భానోదయం: మార్చి 2022

29, మార్చి 2022, మంగళవారం

ప్లాస్టిక్ మనుషులు

 



     మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేసాడు అవి మానవాలికి ఉపయోగంతో పాటు కీడు కూడా చేస్తాయి. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ అయిన రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని సరియైన విధంగా ఉపయోగిస్తే అందరికి శ్రేయస్కరం. కాని వాటిని చాలా మట్టుకు వినాశనం ఉండే విధంగానే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తే మేధావులు తమ అతి తెలివితో వినాశనానికి దారితీస్తున్నారు.


ఏ ఆవిష్కరణ అయిన తరువాత వ్యాపారం అయిపోతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారాలతో ప్రకృతిని నాశనం చేస్తారు. 


మనిషి ఆవిష్కరించిన వాటిలో అత్యంత చెత్త ఆవిష్కరణ "ప్లాస్టిక్".  ఇది ఎంత చెత్త ఆవిష్కరణ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెత్తే కనిపిస్తుంది.

నేలపై, నదుల్లో, సముద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ చెత్తే కనిపిస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.. ఇన్ని రోజులు బయట మాత్రమే ఉండే ఈ చెత్త ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరంలో రక్తంలోకి కూడా చేరింది... ఇన్నాళ్లు పర్యావరణాన్ని చెత్తగా మార్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరాన్ని చెత్తగా మారుస్తుంది.


      ఆవిష్కరణలు మనిషి జీవన విధానాన్ని ఎంత సులభతరం చేస్తయో అంతకంటే ఎక్కువగా నాశనం కూడా చేస్తాయి. ఆవిష్కరణలు రెండు వైపుల పదును వున్న కత్తుల్లాంటివి వాటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది విచ్చలవిడిగా వాడితే ముప్పు తప్పదు.. 

     

    ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మానవ శరీరంలో రక్తంలోకి ఎలా చేరింది.?

    

 ఎలా చేరిందంటే మనిషి విచ్చలవిడిగా వాడడం వలనే.



 అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది.



అందులో కొన్ని నాకు తెలిసినవి:-


ఉదయం నుంచే మన పరుగు ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది.


ఉదయము కూరగాయలకు వెళ్తారు ఖాళీ చేతుల్తో. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు నింపుకుని వస్తారు.



పాలు ప్లాస్టిక్ కవర్లో.


కిరాణా సరుకులు ప్లాస్టిక్ కవర్లో.


బయట  ఎక్కడైన టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో నే.


భోజనం ప్లాస్టిక్ ప్లేట్లలో నే.


ఆహారం ప్యాక్ చేయడం ప్లాస్టిక్ కవర్లో నే.


టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు.


అసలు ప్లాస్టిక్ వాడకం అనేది మామూలుగా లేదు అవసరం ఉన్నా లేకపోయినా వాడడం మాత్రం పక్కా.


అంతలా వాడితే మనిషి రక్తంలో ఏంటి ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ అయిపోయి "ప్లాస్టిక్ మనుషులు" గా మారిపోయిన ఆశ్చర్యం లేదు..!!!



ఉదయం లేవగానే కూరగాయలకు ఒక సంచి తీసుకుని వెళ్తే ఏమవుతుంది.? చాలామందికి చేతిలో సంచి తీసుకుని బయిటకు వెళ్తే నామోషో లేక బద్ధకమో తెలియదు కాని అస్సలు తీసుకెళ్ళరు.


 ఖాలీ చేతుల్తో కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళి గంపెడు ప్లాస్టిక్ చెత్తను తీసుకువస్తారు. సరే తెచ్చారు వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా చేస్తారా అంటే అదిలేదు. ఇష్టం వచ్చినట్టు బయట పారేయడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఇలా కాల్చడం వలన ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసి ఆ గాలి పీల్చునప్పుడు శరీరం లోకి ప్రవేశిస్తున్నాయి.


ఇంకొందరు మహానుభావులు వేడి వేడి 'టీ' ని  కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు. టీ కొట్టు వాడికి తెలియక పోవచ్చు వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయోద్దని చదువుకున్న వాళ్ళుకూడా తెలియదా అలాగే తాగుతున్నారు. అంత వేడి టీ ని ప్లాస్టిక్ కవర్లో పోస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి టీలోకి వెళ్ళి అది తాగినవారి శరీరం లోకి వెళుతుంది.

