భానోదయం: పర్యావరణం
పర్యావరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పర్యావరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జులై 2022, గురువారం

ప్లాస్టిక్ నిషేధం విధించారు సరే, అమలు చేయడం సాధ్యమేనా??

    దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం శుభపరిణామం. నేను ఎప్పటినుంచో ఎదురుచుస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద మార్పుకు నాంది. 


నిషేధం విధించారు సరే అమలు జరగడం సాధ్యమేనా.. 


ఒకసారి వాడిపాడేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేదించామంటున్నారు అందులో వాటర్ బాటిల్స్ లేవు. పేపర్ ప్లేట్లు లేవు ఇవికూడా ఒకసారి వాడిపాడేసేవే కదా.. 


మరొకటి గాలి అమ్మే ప్యాకెట్లు అదేనండి చిప్స్ పాకెట్లు వాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు.. వీటివల్ల కూడా పెద్ద ఎత్తున కాలుష్యం అవుతుంది. ఈ ప్యాకెట్లో 95% గాలి మిగితా 5% మాత్రమే చిప్స్ అనే పదార్థం ఉంటుంది.. ఈ ప్యాకెట్లో ఉండే పదార్థం తక్కువ దాని ద్వారా వచ్చే కాలుష్యం ఎక్కువ.. ఇలాంటివి కూడా నిషేధించాలి.. నిషేధం అంటే నిషేదమే కఠినంగా ఉండాలి అప్పుడే మార్పు వస్తుంది..


నిషేధం అని మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో పెడితే బాగుంటుంది.. ఇదివరకు చాలా సార్లు నిషేదం విధించారు కాని మళ్ళీ వాడుతూనే ఉన్నారు...


వాటర్ బాటిల్స్, పేపర్ ప్లేట్లు, గ్లాసులు,చిప్స్ ప్యాకెట్స్ ఇలా వీటన్నింటినీ నిషేధించాలి..  అప్పుడే కాలుష్యం తగ్గి పరిసరాలు పరిశుభ్రంగా, అందంగా తయారవుతాయి.. లేదంటే మళ్ళీ కథ మొదటికే వస్తుంది...


ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడే విధంగా ప్రోత్సాహించాలి. 


నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నా ప్రతీ ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలకు వెళ్ళినప్పుడు వెంట కాటన్ సంచి లేదా జ్యూట్ బ్యాగులను వెంట తీసుకు వెళ్ళండి. అలాగే వాటర్ బాటిల్ బయట కోనే కంటే ఇంటినుండి స్టీల్ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్ళాలి. పిల్లలకు గాలి ప్యాకెట్లు అవే చిప్స్ ప్యాకెట్లు తినే అలవాటు చేయకండి.. మనం తినకుంటే కంపెనీ వాడు ఎందుకు చేస్తాడు.. కాబట్టి ముందు మనం మారాలి. 


ప్లాస్టిక్ నిషేధం బాధ్యత ప్రభుత్వానిది మనకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి... 


ప్లాస్టిక్ తరిమేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం...







17, ఏప్రిల్ 2022, ఆదివారం

నీటి వనరులను నాశనం చేస్తున్నారు..

    


    ప్రకృతి మానవ మనుగడకు అవసరమైన అన్ని వనరులను మనకు ప్రసాదిస్తుంది. కాని ప్రకృతి ప్రసాదించిన వనరులను ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారు చెప్పండి.? ప్రకృతి వనరులను నాశనం చేయడానికి ఉన్నంత శ్రద్ధ సద్వినియోగం చేసుకోవడంలో ఉండదు. ఏ జీవికైనా ప్రాణాధారం నీరు. నీరు లేనిదే జీవుల మనుగడ లేదు. అది అందరికీ తెలిసిందే కాని నీటి వనరులను మాత్రం విచ్చలవిడిగా కాలుష్యం చేసేసి మనుషులతో పాటు మూగజీవాలకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మానవుడు. ప్రకృతి లో తెలివైన వాడు మానవుడు తన తెలివితేటలతో ప్రకృతిని, ప్రకృతి ప్రసాదించిన వనరులను నాశనం చేసి ఇతర జీవులకు కూడా మనుగడ లేకుండా చేస్తున్నాడు. 


 ఇతర జీవుల సంగతి దేవుడెరుగు గాని ముందు ముందు మనిషి మనుగడకే ముప్పు తెస్తున్నాడు.

 నీరు అందరికి జీవనాధారం కాని నీటి విలువ ఎవరికి తెలియదు. ''మన దగ్గర ఏది ఉంటుందో దాని విలువ మనకు తెలియదు". లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. 


ఇప్పుడు మనకు త్రాగు నీరు పుష్కలంగా లభిస్తుంది. పుష్కలంగా అంటే మరీ మన తాతల నాటి కాలంలో కాకుండా కొంచెం తక్కువగానే స్వచ్చమైన నీరు లభిస్తుంది. అయినా కూడా నీటి వనరుల విలువ ఇంకా చాలామంది కి తెలియదు. ముందు ముందు తెలుస్తుంది. మా చిన్నప్పుడు రవాణా వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందలేదు ఏ ఊరికైనా వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మరీ దూరమైతే మెయిన్ రోడ్డు వరకు నడిచి అక్కడ ఏదైనా వాహనం ఎక్కి చిన్నపాటి సిటీలో దిగి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం. మొత్తంగా కాలినడకనే వెళ్ళేవాళ్ళం. ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం ఎందుకంటే వేసవిలో పిల్లలకు సెలవులు ఉండడం, పెద్దవారికి కూడా ఎలాంటి పనులు ఉండవు కాబట్టి ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం. వేసవిలో ఎక్కువగా ఏ బందువుల  ఇంటికి వెళతాం చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లే వెళ్తారు.  అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అంటే మాకు పండగే. అందరు వస్తారు కాబట్టి ఆ ఆనందంలో ఎంతదూరం అయిన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 

 వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు దాహం వేస్తే ఎక్కడ కూడా నీళ్ళు కోనేవారు కాదు అసలు అప్పట్లో నీళ్ళు అమ్మే వాళ్ళు కాదు మా ఊళ్ళళ్ళో. చిన్న చిన్న వాగులు ఉండేవి వానాకాలం పుష్కలంగా నీరు ప్రవహించే వాగులు వేసవిలో నీరు ఉండేది కాదు. అక్కడ అక్కడ గుంతల్లో కొద్దిగా నీరు ఉండేది. అవి పశువులు తాగడానికి ఉపయోగపడేవి. మేం తాగలంటే చెలిమలు తవ్వి నీరు త్రాగేవాళ్ళం. అప్పుడు ఎలాంటి కాలుష్యం లేదు చాలా స్వచ్ఛంగా ఉండేవి నీళ్ళు. 

