భానోదయం: డిసెంబర్ 2018

19, డిసెంబర్ 2018, బుధవారం

లక్ష రూపాయలతో కోట్లు సంపాదించడం ఎలా??

    బస్ వచ్చి చాలా సేపు అయ్యింది తొందరగా రా అంటు...నా స్నేహితుడు బస్ లో నుండి ఫోన్ చేసాడు. పరుగున వెళ్ళి  గబ గబ బస్ ఎక్కాను. అక్కడ  రోజు ఇద్దరే స్నేహితులు ఉంటారు కాని ఈరోజు ఎవరో కొత్త వ్యక్తి ఉన్నాడు.ఎవరా అని దగ్గరకెళ్ళి చూస్తే నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చూసిన నా క్లాస్ మేట్ ఎక్కడనుండి ఊడిపడ్డడో ఏమో కాని ముగ్గురు దేని గురించో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆ ఇద్దరికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు కనిపించాడు అతడు.

       మధ్యలో నేను కలుగజేసుకున్నాను ఏంటి విషయం అని అడిగాను. 

రేపు సిటీలో మీటింగ్ ఉంది అక్కడికి రండి మొత్తం ప్లాన్ అర్థమవుతుంది. మీరు ప్లాన్ విన్న తర్వాత వెంటనే ఇందులో జాయిన్ అవుతారు అంటూ చెప్పాడు.
నేను మీటింగ్ విన్న వెంటనే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసేసాను అంటూ చెప్పాడు.

 ఎన్ని రోజులు ఇలా ఉంటారు మీరు సంపాదించేది మీకు సరిపోతుందా ఒక్క సారి ఇందులో జాయిన్ అవ్వండి లక్షలేంటి కోట్లు సంపాదిస్తారు. అంటు గాలి బాగా కొడుతున్నాడు.

మా మిత్రుడు ఇతని గాలి కొట్టుడుకు బాగా ఉబ్బిపోతున్నాడు బెలూన్ ఉబ్బినట్టు. కాని మరీ ఎక్కవ గాలి అయితే  ఏంటి పరిస్తితి అంటూ నా సందేహం.

ఏంటి ఈ స్కీమ్ అని అడిగాను.

ఎం లేదు సింపుల్ నువ్వు ఒక లక్ష రూపాయలు ఈ సంస్థలో కట్టాలి కట్టిన నెల నుండే నీకు 6000 రూపాయలు 25 నెలల పాటు  వస్తాయి. మరియు 25 నెలల తర్వాత మీ లక్ష మీకు ఇస్తారు. ఇంకా నీ తరుపున ఇందులో ఎవరినైన ఇందులో చేర్పిస్తే అందుకు కమీషన్ 3%అంటే మూడు వేలు వస్తాయి నువ్వు ఎంత మందిని చేర్పిస్తే అంత సంపాదించుకోవచ్చు అంటు గుక్క తిప్పుకోకుండా ఒకటే గాలి మాటలు చెబుతూనే ఉన్నాడు.

మావాడు ఇప్పటికే బాగా బెలూన్ లా ఉబ్బిపోయాడు.
 ఇంత డబ్బు వస్తుదంటే గాల్లో తేలిపోయేలా ఉన్నాడు. వీడు ఎక్కడ ఎగిరిపోతాడో అని వాడి మాటలకు అడ్డుపడి ఓకె బ్రదర్ ఇందులో సంపాదిస్తున్న వారి వివరాలు చెప్తావా??అని అడిగాను.

తన ఫోన్ తీసి ఒక ఇద్దరు ముగ్గురు  తమ కార్ల ముందు దిగిన ఫోటోలు చూపించాడు.
వీళ్ళు తెలుసా అంటు అడిగాడు తెలియదు అన్నాం ..

ఒకప్పుడు ఏమీ లేనోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. వీళ్ళు చాలా మందిని చేర్పించారు. బాగా సంపాదిస్తున్నారు అంటూ ఫోటోలు చూపించాడు.

ఇంకా నమ్మకపోతే ఈ వీడియో చూడు అంటూ కొంతమంది ఓర్వలేక ఈ సంస్థ మోసాలు చేస్తుందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అందుకే సంస్థ మనేజర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సంస్థ వివరాలు చెప్పాడు. అంటూ యూట్యూబ్ లో వీడియోలు చూపించాడు.