అలా చేయకుండా ఒక ప్లాస్క్ వాడితే సరిపోతుంది కదా. ప్లాస్క్ వాడడానికి బద్దకం, ఆ ప్లాస్క్ ను కొట్టు వరకు తీసుకువెళ్ళడానికి నామోషి. 


ఇక నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో.

పల్లెటూళ్ళలో అయితే ఒకసారి తాగిపడేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ని పదే పదే నీళ్ళు నింపుకుని వాడుతుంటారు.  ఈ ప్లాస్టిక్ బాటిల్స్  లో ఎక్కువ రోజులు నీళ్ళు తాగితే అందులోని ప్లాస్టిక్ కణాలు అందులోని నీటిలోకి వెళ్తాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాడుతూ ఉంటారు. తెలిసిన 

ఎవరూ చెప్పరు, చెప్పిన ఎవరూ వినరు...




     ఇంకా పెళ్ళిళ్ళు, దావత్ లకు అప్పట్లో మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో భోజనం వడ్డించేవారు. ఆ విస్తరాకుల్లో  తృప్తి గా భోజనం చేసేవాళ్ళం. వాటిని తీసుకెళ్ళి పెంటలో వేసే వాళ్ళు అవి ఎరువుగా మారేవి... ఇప్పుడు పేపర్ ప్లేట్లో వడ్డిస్తున్నారు ఈ పేపర్ ప్లేటునుంచి ఏదో దుర్గంధం వస్తుంది. పైగా వాటిపై ప్లాస్టిక్ కవర్ ఉంటుంది వేడి పదార్థాలు అందులో తింటే  ప్లాస్టిక్ శరీరంలోకి చేరకుండా ఉంటుందా..?


ఎంత చక్కనివండి  అప్పట్లో మన పల్లెల్లో "మోదుగ ఆకులతో" తయారు చేసిన విస్తరాకులు. అందులో భోజనం చేస్తే అమోఘం. వీటి వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా అవి ఎరువుగా ఉపయోగపడుతాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ విస్తరాకుల వలన అన్ని విధాలుగా నష్టమే ఎక్కువ...


మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని మరిచిపోయి ప్లాస్టిక్ వెంట పరిగెత్తి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం...



ప్లాస్టిక్ వలన ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం ఎక్కువగా వాడుతున్నారు. కాని పరోక్షంగా దీని నష్టాలు గమనించడం లేదు.


ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది..


కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళినప్పుడు జనపనార (జ్యూట్ )బ్యాగులు కాని కాటన్ బ్యాగులు కాని వెంట తీసుకెళ్ళాలి.


పేపర్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాని, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకులు వాడాలి.


బయట నుండి పార్శిల్ తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకోవడం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.....








28, మార్చి 2022, సోమవారం

అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.

 





అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. 

  పచ్చటి పంటపొలాలను నాశనం చేసి ఫ్లాట్లు చేస్తున్నారు. 

ఒకప్పుడు మా ఊరి భూముల్లో పంటలు

పండేటివి.కాని ఇప్పుడు ఫ్లాట్లు పండుతున్నాయి. 

హైదరాబాద్ కు చుట్టుపక్కల 100 కి.మీ దూరంలో ఎక్కడ చూసినా పొలాలు లేవు ఫ్లాట్లు, వెంచర్లే కనిపిస్తాయి. అక్కడక్కడ కొంత పొలాలు ఉన్న ఇంకొన్ని రోజుల్లో అవి కనుమరుగైపోతాయి.


ఎవరి నోట విన్న వెంచర్లు,ప్లాట్లు,కోట్లు ఇవే మాటలు.


    రైతులకు లక్షలు,కోట్లు ఆశ చూపించి భూములు కొనుగోలు చేయడం వెంచర్లు వేయడం ఇదేపని.

పాపం రైతులు ఎప్పుడు అంతడబ్బు చూసి ఉండరు ఒకేసారి ఎకరం కోటి రూపాయలు అనేసరికి ఎగిరిగంతేసి భూములు అమ్మేసుకుంటున్నారు.