ఇక బావి నీరు ఎక్కువగా త్రాగే వాళ్ళు. బోర్లు అంతగా ఉండేవి కాదు. చెరువులు,కుంటలు ఎక్కడ కూడా కాలుష్యం ఉండేది కాదు. మరీ ఇప్పుడు నీళ్ళు త్రాగాలి అంటే కొనాల్సిందే ప్రకృతి ప్రసాదించిన నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. కారణం స్వచ్చమైన నీరు లభించక పోవడమే. నీటి వనరులను కాలుష్యం చేసి నీటి వ్యాపారం చేస్తున్నారు.


    పట్టణీకరణ, పరిశ్రమల స్థాపనతో నీటి వనరులను పూర్తిగా కలుషితం చేస్తున్నారు. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. ఆ నీటితో చెరువులోని నీరు తాగేందుకు కాదుకదా కనీసం తాకడానికి కూడా పనికి రాకుండా పోతుంది. మనుషులైతే డబ్బులు పెట్టి కొని నీళ్ళు త్రాగుతారు. మరి జంతువులు, పక్షులు ఎలా త్రాగుతాయి నీరు. మనిషి తన అత్యాశకు పోయి ఇతర జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. వాటికి కనీసం తాగేందుకు నీరు లేకుండా చేస్తున్నాడు.  ఆలోచించండి ఇకనైన మేల్కొని నీటి వనరులను కాపాడుకుందాం. మనతో పాటు ఇతర జీవుల మనుగడకు ఎలాంటి హాని తలపెట్టకుండా నీటి వనరులను కాలుష్యం చేయకుండా  కాపాడుకుందాం..


కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు..


ఎవరైతే నీటి వనరులను కాలుష్యం చేస్తారో వారికి త్రాగేందుకు నీరు దొరకదు..

కాని ఇప్పుడు బడా బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు చేసిన నీటి కాలుష్యం వల్ల పశుపక్ష్యాదులు, సామాన్య ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.


బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల ధన దాహానికి   నేల, నీరు కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమల వలన భూమిపై ఉన్న నీటి వనరులే కాకుండా భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. రసాయన పరిశ్రమల వారు కాలుష్య జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. అలాగే భూమిలోకి బోర్లు వేసి అందులోకి రసాయనాలను పంపిస్తారు దీనివలన భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఎక్కడ బోరు బావి తవ్విన రసాయనాలతో నిండిన నీరే వస్తుంది. ఎంత దారుణం అండి ఇది చుట్టుపక్కల వారికి ఈ పరిశ్రమల వలన ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి వారు కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ నేలని,నీటిని, పరిసరాలను కాలుష్యం చేసి స్థానికులకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు...


   

ఇంతవరకు మా వైపు అయితే ఈ దరిద్రపు గొట్టు రసాయన పరిశ్రమలు లేవు. రావొద్దనే కోరుకుంటున్నాను.


 రాను రాను మా వైపు కూడా అభివృద్ధి పేరిట ఈ రసాయన పరిశ్రమల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో విచ్చలవిడిగా పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు హైదరాబాదు చుట్టుపక్కల మాత్రమే ఉండే రసాయన పరిశ్రమలు ఇక పచ్చని పల్లెల వైపు వస్తాయి. ఇక్కడ నేల, నీటిని కాలుష్యం చేస్తాయి. ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తున్నారు. కంచె చేను మేసినట్టు ప్రభుత్వమే నీటి వనరులను నాశనం చేయడానికి చూస్తుంటే ఇంకా ఎవరు వాటిని కాపాడేది.

  ఇప్పటికైతే నేను చిన్నప్పుడు వేసవిలో చెలిమల్లో నీటిని తాగినా నది ఇప్పటికి స్వచ్చమైన నీటితోనే ప్రవహిస్తుంది.

ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిశ్రమలు లేవు. ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటా..

గత ఏడాది అక్టోబరులో మా నదిలో నేను  తీసిన వీడియోలు. ఇప్పటికి స్వచ్చమైన నీటితో ప్రవహిస్తుంది.







 

29, మార్చి 2022, మంగళవారం

ప్లాస్టిక్ మనుషులు

 



     మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేసాడు అవి మానవాలికి ఉపయోగంతో పాటు కీడు కూడా చేస్తాయి. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ అయిన రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని సరియైన విధంగా ఉపయోగిస్తే అందరికి శ్రేయస్కరం. కాని వాటిని చాలా మట్టుకు వినాశనం ఉండే విధంగానే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తే మేధావులు తమ అతి తెలివితో వినాశనానికి దారితీస్తున్నారు.


ఏ ఆవిష్కరణ అయిన తరువాత వ్యాపారం అయిపోతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారాలతో ప్రకృతిని నాశనం చేస్తారు. 


మనిషి ఆవిష్కరించిన వాటిలో అత్యంత చెత్త ఆవిష్కరణ "ప్లాస్టిక్".  ఇది ఎంత చెత్త ఆవిష్కరణ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెత్తే కనిపిస్తుంది.

నేలపై, నదుల్లో, సముద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ చెత్తే కనిపిస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.. ఇన్ని రోజులు బయట మాత్రమే ఉండే ఈ చెత్త ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరంలో రక్తంలోకి కూడా చేరింది... ఇన్నాళ్లు పర్యావరణాన్ని చెత్తగా మార్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరాన్ని చెత్తగా మారుస్తుంది.


      ఆవిష్కరణలు మనిషి జీవన విధానాన్ని ఎంత సులభతరం చేస్తయో అంతకంటే ఎక్కువగా నాశనం కూడా చేస్తాయి. ఆవిష్కరణలు రెండు వైపుల పదును వున్న కత్తుల్లాంటివి వాటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది విచ్చలవిడిగా వాడితే ముప్పు తప్పదు.. 

     

    ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మానవ శరీరంలో రక్తంలోకి ఎలా చేరింది.?

    

 ఎలా చేరిందంటే మనిషి విచ్చలవిడిగా వాడడం వలనే.



 అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది.



అందులో కొన్ని నాకు తెలిసినవి:-


ఉదయం నుంచే మన పరుగు ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది.


ఉదయము కూరగాయలకు వెళ్తారు ఖాళీ చేతుల్తో. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు నింపుకుని వస్తారు.



పాలు ప్లాస్టిక్ కవర్లో.


కిరాణా సరుకులు ప్లాస్టిక్ కవర్లో.


బయట  ఎక్కడైన టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో నే.


భోజనం ప్లాస్టిక్ ప్లేట్లలో నే.


ఆహారం ప్యాక్ చేయడం ప్లాస్టిక్ కవర్లో నే.


టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు.


అసలు ప్లాస్టిక్ వాడకం అనేది మామూలుగా లేదు అవసరం ఉన్నా లేకపోయినా వాడడం మాత్రం పక్కా.