ఓకె ... ప్రెస్ మీట్ పెట్టాడు నమ్మోచ్చు మరీ ఈసంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉందా ? అని అడిగాను.

ఏ.. అవన్ని మనకెందుకు అన్న మనకు నెల నెల డబ్బులు వస్తున్నాయా లేదా? అంటు అన్నాడు .

ఇంకో మిత్రుడు కలుగచేసుకుని ఒకవేళ మోసం చేస్తే ఏంటి పరిస్థితి అంటు గాలి తీసేసాడు. బెలూన్ లా ఉబ్బిన మావాడు ఈ మాటతో తుస్సుమన్నాడు.

 ఎలాగైన ముగ్గురి చేత డబ్బులు కట్టించి కమీషన్ పొందాలని చూస్తున్న అతడు వెనక్కి తగ్గుతాడా? ఒక ఫోటో చూపించాడు

 ఈయన ఎవరో తెలుసా?? అని అడిగాడు.

 హా! తెలుసు ఈయన చాలా నిజాయితి పరుడు అవినీతి పరుల గుండెల్లో రైల్లు పరిగెత్తించిన భారతదేశంలోనే ఒకరైన ఐఏస్ అధికారి అంటు ఇద్దరం సమాధానం చెప్పాం.

తెలుసు కదా ఈయన గురించి మరీ ఈ సంస్థ మోసం చేేసేదే అయితే అంత నిజాయితి పరుడైన ఐఏస్ అధికారి ఈ సంస్థ వారు చేపట్టే కార్యక్రమాలకు వస్తాడా ?? చెప్పండి అంటూ ప్రశ్న సందించాడు.

అరే అవునురా ఇందులో మోసంలేదు మనం ఇందులో లక్ష కడుదాం మన తరుపునుండి ఎవరినైనా జాయిన్ చేద్దాం డబ్బులు సంపాదించుకుందాం ఎన్ని రోజులు ఇలా చాలి చాలని జీతాలతో పని చేస్తాం నేను లక్ష కట్టేస్తా అని మా మిత్రుడు జాయిన్ అవ్వడానికి సిద్దం అయ్యాడు.

నేను ఇంకో మిత్రుడు మాత్రం సందేహిస్తూనే ఉన్నాం.

సరే ఓకవేళ మోసం చేస్తే ఏంటి పరిస్థితి?? అంటూ అడిగాం.

అరే ఏందన్నా ఇన్ని డౌట్లు నమ్మాలి అన్నా అందుకే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు ఇందులో జాయిన్ అయ్యి ప్రతీ నెల లక్షలు సంపాందించేే వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఏమి లేనటువంటి వారు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. సొంతంగా బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు నమ్మాలి అన్న నమ్మకమే జీవితం. అంటూ ధీమా వ్యక్తం చేసాడు.

నువ్వు ఎన్నైనా చెప్పు బ్రదర్ ఒక వేళ రాత్రికి రాత్రే బోర్డ్ తిప్పేస్తే ఏంటి పరిస్థితి. ఇలా బోర్డ్ తిప్పేసిన సంస్థలు చాలా చూసాం. అక్కడ డబ్బులు పెట్టి మోసపోయిన చాలా మందిని చూసాం. మేము నీ మాటలు నమ్మలేం అన్నాను.

అన్నా నమ్మితే నమ్ము లేకపోతే లేదు ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళను మాత్రం ఆపకు అంటూ కొంచెం చిరాకుగా చెప్పాడు.

నా మిత్రుడితో అరే నువ్వు ఎవరి మాట వినకు నువ్వు నా కింద జాయిన్ అవ్వు...
పోతే లక్ష పోతాయి వస్తే కోట్లు వస్తాయి ఒక్కసారి లక్ష పెట్టు నువ్వే ఇందులో ఇంకా పది మందిని చేర్పిస్తావు. ఇంకో విషయం ఎంత ఎక్కువ మందిని చేర్పిస్తే అంత కమీషన్ తో పాటు గోవా, సింగపూర్, దుబాయ్ లాంటి ప్రదేశాలకు టూర్లు కూడా పంపిస్తారు. మన పక్క ఊర్లో సగం మందికి పైగా జాయిన్ అయ్యి కార్లలో తిరుగుతున్నారు.అసలు నువ్వు ఊహించావా కార్లలో తిరుగుతావని మరియు ఫారిన్ టూర్లు వెళ్తానని ఎప్పుడైన ఊహించావా?!!
తొందరగా కట్టు ఇప్పుడే ఈ నెలలోనె లక్ష రూపాయలు కట్టి జాయిన్ అవ్వు వచ్చే నెల అంటే డిసెంబర్ లోపల జాయిన్ అవ్వు ఎందుకంటే తర్వాత జాయిన్ అయితే డబ్బులు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకే కమీషన్ తక్కువగా ఇస్తారు. నువ్వు రేపు లక్ష కట్టి జాయిన్ అవ్వు త్వరగా
 అంటూ మా వాడికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు.

