26, అక్టోబర్ 2022, బుధవారం
పొట్లం యాప్ ఆన్లైన్ కూరగాయలు
2, ఏప్రిల్ 2022, శనివారం
వ్యవసాయం మీద ప్రేమతో ఎకరం విస్తీర్ణంలో బావిని తవ్వించిన రైతు భగీరథుడు.
ఆలోచన అంటే ఇది, అభివృద్ధి అంటే ఇది, పర్యావరణ పరిరక్షణ అంటే ఇది..
ఒక సామాన్య రైతు గొప్ప పని చేసాడు కాదు కాదు భగీరథ ప్రయత్నం చేశాడు. చేసి సాధించాడు.
మహారాష్ట్ర బీడ్ జిల్లా పదల్షింగి గ్రామానికి చెందిన రైతు మారుతి బాజ్గుడే సాధించిన విజయం చూస్తే గర్వంగా ఉంది..
బీడ్ జిల్లా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండడం వలన నీళ్ళ కరువుతో పంటలు పండేవి కావు. మారుతి అనే రైతుకు 12 ఎకరాలు పొలం ఉంది ఎంత పొలం ఉంటే ఏంటి లాభం నీళ్ళు లేకుంటే..
అప్పుడు ఆ రైతు ఆలోచన ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే తన పొలంలో నీళ్ళ కరువే లేకుండా చేయాలనుకుని ఒక ఎకరం విస్తీర్ణంలో, నలబై అడుగుల లోతుగా బావిని తవ్వాలనుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం అంటే మామూలు విషయం కాదు అదికూడా ఒక రైతు.
ఇది జరిగే పనేనా!
ఇంత విశాలమైన బావిని తవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది.
తవ్వినాక నీళ్ళు రాకుంటే పరిస్థితి ఏంటి?
ఇవేవి మారుతి పట్టించుకోలేదు.
కేవలం తాను అనుకున్నది సాధించాలి అంతే.
తన పొలం ఎప్పుడు పంటలతో కళకళలాడుతూ ఉండాలి.
తను అనుకున్నట్టుగానే బావిని తవ్వించాడు. బావిచుట్టు కాంక్రీటు తో గోడ నిర్మించాడు.
అందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర రూపాయలు..
అంత ఖర్చా ..! అది నీళ్ళ కోసం..!
అని అందరూ నోరెళ్ళబెడతారు. ఇది పిచ్చి పని అనికూడా అంటారు.
అదే కోటిన్నర తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అంటారు..
కాని మారుతి గారు ఇవేమి పట్టించుకోకుండా వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేసాడు.
తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఎకరం విస్తీర్ణంలో ఉన్న బావిలో పుష్కలంగా నీరు ఉంది. ఆ నీటితో తన పదకొండు ఎకరాల పొలానికి నీరు అందుతుందని అంటున్నాడు. అందులో అన్నిరకాల పండ్ల మొక్కలు, అన్నిరకాల పంటలు వేస్తానంటున్నాడు.
"నీవు ప్రయత్నం చేయి ఫలితం భగవంతుడు చూసుకుంటాడు అన్నట్టు"..
మన ఆలోచన మంచిదైతే మన ప్రయత్నంతో ఏ పని చేసిన ఫలితం సాధించవచ్చు అని నిరూపించారు మారుతి గారు. ఆయన పేరు మారుతి అంటే హనుమాన్. ఆనాడు ఆ హనుమాన్ కొండను పెకిలించి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మారుతి బీడు భూముల్లో బావిని తవ్వి గంగమ్మను తీసుకొచ్చాడు.. తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు.
చాలా మంది అనుకుంటారు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం ఎందుకు.
అదే డబ్బు తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అని..
అదే మనదగ్గర అయితే ఈ పాటికి అలాంటి భూమి ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకునేవాళ్ళు.
ఉన్న నీటి వనరులను కాలుష్యం చేస్తారు.
కాని మారుతి గారు వ్యవసాయం మీద ప్రేమతో ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా తాను అనుకున్నది సాధించాడు.
మారుతి గారు కోటిన్నర ఖర్చు పెట్టిన దానికి ఆయన పొందే ఆనందానికి ఎన్ని వేల కోట్ల డబ్బుతో వెలకట్టలేనిది.