అంతలా వాడితే మనిషి రక్తంలో ఏంటి ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ అయిపోయి "ప్లాస్టిక్ మనుషులు" గా మారిపోయిన ఆశ్చర్యం లేదు..!!!



ఉదయం లేవగానే కూరగాయలకు ఒక సంచి తీసుకుని వెళ్తే ఏమవుతుంది.? చాలామందికి చేతిలో సంచి తీసుకుని బయిటకు వెళ్తే నామోషో లేక బద్ధకమో తెలియదు కాని అస్సలు తీసుకెళ్ళరు.


 ఖాలీ చేతుల్తో కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళి గంపెడు ప్లాస్టిక్ చెత్తను తీసుకువస్తారు. సరే తెచ్చారు వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా చేస్తారా అంటే అదిలేదు. ఇష్టం వచ్చినట్టు బయట పారేయడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఇలా కాల్చడం వలన ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసి ఆ గాలి పీల్చునప్పుడు శరీరం లోకి ప్రవేశిస్తున్నాయి.


ఇంకొందరు మహానుభావులు వేడి వేడి 'టీ' ని  కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు. టీ కొట్టు వాడికి తెలియక పోవచ్చు వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయోద్దని చదువుకున్న వాళ్ళుకూడా తెలియదా అలాగే తాగుతున్నారు. అంత వేడి టీ ని ప్లాస్టిక్ కవర్లో పోస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి టీలోకి వెళ్ళి అది తాగినవారి శరీరం లోకి వెళుతుంది.

అలా చేయకుండా ఒక ప్లాస్క్ వాడితే సరిపోతుంది కదా. ప్లాస్క్ వాడడానికి బద్దకం, ఆ ప్లాస్క్ ను కొట్టు వరకు తీసుకువెళ్ళడానికి నామోషి. 


ఇక నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో.

పల్లెటూళ్ళలో అయితే ఒకసారి తాగిపడేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ని పదే పదే నీళ్ళు నింపుకుని వాడుతుంటారు.  ఈ ప్లాస్టిక్ బాటిల్స్  లో ఎక్కువ రోజులు నీళ్ళు తాగితే అందులోని ప్లాస్టిక్ కణాలు అందులోని నీటిలోకి వెళ్తాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాడుతూ ఉంటారు. తెలిసిన 

ఎవరూ చెప్పరు, చెప్పిన ఎవరూ వినరు...




     ఇంకా పెళ్ళిళ్ళు, దావత్ లకు అప్పట్లో మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో భోజనం వడ్డించేవారు. ఆ విస్తరాకుల్లో  తృప్తి గా భోజనం చేసేవాళ్ళం. వాటిని తీసుకెళ్ళి పెంటలో వేసే వాళ్ళు అవి ఎరువుగా మారేవి... ఇప్పుడు పేపర్ ప్లేట్లో వడ్డిస్తున్నారు ఈ పేపర్ ప్లేటునుంచి ఏదో దుర్గంధం వస్తుంది. పైగా వాటిపై ప్లాస్టిక్ కవర్ ఉంటుంది వేడి పదార్థాలు అందులో తింటే  ప్లాస్టిక్ శరీరంలోకి చేరకుండా ఉంటుందా..?


ఎంత చక్కనివండి  అప్పట్లో మన పల్లెల్లో "మోదుగ ఆకులతో" తయారు చేసిన విస్తరాకులు. అందులో భోజనం చేస్తే అమోఘం. వీటి వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా అవి ఎరువుగా ఉపయోగపడుతాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ విస్తరాకుల వలన అన్ని విధాలుగా నష్టమే ఎక్కువ...


మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని మరిచిపోయి ప్లాస్టిక్ వెంట పరిగెత్తి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం...



ప్లాస్టిక్ వలన ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం ఎక్కువగా వాడుతున్నారు. కాని పరోక్షంగా దీని నష్టాలు గమనించడం లేదు.


ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది..


కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళినప్పుడు జనపనార (జ్యూట్ )బ్యాగులు కాని కాటన్ బ్యాగులు కాని వెంట తీసుకెళ్ళాలి.


పేపర్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాని, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకులు వాడాలి.


బయట నుండి పార్శిల్ తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకోవడం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.....








28, మార్చి 2022, సోమవారం

అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.

 





అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. 

  పచ్చటి పంటపొలాలను నాశనం చేసి ఫ్లాట్లు చేస్తున్నారు. 

ఒకప్పుడు మా ఊరి భూముల్లో పంటలు

పండేటివి.కాని ఇప్పుడు ఫ్లాట్లు పండుతున్నాయి. 

హైదరాబాద్ కు చుట్టుపక్కల 100 కి.మీ దూరంలో ఎక్కడ చూసినా పొలాలు లేవు ఫ్లాట్లు, వెంచర్లే కనిపిస్తాయి. అక్కడక్కడ కొంత పొలాలు ఉన్న ఇంకొన్ని రోజుల్లో అవి కనుమరుగైపోతాయి.


ఎవరి నోట విన్న వెంచర్లు,ప్లాట్లు,కోట్లు ఇవే మాటలు.


    రైతులకు లక్షలు,కోట్లు ఆశ చూపించి భూములు కొనుగోలు చేయడం వెంచర్లు వేయడం ఇదేపని.

పాపం రైతులు ఎప్పుడు అంతడబ్బు చూసి ఉండరు ఒకేసారి ఎకరం కోటి రూపాయలు అనేసరికి ఎగిరిగంతేసి భూములు అమ్మేసుకుంటున్నారు.

భూములు అమ్మని రైతులను ఎలాగోలా అమ్మేలా చేస్తున్నారు. రైతుల భూములకు దారిలేకుండా చేసి భూములు అమ్ముకునేలా చేస్తున్నారు.


రోడ్డు ప్రక్కన భూమి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ గ్రద్దలు అక్కడ వాలిపోతాయి. ఆభూమిని ఎలాగోలా ఎన్ని డ్రామాలు ఆడైనా కొనేస్తారు.  ముందుగా రోడ్డు ప్రక్కన ఉన్న భూమిని కొనేస్తే వెనకాల ఉన్న పొలాలను కొనడం వారికి తేలికవుతుంది. ఎందుకంటే వారికి దారి ఇవ్వకుండా చేసి భూములు అమ్మేలా చేస్తారు. పచ్చని పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకోవడం. మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారు,అవుతున్నారు. వేలిముద్రలు (అంగూటి) వేసేవాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. 

మద్యలో బ్రోకర్లు అబ్బో వీళ్ళగురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారులదైతే ఆచరణ బ్రోకర్లది. వీళ్ళు ఏలాగైనా సరే రైతులను భూములు అమ్ముకునేలా చేస్తారు. ఎలాగైనా సరే....!