పోతే లక్ష పోతాయా లక్ష అంటే చిన్న మొత్తమా ??
నీతో పాటు ప్రయాణించే నీ మిత్రుడికి పది రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనడానికి వెనక ముందు ఆలోచిస్తావు. టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇరవై రూపాయలు కట్టడానికి జేబులు తడుముకుంటావు. నీవు లక్ష పోతే పోతాయి అంటున్నావా??  ఆహా ! డబ్బు సంపాదించడానికి ఎన్నైనా చెబుతారు ఎంతకైనా దిగజారుతారు. అంటు అనుకున్నాను.
అది కూడా డిసెంబర్ లోపల కట్టాలి అంటూ తొందరపెడుతున్నాడు.

అబ్బా ఇంత తొందర ఏంటి డిసెంబర్ లోపలె కట్టాలా ???  డిసెంబర్ లోపల వీళ్ళ టార్గెట్ మనీ రీచ్ అయితే బోర్డు తిప్పేద్దామని కాబోలు.. అని నా సందేహం..

ఇప్పుడు మా మిత్రుడికి ఎంత చెప్పిన వినేలా లేడు.
మా వాడి బ్రెయిన్ లో కార్లు ,టూర్లు ,డాలర్లు షికారు చేస్తున్నాయి.

 కార్లల్లో తిరగాలని ఫారిన్ టూర్లు వెళ్ళాలని అందరికీ ఉంటుంది కానీ వాడు మోసం చేస్తే కార్లు టూర్లు ఏమో కాని వీడిని నమ్మీ  డబ్బు పెట్టిన వారు, నీ మీద నమ్మకం తోనే ఇందులో డబ్బులు పెట్టాం. ఆ డబ్బులు నువ్వే ఇవ్వు అంటే కనీసం సొంత ఊళ్ళోనైనా  తిరగగలడా??


నెల రోజుల తరువాత డిసెంబర్ నెల...

ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాం.

వార్తల హెడ్ లైన్స్ ...

అంబాని వారింట పెళ్ళి సందడి ప్రపంచంలోనే ఖరీదైన పెళ్ళంటా..

 తెలంగాణలో ఓటమికి కారణాలు అన్వేషిస్తున్న కూటమి..

దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్..

 అధిక వడ్డీలు ఇస్తామంటూ బోర్డ్ తిప్పేసిన సంస్థ..

ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి..

సిందు ఖాతాలో మరో విజయం..


అంబానీల సంబురాల కంటే
కూటమి ఓటమి కంటే
తుఫాన్ భీభత్సం కంటే
భారత్ ఓటమి కంటే
సిందు విజయం కంటే

ఇన్ని వార్తల్లో  హైలెట్ ఏంటంటే  కోట్లల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ..!!!

ఆ సంస్థ మరేదో కాదు ఒ రోజు మాకు బస్సులో బ్రెయిన్ వాష్ చేసిన వ్యక్తి తాలుకు సంస్థే.

ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విఛాఫ్ చేయబడి ఉంది. అంటూ సమాధానం వచ్చింది.

ఎప్పటికైనా బోర్డు తిప్పేస్తారని ఊహించాం కానీ ఇంత తొందర గా తిప్పేస్తారని ఊహించలేం.

ఒక ప్రభుత్వ పాఠశాల టీచర్.
14000  మందిని నిలువునా ముంచేసాడు.
158 కోట్లు కాజేసాడు.

