ఒక చిన్న కంపెని అందులో CFL బల్బులు తయారు చేస్తారు. కంపెనీలో ఉద్యోగులు 200 వరకు ఉంటారు. అందులో పని చేయడానికి నేను వెళ్ళాను. కంపెనీలో 2 షిఫ్ట్ లు మాత్రమే అంటే ఒక షిఫ్ట్ 12 గంటలు. చాలా కంపెనీల్లో 3 షిఫ్ట్ లు ఒక్కో షిఫ్ట్ 8గంటలు ఉంటాయి. కాని ఈ కంపెనీలో 2 షిఫ్ట్ లు మాత్రమే. 12 గంటలు అయినా సరే ఉద్యోగం చేయాల్సిందే ఎందుకంటే ఉద్యోగం తప్పితే వేరే దారి లేదు. ఉండేది సిటీలో రూమ్ రెంటు కట్టాలి. అన్ని కొనాలి. ఈ పరిస్థితుల్లో ఏ ఉద్యోగం అయినా చేయాల్సిందే తప్పదు.
కంపెనీలో కి వెళ్ళిన తరువాత అక్కడ పని ఏంటంటే ఒక కన్వేయర్ బెల్ట్ దాని చుట్టూ డజను కుర్చీలు అవి కుర్చీలు అంటే లగ్జరీ కుర్చీలు అనుకునేరు కేవలం కూర్చుని పనిచేసే విధంగా చెక్క తో తయారు చేసిన బల్లులు. వాటిపై కూర్చుని కన్వేయర్ బెల్ట్ పై నుండి వచ్చే CFL బల్బులను చెక్ చేయడం వాటికి ఉన్న వైర్లు కత్తిరించడం, వాటికి PCB లు పెట్టడం, క్యాప్ లు పెట్టడం, సోల్టరింగ్ చేయడం ఆ తర్వాత వాటిని డబ్బాలో జాగ్రత్త గా పెట్టాలి. ఇదే పని
అలా కన్వేయర్ బెల్ట్ పై వస్తున్న బల్బులను మిషన్ వేగంతో, తోటి కార్మికుల వేగంతో పని చేయాలి ఎవరు నెమ్మదించిన బెల్ట్ పై బల్బులు వెళ్ళపోతూనే ఉంటాయి మిషన్ మాత్రం ఆగదు. ఒకవేళ ఆపితే అంతే సంగతులు సూపర్వైజర్ తో నానా తిట్లు, రిమార్కులు, జీతంలో కోతలు. అన్నింటికంటే మించి అందరిముందు అవమానం తప్పదు.
అలా ఉదయం 7 గంటలకి మొదలైన పని సాయంత్రం 7 గంటలవరకు చేయాలి. మధ్యలో ఓ అరగంట మాత్రమే భోజన విరామం ఉంటుంది. ఉదయం 7 గంటలకి కంపెనీకి వెళితే మధ్యాహ్నం 12 గంటలకి భోజనానికి వెళ్ళాలి అదికూడా కేవలం 30 నిమిషాల్లోనే భోజనం చేసి రావాలి. 30 నిమిషాల కంటే ఒక్కో నిమిషం ఆలస్యం అయినా సూపర్ వైజర్ తో తిట్లు తప్పవు వాళ్ళు మామూలుగా తిట్టరు అందుకని ఎవరు నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేస్తారు.
మధ్యాహ్నం తిని వచ్చిన తర్వాత మళ్ళీ కన్వేయర్ బెల్ట్ పై బల్బుల పని చేస్తూనే ఉండాలి సాయంత్రం 7 గంటల వరకు. 12 గంటలు ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
అలా వారం రోజులు పగలు డ్యూటీ పూర్తి అయ్యింది. తర్వాత వారం నైట్ డ్యూటీ చేయాలి. సాయంత్రం 7 గంటలకి కంపెనీకి వెళితే ఉదయం 7 గంటలవరకు డ్యూటీ చేయాలి. నైట్ డ్యూటీ కూడా సేమ్ రాత్రి 12 గంటలకి భోజనానికి వెళ్ళాలి అదికూడా కేవలం 30 నిమిషాల్లోనే తినేసి రావాలి. ఒక్కో నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. నైట్ డ్యూటీ కదా కాసేపు పడుకుంటాం అంటే కుదరదు.
ఉదయం అయినా రాత్రి అయిన 12 గంటలు పని చేయాల్సిందే. కేవలం 30 నిమిషాలు మినహాయించి. నిద్ర వస్తుంది అంటే కుదరదు పని చేయాల్సిందే లేదా ఉద్యోగం మానేయాలి. నాముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు అక్కడి పని చేయలేక. కంపెనీలో కి అడుగు పెడితే చాలు అక్కడ కార్మికులకు, యంత్రాలకు పెద్ద తేడా ఉండదు. కంపెనీల్లో కార్మికులను యంత్రాల్లాగే చూస్తారు. ఇలాంటి కంపెనీల్లో కార్మికులను అస్సాం, బీహార్ లాంటి రాష్ట్రాల నుండి తీసుకువస్తారు.
నాకు ఒకరితో మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ పని చేసి అందరి మన్ననలు పొందాను. కొందరు అసూయ కూడా పడ్డారు ఎందుకంటే నాతో పాటు పనిలో పోటీ పడలేక పోయేవారు సూపర్ వైజర్ లతో నానా తిట్లు తినేవారు. నేనేప్పుడు మాట పడలేదు కాని ఈ కంపెనీలో ఉద్యోగం అంటే అది 12 గంటలు, వారం రోజులు, పగలు, రాత్రి తేడా లేకుండా డ్యూటీ చేయాలి. ఫ్రీడమ్ అనేది లేదు, యంత్రాలకు, మనుషులకు తేడాలేదు. 12గంటలు పని 2 గంటలు ప్రయాణం,10 గంటలు నిద్ర ఇదేనా జీవితం ఇలాంటి బానిస జీవితం వేస్ట్ అనిపించింది కంపెనీకి దండం పెట్టి వచ్చేసా.
ఇక కంపెనీలో CFL బల్బు తయారు చేసే విధానం ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సన్నని గాజు గొట్టాన్ని వివిధరకాల ఆకృతుల్లో ఒక బల్బు గా తయారు చేసే టెక్నాలజీ అద్భుతం.
ఈ CFL కంపెనీలో నేను గమనించిన ఒక పెద్ద విషయం ఏంటంటే మనం మార్కెట్లో కొనే బల్బుల పై వివిధ రకాల కంపెనీలో బ్రాండ్ లా పేర్లు ఉంటాయి కదా అంది చూసి మనం ప్రతీ బ్రాండ్ కి ఒక కంపెనీ ఉంటుంది అనుకుంటాం.కాని ఏ బ్రాండ్ కి కూడా కంపెనీ ఉండదు. ఒక కంపెనీ బల్బు తయారు చేస్తే వివిధ రకాల బ్రాండ్ల పేరుతో వాటిని ప్యాక్ చేసి మార్కెట్లో విడుదల చేస్తారు.
అంటే ఒకే బల్బు పేర్లు మాత్రం వేరు.
ఇప్పుడు LED బల్బులు వచ్చాయి ఇప్పుడు ఆ కంపెనీ మూతపడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి