26, అక్టోబర్ 2022, బుధవారం
పొట్లం యాప్ ఆన్లైన్ కూరగాయలు
2, ఏప్రిల్ 2022, శనివారం
వ్యవసాయం మీద ప్రేమతో ఎకరం విస్తీర్ణంలో బావిని తవ్వించిన రైతు భగీరథుడు.
ఆలోచన అంటే ఇది, అభివృద్ధి అంటే ఇది, పర్యావరణ పరిరక్షణ అంటే ఇది..
ఒక సామాన్య రైతు గొప్ప పని చేసాడు కాదు కాదు భగీరథ ప్రయత్నం చేశాడు. చేసి సాధించాడు.
మహారాష్ట్ర బీడ్ జిల్లా పదల్షింగి గ్రామానికి చెందిన రైతు మారుతి బాజ్గుడే సాధించిన విజయం చూస్తే గర్వంగా ఉంది..
బీడ్ జిల్లా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండడం వలన నీళ్ళ కరువుతో పంటలు పండేవి కావు. మారుతి అనే రైతుకు 12 ఎకరాలు పొలం ఉంది ఎంత పొలం ఉంటే ఏంటి లాభం నీళ్ళు లేకుంటే..
అప్పుడు ఆ రైతు ఆలోచన ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే తన పొలంలో నీళ్ళ కరువే లేకుండా చేయాలనుకుని ఒక ఎకరం విస్తీర్ణంలో, నలబై అడుగుల లోతుగా బావిని తవ్వాలనుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం అంటే మామూలు విషయం కాదు అదికూడా ఒక రైతు.
ఇది జరిగే పనేనా!
ఇంత విశాలమైన బావిని తవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది.
తవ్వినాక నీళ్ళు రాకుంటే పరిస్థితి ఏంటి?
ఇవేవి మారుతి పట్టించుకోలేదు.
కేవలం తాను అనుకున్నది సాధించాలి అంతే.
తన పొలం ఎప్పుడు పంటలతో కళకళలాడుతూ ఉండాలి.
తను అనుకున్నట్టుగానే బావిని తవ్వించాడు. బావిచుట్టు కాంక్రీటు తో గోడ నిర్మించాడు.
అందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర రూపాయలు..
అంత ఖర్చా ..! అది నీళ్ళ కోసం..!
అని అందరూ నోరెళ్ళబెడతారు. ఇది పిచ్చి పని అనికూడా అంటారు.
అదే కోటిన్నర తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అంటారు..
కాని మారుతి గారు ఇవేమి పట్టించుకోకుండా వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేసాడు.
తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఎకరం విస్తీర్ణంలో ఉన్న బావిలో పుష్కలంగా నీరు ఉంది. ఆ నీటితో తన పదకొండు ఎకరాల పొలానికి నీరు అందుతుందని అంటున్నాడు. అందులో అన్నిరకాల పండ్ల మొక్కలు, అన్నిరకాల పంటలు వేస్తానంటున్నాడు.
"నీవు ప్రయత్నం చేయి ఫలితం భగవంతుడు చూసుకుంటాడు అన్నట్టు"..
మన ఆలోచన మంచిదైతే మన ప్రయత్నంతో ఏ పని చేసిన ఫలితం సాధించవచ్చు అని నిరూపించారు మారుతి గారు. ఆయన పేరు మారుతి అంటే హనుమాన్. ఆనాడు ఆ హనుమాన్ కొండను పెకిలించి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మారుతి బీడు భూముల్లో బావిని తవ్వి గంగమ్మను తీసుకొచ్చాడు.. తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు.
చాలా మంది అనుకుంటారు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం ఎందుకు.
అదే డబ్బు తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అని..
అదే మనదగ్గర అయితే ఈ పాటికి అలాంటి భూమి ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకునేవాళ్ళు.
ఉన్న నీటి వనరులను కాలుష్యం చేస్తారు.
కాని మారుతి గారు వ్యవసాయం మీద ప్రేమతో ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా తాను అనుకున్నది సాధించాడు.
మారుతి గారు కోటిన్నర ఖర్చు పెట్టిన దానికి ఆయన పొందే ఆనందానికి ఎన్ని వేల కోట్ల డబ్బుతో వెలకట్టలేనిది.
