులై 2018, మంగళవారం

మేకవన్నె పులులు



కుక్క కు విశ్వాసం ఉంటుంది.
పిల్లికి విశ్వాసం ఉండదు..
సింహం ,పులి ,లాంటి జంతువులకు కౄరత్వం ఉంటుంది.
ఆవుకు మృదు స్వభావం ఉంటుంది..
ఊసరవెల్లికి రంగులు మార్చే గుణం ఉంటుంది.
ప్రతీ జీవికి పుట్టుకతోనే ఒక స్వభావం ఉంటుంది.
అది ప్రకృతి రీత్య ఆయా జంతువుల స్వభావం..

ప్రతీ జంతువు స్వాభావం మనకు తెలుసు..
అందుకే
కౄర మృగాలకు దూరంగా ఉంటాం.
ఆవు మేక కుక్క  వంటి వాటిని మనం ఇంట్లో పెంచుకుంటాం..
అవి ఏనాడు మనకు హాని తల పెట్టవు.

కాని ప్రపంచంలోని అన్నీ జంతువుల స్వభావాలు ఒక మనిషిలో మాత్రమే చూడగలం.
అదే

"మానవ మృగాలు"

సందర్భాన్నీ బట్టీ ఒక్కో స్వభావం బయట పడుతుంది.

కౄర జంతువులు అడవుల్లో తమకంటే చిన్న బలహీనమైన జంతువులను వేటాడి తిని బ్రతుకుతాయి.

కాని మానవ మృగాలు మన చుట్టూనే ఉంటారు
మేక వన్నె పులిలా తిరుగుతూ అవకాశం వచ్చినపుడు పంజ విసురుతారు..
అలాంటి వారిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది..

మన చుట్టూ ఉంటూ మంచిగా ఉన్నట్టు నటిస్తు మన వెనకాలే గోతులు తవ్వే వంద మంది స్నేహితుల కంటే నిజాయితీగా ఉండే ఒక స్నేహితుడు చాలు జీవితంలో సంతోషంగా బ్రతకడానికి......

ఈ పోస్ట్ సమాజంలో కొందరు వ్యక్తులు నమ్మకంగా ఉంటు నమ్మిన వారినే వెన్నుపోటు పొడిచే వారిని ఉద్దేశించి వ్రాయడం జరిగింది..