అప్పటి వరకు బీడుగా ఉన్న పొలం తన ప్రయత్నంతో పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంది. విశాలమైన బావిలో పుష్కలంగా నీరు ఉంది. తను పెంచుకున్న వివిధ రకాల పండ్లు మొక్కలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో తన పొలం గట్టు మీద నీటి కాలువ పక్కన ఉన్న ఒక పచ్చని చెట్టుకింద నులక మంచం వేసుకుని ఒక కునుకు తీస్తుంటే ఆ ఆనందం ఎన్ని లక్షల కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి..
చుట్టూ పచ్చని పంటపొలాలు,
పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు,
పొలం గట్టున కాలువలో చిన్నగా పారే నీటి సవ్వడి, ఆకాలువ నీటితో తడిసిన మట్టి సువాసన,
ఈ వేసవిలో మద్యాహ్నం వీచే పిల్లగాలులు. వీటన్నింటిని ఆస్వాదిస్తూ ఆ చెట్టు కింద కూర్చుని ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఆనందానికి ఎన్ని కోట్లు వెల కట్టగలం.
మారుతి గారు ఏడాది పొడవునా పంటలు పండిస్తూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు.
ఆయన తను పెట్టిన ఖర్చు తిరిగి సంపాదిస్తాడా అంటే? సంపాదిస్తాడు.
ఎందుకంటే మనదగ్గర వ్యవసాయం తగ్గిపోయింది త్వరలో ఆహార సంక్షోభం తలెత్తుతుంది. అప్పుడు మారుతి లాంటి రైతులు వద్దే ఆహార ధాన్యాల ఉంటాయి కాబట్టి వారు అప్పుడు కోట్లు సంపాదిస్తారు.
ఆయన కోట్లు సంపాదించడం కంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాడు అది చాలు ఆయనకు ఈ జన్మకు సంతృప్తి..
28, మార్చి 2022, సోమవారం
అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.
అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.
పచ్చటి పంటపొలాలను నాశనం చేసి ఫ్లాట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు మా ఊరి భూముల్లో పంటలు
పండేటివి.కాని ఇప్పుడు ఫ్లాట్లు పండుతున్నాయి.
హైదరాబాద్ కు చుట్టుపక్కల 100 కి.మీ దూరంలో ఎక్కడ చూసినా పొలాలు లేవు ఫ్లాట్లు, వెంచర్లే కనిపిస్తాయి. అక్కడక్కడ కొంత పొలాలు ఉన్న ఇంకొన్ని రోజుల్లో అవి కనుమరుగైపోతాయి.
ఎవరి నోట విన్న వెంచర్లు,ప్లాట్లు,కోట్లు ఇవే మాటలు.
రైతులకు లక్షలు,కోట్లు ఆశ చూపించి భూములు కొనుగోలు చేయడం వెంచర్లు వేయడం ఇదేపని.
పాపం రైతులు ఎప్పుడు అంతడబ్బు చూసి ఉండరు ఒకేసారి ఎకరం కోటి రూపాయలు అనేసరికి ఎగిరిగంతేసి భూములు అమ్మేసుకుంటున్నారు.
భూములు అమ్మని రైతులను ఎలాగోలా అమ్మేలా చేస్తున్నారు. రైతుల భూములకు దారిలేకుండా చేసి భూములు అమ్ముకునేలా చేస్తున్నారు.
రోడ్డు ప్రక్కన భూమి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ గ్రద్దలు అక్కడ వాలిపోతాయి. ఆభూమిని ఎలాగోలా ఎన్ని డ్రామాలు ఆడైనా కొనేస్తారు. ముందుగా రోడ్డు ప్రక్కన ఉన్న భూమిని కొనేస్తే వెనకాల ఉన్న పొలాలను కొనడం వారికి తేలికవుతుంది. ఎందుకంటే వారికి దారి ఇవ్వకుండా చేసి భూములు అమ్మేలా చేస్తారు. పచ్చని పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకోవడం. మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారు,అవుతున్నారు. వేలిముద్రలు (అంగూటి) వేసేవాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు.
మద్యలో బ్రోకర్లు అబ్బో వీళ్ళగురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారులదైతే ఆచరణ బ్రోకర్లది. వీళ్ళు ఏలాగైనా సరే రైతులను భూములు అమ్ముకునేలా చేస్తారు. ఎలాగైనా సరే....!
