భానోదయం: ఏప్రిల్ 2022

20, ఏప్రిల్ 2022, బుధవారం

నియంతలు, సామ్రాజ్యవాదులు ఉన్నంతకాలం ప్రపంచంలో శాంతి ఉండదు.

  ప్రపంచంలో ఏ మూలన ఏ సంక్షోభం వచ్చిన అందుకు కారణం కొందరు నియంతల సామ్రాజ్యవాదం వలనే.

 ఉక్రెయిన్ యుద్దానికి కారణం సామ్రాజ్యవాదుడైన నియంత పుతిన్. రష్యా పేరుకు ప్రజాస్వామ్య దేశమైన పుతిన్ దానిని నియంత్రుత్వ పాలన కింద మార్చేసాడు.

నియంతల్లో రెండు రకాల నియంతలు ఉంటారు. ఒకరు సామ్రాజ్యవాద నియంతలు. మరొకరు వారసత్వ పాలన నియంతలు.


    పుతిన్ సామ్రాజ్యవాద నియంత. తన లక్ష్యం పూర్వపు సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలన్నిటిని కలిపి సోవియట్ యూనియన్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆరాటపడుతున్నాడు. వయసు మీద పడుతోంది సోవియట్ యూనియన్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడు. అందుకే  ఉక్రెయిన్ పై ఈ యుద్దానికి దిగాడు. సైనిక పరంగా బలహీనమైన దేశం నాలుగు రోజుల్లో స్వాదీనం  చేసుకుందాం అనుకున్నాడు. కాని 50 రోజులైన ఉక్రెయిన్ లొంగిపోవడం లేదు. 50 రోజుల నుండి ఉక్రెయిన్ సంక్షోభం అలానే ఉంది. రష్యా నియంత లక్ష్యం కోసం, సామ్రాజ్య విస్తరణ కోసం ఉక్రెయిన్ లో అశాంతి నెలకొంది. కొన్ని లక్షల మంది  ఉక్రెయిన్ ప్రజలు బతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ఈ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటోలో చేరకుండా సోవియట్ యూనియన్లో చేరతానని ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోతుంది కాని అది జరగదు. దేశం అంటే అధ్యక్షుడు ఒక్కడే కాదు కదా ప్రజలందరూ ఒప్పుకోవాలి. రష్యా కంటే పశ్చిమ దేశాల వైపే ఉక్రెయిన్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏ దేశ ప్రజలైనా నియంత్రుత్వ పాలన కోరుకోరు కదా.

 అందుకే నాటో వైపే ఉక్రెయిన్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా యుద్ధం చేస్తున్నారు.



    ఉక్రెయిన్ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ లొంగిపోవాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం లో హీరో ఎవరంటే ఆ దేశ సైనికులు, ప్రజలు, అధ్యక్షుడు జెలెన్ స్కీ అని చెప్పొచ్చు. చిన్న దేశం సైనిక పరంగా, ఆయుధాల పరంగా రష్యాకు ఏ మూలకు సరితూగని దేశం. అణ్వాయుధాల లేవు అయినా కూడా ఇన్ని రోజులగా యుద్ధం చేస్తూనే ఉంది అంటే దానికి కారణం జెలెన్ స్కీ నే.  ఆయన స్థానంలో వేరే ఎవరున్నా దేశం విడిచి పారిపోయేవారు. నాటో దేశాలు తన తరపున యుద్ధం చేస్తాయనుకున్నాడు కాని అది జరగలేదు. నాటో రాలేదు, ఆయుధాలు లేవు,ఈ పరిస్థితుల్లో కూడా శక్తి వంతమైన రష్యాతో పోరడడానికే సిద్దపడ్డాడు. అందుకే జెలెన్ స్కీ నిజమైన హీరో. అసలు సిసలైన దేశభక్తుడు, నాయకుడు.. తను రష్యాతో యుద్దం గెలవలేక పోవచ్చు గాని తన పోరాటం ఎన్నో చిన్న దేశాలకు స్పూర్తి నిస్తుంది. శత్రువు ఎంత బలవంతుడైనా సరే ధైర్యంగా ఉండి పోరాడితే విజయం సాధించవచ్చు అని నిరూపించాడు. పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప..