భూములు అమ్మని రైతులను ఎలాగోలా అమ్మేలా చేస్తున్నారు. రైతుల భూములకు దారిలేకుండా చేసి భూములు అమ్ముకునేలా చేస్తున్నారు.


రోడ్డు ప్రక్కన భూమి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ గ్రద్దలు అక్కడ వాలిపోతాయి. ఆభూమిని ఎలాగోలా ఎన్ని డ్రామాలు ఆడైనా కొనేస్తారు.  ముందుగా రోడ్డు ప్రక్కన ఉన్న భూమిని కొనేస్తే వెనకాల ఉన్న పొలాలను కొనడం వారికి తేలికవుతుంది. ఎందుకంటే వారికి దారి ఇవ్వకుండా చేసి భూములు అమ్మేలా చేస్తారు. పచ్చని పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకోవడం. మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారు,అవుతున్నారు. వేలిముద్రలు (అంగూటి) వేసేవాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. 

మద్యలో బ్రోకర్లు అబ్బో వీళ్ళగురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారులదైతే ఆచరణ బ్రోకర్లది. వీళ్ళు ఏలాగైనా సరే రైతులను భూములు అమ్ముకునేలా చేస్తారు. ఎలాగైనా సరే....!

 వాళ్ళ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు...



నా చిన్నప్పుడు పంటపొలాల్లో అన్నిరకాల పంటలు పండేవి. రాను రాను పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు అవికూడా లేవు 50% పంటపొలాలు ప్లాట్లుగా మారాయి. ఎందుకు ఈపరిస్థితి దాపురించింది అంటే.నా చిన్నప్పుడు పంటలు బాగా పండేవి పాడిపశువులు ప్రతీ ఇంటికి ఉండేవి. వాటి పేడ ఎరువుతోనే పంటలు పండేవి. చీడపీడలు ఉండేవి కావు. రసాయన మందులు అసలు ఎవరికి తెలియదు.కృత్రిమ ఎరువులు, విత్తనాలు వాడలేదు. అప్పుడు రెైతులు అన్నిరకాల అపరాలు,జొన్నలు,వరి,  మిరప, కొర్ర, సజ్జలు, రాగులు,పసుపు వంటి ఆహార పంటలే పండించేవారు.

వ్యవసాయం అంటే పెట్టుబడి ఉండేదే కాదు కేవలం రైతు శ్రమే వ్యవసాయానికి పెట్టుబడి. విత్తనాలు సొంతంగా తయారు చేసుకునేవారు,ఎరువులు పశువుల పేడ. అలా వ్యవసాయం చేసారు కాబట్టి దిగుబడులు బాగా వచ్చేవి. 

ఎవరి ఇంట్లో చూసినా గుమ్ములకు, గుమ్ములు జొన్నలు,బియ్యం,కందులు,కొర్రలు, పెసలు ఉండేవి. 

డబ్బు ఎక్కువగా ఉండేదికాదు. అయినా సంతోషంగా ఉండేవాళ్ళు. 


ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి వ్యవసాయం నాశనం అవుతూ వచ్చింది. డబ్బు ఆశ చూపించి ఈ పంటలు వేస్తే  ఇంత దిగుబడి వస్తుంది ఇంత ధర ఉంటుంది అంటు రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్ళేలా చేసారు. ముఖ్యంగా పత్తిపంట. మొదట్లో దిగుబడులు బాగా వచ్చే సరికి చాలామంది రైతులు పత్తిపంట వేయడం ప్రారంభించారు. పత్తి విత్తనాలు రైతులు తయారు చేసుకోలేరు విత్తన కంపేని వారు తయారు చేసే విత్తనాలే వాడాలి. అలా విత్తన కంపెనీలు విత్తనాన్ని తమగుప్పిట్లోకి తీసుకుని వ్యాపారం మొదలెట్టాయి.

ఏం భూమిలో అయినా ఎన్ని రోజులు దిగుబడులు వస్తాయి ఒకే పంట వేస్తుంటే? మొదట్లో దిగుబడులు వచ్చినా రాను రాను దిగుబడులు తగ్గాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యాపారం మొదలైంది ఎరువుల వ్యాపారం ఈ ఎరువులు వాడండి దిగుబడి పెరుగుతుంది అని ఎరువులు కొనేలా చేసారు. తరువాత పురుగుమందులు ఇలా మొత్తం వ్యవసాయాన్ని పెట్టుబడి లేనిదే చేయలేమనే స్థాయికి తీసుకొచ్చారు. 