 వాళ్ళ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు...



నా చిన్నప్పుడు పంటపొలాల్లో అన్నిరకాల పంటలు పండేవి. రాను రాను పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు అవికూడా లేవు 50% పంటపొలాలు ప్లాట్లుగా మారాయి. ఎందుకు ఈపరిస్థితి దాపురించింది అంటే.నా చిన్నప్పుడు పంటలు బాగా పండేవి పాడిపశువులు ప్రతీ ఇంటికి ఉండేవి. వాటి పేడ ఎరువుతోనే పంటలు పండేవి. చీడపీడలు ఉండేవి కావు. రసాయన మందులు అసలు ఎవరికి తెలియదు.కృత్రిమ ఎరువులు, విత్తనాలు వాడలేదు. అప్పుడు రెైతులు అన్నిరకాల అపరాలు,జొన్నలు,వరి,  మిరప, కొర్ర, సజ్జలు, రాగులు,పసుపు వంటి ఆహార పంటలే పండించేవారు.

వ్యవసాయం అంటే పెట్టుబడి ఉండేదే కాదు కేవలం రైతు శ్రమే వ్యవసాయానికి పెట్టుబడి. విత్తనాలు సొంతంగా తయారు చేసుకునేవారు,ఎరువులు పశువుల పేడ. అలా వ్యవసాయం చేసారు కాబట్టి దిగుబడులు బాగా వచ్చేవి. 

ఎవరి ఇంట్లో చూసినా గుమ్ములకు, గుమ్ములు జొన్నలు,బియ్యం,కందులు,కొర్రలు, పెసలు ఉండేవి. 

డబ్బు ఎక్కువగా ఉండేదికాదు. అయినా సంతోషంగా ఉండేవాళ్ళు. 


ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి వ్యవసాయం నాశనం అవుతూ వచ్చింది. డబ్బు ఆశ చూపించి ఈ పంటలు వేస్తే  ఇంత దిగుబడి వస్తుంది ఇంత ధర ఉంటుంది అంటు రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్ళేలా చేసారు. ముఖ్యంగా పత్తిపంట. మొదట్లో దిగుబడులు బాగా వచ్చే సరికి చాలామంది రైతులు పత్తిపంట వేయడం ప్రారంభించారు. పత్తి విత్తనాలు రైతులు తయారు చేసుకోలేరు విత్తన కంపేని వారు తయారు చేసే విత్తనాలే వాడాలి. అలా విత్తన కంపెనీలు విత్తనాన్ని తమగుప్పిట్లోకి తీసుకుని వ్యాపారం మొదలెట్టాయి.

ఏం భూమిలో అయినా ఎన్ని రోజులు దిగుబడులు వస్తాయి ఒకే పంట వేస్తుంటే? మొదట్లో దిగుబడులు వచ్చినా రాను రాను దిగుబడులు తగ్గాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యాపారం మొదలైంది ఎరువుల వ్యాపారం ఈ ఎరువులు వాడండి దిగుబడి పెరుగుతుంది అని ఎరువులు కొనేలా చేసారు. తరువాత పురుగుమందులు ఇలా మొత్తం వ్యవసాయాన్ని పెట్టుబడి లేనిదే చేయలేమనే స్థాయికి తీసుకొచ్చారు. 


ఒకప్పుడు రైతులు స్వయంగా తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసుకునేవారు. పురుగుమందుల వాడకం అసలే ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడి లేనిదే చేయలేని స్థితికి తీసుకొచ్చారు.

వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొచ్చారు.

ఒకప్పుడు ఆహారం పంటలు మనదగ్గరే పండేవి కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి ఆహార పంటలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గాయి.పశుసంపద తగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్ని కొనుక్కోవలసిందే.విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనిదే ఏమి తినలేం. పంటలు ఎలాగు పండవు అందుకని భూములు అమ్ముకొంటున్నారు.



అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు తిని హాయిగా ఆరోగ్యంగా జీవించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, పురుగుమందులు వేసి పండించిన పంటలు  తిని రోగాల పాలు అవుతున్నారు. 


ఇదా అభివృద్ధి అంటే...???



  మనిషికి కావలసింది ఏంటి కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యకరమైన జీవితం. అంతే కాని డబ్బు కాదు. 

  

కాని డబ్బు డబ్బు అని ఆశ చూపించి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని నాశనం చేస్తున్నారు.

దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చేను కంచె చేసినట్టు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నరు. ఎందుకు ఈ కోట్లు డబ్బులు తింటారా, ఆరోగ్యం పాడైనాక ఎన్నికోట్లు ఉండి ఏం లాభం. పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నాశనం చేసే కోట్ల రూపాయల డబ్బు ఎందుకు...? పర్యావరణం నాశనం అయ్యాక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి మునుపటి స్థితికి రాదు. 


 111 జీవోను ఎత్తేసి రెండు నదుల పరివాహక ప్రాంతంలోని రైతులను కోటీశ్వరులను చేస్తాం  అని సారు చెప్తున్నాడు. జీవో ఎత్తేస్తే ఏమవుతుంది ఆ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలు, అపార్ట్ మెంట్లు పరిశ్రమలు వస్తాయి.పరిశ్రమలనుండి విడుదలయ్యే కాలుష్యం తో రెండు నదులు, రెండు జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో గాలి,నీరు,నేల అన్నిరకాలుగా కలుషితమే. ఇప్పుడు జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుంది. జీవో ఎత్తేస్తే అటుపక్కకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది.

 ఎలాగంటారా ఆ సుగంధాన్ని భరించలేం మరి....!!!


  2018 లో  హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, బుద్దుని విగ్రహం చూద్దామని నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగాను. అక్కడ నుండి ప్రారంభం అయ్యింది ఏదో దుర్గంధం ఎంటీ వాసన అనుకుంటూ  ముందుకు నడుస్తున్నాను. అప్పటికే ఆ వాసనకి తల పట్టేసింది ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సువాసన పెరిగిపోయింది. ఈ లోపు హుస్సేన్ సాగర్ కనబడింది. అందులో నీళ్ళు చూసేసరికి అర్థం అయింది ఆ దుర్గంధం ఈ సాగర్ నుండే వస్తుందని. ఆ నీళ్ళల్లో కూడా బోటు షికారు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుండే ఆ వాసన భరించలేక తల తిరుగుతోంది అలాంటిది హుస్సేన్ సాగర్ మద్యలో   బోటు షికారు చేస్తున్నారు అంటే నిజంగా మీకు దండం పెట్టాలి..🙏🙏🙏🙏

 అంతటి దుర్గంధభరితమైన నీటిలో బోటు షికారు చేసే వారిని చూసినపుడు నాకు ఆశ్చర్యం,జాలి, అసహ్యం, అన్ని ఒకేసారి అనిపించాయి..