అత్యాశకు పోయి కష్టపడి సంపాదించున్న డబ్బులు. ఏ కష్టం చేయకుండా సంపాదించుకోవచ్చు అని చెపితే గొర్రెల్లా వెళ్ళి ఈ మాయగాడికి సమర్పించుకున్నారు.

 చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం???

నువ్వు చేరు నీ కింద ఇంకో ముగ్గురుని చేర్పించు ఇక అంతే  నువ్వు ఏ పని చేయక్కర్లేదు కూర్చున్న చోటకే డబ్బులు వస్తాయి అని చెప్పే మాయగాళ్ళ మాటలు నమ్మి చాలా మంది మోసపోతున్నారు.
ఇంకా కూడా మోసపోతూనే ఉంటారు.

ఈజీగా డబ్బు వస్తుందటే అది 100% మోసమే అని గుర్తించాలి..

వీళ్ళు  అందరిని నమ్మించడానికి చాలా కార్యక్రమాలు చేస్తారు మంచి పేరున్న వ్యక్తులను పిలిపించి సేవా కార్యక్రమాలను చేపడుతారు.
మీటింగ్ లు పెట్టి వింధు భోజనాలు పెట్టిస్తారు. వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి పెట్టుబడి పెట్టెలా "కలుస్తే గెలుస్తం" అంటూ ఉపన్యాసాలతో ఊదరగొడతారు.
అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు పెట్టేస్తున్నారు సామాన్య జనం.
అప్పులు చేసి మరీ ఇందులో పెడుతున్నారు.

వాళ్ళు అనుకున్న అమౌంట్ వచ్చినాక బిచానా ఎత్తేస్తారు. సంస్థ నిర్వాహకులు.

ఎన్నీ సంస్థలు బోర్డులు తిప్పేసిన ఇంకో కొత్త సంస్థలు వస్తూనే ఉంటాయి. గొర్రెల్లా జనాలు అందులో డబ్బులు పెట్టి మోసపోతూనే ఉంటారు.

నిర్వాహకులు మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నారు.
ఒక్క రూపాయి లేకుండా కోట్లు సంపాదించడం ఎలా??
అంటూ, ఇలా ప్రజలను మోసం చేసి సంపాదిస్తున్నారు.




12, డిసెంబర్ 2018, బుధవారం

కారు+సారు=సర్కారు@కెసీఆర్ వార్ వన్ సైడ్



  తెలంగాణలో ఎదురులేని శక్తిగా తెరాస నిలిచింది.
మహా కూటమి కూలిపోయింది. కూటమిలో వారిలో వారికే స్పష్టత లేదు మరి ఇలాంటి వారికి జనం అధికారం అప్పజెప్తారా.???  పైగా ప్రగల్భాలు అది చేస్తాం ఇది చేస్తాం పీకేస్తాం బరికేస్తాం అంటూ ఒకటే ఊపదంపుడు ఉపన్యాసాలు.

అసలు కూటమి యొక్క ముఖ్య ఉద్ద్యేషం కెసీఆర్ ను గద్దె దింపడం.! అంతె తప్ప అబివృద్ది, ప్రజల సంక్షేమం కోసమైతే కాదు. కెసీఆర్ ను గద్దె దింపడం ఎవరి తరం కాదు. కారణం ప్రజలు కెసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. తెలంగాణ సంక్షేమంగా ఉండాలంటే కెసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలంటు ఈ అఖండ విజయాన్ని అందించారు.
  ఇది ప్రజల విజయం...

మహాకూటమి నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కెసీఆర్ పాలన అంతం చేస్తాం, కాంగ్రేస్ లో ఫైర్ బ్రాండ్ అనిపించుకునే నేతలు మీసాలు, గెడ్డాలు మెలేసారు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అని, ఇంకొకరు బ్లేడ్ తో కోసుకుంటాననీ.ఇంకొకరు తొడలు కొట్టారు బుల్ బుల్ కామెడీలు చేసారు.

చివరికి ఏమైంది సారే కెసీఆరే గెలిచారు. మీసాలు
గెడ్డాలు  మెలేసిన పౌరుషం ఏమైంది???? తొడలు కొట్టిన హీరోయిజం ఏమైంది????

ఫామ్ హౌస్ లో పండుకునేటోడు రాష్ట్రాన్నీ ఏం పాలిస్తాడన్నారు?? కెసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకునేటోడు కాదు ఫామ్ లో ఉన్నోడు అని నిరూపించాడు...