ఒకప్పుడు రైతులు స్వయంగా తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసుకునేవారు. పురుగుమందుల వాడకం అసలే ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడి లేనిదే చేయలేని స్థితికి తీసుకొచ్చారు.

వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొచ్చారు.

ఒకప్పుడు ఆహారం పంటలు మనదగ్గరే పండేవి కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి ఆహార పంటలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గాయి.పశుసంపద తగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్ని కొనుక్కోవలసిందే.విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనిదే ఏమి తినలేం. పంటలు ఎలాగు పండవు అందుకని భూములు అమ్ముకొంటున్నారు.



అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు తిని హాయిగా ఆరోగ్యంగా జీవించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, పురుగుమందులు వేసి పండించిన పంటలు  తిని రోగాల పాలు అవుతున్నారు. 


ఇదా అభివృద్ధి అంటే...???



  మనిషికి కావలసింది ఏంటి కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యకరమైన జీవితం. అంతే కాని డబ్బు కాదు. 

  

కాని డబ్బు డబ్బు అని ఆశ చూపించి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని నాశనం చేస్తున్నారు.

దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చేను కంచె చేసినట్టు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నరు. ఎందుకు ఈ కోట్లు డబ్బులు తింటారా, ఆరోగ్యం పాడైనాక ఎన్నికోట్లు ఉండి ఏం లాభం. పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నాశనం చేసే కోట్ల రూపాయల డబ్బు ఎందుకు...? పర్యావరణం నాశనం అయ్యాక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి మునుపటి స్థితికి రాదు. 


 111 జీవోను ఎత్తేసి రెండు నదుల పరివాహక ప్రాంతంలోని రైతులను కోటీశ్వరులను చేస్తాం  అని సారు చెప్తున్నాడు. జీవో ఎత్తేస్తే ఏమవుతుంది ఆ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలు, అపార్ట్ మెంట్లు పరిశ్రమలు వస్తాయి.పరిశ్రమలనుండి విడుదలయ్యే కాలుష్యం తో రెండు నదులు, రెండు జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో గాలి,నీరు,నేల అన్నిరకాలుగా కలుషితమే. ఇప్పుడు జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుంది. జీవో ఎత్తేస్తే అటుపక్కకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది.

 ఎలాగంటారా ఆ సుగంధాన్ని భరించలేం మరి....!!!


  2018 లో  హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, బుద్దుని విగ్రహం చూద్దామని నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగాను. అక్కడ నుండి ప్రారంభం అయ్యింది ఏదో దుర్గంధం ఎంటీ వాసన అనుకుంటూ  ముందుకు నడుస్తున్నాను. అప్పటికే ఆ వాసనకి తల పట్టేసింది ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సువాసన పెరిగిపోయింది. ఈ లోపు హుస్సేన్ సాగర్ కనబడింది. అందులో నీళ్ళు చూసేసరికి అర్థం అయింది ఆ దుర్గంధం ఈ సాగర్ నుండే వస్తుందని. ఆ నీళ్ళల్లో కూడా బోటు షికారు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుండే ఆ వాసన భరించలేక తల తిరుగుతోంది అలాంటిది హుస్సేన్ సాగర్ మద్యలో   బోటు షికారు చేస్తున్నారు అంటే నిజంగా మీకు దండం పెట్టాలి..🙏🙏🙏🙏

 అంతటి దుర్గంధభరితమైన నీటిలో బోటు షికారు చేసే వారిని చూసినపుడు నాకు ఆశ్చర్యం,జాలి, అసహ్యం, అన్ని ఒకేసారి అనిపించాయి..

 అతిపెద్ద సాహసం అది.....!!!

 5నిమిషాలు కూడా అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కు వెళితే అక్కడకు కూడా సాగర్ సువాసన వస్తూనే ఉంది..