 అతిపెద్ద సాహసం అది.....!!!

 5నిమిషాలు కూడా అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కు వెళితే అక్కడకు కూడా సాగర్ సువాసన వస్తూనే ఉంది..

 నేను చాలా సార్లు విన్నా ట్యాంక్ బండ్,బుద్దుని విగ్రహం ఆ చుట్టుపక్కల పార్కులు బాగుంటాయి అని  గొప్పలు చెప్పెవారు. నాకు అక్కడకు వెళ్ళి చూడాలని కుతూహలంగా ఉండేది. ఇక్కడకు వచ్చి చూసాక తెలిసింది ఈ కాలుష్యం గురించా ఇంత గొప్పగా చెప్పారని.  ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో నిండిన ఆ ప్రాంతంలో10నిమిషాలు కూడా ఉండలేం.. అందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని... 

 ఇది చూసిన తర్వాత నేను ఒకటి బలంగా చెప్పగలను

 దీనికంటే లక్షరెట్లు మా ఊరి చెరువులు గొప్పవని..

స్వచ్చమైన గాలి, నీరు, నింగి,నేల ఉన్న నా పల్లెటూరు గొప్పది...


ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి సరస్సే కదా మరి ఇప్పుడు కాలుష్య సాగర్ గా మారింది. దీనికి కారణం అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వ్యర్థాలను సాగర్ లోకి వదిలి పెట్టి, కనీసం ఆనీటిని తాకడానికి కాదుకదా చూస్తేనే, అటునుండి వెళ్తేనే వాంతికొచ్చెలా చేసారు....

అభివృద్ధి వద్దనడం లేదు కాని ప్రణాలిక లేని అభివృద్ధి మానవాళికి చేటు.. ప్రపంచంలో హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు నదుల పక్కనే ఉన్నాయి అక్కడ ఇలాంటి కాలుష్యం లేదే... మరి మన దగ్గర ఎందుకిలా అంటే మన నాయకుల స్వార్థ రాజకీయాల వలన ఇలా ఉంది..


ఎందుకు ఇది చెబుతున్నానంటే  రోడ్లు, బిల్డింగ్స్ కట్టేసి   సహజ వనరులను మురికి కూపంగా మార్చడం అభివృద్ధి కాదు.. హుస్సేన్ సాగర్ బాగు చేయడం ఈ జన్మలో జరగదు. సరే వదిలేద్దాం.. ఇప్పుడు 111 జీవో ఎత్తేసి   జంట జలాశయాలను కూడా హుస్సేన్ సాగర్ లా మార్చాలనుకుంటున్నారు.... సారు..

ఇప్పుడు రెండు జలాశయాలు స్వచ్చమైన నీటితో శుభ్రంగా ఉన్నాయి.. వాటి చుట్టుపక్కల పరిశ్రమలు, బిల్డింగ్స్ కట్టేసి వాటిని కూడా మురికి కూపంగా మార్చేయాలి... ఇదేందయ్యా ఇది అంటే అభివృద్ధి..

అప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను హుస్సేన్ సాగర్ 2, హుస్సేన్ సాగర్ 3అని అనాలి...

ఇప్పటికీ మూసీ నది గండిపేట చెరువు వరకు స్వచ్ఛమైన నీటితో జూన్ లో వర్షాలు ప్రారంభం నుండి డిసెంబర్ వరకు ప్రవహిస్తుంది. మన నాయకుడు అభివృద్ధి చేసిన తర్వాత మురికి కూపంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది వ్యర్ద జలాలతో.


ఎవరు 111 రద్దు చేయమని చెప్పింది. ఈ జీవో వలన భూముల ధరలు లేక రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. రైతుల నష్టం ఏమో కాని నాయకుల లాభం కోసం అని అందరికి తెలిసిందే... నిజంగా ఏ నాయకుడికి రైతులపై, ప్రజలకు మంచి చేయాలని ఉండదు.    కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇన్ని డ్రామాలు. ఆ ఓట్లను నోట్లతో కొనాలి. మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇలా అభివృద్ధి పేరిట దోచుకుంటే వస్తుంది..


అయ్యా మీరు ప్రజలను కోటీశ్వరులను చేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను నాశనం చేయకుంటే చాలు అదే పదివేలు....🙏🙏😌😌..


సొంత లాభం కొంత మానుకోని

పరుల సేవకు పాటుపడవోయ్.


ప్రజల సేవకు పాటు పడకపోయినా పర్వాలేదు.

పర్యావరణాన్ని నాశనం చేయకండి..







10, మార్చి 2021, బుధవారం

బంగారు తెలంగాణ కాదు కాలుష్య తెలంగాణ.

        

                మనిషి ప్రశాంతంగా,ఆరోగ్యంగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి,నీరు ఎంతో అవసరం. స్వచ్ఛమైన గాలి,నీరు ఎక్కడ లభిస్తుంది అంటే పల్లెటూర్లో లభిస్తుంది అని అందరూ చెబుతారు. ఎందుకంటే పట‌్ట‌ణాల్లో గాలి,నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పట‌్ట‌ణాల్లో,నగరాల్లో నివసించే ప్రజలు వారాంతాల్లో నగర కాలుష్యానికి దూరంగా పల్లెల వైపు వచ్చి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తుం‌టారు.  పల్లెటూళ్ళంటే పచ్చని ప్రకృతితో, స్వచ్చమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండేవి.  ఉండేవి అని ఎందుకన్నానంటే అది గతంలో ఇప్పుడు కాదు. ఎందుకంటే  ఇప్పుడు        పల్లెటూళ్ళు కాలుష్యంలో  పట‌్ట‌ణాలతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కాలుష్యంలో పట‌్నంకు, పల్లెకు తేడా లేదు. 

               

              ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండే పల్లెల్లో ఇప్పుడు కాలుష్యంతో విలవిల ాడుతున్నాయి. పట‌్ట‌ణాల్లో  వాహనాల పొగ, ప్లాస్టిక్ వ్యర్ధాలు, డ్రైనేజీల వలన కాలుష్యాం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉం‌టారు. వీరికి కాలుష్యం పట‌్ల అవగాహన కూడా ఉంటుంది. అయిన పర్యావరణ కాలుష్యం గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అందువలన పట‌్ట‌ణాలెప్పుడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పల్లెలు కూడా కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం విపరీతంగాపెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి చదువుకున్న వాళ్ళే పట‌్టించుకోరు. ఇక పల్లెల్లో ఉండే చదువుకోని ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండదు. అందువల్ల పల్లెల్లో కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా గాలి  కాలుష్యం పెరిగిపోయింది. ఎలా అంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తగల పెట‌్ట‌డం వలన గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది.  ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం విపరీతంగాపెరిగిపోయింది. క్యారీబ్యాగ్, కూల్ డ్రింక్స్ బాటిల్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్,    ప్లాస్టిక్ విస్తరాకులు, చిప్స్ ప్యాకెట్స్ ఇలా అన్ని ప్లాస్టిక్ మయమే వీటిని వాడిన తర్వాత ఒక దగ్గర వేసి కాల్చి వేస్తున్నారు. దీని వలన ఏర్పడిన పొగ వలన పర్యావరణ ానికి ఎంత ప్రమాదమో వారికి తెలియదు, ఆ పొగ పీల్చటం వలన ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో వారికి తెలియదు. ఇది తెలియక చాలామంది ప్లాస్టిక్ వ్యర్ధాలను తగలబెడుతుంట ారు. ఇదివరకు ఎవరి ఇళ్ళముందు వారు తగలబెట్టెవారు. దీని వలన కొంత సమయం గాలి కాలుష్యం ఆ చుట్టు పక్కల ఉండేది. కానీ ఇప్పుడు  ఈ గాలి కాలుష్యం, పొగ రోజంతా పల్లెలను పట్టి పీడిస్తోంది. ఇలా రోజంతా గాలి కాలుష్యం, పొగ రావడానికి కారణం ప్రభుత్వాల అతి తెలివి వల్ల నేడు గ్రామాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది.


              ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం నడుస్తుంది. తడిచెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని కొన్ని గ్రామాల్లో రెండు చెత్త బుట్టలను ఇవ్వడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. ఇక్కడ వరకు ప్రభుత్వం చేసిన పని మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ చెత్త డబ్బాలు కొన్ని గ్రామాల్లోనే ఇచ్చారు. చాలా గ్రామాల్లో ఇవి ఇవ్వలేదు. సరే ఇవ్వలేకున్నా సరే మేమే తెచ్చుకుంటాం చెత్తను   వేరు చేసి ఇస్తాం ఈ చెత్తను ప్రభుత్వం ఏమి చేయాలి? పర్యావరణ ానికి హాని కలిగించకుండా రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా తడి చెత్త, పొడి చెత్త , ఆ చెత్త ఈ చెత్త అని తెడా లేదు అన్ని చెత్తలు ఒకటే అన్నట‌్టు ఒకే చోట‌ వేస్తున్నారు. ఈ చెత్త  సేకరించే వారు ఉదయం ఒక ట‌్రాక్ట‌ర్ తో గ్రామంలో మొత్తం తిరిగి అన్ని రకాల చెత్తలు అందులో వేసుకుని ఊరి బయట‌ ఉన్న చెత్త డంప్ యార్డ్ లో వేస్తున్నారు.  ఇక్కడ వరకు బాగానే ఉంది కదా?  తెలంగాణ గ్రామాలు దీని వలన స్వచ్ఛంగా వెలిగిపోతున్నాయి అని మీరు అనొచ్చు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని కూడా అనొచ్చు. కాని నేను మాత్రం ఇది పరమ దరిద్రమైన చెత్త పని అని అంటాను.... ఎందుకంటే ఒకపని చేస్తే ప్రజలకు మేలు కలగాలి కాని ఈ చెత్త సేకరించే పని వలన ప్రజలకు నష్ట‌మే తప్ప మేలు జరగడం లేదు.


           ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో చెత్త డంప్ యార్డులు నిర్మించారు. దాంట‌్లో చెత్తను వేరు చేయడానికి అన్నట‌్టు చిన్న చిన్న గదులు నిర్మించారు. అందులో  గ్రామాల్లో సేకరించిన చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పడు ఏం చేస్తున్నారంటే డంపు యార్డ్ ముందు ఒక పెద్ద గుంత తీసి గ్రామంలో సేకరించిన చెత్తను అందులో వేసి తగలబెడుతున్నారు. దీని వలన 24/7 365 రోజులు అది మండుతూనే ఉంటుంది. ఆ పొగ పగటి పూట‌ పైకి వెళుతుంది. అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాని సాయంత్రం పూట‌ చుట్టు పక్కల మొత్తం పొగతో నిండిపోయి నరకం కనిపిస్తుంది. గాలి పీల్చాం‌టేనే భయం వేస్తుంది. దగ్గు, ఆయాసం, కళ్ళ మంట‌లు నరకయాతన.

       అసలు ప్రభుత్వాలకు ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకొస్తాయో..? 😭😭😭 మా గ్రామంలో అయితే సాయంత్రం అయ్యిందం‌టే చాలు ఈ చెత్త డంపు యార్డ్ వల్ల దానికి దగ్గరగా ఉన్న ఇళ్ళ ప్రజలు    చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకు ఉదాహరణ నేనే... సాయంత్రం నుండి ఉదయం వరకు ఆ పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నా. నా పక్కన ఎవరైన సిగరెట‌్ తాగితేనే నాకు పడదు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అలాంటిది లక్షల సిగరెట్లు  కాల్చినంత పొగ వస్తే ఏం చేయాలి. ఉపాది లేక  దశాబ్దం పాటు ఊరు వదిలి వెళ్ళిపోయాం.అక్కడ నానా కష్టాలు పడ్డాం. తెలంగాణ వచ్చాక మన బతుకులు బాగు పడతాయని సొంత ఊరికి వస్తే ఇక్కడేమే స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.????

        బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందో అందరికి తెలిసిందే. ఒక కుటుంబం బాగు పడితే చాలా...???


ఇది చాలా చిన్న సమస్య ఇంత పెద్ద రాద్దాంతం చేయడం అవసరమా అని మీరు అనొచ్చు. ఆ కష్టం అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ భాదేమిటో.  ఎక్కడైన పొగ వస్తేనే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాం అలాంటిది మన ఇంటికి దగ్గర 24 గంట‌లు పొగ అది కూడా ప్లాస్టిక్ ను తగలబెట్టిన పొగ వస్తే ఎలా ఉం‌టుందో ఆలోచించండి. ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చి అనారోగ్యాల పాలయితే ఆసుపత్రుల చుట‌్టు తిరిగే స్తోమత మాకు లేదు. నాకు ఆసుపత్రులంటే మహా భయం.. అక్కడకు వెళ్ళాలంటే ఇంట‌్లో డబ్బులు కాసే చెట్లు ఉండాలి. అయినా ఆసుపత్రుల చుట‌్ట‌్టు తిరగడం కం‌టే ఆరోగ్యంగా ఉండట‌మే మేలు కదా..  