వాళ్ళ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు...
నా చిన్నప్పుడు పంటపొలాల్లో అన్నిరకాల పంటలు పండేవి. రాను రాను పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు అవికూడా లేవు 50% పంటపొలాలు ప్లాట్లుగా మారాయి. ఎందుకు ఈపరిస్థితి దాపురించింది అంటే.నా చిన్నప్పుడు పంటలు బాగా పండేవి పాడిపశువులు ప్రతీ ఇంటికి ఉండేవి. వాటి పేడ ఎరువుతోనే పంటలు పండేవి. చీడపీడలు ఉండేవి కావు. రసాయన మందులు అసలు ఎవరికి తెలియదు.కృత్రిమ ఎరువులు, విత్తనాలు వాడలేదు. అప్పుడు రెైతులు అన్నిరకాల అపరాలు,జొన్నలు,వరి, మిరప, కొర్ర, సజ్జలు, రాగులు,పసుపు వంటి ఆహార పంటలే పండించేవారు.
వ్యవసాయం అంటే పెట్టుబడి ఉండేదే కాదు కేవలం రైతు శ్రమే వ్యవసాయానికి పెట్టుబడి. విత్తనాలు సొంతంగా తయారు చేసుకునేవారు,ఎరువులు పశువుల పేడ. అలా వ్యవసాయం చేసారు కాబట్టి దిగుబడులు బాగా వచ్చేవి.
ఎవరి ఇంట్లో చూసినా గుమ్ములకు, గుమ్ములు జొన్నలు,బియ్యం,కందులు,కొర్రలు, పెసలు ఉండేవి.
డబ్బు ఎక్కువగా ఉండేదికాదు. అయినా సంతోషంగా ఉండేవాళ్ళు.
ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి వ్యవసాయం నాశనం అవుతూ వచ్చింది. డబ్బు ఆశ చూపించి ఈ పంటలు వేస్తే ఇంత దిగుబడి వస్తుంది ఇంత ధర ఉంటుంది అంటు రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్ళేలా చేసారు. ముఖ్యంగా పత్తిపంట. మొదట్లో దిగుబడులు బాగా వచ్చే సరికి చాలామంది రైతులు పత్తిపంట వేయడం ప్రారంభించారు. పత్తి విత్తనాలు రైతులు తయారు చేసుకోలేరు విత్తన కంపేని వారు తయారు చేసే విత్తనాలే వాడాలి. అలా విత్తన కంపెనీలు విత్తనాన్ని తమగుప్పిట్లోకి తీసుకుని వ్యాపారం మొదలెట్టాయి.
ఏం భూమిలో అయినా ఎన్ని రోజులు దిగుబడులు వస్తాయి ఒకే పంట వేస్తుంటే? మొదట్లో దిగుబడులు వచ్చినా రాను రాను దిగుబడులు తగ్గాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యాపారం మొదలైంది ఎరువుల వ్యాపారం ఈ ఎరువులు వాడండి దిగుబడి పెరుగుతుంది అని ఎరువులు కొనేలా చేసారు. తరువాత పురుగుమందులు ఇలా మొత్తం వ్యవసాయాన్ని పెట్టుబడి లేనిదే చేయలేమనే స్థాయికి తీసుకొచ్చారు.
ఒకప్పుడు రైతులు స్వయంగా తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసుకునేవారు. పురుగుమందుల వాడకం అసలే ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడి లేనిదే చేయలేని స్థితికి తీసుకొచ్చారు.
వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొచ్చారు.
ఒకప్పుడు ఆహారం పంటలు మనదగ్గరే పండేవి కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి ఆహార పంటలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గాయి.పశుసంపద తగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్ని కొనుక్కోవలసిందే.విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనిదే ఏమి తినలేం. పంటలు ఎలాగు పండవు అందుకని భూములు అమ్ముకొంటున్నారు.
అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు తిని హాయిగా ఆరోగ్యంగా జీవించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, పురుగుమందులు వేసి పండించిన పంటలు తిని రోగాల పాలు అవుతున్నారు.
ఇదా అభివృద్ధి అంటే...???
మనిషికి కావలసింది ఏంటి కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యకరమైన జీవితం. అంతే కాని డబ్బు కాదు.
కాని డబ్బు డబ్బు అని ఆశ చూపించి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని నాశనం చేస్తున్నారు.
దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చేను కంచె చేసినట్టు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నరు. ఎందుకు ఈ కోట్లు డబ్బులు తింటారా, ఆరోగ్యం పాడైనాక ఎన్నికోట్లు ఉండి ఏం లాభం. పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నాశనం చేసే కోట్ల రూపాయల డబ్బు ఎందుకు...? పర్యావరణం నాశనం అయ్యాక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి మునుపటి స్థితికి రాదు.
111 జీవోను ఎత్తేసి రెండు నదుల పరివాహక ప్రాంతంలోని రైతులను కోటీశ్వరులను చేస్తాం అని సారు చెప్తున్నాడు. జీవో ఎత్తేస్తే ఏమవుతుంది ఆ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలు, అపార్ట్ మెంట్లు పరిశ్రమలు వస్తాయి.పరిశ్రమలనుండి విడుదలయ్యే కాలుష్యం తో రెండు నదులు, రెండు జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో గాలి,నీరు,నేల అన్నిరకాలుగా కలుషితమే. ఇప్పుడు జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుంది. జీవో ఎత్తేస్తే అటుపక్కకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది.
ఎలాగంటారా ఆ సుగంధాన్ని భరించలేం మరి....!!!
2018 లో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, బుద్దుని విగ్రహం చూద్దామని నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగాను. అక్కడ నుండి ప్రారంభం అయ్యింది ఏదో దుర్గంధం ఎంటీ వాసన అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను. అప్పటికే ఆ వాసనకి తల పట్టేసింది ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సువాసన పెరిగిపోయింది. ఈ లోపు హుస్సేన్ సాగర్ కనబడింది. అందులో నీళ్ళు చూసేసరికి అర్థం అయింది ఆ దుర్గంధం ఈ సాగర్ నుండే వస్తుందని. ఆ నీళ్ళల్లో కూడా బోటు షికారు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుండే ఆ వాసన భరించలేక తల తిరుగుతోంది అలాంటిది హుస్సేన్ సాగర్ మద్యలో బోటు షికారు చేస్తున్నారు అంటే నిజంగా మీకు దండం పెట్టాలి..🙏🙏🙏🙏
అంతటి దుర్గంధభరితమైన నీటిలో బోటు షికారు చేసే వారిని చూసినపుడు నాకు ఆశ్చర్యం,జాలి, అసహ్యం, అన్ని ఒకేసారి అనిపించాయి..
అతిపెద్ద సాహసం అది.....!!!
5నిమిషాలు కూడా అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కు వెళితే అక్కడకు కూడా సాగర్ సువాసన వస్తూనే ఉంది..
నేను చాలా సార్లు విన్నా ట్యాంక్ బండ్,బుద్దుని విగ్రహం ఆ చుట్టుపక్కల పార్కులు బాగుంటాయి అని గొప్పలు చెప్పెవారు. నాకు అక్కడకు వెళ్ళి చూడాలని కుతూహలంగా ఉండేది. ఇక్కడకు వచ్చి చూసాక తెలిసింది ఈ కాలుష్యం గురించా ఇంత గొప్పగా చెప్పారని. ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో నిండిన ఆ ప్రాంతంలో10నిమిషాలు కూడా ఉండలేం.. అందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని...
ఇది చూసిన తర్వాత నేను ఒకటి బలంగా చెప్పగలను
దీనికంటే లక్షరెట్లు మా ఊరి చెరువులు గొప్పవని..
స్వచ్చమైన గాలి, నీరు, నింగి,నేల ఉన్న నా పల్లెటూరు గొప్పది...
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి సరస్సే కదా మరి ఇప్పుడు కాలుష్య సాగర్ గా మారింది. దీనికి కారణం అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వ్యర్థాలను సాగర్ లోకి వదిలి పెట్టి, కనీసం ఆనీటిని తాకడానికి కాదుకదా చూస్తేనే, అటునుండి వెళ్తేనే వాంతికొచ్చెలా చేసారు....
అభివృద్ధి వద్దనడం లేదు కాని ప్రణాలిక లేని అభివృద్ధి మానవాళికి చేటు.. ప్రపంచంలో హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు నదుల పక్కనే ఉన్నాయి అక్కడ ఇలాంటి కాలుష్యం లేదే... మరి మన దగ్గర ఎందుకిలా అంటే మన నాయకుల స్వార్థ రాజకీయాల వలన ఇలా ఉంది..