 నేను చాలా సార్లు విన్నా ట్యాంక్ బండ్,బుద్దుని విగ్రహం ఆ చుట్టుపక్కల పార్కులు బాగుంటాయి అని  గొప్పలు చెప్పెవారు. నాకు అక్కడకు వెళ్ళి చూడాలని కుతూహలంగా ఉండేది. ఇక్కడకు వచ్చి చూసాక తెలిసింది ఈ కాలుష్యం గురించా ఇంత గొప్పగా చెప్పారని.  ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో నిండిన ఆ ప్రాంతంలో10నిమిషాలు కూడా ఉండలేం.. అందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని... 

 ఇది చూసిన తర్వాత నేను ఒకటి బలంగా చెప్పగలను

 దీనికంటే లక్షరెట్లు మా ఊరి చెరువులు గొప్పవని..

స్వచ్చమైన గాలి, నీరు, నింగి,నేల ఉన్న నా పల్లెటూరు గొప్పది...


ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి సరస్సే కదా మరి ఇప్పుడు కాలుష్య సాగర్ గా మారింది. దీనికి కారణం అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వ్యర్థాలను సాగర్ లోకి వదిలి పెట్టి, కనీసం ఆనీటిని తాకడానికి కాదుకదా చూస్తేనే, అటునుండి వెళ్తేనే వాంతికొచ్చెలా చేసారు....

అభివృద్ధి వద్దనడం లేదు కాని ప్రణాలిక లేని అభివృద్ధి మానవాళికి చేటు.. ప్రపంచంలో హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు నదుల పక్కనే ఉన్నాయి అక్కడ ఇలాంటి కాలుష్యం లేదే... మరి మన దగ్గర ఎందుకిలా అంటే మన నాయకుల స్వార్థ రాజకీయాల వలన ఇలా ఉంది..


ఎందుకు ఇది చెబుతున్నానంటే  రోడ్లు, బిల్డింగ్స్ కట్టేసి   సహజ వనరులను మురికి కూపంగా మార్చడం అభివృద్ధి కాదు.. హుస్సేన్ సాగర్ బాగు చేయడం ఈ జన్మలో జరగదు. సరే వదిలేద్దాం.. ఇప్పుడు 111 జీవో ఎత్తేసి   జంట జలాశయాలను కూడా హుస్సేన్ సాగర్ లా మార్చాలనుకుంటున్నారు.... సారు..

ఇప్పుడు రెండు జలాశయాలు స్వచ్చమైన నీటితో శుభ్రంగా ఉన్నాయి.. వాటి చుట్టుపక్కల పరిశ్రమలు, బిల్డింగ్స్ కట్టేసి వాటిని కూడా మురికి కూపంగా మార్చేయాలి... ఇదేందయ్యా ఇది అంటే అభివృద్ధి..

అప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను హుస్సేన్ సాగర్ 2, హుస్సేన్ సాగర్ 3అని అనాలి...

ఇప్పటికీ మూసీ నది గండిపేట చెరువు వరకు స్వచ్ఛమైన నీటితో జూన్ లో వర్షాలు ప్రారంభం నుండి డిసెంబర్ వరకు ప్రవహిస్తుంది. మన నాయకుడు అభివృద్ధి చేసిన తర్వాత మురికి కూపంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది వ్యర్ద జలాలతో.


ఎవరు 111 రద్దు చేయమని చెప్పింది. ఈ జీవో వలన భూముల ధరలు లేక రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. రైతుల నష్టం ఏమో కాని నాయకుల లాభం కోసం అని అందరికి తెలిసిందే... నిజంగా ఏ నాయకుడికి రైతులపై, ప్రజలకు మంచి చేయాలని ఉండదు.    కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇన్ని డ్రామాలు. ఆ ఓట్లను నోట్లతో కొనాలి. మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇలా అభివృద్ధి పేరిట దోచుకుంటే వస్తుంది..


అయ్యా మీరు ప్రజలను కోటీశ్వరులను చేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను నాశనం చేయకుంటే చాలు అదే పదివేలు....🙏🙏😌😌..


సొంత లాభం కొంత మానుకోని

పరుల సేవకు పాటుపడవోయ్.


ప్రజల సేవకు పాటు పడకపోయినా పర్వాలేదు.

పర్యావరణాన్ని నాశనం చేయకండి..