పేడ మూతోడు మీసాలు లేనోడు అంటు హేళన చేస్తు మాట్లాడిన నేతలకు తన మెజారిటీ గెలుపుతో తన స్టామినా ఏంటో నిరూపించాడు కెటీఆర్.

మీసాలు,గడ్డాలు పెంచినంత మాత్రాన హీరోలైపోరు జనం హృదయాలను గెలవాలి ఆడే మగోడు మగాడు...
       
కెటీఆర్ సాఫ్ట్ వేర్ మీలాగా చిల్లరగాడు కాదు.
మైక్ ఉందికదా నలుగురు చెంచాగాళ్ళు ఆరుస్తున్నారు కదా అని నోటికి ఏదోస్తే అదే మాట్లాడటం కరెక్ట్ కాదు.

హీ ఇజ్ ఏ క్లారిటీ పర్సన్. మిస్టర్ పర్ ఫెక్ట్..

ప్రజలకు కావలసింది ఈలలు వేయించే మాటలు కాదు. అభివృద్దికి వేయించే బాటలు కావాలి..
     
 ఇంకొకరు సినిమా డైలాగులతో మేం సింహాలం ఒకవైపే గెలుపు అన్నట్టు సినిమా డైలాగులతో అధరగొట్టారు.
అధరగొట్టె సమయంలో నవ్వులపాలు అయ్యారు. సినిమా వేరు జీవితం వేరు సినిమాని జీవితాన్ని ఒకేలా చూడలేం. సినిమా ,జీవితం ఒకేలా ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే .. అలా అనుకుంటే పప్పు పప్పు అయిపోవడం గ్యారంటీ!!
అయిపోయారు కూడా!!😁😁😁😁

పెద్ద ఎత్తున డంబాచారం కొట్టిన మహాకూటమి కెసీఆర్ ప్రభంజనం ముందు గడ్డిపోచలా కొట్టుకుపోయింది.

అసలు సింహం ఎవరో తెలిపోయింది..

కెసీఆర్ అంటే ఆల్తు ఫాల్తు కాదు..

కెెసీఆర్ అంటే కెసీఆరే ..

ఎదురులేని నాయకుడు ..

ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక సీఎం...

ఫిర్ ఏక్ బార్ కాదు బార్ బార్ సీఎం కెసీఆర్...

           

8, డిసెంబర్ 2018, శనివారం

కమెడియన్ ఆఫ్ ద ఇయర్


              తెలుగు సినిమా ఇండస్ట్రీలో  హీరోలు విలన్లుగా విలన్లు హీరోలుగా మారి యాక్టింగ్ చేస్తుంటారు. ఉదాహరణకు జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు. అలాగే  ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అరవింద స్వామి ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు. 
            అలాగే టాప్ కమెడియన్లు సునీల్ , సప్తగిరి, షకలక శంకర్ కూడా హీరోలైపోయారు.  తెలుగులో కమెడియన్లు అందరూ హీరోలుగా నటించడం వలన కామెడి తక్కువైపోయింది. బ్రహ్మీ సినిమాలు చేయడం లేదు. మరీ ఇలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకులు కామెడీ లేక బోర్ గా ఫీల్ అవుతున్న సమయంలో నేనున్నానంటూ దూసుకొచ్చాడు ఈ కామెడీ సింహం.
     టాప్ కమెడియన్లను మించి కామెడి చేస్తున్నాడు. 
    తెలంగాణ ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేసి చేసి అలసిపోయి ఈయన కామెడి చూసి రిలీఫ్ అవుతున్నారు.
  ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో,
 ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను అటు బాలీవుడ్ ప్రేక్షకులను, రాజకీయ నాయకులను  ఏకకాలంలో తన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తున్నాడు. 
  
  అసలు కామెడీ ఎలా చేయాలో ఈయనను చూసి నేర్చుకోవాలి. కామెడీకి స్పెల్లింగ్ నేర్పిందే ఈయన.


తన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేల నవ్విస్తు "కామేడియన్ ఆఫ్ ద ఇయర్" అనిపించుకున్నాడు ఈ తెలుగు తేజం..
    
    ఆయన ఎవరో అనుకుంటున్నారా!!!