ఎందుకు ఇది చెబుతున్నానంటే రోడ్లు, బిల్డింగ్స్ కట్టేసి సహజ వనరులను మురికి కూపంగా మార్చడం అభివృద్ధి కాదు.. హుస్సేన్ సాగర్ బాగు చేయడం ఈ జన్మలో జరగదు. సరే వదిలేద్దాం.. ఇప్పుడు 111 జీవో ఎత్తేసి జంట జలాశయాలను కూడా హుస్సేన్ సాగర్ లా మార్చాలనుకుంటున్నారు.... సారు..
ఇప్పుడు రెండు జలాశయాలు స్వచ్చమైన నీటితో శుభ్రంగా ఉన్నాయి.. వాటి చుట్టుపక్కల పరిశ్రమలు, బిల్డింగ్స్ కట్టేసి వాటిని కూడా మురికి కూపంగా మార్చేయాలి... ఇదేందయ్యా ఇది అంటే అభివృద్ధి..
అప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను హుస్సేన్ సాగర్ 2, హుస్సేన్ సాగర్ 3అని అనాలి...
ఇప్పటికీ మూసీ నది గండిపేట చెరువు వరకు స్వచ్ఛమైన నీటితో జూన్ లో వర్షాలు ప్రారంభం నుండి డిసెంబర్ వరకు ప్రవహిస్తుంది. మన నాయకుడు అభివృద్ధి చేసిన తర్వాత మురికి కూపంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది వ్యర్ద జలాలతో.
ఎవరు 111 రద్దు చేయమని చెప్పింది. ఈ జీవో వలన భూముల ధరలు లేక రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. రైతుల నష్టం ఏమో కాని నాయకుల లాభం కోసం అని అందరికి తెలిసిందే... నిజంగా ఏ నాయకుడికి రైతులపై, ప్రజలకు మంచి చేయాలని ఉండదు. కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇన్ని డ్రామాలు. ఆ ఓట్లను నోట్లతో కొనాలి. మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇలా అభివృద్ధి పేరిట దోచుకుంటే వస్తుంది..
అయ్యా మీరు ప్రజలను కోటీశ్వరులను చేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను నాశనం చేయకుంటే చాలు అదే పదివేలు....🙏🙏😌😌..
సొంత లాభం కొంత మానుకోని
పరుల సేవకు పాటుపడవోయ్.
ప్రజల సేవకు పాటు పడకపోయినా పర్వాలేదు.
పర్యావరణాన్ని నాశనం చేయకండి..
19, మే 2019, ఆదివారం
రైతుల గురించి మహర్షి కంటే ముందే చెప్పిన నేను
రైతుల కష్టాల గురించి మహర్షి సినిమా కంటే ముందే చెప్పిన నా పోస్ట్.. రైతునేస్తం.
రైతునేస్తం
https://bhaanodhayam.blogspot.com/2018/03/blog-post.html?m=1
24, నవంబర్ 2018, శనివారం
ఆదర్శ రైతు శాస్త్రవేత్త
ఈ రోజుల్లో పొలం ఉంటే ఏం చేస్తారు రేటు వస్తే అమ్మేసి కార్లు, బంగళాలు కొనేసి లగ్జరీ లెఫ్ అనుభవించాలని చూస్తారు. లేదా ఫ్లాట్లు, వెంచర్లు లాంటివి చేసి అమ్మేసి అప్పుడు కూడా లగ్జరీ లైఫ్ అనుభవించాలని చూస్తారు. ఎటు తిరిగి కార్లలో, పెద్ద పెద్ద బంగాళాలో ఉండాలని కోరుకుంటారు ఇదే మనిషి జీవన విధానం అనుకుంటారు.
కాని వ్యవసాయం చేయాలని ఎవరు అనుకోరు అదికూడా ప్రకృతి వ్యవసాయం. వ్యవసాయం చేయాలంటే అసలు వ్యవసాయమే దండగ అనే వారు ఉన్నారు.
వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది అప్పులే మిగులుతున్నాయి. పెట్టుబడులు సైతం రాలేని పరిస్థితి నెలకొంది ఇలాంటప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో నష్టాలు రావడానికి కారణం నేడు మనం పాటించే పద్దతులు మితిమీరిన ఎరువులు పురుగుమందులు వాడటం. పైగా విత్తనాలను కూడా కొంటున్నారు ఒకప్పుడు ఎవరి విత్తనాలు వారే తయారు చేసుకునే వారు సహజ సిద్దమైన ఎరువులనే వాడేవారు అలా పండించిన ఆహారం తిన్నవారు ఆరోగ్యంగా జీవించేవారు. నేడు రసాయన ఆహారం తిని రోగాల బారిన పడుతున్నారు ఈ రసాయన ఎరువులు వాడి పండించిన ఆహారం తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో ఒక బస్తా ఎరువు మనకు తెలియకుండానే తింటున్నాం.
విత్తన కంపెనీలు ఎరువుల కంపెనీలు రైతులను కీలు బొమ్మల్ల ఆడిస్తున్నాయి. మేం తయారు చేసిన విత్తనాలే వేయాలి మేం తయారు చేసిన ఎరువులు పురుగు మందులు వాడాలి అంటు వ్యవసాయం మొత్తం ఈ కంపెనీల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. రైతులు తమ సొంతంగా విత్తనాలు ఎరువులు తయారుచేయడం మానేసి ఈ కంపెనీలపై ఆధారపడుతున్నారు.
ఈ విత్తనాలకు ఈ రేటు, ఈ ఎరువులకు ఈ రేటు అంటు కంపెనీ వాడే ధర నిర్ణయిస్తాడు. కాని రైతులు పండించిన పంటలకు ధర ఎవరో ధలారి నిర్ణయిస్తాడు. ఇది రైతుల పరిస్థితి మరి ఇలాంటప్పుడు ఎవరు వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతారు.
కాని ఒక రైతు ఉన్నాడు అతన్ని రైతు అనే కంటే వ్యవసాయ శాస్త్రవేత్త అనాలి. తనకున్న పొలంలో సహజ సిద్దంగా పంటలను పండించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వ్యవసాయంలో కొత్త కొత్త పద్దతులను అవలంబించి అధిక దిగుబడులను సాదిస్తున్నాడు. తను అవలంబించే విధానాలను అందరి రైతులకు ఉపయోగపడేలా తన వ్యవసాయ క్షేత్రం సందర్శించి తెలుసుకునేలా ఏర్పాటు చేసాడు. పంటలతో పాటు చేపల పెంపకం కూడా చేసి రెండు సమన్వయం చేస్తున్నాడు. ఈయన వ్యవసాయ క్షేత్రాన్ని తెలుగు రాష్ట్రలనుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు,రైతులు ,శాస్ర్తవేత్తలు సందర్శిస్తు ఉంటారు. ఆయనే విశ్వనాథ రాజు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఈయన వ్యవసాయ క్షేత్రం.
పచ్చని పంట పొలాలను సైతం కాంక్రీట్ జంగల్లుగా మారుస్తున్న నేటీ సమాజంలో బీడు భూముల్లో సైతం బంగారు పంటలు పండిచ్చవచ్చు అని నిరూపిస్తున్న విశ్వనాథ రాజు ఎందరికో ఆదర్శం. రైతే రాజు అని ఆయన నిరూపిస్తున్నాడు.
కార్లు బంగాళాలు కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ అనుకుంటు పీల్చే గాలిని సైతం కొనుక్కుంటున్నారు నేటి మనుషులు.
పచ్చని ప్రకృతిలో ఆహ్లాదకరంగా బ్రతికే వారికి కోట్ల రూపాయలు చిత్తు కాగితాలతో సమానం.
విశ్వనాథ రాజు లాంటి వ్యవసాయ రైతు శాస్త్రవేత్తలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శం..
15, నవంబర్ 2018, గురువారం
రైతులకు వరం వేస్ట్ డీకంపోసర్
మరి దీనికి పరిష్కారం సేంద్రీయ వ్యవసాయ చేయడం. కాని సేంద్రీయ వ్యవసాయం అందరికి సాద్యపడక పోవచ్చు. అలాంటి వారికోసం మరియు అందరు రైతులు
వాడుకునేలా తయారు చేసిందే ఈ వేస్ట్ డీకంపోసర్ దీని ధర కేవలం 20రూపాయలు మాత్రమే. వేస్ట్ డీకంపోసర్ పంటలకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. చీడపీడలనుండి పంటలను కాపాడుతుంది మరియు పంటలకు ఎరువుగాను ఉపయోగపడుతుంది. భూమిలో సారాన్ని పెంచి పంటలు అధిక దిగుబడులు వచ్చేలా తోడ్పడుతుంది. చీడపీడలు సోకినపుడు ఈ ద్రావణాన్ని పంటలపై పిచికారి చేయవచ్చు.