 

       అందమైన ఉక్రెయిన్ నగరాలు బాంబు మోతలతో కళావిహీనంగా మారాయి, లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు వలసలు వెళ్లిపోయారు, అమాయక ప్రజలు, సైనికులు యుద్ధంలో చనిపోతున్నారు. ఈ హృదయం విదారక దృశ్యాలను, ఈ వినాశనాన్ని చూసి జెలెన్ స్కీ వెనక్కి తగ్గి రష్యాకు తలొగ్గితే ఈ సంక్షోభం ముగుస్తుంది.  లేదు ఇలాగే ముందుకు వెళ్తే వినాశనమే అణు యుద్ధం వరకు వెళ్ళవచ్చు.  నియంతలు ఓటమి ఒప్పుకోరు అందులో పుతిన్ లాంటి వారు అసలు ఒప్పుకోరు. జెలెన్ స్కీ నే తన దేశ ప్రజల కోసం ఓడిపోయి శాంతి నెలకోల్పుతాడని అనుకుంటున్నాను.



  ఇక శ్రీలంక సంక్షోభానికి కారణం చైనా. చైనా కూడా సామ్రాజ్యవాద దేశమే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ది కూడా నియంత్రృత్వ పాలనే. శ్రీలంకలో పాగా వేసి హిందూ మహాసముద్రంలో పట్టు సాధించాలని చూస్తున్నాడు. దాని ఫలితమే శ్రీలంకతో ఆర్థిక సంక్షోభం. ఇటు పాకిస్థాన్, అటు శ్రీలంకను ఆక్రమించి చైనాను విస్తరించాలని చూస్తున్నాడు. అందుకోసమే ఆ దేశాలకు అభివృద్ధి పేరిట రూణాలిచ్చి ఆర్థికంగా దెబ్బతీసి ఆక్రమించుకోవాలని జిన్ పింగ్ ఆలోచన. 


     ఇక మరో  రకం నియంత  ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జోన్ ఉన్. వారసత్వ పాలన నియంత. ఇతను సామ్రాజ్యవాదుడు కాకపోయినా ప్రపంచంలో అశాంతికి కారణం అవుతాడు.  అణ్వాయుధాలు, క్షిపణులు తయారు చేస్తూ పెద్ద దేశాలను హెచ్చరిస్తూ ఉంటాడు.  దేశ ప్రజలను బానిసలుగా చేసి పరిపాలిస్తున్నాడు. పక్క దేశం  దక్షిణ కొరియా LG, SAMSUNG వంటి  ఎలక్ట్రానిక్స్, HUNDAI,KIA  వాహనాలు ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందుతుంటే, కింగ్ జోన్ ఉన్  వంటి  నియంతలు వినాశకర ఆయుధాలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి నియంతలు ఉన్నంత కాలం ప్రపంచంలో శాంతి నెలకొనడం అసాధ్యం..



  


17, ఏప్రిల్ 2022, ఆదివారం

నీటి వనరులను నాశనం చేస్తున్నారు..

    


    ప్రకృతి మానవ మనుగడకు అవసరమైన అన్ని వనరులను మనకు ప్రసాదిస్తుంది. కాని ప్రకృతి ప్రసాదించిన వనరులను ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారు చెప్పండి.? ప్రకృతి వనరులను నాశనం చేయడానికి ఉన్నంత శ్రద్ధ సద్వినియోగం చేసుకోవడంలో ఉండదు. ఏ జీవికైనా ప్రాణాధారం నీరు. నీరు లేనిదే జీవుల మనుగడ లేదు. అది అందరికీ తెలిసిందే కాని నీటి వనరులను మాత్రం విచ్చలవిడిగా కాలుష్యం చేసేసి మనుషులతో పాటు మూగజీవాలకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మానవుడు. ప్రకృతి లో తెలివైన వాడు మానవుడు తన తెలివితేటలతో ప్రకృతిని, ప్రకృతి ప్రసాదించిన వనరులను నాశనం చేసి ఇతర జీవులకు కూడా మనుగడ లేకుండా చేస్తున్నాడు. 


 ఇతర జీవుల సంగతి దేవుడెరుగు గాని ముందు ముందు మనిషి మనుగడకే ముప్పు తెస్తున్నాడు.

 నీరు అందరికి జీవనాధారం కాని నీటి విలువ ఎవరికి తెలియదు. ''మన దగ్గర ఏది ఉంటుందో దాని విలువ మనకు తెలియదు". లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. 


ఇప్పుడు మనకు త్రాగు నీరు పుష్కలంగా లభిస్తుంది. పుష్కలంగా అంటే మరీ మన తాతల నాటి కాలంలో కాకుండా కొంచెం తక్కువగానే స్వచ్చమైన నీరు లభిస్తుంది. అయినా కూడా నీటి వనరుల విలువ ఇంకా చాలామంది కి తెలియదు. ముందు ముందు తెలుస్తుంది. మా చిన్నప్పుడు రవాణా వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందలేదు ఏ ఊరికైనా వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మరీ దూరమైతే మెయిన్ రోడ్డు వరకు నడిచి అక్కడ ఏదైనా వాహనం ఎక్కి చిన్నపాటి సిటీలో దిగి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం. మొత్తంగా కాలినడకనే వెళ్ళేవాళ్ళం. ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం ఎందుకంటే వేసవిలో పిల్లలకు సెలవులు ఉండడం, పెద్దవారికి కూడా ఎలాంటి పనులు ఉండవు కాబట్టి ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం. వేసవిలో ఎక్కువగా ఏ బందువుల  ఇంటికి వెళతాం చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లే వెళ్తారు.  అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అంటే మాకు పండగే. అందరు వస్తారు కాబట్టి ఆ ఆనందంలో ఎంతదూరం అయిన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 

 వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు దాహం వేస్తే ఎక్కడ కూడా నీళ్ళు కోనేవారు కాదు అసలు అప్పట్లో నీళ్ళు అమ్మే వాళ్ళు కాదు మా ఊళ్ళళ్ళో. చిన్న చిన్న వాగులు ఉండేవి వానాకాలం పుష్కలంగా నీరు ప్రవహించే వాగులు వేసవిలో నీరు ఉండేది కాదు. అక్కడ అక్కడ గుంతల్లో కొద్దిగా నీరు ఉండేది. అవి పశువులు తాగడానికి ఉపయోగపడేవి. మేం తాగలంటే చెలిమలు తవ్వి నీరు త్రాగేవాళ్ళం. అప్పుడు ఎలాంటి కాలుష్యం లేదు చాలా స్వచ్ఛంగా ఉండేవి నీళ్ళు. 

ఇక బావి నీరు ఎక్కువగా త్రాగే వాళ్ళు. బోర్లు అంతగా ఉండేవి కాదు. చెరువులు,కుంటలు ఎక్కడ కూడా కాలుష్యం ఉండేది కాదు. మరీ ఇప్పుడు నీళ్ళు త్రాగాలి అంటే కొనాల్సిందే ప్రకృతి ప్రసాదించిన నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. కారణం స్వచ్చమైన నీరు లభించక పోవడమే. నీటి వనరులను కాలుష్యం చేసి నీటి వ్యాపారం చేస్తున్నారు.


    పట్టణీకరణ, పరిశ్రమల స్థాపనతో నీటి వనరులను పూర్తిగా కలుషితం చేస్తున్నారు. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. ఆ నీటితో చెరువులోని నీరు తాగేందుకు కాదుకదా కనీసం తాకడానికి కూడా పనికి రాకుండా పోతుంది. మనుషులైతే డబ్బులు పెట్టి కొని నీళ్ళు త్రాగుతారు. మరి జంతువులు, పక్షులు ఎలా త్రాగుతాయి నీరు. మనిషి తన అత్యాశకు పోయి ఇతర జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. వాటికి కనీసం తాగేందుకు నీరు లేకుండా చేస్తున్నాడు.  ఆలోచించండి ఇకనైన మేల్కొని నీటి వనరులను కాపాడుకుందాం. మనతో పాటు ఇతర జీవుల మనుగడకు ఎలాంటి హాని తలపెట్టకుండా నీటి వనరులను కాలుష్యం చేయకుండా  కాపాడుకుందాం..


కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు..


ఎవరైతే నీటి వనరులను కాలుష్యం చేస్తారో వారికి త్రాగేందుకు నీరు దొరకదు..