మాదాపూర్ లో ఐటీ కి స్పెల్లింగ్ నేర్పించిన మాదాపూర్ మైదాపిండి!!

తన కామెడీతో హిస్టరీ క్రియేట్ చేస్తున్న కామెడీ సింహం....!!!

ఆయన ఎవరో నేను చెప్పను మీరే చూడండి...!!!

ఆయన చేసిన కామెడీలో మచ్చుకు ఒకటి ఈ బుల్ బుల్ కామెడి....!!!😂😂😂😂
   
    ఈ పోస్ట్ ఎవరిని కించపరచడానికి  కాదు  కేవలం నవ్వడానికి మాత్రమే..










      


          

6, డిసెంబర్ 2018, గురువారం

రూపం మార్చిన ఆక్టోపస్

   
   ఆక్టోపస్ అంటే అందరికి తెలుసు ఆరు నుండి ఎనిమిది కాల్లు ఉంటాయి వాటినే టెంటకిల్స్ అంటారు. అవసరానికి అనుగునంగా తన ఈ టెంటకిల్స్ తో  రూపాన్ని మార్చుకుంటుంది. పరిసరాలకనుగునంగా రంగులు మారుస్తుంది శత్రు జీవులనుండి కాపాడుకోవడానికి దాని శత్రు జీవిగా మారిపోతుంది అది ఆక్టోపస్ ప్రత్యేకత. మరి సముద్రంలో ఉండే ఆక్టోపస్ ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించింది అంటే సాకర్ వరల్డ్ కప్ 2010 లో ఏ దేశం మ్యాచ్ నెగ్గుతుందో ముందే జోష్యం చెప్పింది అది చెప్పినట్టే జరిగింది దాని యజమాని పాల్. అందుకే దానికి పాల్ ఆక్టోపస్ అని పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందో కాని తర్వాత ప్రపంచకప్ లో అది కనపడలేదు. రష్యాలో జరిగిన సాకర్ ప్రపంచకప్ లో చెవిటి పిల్లి జోష్యం చెప్పింది.
    మరీ పాల్ ఏమయ్యింది ప్రపంచవ్యాప్తంగా అందరూ పాల్ గురించి ఆలోచిస్తున్నారు చనిపోయిందా లేదా  సముద్రంలోకి వెళ్ళిపోయిందా ఏమైంది.??
       అలా ఆలోచిస్తుంటే ఆంద్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది ఒక కొత్త రూపంలో ఒకప్పుడు ఫుట్ బాల్ ప్రపంచకప్ లకు జోష్యం చెప్పే పాల్ ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోష్యం చెప్పింది అరే ఈ హైటెక్ యుగంలో ఈ చిలక జోష్యాలు పాల్ జోష్యాలు ఎవడు నమ్ముతారు అని మీరనొచ్చు నమ్మాలి ఎందుకంటే అది చెప్పిన జోష్యం నిజం అయ్యింది కాబట్టి. 2014  ఎన్నికల్లో తెలంగాణలో సర్వే చేసి  ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఆక్టోపాస్ కరెక్ట్ గా చెప్పింది అప్పుడు ప్రపంచం దృష్టి ఆంధ్రావైపు మళ్ళింది పాల్ ఆక్టోపాస్ ఎక్కడికి వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిందని అందరూ దానికి ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు పెట్టారు కాని సముద్రంలో ఉండే ఆక్టోపస్ కి తన లక్షణాలు ఒక్కటి కూడాలేవు.
          మరి ఆక్టోపస్ ఎందుకు తన రూపాన్ని కోల్పోయింది అనుకుంటున్నారా ముందే చెప్పానుగా ఆక్టోపస్ అనే జీవి పరిసరాలకనుగునంగా అవసరానికి తగ్గట్టుగా తన రూపాన్ని మార్చుకుంటుందని అందుకే ఇప్పుడు ఇలా ఆంధ్రా ఆక్టోపస్ గా అవతరించింది. రూపం అయితే మారింది గాని అది చెప్పే జోష్యం మారలేదు. 2014 లో సర్వే చేసి అన్ని ఎన్నికల ఫలితాలు కరెక్ట్ గా చెప్పింది. 2018 లో కూడా సర్వేచేసి  ఫలితాలు చెప్పింది కాని అది నిజం అవుతుందో కాదో అసలు అవుతుందా అని డౌటు ఎందుకంటే పాల్ ఆక్టోపస్ ఒకసారి మాత్రమే ఫుట్ బాల్ టోర్నీకి జోష్యం చెప్పింది తర్వాత చెప్పలేదు తన రూపాన్ని మార్చుకున్నట్టే వృత్తిని ,ప్రాంతాన్ని రెండు మార్చేసింది అదేనండి సాకర్ నుండి ఎన్నికలకు, జర్మనీ నుండి ఆంధ్రప్రదేశ్ కు మారింది ఈసారి మాత్రం ఏమీ మార్చలేదు అలాగే ఉంది అందుకే అది చెప్పే జోష్యం కరెక్ట్ కాదని అనిపిస్తుంది.
     అసలు పాల్ ఆటల నుండి రాజకీయాల వైపు అదికూడా తెలుగు రాజకీయాలవైపు వచ్చింది ఎందుకు ?? బహుషా రాజకీయాలంటేనే రంగులు మార్చడం అనుకుందేమో అవసరాన్ని బట్టి రాజకీయ నాయకులు పార్టీ కండువాలు మారుస్తుంటారు అందుకని ఈ వైపు వచ్చి ఉండాలి రంగులు మార్చే నాయకులను ఊసరవెల్లితో పోలుస్తాం నాకేం తక్కువ రంగులతో పాటు రూపాన్ని కూడా మార్చగలననీ ఇటు వైపు వచ్చి ఉండాలి. కొంపదీసి ఈ ఆక్టోపస్ ను రప్పించింది బాబు గారైతే కాదు కదా!!

 అసలు పాల్ ఈ సారి ఎందుకు తన రూపాన్ని మార్చలేదు ఒకవేళ తన జోష్యం తప్పయితే మార్చుతుందేమో చూడాలి. నాలుగైదు సంవత్సారాలకు ఒక సారి  తన రూపాన్ని మార్చేే పాల్  ఆక్టోపస్ ఈ సారి ఎక్కడికి వెళ్తుందో చూడాలి.
   

           
                      సర్వేజన లగడపాటి భవంతు

4, డిసెంబర్ 2018, మంగళవారం

బహుభాష కోవిదుడు బాలయ్య



    తెలుగులో అనర్గళంగా మాట్లాడేవారిలో బాలయ్య బాబు ముందువరుసలో ఉంటారు. అబ దబబ ఆఆఒ బబబ అబ అంటు అనర్గళంగా మాట్లాడగలరు.ఇప్పుడు ఎన్నికల పప్రచారంలో తనదైన శైలిలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తన మాటల తూటాలతో ఎండగడుతున్నారు.మరోవైపు మోది సర్కార్ పైన కూడా తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు మనందరికి తెలుసు బాలయ్య బాబు తెలుగు ఎంత చక్కగా ఉఛ్ఛరిస్తారో కొందరు భాష పండితులకు మాత్రమే అది అర్థం అవుతుంది. ఇప్పుడు బాలయ్య హిందీలో కూడా అధరగోడుతున్నారు బాలయ్యకు తొడలు కొట్టడమే వచ్చు అనుకున్నాం కాని ఇలా హిందీలో అధరగొడుతాడని ఊహించలేం.
           ఈ మధ్య ఒక సభలో ఆయన హిందీలో చేసిన ప్రసంగం హిందీ భాషా పండితులకు సైతం అర్థం కాలేదు అది బాలయ్య వాక్ఛ్యాతుర్యం అంటే. బాలయ్య కొడితేనే కోమాలోకి వెళ్తారు అనుకున్నాం కాని బాలయ్య మాట్లాడితే కూడా కోమాలోకి వెళ్తారని ఆయన హిందీ ప్రసంగంతో ఋజువయ్యింది. ఆయన హిందీలో ఏం మాట్లాడారో అర్థం కాక హిందీ భాషా పండితులు నాలుగైదుగురు కోమాలోకి వెళ్ళిపోయారు. అది బాలయ్య దెబ్బ అంటే.
           ఆయన ఏం మాట్లాడారో  ఆ పదాలు అర్థం అవ్వడానికి  ఈ ప్రపంచంలో ని ఏ డిక్షనరీలో వెతికిన దొరకదు. అది బాలయ్య భాష చతురత.
       