            కెసిఆర్ సార్ అంటే నాకు ఎంతో అభిమానం... నా చుట్టూ ఉండే వాళ్ళు ఎందరు కెసిఆర్ సార్ ను విమర్శించిన

 సార్ గొప్పవాడు  విమర్శించడం తప్పు అనేవాడిని . నేనే తప్పు అని ఇప్పుడు అర్థం అయ్యింది.. ఒక పని చేసే ట‌ప్పుడు అది పూర్తిగా  అమలు జరిగేలా చూడాలి అది వారి బాధ్యత. కాని ఆ పనిని  సగంలోనే వదిలేస్తే   బాధ్యతారాహిత్యం అంటారు.. ఈ చెత్త డంప్ యార్డులు ఎందుకు కట‌్ట‌డం జరిగింది అక్కడ జరుగుతున్నదేమిటి. అది పూర్తిగా నిర్దేశించిన పని జరుగుతుందా లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి లేదా....??  కెసిఆర్ సార్ బంగారు తెలంగాణ అంటాడు సార్ మాకు బంగారు తెలంగాణ అవసరం లేదు. మాకు స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు నీ బంగారు తెలంగాణలో...


నా తెలంగాణ ఇప్పుడు కాలుష్యానికి చిరునామా. 

కెసిఆర్ సారూ నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏

మీరు ఈ రాష్ట‌్రాన్ని బంగారు తెలంగాణ చేయకపోయిన పరవలేదు కానీ కాలుష్య తెలంగాణగా మాత్రం చేయకండి..


ఇక చివరగా ఒక మాట‌.. కెసిఆర్ సార్ చెప్పిన బంగారు తెలంగాణ ఎక్కడుందంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం హాయిగా ఆయన నివసిస్తున్నారు. సార్..... మీరు ముఖ్యమంత్రి అయ్యింది మీ కు‌టుంబం మాత్రమే హాయిగా ప్రశాంతంగా,ఆరోగ్యంగా జీవించడానికి కాదు. తెలంగాణ ప్రజలు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలి. దాన్ని అం‌టారు బంగారు తెలంగాణ అని.. నీ ఫామ్ హౌస్ పక్కన ఒక చెత్త డంపు యార్డ్ ఉండి ఊరి చెత్తనంతా అక్కడ వేసి తగలబెడితే తేలుస్తుంది మా బాధేమిటో. ఈ మాట‌ మీకు కోపం కలిగిస్తే, మాట‌ అన్నందుకే మీకు కోపం వస్తే మీరు గ్రామాల్లో కట‌్టించిన చెత్త డంపు యార్డుల   పొగ వల్ల నరకం అనుభవిస్తున్న మాకు ఎంత రావాలి మీపై కోపం..😠😠😠😠😠😠😠😠😠😠


ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి.  కొండలు తవ్వేయడం, పచ్చని పంట‌ పొలాల్లో కంపెనీలు,  వెంచర్లు వేయడం వలన పర్యావరణం నాశనం అవుతుంది.. ఇక ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటీ అవసరాలు తీర్చిన జంట‌ జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కాలుష్యం కాకుండా 111 జీవో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పడు కెసిఆర్ ప్రభుత్వం వచ్చింది కదా బంగారు తెలంగాణ చేయాలి కదా ... అందుకే కెసిఆర్ సార్ 111 జీవోను కూడా ఎత్తి పడేస్తా అని చెప్పాడు.. నాకు తెలుసి కెసిఆర్ సార్  తెలంగాణ రాష్ట‌్రాన్ని కాలుష్యంగా మార్చడానికే కంకణం కట‌్టుకున్నట్టున్నాడు..

ఈ రెండు జలాశయను కూడా హూస్సేన్ సాగర్ లాగా  సుగంధభరితమైన జలాశయాలుగా మార్చాలనుకుంటున్నాడు. సారూ మీరు బంగారు తెలంగాణ చేస్తాను అం‌టే ఈ విధంగా చేస్తావనుకోలేదు..

సారూ కెసిఆరూ ఇలాంటి బంగారు తెలంగాణ మాకు వద్దు..... నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏��











              






                 












          

25, నవంబర్ 2019, సోమవారం

జ్యూట్ బ్యాగులను వాడండి పర్యావరణాన్ని కాపాడండి.

   
జ్యూట్ బ్యాగ్
      
    నిత్యవసరసర వస్తువులకోసం  కిరాణస్టోర్, సూపర్ మార్కెట్ కి  వెళ్ళినప్పుడు అక్కడ మనకు వస్తువులను ప్లాస్టిక్ కవర్లో వేసి ఇస్తారు అదికూడా 5 రూపాయలు కవర్ కు ఛార్జ్ చేస్తారు. అలా మనం ఇంటికి తెచ్చిన ప్లాస్టిక్ కవర్ మళ్ళీ మార్కెట్ కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడదు. బయట పారేస్తాం ఇలా పారవేయడం వలన పర్యావరణానికి అది ఎంత నష్టమే మనకు తెలుసు .
  కాబట్టి  ఇలా ప్లాస్టిక్ కవర్లో వస్తువులు తీసుకురాకుండా ఇంటినుంచే జ్యూట్ బ్యాగులను మార్కెట్ కు తీసుకెళ్దాం. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కవర్ వాడటం మానేసి పర్యావరణానికి మేలు చేసిన వారమవుదాం దాంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి కవర్ కొనాలి అదే ఈ జ్యూట్ బ్యాగ్ ఒక్కసారి కొంటే సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మేం ఒక్కరం ప్లాస్టిక్ వాడటం మానేస్తే పర్యావరణం బాగుపడుతుందా అని అనుకోవచ్చు. ఒక్కరమే కదా అని అందరూ అనుకుంటే మార్పు రాదు. మార్పు అనేది మన నుండే ప్రారంభం కావాలి. ఒక్కటే కవర్ కదా అని పారేస్తే అది ఎక్కడో చోట తగలబడి కాలుష్యాన్ని వెదల్లుతుంది. అది మీదాక రాకుండా ఉండదు. 

               మీరు ఎప్పుడైనా నగర శివార్లలో గాని, పట్టణ శివారులో చూస్తే ప్లాస్టిక్ కవర్లను  పెద్ద పెద్ద గుట్టలుగా పోసి తగలబెడుతుంటారు. అక్కడ మనం ఒక్క క్షణమైన ఉండగలమా ఆ పొగకి ఉక్కిరిబిక్కిరి అవుతాం. అలాంటిది ఆ కలుషితమైన గాలిని రోజు పీల్చే ఆ ప్రాంతంలో నివసించే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి ఈ భూమిపై నివసించడానికి దేవుడు మనకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించి ఇచ్చాడు. అభివృద్ధి పేరుతో మనం దానిని నాశనం చేసి పీల్చేగాలి త్రాగే నీరు కలుషితం చేసి రోగాలబారిన పడేలా చేస్తున్నారు. కాబట్టి  ప్లాస్టిక్ కవర్ల వాడకం మానేసి పర్యావరణాన్ని కాపాడండి..

జ్యూట్ బ్యాగులను వాడండి ...

ఏమంటారు ఒకసారి ఆలోచించండి...🤔🤔

 జ్యూట్ బ్యాగులను ఇక్కడ క్లిక్ చేసి కొనండి..