కాని ఇప్పుడు బడా బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు చేసిన నీటి కాలుష్యం వల్ల పశుపక్ష్యాదులు, సామాన్య ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.


బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల ధన దాహానికి   నేల, నీరు కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమల వలన భూమిపై ఉన్న నీటి వనరులే కాకుండా భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. రసాయన పరిశ్రమల వారు కాలుష్య జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. అలాగే భూమిలోకి బోర్లు వేసి అందులోకి రసాయనాలను పంపిస్తారు దీనివలన భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఎక్కడ బోరు బావి తవ్విన రసాయనాలతో నిండిన నీరే వస్తుంది. ఎంత దారుణం అండి ఇది చుట్టుపక్కల వారికి ఈ పరిశ్రమల వలన ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి వారు కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ నేలని,నీటిని, పరిసరాలను కాలుష్యం చేసి స్థానికులకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు...


   

ఇంతవరకు మా వైపు అయితే ఈ దరిద్రపు గొట్టు రసాయన పరిశ్రమలు లేవు. రావొద్దనే కోరుకుంటున్నాను.


 రాను రాను మా వైపు కూడా అభివృద్ధి పేరిట ఈ రసాయన పరిశ్రమల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో విచ్చలవిడిగా పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు హైదరాబాదు చుట్టుపక్కల మాత్రమే ఉండే రసాయన పరిశ్రమలు ఇక పచ్చని పల్లెల వైపు వస్తాయి. ఇక్కడ నేల, నీటిని కాలుష్యం చేస్తాయి. ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తున్నారు. కంచె చేను మేసినట్టు ప్రభుత్వమే నీటి వనరులను నాశనం చేయడానికి చూస్తుంటే ఇంకా ఎవరు వాటిని కాపాడేది.

  ఇప్పటికైతే నేను చిన్నప్పుడు వేసవిలో చెలిమల్లో నీటిని తాగినా నది ఇప్పటికి స్వచ్చమైన నీటితోనే ప్రవహిస్తుంది.

ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిశ్రమలు లేవు. ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటా..

గత ఏడాది అక్టోబరులో మా నదిలో నేను  తీసిన వీడియోలు. ఇప్పటికి స్వచ్చమైన నీటితో ప్రవహిస్తుంది.







 

2, ఏప్రిల్ 2022, శనివారం

వ్యవసాయం మీద ప్రేమతో ఎకరం విస్తీర్ణంలో బావిని తవ్వించిన రైతు భగీరథుడు.


 ఆలోచన అంటే ఇది, అభివృద్ధి అంటే ఇది, పర్యావరణ పరిరక్షణ అంటే ఇది..


   


    ఒక సామాన్య రైతు గొప్ప పని చేసాడు కాదు కాదు భగీరథ ప్రయత్నం చేశాడు. చేసి సాధించాడు. 


మహారాష్ట్ర బీడ్ జిల్లా పదల్షింగి గ్రామానికి చెందిన రైతు  మారుతి బాజ్గుడే సాధించిన విజయం చూస్తే గర్వంగా ఉంది.. 


బీడ్ జిల్లా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండడం వలన నీళ్ళ కరువుతో పంటలు పండేవి కావు.  మారుతి అనే రైతుకు 12 ఎకరాలు పొలం ఉంది ఎంత పొలం ఉంటే ఏంటి లాభం నీళ్ళు లేకుంటే..


అప్పుడు ఆ రైతు ఆలోచన ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే తన పొలంలో నీళ్ళ కరువే లేకుండా చేయాలనుకుని ఒక ఎకరం విస్తీర్ణంలో, నలబై అడుగుల లోతుగా  బావిని తవ్వాలనుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం అంటే మామూలు విషయం కాదు అదికూడా ఒక రైతు.


 ఇది జరిగే పనేనా!


ఇంత విశాలమైన బావిని తవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది. 


తవ్వినాక నీళ్ళు రాకుంటే పరిస్థితి ఏంటి?



ఇవేవి మారుతి పట్టించుకోలేదు.

కేవలం తాను అనుకున్నది సాధించాలి అంతే.