అప్పటి వరకు బీడుగా ఉన్న పొలం తన ప్రయత్నంతో పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంది. విశాలమైన బావిలో పుష్కలంగా నీరు ఉంది. తను పెంచుకున్న వివిధ రకాల పండ్లు మొక్కలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో తన పొలం గట్టు మీద నీటి కాలువ పక్కన ఉన్న ఒక పచ్చని చెట్టుకింద నులక మంచం వేసుకుని ఒక కునుకు తీస్తుంటే ఆ ఆనందం ఎన్ని లక్షల కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి..
చుట్టూ పచ్చని పంటపొలాలు,
పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు,
పొలం గట్టున కాలువలో చిన్నగా పారే నీటి సవ్వడి, ఆకాలువ నీటితో తడిసిన మట్టి సువాసన,
ఈ వేసవిలో మద్యాహ్నం వీచే పిల్లగాలులు. వీటన్నింటిని ఆస్వాదిస్తూ ఆ చెట్టు కింద కూర్చుని ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఆనందానికి ఎన్ని కోట్లు వెల కట్టగలం.
మారుతి గారు ఏడాది పొడవునా పంటలు పండిస్తూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు.
ఆయన తను పెట్టిన ఖర్చు తిరిగి సంపాదిస్తాడా అంటే? సంపాదిస్తాడు.
ఎందుకంటే మనదగ్గర వ్యవసాయం తగ్గిపోయింది త్వరలో ఆహార సంక్షోభం తలెత్తుతుంది. అప్పుడు మారుతి లాంటి రైతులు వద్దే ఆహార ధాన్యాల ఉంటాయి కాబట్టి వారు అప్పుడు కోట్లు సంపాదిస్తారు.
ఆయన కోట్లు సంపాదించడం కంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాడు అది చాలు ఆయనకు ఈ జన్మకు సంతృప్తి..
26, జులై 2019, శుక్రవారం
టైమ్ బ్యాంక్ అంటే ఏమిటి?
టైమ్ బ్యాంక్ గురించి ఒక చోట మెసేజ్ చదివాను కొత్తగా అనిపించింది. అసలు ఏంటి టైమ్ బ్యాంక్ అని చూస్తే బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు స్విస్ ప్రజలు తమ ఇతరులకు సేవ చేసి ఆ సమయాన్ని టైమ్ బ్యాంకులో దాచుకుంటారట.
తిరిగి వారు దాచుకున్న సమయాన్ని వడ్డీతో సహా వాడుకోవచ్చట.
టైమ్ బ్యాంక్ అనేది స్విట్జర్ లాండ్ లో ఉంది.
టైమ్ బ్యాంక్ అనేది స్విట్జర్ లాండ్ ప్రభుత్వం వృద్దుల కోసం ఏర్పాటు చేసిన వృద్దాప్య పెన్షన్ కార్యక్రమం. తాము వయసులో ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నవారికి సేవచేస్తూ ఆ సమయాన్ని తమ టైమ్ బ్యాంక్ ఖాతాలో దాచుకుంటారట. అలా తమ ఖాతాలో దాచుకున్న టైమ్ ను వారు అనారోగ్యానికి గురి అయినప్పుడు వాడుకోవచ్చట.
ఈ టైమ్ బ్యాంక్ లో తమ సేవా సమయాన్ని దాచుకునాలనుకునే వారు అందులో ఖాతా పొందాలి. ఈ ఖాతా పొందాలనుకునే వారు ఆరోగ్యంగా ఉండి అందరితో స్నేహపూర్వక సంభాషణ నైపుణ్యం కలిగి ఉండాలి. వారి సేవలను పొందాలనుకునే వారికి సేవలను అందించగలగాలి. అలా ఒక సంవత్సరం తమ సేవలను అందించిన తర్వాత వారు ఎంత సమయం సేవ చేసారో అన్ని గంటలను లెక్కించి టైమ్ బ్యాంక్ కార్డు ఇస్తారు. ఈ కార్డులో వారు ఎన్ని గంటలు సేవ చేసారో ఉంటుంది. వారు వృద్దాప్యంలో అనారోగ్యానికి గురి అయినప్పుడు తిరిగి అన్ని గంటలు వడ్డీ తో కలిపి వారికి సేవలు చేయడానికి టైమ్ బ్యాంకు వారు వాలంటీర్లను పంపిస్తారట. ఈ వాలంటీర్లు అంటే తమ సమయాన్ని టైమ్ బ్యాంకులో దాచుకునేవారే.
స్విట్జర్లాండ్ లో టైమ్ బ్యాంకు విధానం ద్వారా వృద్దులకు సేవలు అందిస్తున్నారు. ఈ విధానం ద్వారా అనేక సామాజిక సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయట. టైమ్ బ్యాంకులు ఒంటరి వృద్దులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కదా...
7, ఏప్రిల్ 2019, ఆదివారం
ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుల్లో వెనుకబడి ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు రేపు ఏ రంగంలో రాణిస్తారు.
మరో వైపు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు నాణ్యమైన విద్యాబోధన వలన అన్ని రంగాల్లోను రాణిస్తున్నారు. ఇది తీవ్రమైన పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తుంది. అలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకుని అప్డేట్ అవ్వాలి. కాని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందంటే 70ఏళ్ళైనా ఏమీ మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఈ పరిస్థితి మారదా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరగదా.?
ప్రభుత్వాలు ఎలాగు ఈ పాఠశాలలను పట్టించుకోవు. టీచర్లు కూడా ఎలాంటి సలహాలు ఇవ్వరు. వాళ్ళ జీతం వాళ్ళకు వస్తే చాలు విద్యార్థులు ఏమైపోతే ఏంటి అనుకుంటారు.
నాణ్యమైన విద్య అంటే అర్థవంతమైన పాఠాలు చెప్పడం. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎలా ఉంటుందో మనకు తెలుసు ఒక నల్ల బోర్డు చాక్ పీస్ అంతే మొత్తం పాఠాలు నల్ల బోర్డు పైనే. ఇలా చెప్తె ఎంత మందికి అర్థమవుతుంది చెప్పండి. పాఠం గురించి ఊహించుకోవాలి అంతే అలా ఊహించుకుని అర్థం చేసుకునే శక్తి అందరికి ఉండదు. ఈ రోజు చెప్పిన పాఠం రేపు అడిగితే చెప్పలేకపోతారు. ఎందుకంటే పాఠాలు చెప్పే విధానం అర్థం కాకపోవడమే.అదే పలాన సినిమాలో హీరో ఎవరంటే టక్కున చెప్పేస్తారు. మొత్తం సినిమా కథ చెప్పమన్న చెప్పేస్తారు. దీనికి కారణం సినిమా అనేది దృశ్యరూపం ఆకర్శనీయంగా ఉంటుంది. ఒకసారి చూస్తే అలాగే గుర్తుండి పోతుంది. అలాగని సినిమాలు చూపించమనట్లేదు. పాఠాలనే అర్థవంతంగా దృశ్యరూపంలో చూపిస్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు. అదేనండి స్మార్ట్ క్లాస్ విధానం. ఈ స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. అప్పుడే విద్యార్థులు అర్థవంతంగా పాఠాలు నేర్చుకుంటారు.
ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసెస్ ప్రారంబించాలంటే ప్రభుత్వాల వల్ల కాదు. మనమే చేయాలి ఎలాగంటే స్వచ్ఛంద సంస్థలు గాని లేదా ఎవరైన కొంతమంది ఒక జట్టుగా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం గురించి అవగాహన కల్పించాలి. ప్రతి పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూం ఎర్పాటు చేసేలా కృషి చేయాలి. ఇందుకు డబ్బులు ఎలా అంటే పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థి వద్ద నుండి కొంత మొత్తం వసూలు చేసి ఈ స్మార్ట్ క్లాస్ ఎక్విప్ మెంటుకు సరిపడ డబ్బు తీసుకుంటె సరిపోతుంది. అలాగే ఉపాద్యాయుల వద్ద కూడా కొంత మొత్తం తీసుకుని
పాఠశాలలోని ఒక గదిలో స్మార్ట్ క్లాస్ సెటప్ ను సెట్ చేసుకుంటే చాలు. ప్రొజెక్టర్, స్క్రీన్, స్పీకర్స్, పాఠాలకు సంబందించిన మెమరీ డ్రైవ్ లు పాఠశాలల్లో అందించి వాటి ఆపరేటింగ్ గురించి ఉపాద్యాయులకు శిక్షణ ఇచ్చేస్తే చాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనను అందిచి వారి అభివృద్దికి పాటుపడుదాం.
ఈ నా ఆలోచన నచ్చినవారు మీకు వీలైతే ఈ స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయగలరు.