ఈ వేస్ట్ డీకంపోసర్ ను తయారు చేసింది కేంద్రప్రభుత్వ సంస్థ "నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్" ఇది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉంది.
వేస్ట్ డీకంపోసర్ ను వాడే విదానం :
20 రూపాయల వేస్ట్ డీకంపోసర్ డబ్బాలోని పదార్థాన్ని ఒక ప్లాస్టక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకుని అందులో వేసి అందులో 2కీలోల నల్ల బెల్లాన్ని వేసి రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం కర్రతో తిప్పాలి అలా వారం రోజుల పాటు తిప్పుతూ ఉంటె నుురగ వస్తుంది మరియు పులిసిన వాసన వస్తుంది అలా వచ్చినపుడు పంటలకు వాడుకోవడానికి సిద్దంగా ఉందని గమనించాలి. అలా తయారయిన ద్రావణాన్ని నీటితోపాటు పొలం అంత పారేలా చేయాలి దీనివలన భూసారం పెరుగుతుంది. పంటలకు చీడపీడలు ఆశించినప్పుడు నేరుగా పంటలపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం రెండు విదాలుగా ఉపయోగ పడుతుంది. ఒకసారి తయారు చేసుకున్న ద్రావణాన్ని కొద్ధిగా ఉంచుకుని మళ్ళీ అందులో బెల్లం నీరు కలిపి ఎన్నీ సార్లైనా వాడుకోవచ్చు. దీనిలో సూక్ష్మజీవులు పెరుగుతునే ఉంటాయి. అలా తయారు చేసుకున్న ద్రావణాన్ని కొద్దిగా ఉంచుకొని మళ్ళీ నీళ్ళు బెల్లం కలిపితే మళ్ళీ తయారవుతుంది. ఈ వేస్ట్ డీకంపోసర్ ఒకసారి కొంటే చాలు ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. ఈ వేస్ట్ డీకంపోసర్ ని వాడి చాలా మంది రైతులు అధిక దిగుబడులు సాధించారు. రసాయనిక ఎరువులు ,మందులు వాడకపోవడం ఖర్చులు తగ్గడం అధిక దిగుబడులు రావడం వలన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు... ఈ వేస్ట్ డీకంపోసర్ ని అన్ని పంటలకు వాడవచ్చును .
7, మార్చి 2018, బుధవారం
రైతునేస్తం
ప్రతి రోజు ఉదయం తన లేలేత కిరణాలతో చీకటిని పారద్రోలి వెండి వెలుగులు నింపేవాడు భానుడు.
సమాజానికి నా అక్షర కిరణాలతో వెలుగులు నింపడమే భానోదయం బ్లాగు.
భారతదేశం:
రైతు ప్రధాన దేశం కానీ ఈదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కవ.
ఈ దేశంలో వేలకోట్లు ముంచే వారికి ఎర్ర తివాచి పరిచి అప్పులిచ్చే బ్యాంకులు రైతుల పంట సాగుకు మాత్రం కాళ్ళరిగేలా తిప్పుతారు.
ఒక బిస్కేట్ కంపెనీ వాడో లేదా వేరే ఏఇతర కంపెనీ వాడయినా తాను తయారు చేసిన వస్తవుకు ధరను తనే నిర్ణయిస్తాడు కాని రైతులు కష్టపడి పండించిన పంటల ధరలను ధళారులు నిర్ణయిస్తారు.
రైతులు కష్టపడుతున్నారు ధళారులు కోటీశ్వరులవుతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల కష్టాలు తీరడం లేదు.
ఉద్యోగులు ,వ్యాపారస్తులు,సాఫ్టవేర్ ఉద్యోగులు,పారిశ్రామిక వేత్తలు మీరంతా ఒక్కసారి ఆలోచించండి రైతుల గురించి మనందరికి అన్నం పెట్టే రైతన్న దీనస్థితిని మాకెందుకు ప్రభుత్వాలు చూసుకుంటాయిలే అనకండి చూస్తూనే ఉన్నాం స్వతంత్య్రం వచ్చి ఎన్నేండ్లయినా ఏం మారింది రైతుల బతుకు.