 బాలయ్య బాబు సినిమాల్లో మరియు బయట ఒకేలా ఉంటారు అక్కడ రౌడీలను కొడతారు ఇక్కడ అభిమానులను కొడుతారు ఆయనతో కొట్టించుకోవడానికి ఆయన అభిమానులు ఎగబడుతుంటారు. ఒకప్పుడు తొడలు కొట్టేవాడు ఇప్పుడు జనాలని కొడుతున్నాడు. ఒకప్పుడు కత్తులతో కాదు కంటి చూపుతో చంపేసేవాడు ఇప్పుడు మాటలతో చంపేస్తున్నాడు.
  ఇంకో అడుగు ముందుకేసి వార్నింగ్ లు కూడా ఇస్తున్నాడు తెలంగాణ మంత్రి కెటీఆర్ కు ఇచ్చిన వార్నింగ్  ఇలా ఉంది  "బిడ్డా కెటిఆల్ హైటెక్ సిటీ కట్టాలా చెంచాబాద్ ఎయిల్ పోల్ట్ కట్టాలా లింగ్ లోడ్ కట్టాలా  ఏం కట్టాలు మీలు ఇవన్ని కట్టింది మా బావ బాబు గాలు హైదలాబాద్ అభిలుద్ది చేచింది మా బావ బాబు గాలు ఆయన్ను తిడితే ఊలుకోనూ ఆంధ్లా ఎన్నికల్లో వేలు పెడుతావా ధమ్ముందా  లా చూచుకుందాం ఆంధ్లాలో " అంటు భీకరమైన లెలుగు సారీ తెలుగు భాషలో హెచ్చలించాలు.
చూసారా బాలయ్య భాష వింటే నాకు కూడా ఆయన భాష వచ్చేలా ఉంది. ఎంతకైనా మంచిది కెటీఆర్ సార్ బాలయ్య జోలికి వెళ్ళకు ఆయన భాష మీకు వచ్చేయగలదు.
 ఈ జోరు చూస్తుంటే బాలయ్య టీడిపీని తెలంగాణలో ఒంటి చేత్తో గెలిపించేలా ఉన్నాడు ఈ విషయం బాబు గారు గుర్తించలేక పోయినట్టున్నారు ముందే తెలిస్తే 119 సీట్లు టీడీపీకె వచ్చేవి బాలయ్య అంటే మజాకా మరి సమర సింహం. పాపం బాబు గారు కేవలం 13సీట్లకే పరిమితమయ్యారు. బాబు గారు ఇంకో సింహాన్ని తెలంగాణలో వదలలేదు ఎవరో అనుకుంటున్నారా అదేనండి ఈయన బాలయ్య కంటే ఘనుడు ఈయనకు కూడా తెలుగు భాషను నేర్పింది బాలకిట్టీ గారే. ఈయన  తెలుగు మాట్లాడటంలో గురువును మించిన శిష్యుడు ఆయనేనండి మన పండితపుత్ర పరమ ........ నారా లోకేష్ పప్పు  గారు ఈయనను కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దించి ఉంటే వార్ వన్ సైడ్ అయిపోతుండే. ఎందుకు ఈ సింహాన్ని వదలలేదో అర్థం కాలేదు బహుషా సమరసింహం అదేనండి గడ్డాలు మీసాలు గీసుకున్న మగ సింహం బాలయ్య ఒక్కడు చాలు అనుకున్నాడేమో బాబు గారు.

నాకొకటి అర్థం కావటంలేదు అసలు బాలయ్య భాషలు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఆయన భాషలు ప్రపంచంలో ఎవరీకి అర్థం అవ్వటంలేదు బాబు గారు వేరే గ్రహం నుండి  గ్రహాంతరవాసులను రప్పించి ఈ భాషను నేర్పించినట్టున్నాడు అభివృద్దిలో బాబును మించినోడే లేడుపో
 నీ కీర్తీ ఖండాంతరాలు సారీ గ్రహాంతరాలు దాటింది
పో.
    ఏది ఏమైనా బాలయ్య గారు భాషలు మాట్లాడటంలో  తెలుగు జాతికి దొరికిన ఆలిముత్యం సారీ ఆణిముత్యం.
                       
                        జై లాలయ్య అబ్బా... సారీ....
                                   జై బాలయ్య