తన పొలం ఎప్పుడు పంటలతో  కళకళలాడుతూ ఉండాలి. 


తను అనుకున్నట్టుగానే బావిని తవ్వించాడు. బావిచుట్టు కాంక్రీటు తో గోడ నిర్మించాడు.

 అందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర రూపాయలు..

అంత ఖర్చా ..! అది నీళ్ళ కోసం..!


అని అందరూ నోరెళ్ళబెడతారు. ఇది పిచ్చి పని అనికూడా అంటారు.

అదే కోటిన్నర తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అంటారు..


కాని మారుతి గారు ఇవేమి పట్టించుకోకుండా వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేసాడు.


తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఎకరం విస్తీర్ణంలో ఉన్న బావిలో పుష్కలంగా నీరు ఉంది. ఆ నీటితో తన పదకొండు ఎకరాల పొలానికి నీరు అందుతుందని అంటున్నాడు. అందులో అన్నిరకాల పండ్ల మొక్కలు, అన్నిరకాల పంటలు వేస్తానంటున్నాడు.


"నీవు ప్రయత్నం చేయి ఫలితం భగవంతుడు చూసుకుంటాడు అన్నట్టు"..

మన ఆలోచన మంచిదైతే మన ప్రయత్నంతో ఏ పని చేసిన ఫలితం సాధించవచ్చు అని నిరూపించారు మారుతి గారు. ఆయన పేరు మారుతి అంటే హనుమాన్. ఆనాడు ఆ హనుమాన్ కొండను పెకిలించి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మారుతి బీడు భూముల్లో బావిని తవ్వి గంగమ్మను తీసుకొచ్చాడు.. తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు.




చాలా మంది అనుకుంటారు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం ఎందుకు.

అదే డబ్బు తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అని..


అదే మనదగ్గర అయితే ఈ పాటికి అలాంటి భూమి ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకునేవాళ్ళు.

ఉన్న నీటి వనరులను కాలుష్యం చేస్తారు.


కాని మారుతి గారు వ్యవసాయం మీద ప్రేమతో ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా తాను అనుకున్నది సాధించాడు.


మారుతి గారు కోటిన్నర ఖర్చు పెట్టిన దానికి ఆయన పొందే ఆనందానికి ఎన్ని వేల కోట్ల డబ్బుతో వెలకట్టలేనిది.


అప్పటి వరకు బీడుగా ఉన్న పొలం తన ప్రయత్నంతో పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంది. విశాలమైన బావిలో పుష్కలంగా నీరు ఉంది. తను పెంచుకున్న వివిధ రకాల పండ్లు మొక్కలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో తన పొలం గట్టు మీద నీటి కాలువ పక్కన ఉన్న ఒక పచ్చని చెట్టుకింద నులక  మంచం వేసుకుని ఒక కునుకు తీస్తుంటే ఆ ఆనందం ఎన్ని లక్షల కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి..


 చుట్టూ పచ్చని పంటపొలాలు,

 పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, 

 పొలం గట్టున కాలువలో  చిన్నగా పారే నీటి సవ్వడి, ఆకాలువ నీటితో తడిసిన మట్టి సువాసన,

 ఈ వేసవిలో   మద్యాహ్నం వీచే పిల్లగాలులు. వీటన్నింటిని ఆస్వాదిస్తూ ఆ చెట్టు కింద కూర్చుని ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఆనందానికి ఎన్ని కోట్లు వెల కట్టగలం.


మారుతి గారు ఏడాది పొడవునా పంటలు పండిస్తూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. 


 ఆయన తను పెట్టిన ఖర్చు తిరిగి సంపాదిస్తాడా అంటే? సంపాదిస్తాడు. 

  

ఎందుకంటే మనదగ్గర వ్యవసాయం తగ్గిపోయింది త్వరలో ఆహార సంక్షోభం తలెత్తుతుంది. అప్పుడు మారుతి లాంటి రైతులు వద్దే ఆహార ధాన్యాల ఉంటాయి కాబట్టి వారు అప్పుడు కోట్లు సంపాదిస్తారు.


ఆయన కోట్లు సంపాదించడం కంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాడు అది చాలు ఆయనకు ఈ జన్మకు సంతృప్తి..