ఎప్పుడూ ఏసీ గదుల్లో కూర్చూనే మీకు ఎక్కడ నుండి వస్తుంది మీరు తినే అన్నం.
మీరు తినే ప్రతీ మెతుకు రైతు చెమటోడ్చి పండించిందే.
మేము ఊరికే తినట్లేదు డబ్బులిచ్చి కొంటున్నాం అనొచ్చు కానీ మీరు కొనే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించేది రైతులు కాదు మద్యవర్తులు, దళారులే.
ధళారులు రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొని మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్మి లాభాలు గడిస్తున్నారు.
ఎండనకా వాననక కష్టపడి పంటలు పండించిన రైతులకు మాత్రం కష్టాలు కన్నీళ్ళె మిగులుతున్నాయి.
ఈ దేశంలో రైతు ఆనందంగా జీవించలేడా.?
రైతులు జీవితాలు మారవా.?
ఈ దేశంలో రైతుల కష్టాలు విత్తనలనుండే మొదలవుతాయి. విత్తన కంపెనివాడు నకిలి విత్తనాలను అంటగట్టి మోసం చేస్తాడు.
ఒకవేళ విత్తనాలు బాగుండి మొలకెత్తితే వర్షాలు సరిగ్గా పడతాయో లేదో అని ఆందోళన.
అన్ని అనుకూలించి పంటలు బాగా పండితే మార్కెట్లో అమ్మడానికి వెళితే గిట్టుబాటు ధరలు లేక పెట్టిన పెట్టుబడి కుడా రాని పరిస్థితి. రైతుల కష్టపడితే ధళారులు లాభపడుతున్నారు.
రైతులు బాగుండాలంటే ధళారి వ్యవస్థ పోవాలి.
నేరుగా రైతులే తాము పండించిన పంటలను అమ్ముకునేలా చేస్తే ఇటు రైతులు అటు వినియోగదారులు ఇద్దరు బాగుపడుతారు.
రైతులకు అనుకూలంగా ఉండేటట్టు ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలి. ప్రజలు కూడా నేరుగా రైతుల వద్దనుండే వ్యవసాయ ఉత్పత్తులను కొనే ఏర్పాట్లు చేయాలి అప్పుడే రైతులు బాగుపడుతారు.
ఈ రోజుల్లో అందరికి డబ్బే ప్రధానం అయ్యింది డబ్బు డబ్బు డబ్బు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒక్క రైతు మాత్రమే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇంకా తన కష్టాన్నే నమ్ముకుని వ్యవసాయం చేస్తూ ఈ దేశానికి అన్నం పెడుతున్నాడు.
చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు ఎందుకు ఇంకా వ్యవసాయం చేయడం అంటూ వ్యవసాయం మానేసి పట్టణాలకు వలసవెళ్ళి చిన్న చితక పనులు చేసుకుంటు బతుకుతున్నారు.
గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే వ్యవసాయం దండగ అని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా అన్నప్పుడు రైతులు ఏం చేయాలి సాయం చేయాల్సిన వాడే నువ్వు చేయాల్సిన పని దండగ అంటే ఏం చేస్తారు. సాయం చేయాల్సింది పోయి వ్యవసాయమే దండగా అంటే ఇక రైతులు చేసేది ఏమిటి. వ్యవసాయం వదిలేయడమే శరణ్యం.
ముఖ్యమంత్రి గారి వ్యవసాయం దండగా అనే మాటల ప్రకారం ఆయన రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఆయనకున్న అసహనం అర్థమవుతుంది. రైతులందరు వ్యవసాయం మానేస్తే జనాలకు ఈయన గడ్డి తిని బతకమంటారేమో.? లేదా నోట్ల కట్టలు తినమంటారేమో?
ప్రభుత్వాలు రైతులకు అనుకూల విధానాలను అవలంభించి వ్యవసాయాన్ని ప్రత్సాహించాలి.
వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనే రోజులు రావాలి. రైతులు ఆనందంగా జీవించే రోజులు రావాలి..
అప్పుడే రైతు బాగుంటాడు రైతు బాగుంటే ఈ దేశం బాగుపడుతుంది..