24, అక్టోబర్ 2019, గురువారం

దోమల నివారణకు ఏం చేయాలి


దోమల నివారణ



        దోమల నివారణకు ఆల్ అవుట్,గుడ్ నైట్ వంటి లిక్విడ్ వెపరైజర్లు, జెట్ కాయిల్స్, దోమల అగరబత్తీలు వాడుతుంటాం వీటి వల్ల దోమలు రాకుండా ఉంటాయి కాని వీటి వాడకం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే  ఈ లిక్విడ్ వెపరైజర్లు ఖాళీ అయిపోయిన తర్వాత పారేస్తున్నారు వీటి వలన పర్యావరణం కాలుష్యం అవుతుంది.

 సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమలను నివారించాలంటే
మస్కిటో కిల్లర్ ట్రాప్ అనే చిన్న పరికరం సహాయంతో దోమలను నివారించవచ్చు.    దీనివలన
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైగా ఇవి ఇకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఇందులో పడ్డ దోమలు బయటికి వెళ్ళలేవు చనిపోతాయి.కాబట్టి వాటి సంఖ్య పెరగకుండా ఉంటుంది. లిక్విడ్ వెపరైజర్లు,కాయిల్స్,దోమల అగరబత్తీలు వాడటం వల్ల దోమలు రాకుండా ఉంటాయే తప్ప చనిపోవు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయి. మస్కిటో కిల్లర్ ట్రాప్ ను వాడితే
అవి దోమలను ఆకర్షించి చంపేస్తాయి. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి.



దోమల నివారణ







28, జూన్ 2019, శుక్రవారం

చెన్నైలో నీళ్ళ కరువుకు కారణం ఎవరు.

చెన్నై లో నీటి కరువుకు కారణం ఎవరు.





చెన్నై మెట్రోపాలిటన్ సిటీ దేశంలో నాలుగో పెద్ద నగరం. అలాగే పరిశ్రమలు కూడా ఎక్కువగానే ఉన్న నగరం. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అభివృద్ది చెందిన నగరం.  చెన్నైలో 2015 డిసెంబర్ లో వరదలు వచ్చాయి. అదే నగరంలో 2019 ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేక విలవిలలాడుతున్నారు జనం.
ఇప్పుడు చెన్నైలో
నీళ్ళ కంటే పెట్రోలే చవక.
ఒకప్పుడు వరదలు ఇప్పుడు నీళ్ళ కరువు దీనికి కారణం ఎవరు. ప్రభుత్వాలా? పాలకులా ? వీళ్ళెవరూ కాదు దీనికి కారణం ప్రజలు.  మనిషి ఆశకు హద్దుండదు విచ్చల విడిగా పర్యావరాణాన్ని నాశనం చేస్తున్నారు. నగరాల్లోనే ఎందుకు వరదలు వస్తాయి? గ్రామాల్లో రావెందుకు ?
 ఎందుకంటే నగారాలు కాంక్రీటు జంగల్లు ఎక్కడా కూడా చుక్క నీరు నిలవకుండా ప్రతీ అడుగు కాంక్రీటుతో కప్పేస్తున్నారు. ఇలాంటప్పుడు వర్షం పడితే నీరు ఎక్కడికి పోతుంది? కొంచెం వర్షం పడిన నీరు రోడ్లపైకి వస్తుంది. నాలాలు ఉన్న అక్రమ కట్టడాలతో వాటిని కూడా వదలట్లేదు. భారీ వర్షం కురిస్తే ఏమవుతుంది అటు భూమిలోకి ఇంకలేక,ఇటు డ్రైనేజీ వ్యవస్త లేక ఇళ్ళల్లోకే వస్తాయి. అప్పుడు వరదలొచ్చాయని గగ్గోలు పెడుతుంటారు. ప్రభుత్వాల మీద పడుతుంటారు చేతకాని ప్రభుత్వాలంటూ పాలకుల మీద ఎనలేని కోపం ప్రదర్శింస్తుంటారు. పాపం పాలకులు ఏం చేస్తారు  తమ ప్రభుత్వాలను కాపాడుకోవడంలో బిజీగా ఉంటాయి. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక ప్రభుత్వాలకెక్కడిది.
ప్రకృతి వైపరిత్యాలకు కారణం ప్రజలు. వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రజలకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాలి. ఇంకుడు గుంతలు ప్రతీ ఇంటిలో తప్పని సరి చేయాలి. నాలాలపై అక్రమణలను తొలగించాలి. డ్రైనేజీల్లో చెత్త వేయకుండ నివారించాలి. అప్పుడే నగారాల్లో వరదలు రాకుండా ఉంటాయి.

ఇప్పుడు కరువు గురించి చూద్దాం:

 నీళ్ళ కరువుకు కారణం ముఖ్య కారణం  కూడా ప్రజలే. నగరాల్లో ఏ ఇంటిలో చూసిన ఒక బోరు బావి తప్పని సరిగా ఉంటుంది. మన బోరు మన కరెంటు అని విచ్ఛలవిడిగా నీటిని తోడేస్తున్నారు.  భూగర్భ జలాలను అవసరం ఉన్నా లేకపోయిన బోరు బావుల నుండి నీటిని తోడి వృధా చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో ఒక బోరుబావి తప్పని సరిగా ఉంటుంది కాని ఏ ఒక్క ఇంటిలో కూడా ఇంకుడు గుంత ఉండదు. జనాలకు నీళ్ళు ఎలా వస్తాయో, ఎంత ఖర్చవుతుందో  కనీస అవగాహన లేదు. ఇక మున్సిపాలిటీ వారు అందించే కుళాయి నీళ్ళ గురించి చెప్పాలి. నేను హైదరాబాదులో ఒక కాలనీలో చూసాను అక్కడ రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. అన్ని డ్రమ్ములు, సంపులు, ట్యాంకులు నింపుకున్నాక ఇంకా నీరు వస్తుంది. అప్పుడు మనోళ్ళు ఊరుకుంటారా ఇంటి ముందు ఉన్న రోడ్డుమొత్తం కుళాయి నీటితో ఓ అరగంట కడిగేస్తారు. అలా ఒక్కరు కాదు కాలనీ మొత్తం ఇలాగే రోడ్లను కడిగేస్తారు నీళ్ళు వచ్చినప్పుడల్లా.. దీన్ని బట్టి అర్థమయ్యిందేమిటంటే జనాలకు  నీటి విలువ అస్సలు తెలియదని. అసలు నీళ్ళు మనకు ఎలా వస్తున్నాయి, ఎలా వాటిని వాడుకోవాలి, వృధా చేస్తే ఏమవుతుంది అని వారికి కనీస అవగాహన లేదు.

ప్రభుత్వాలకు కూడా ముందు చూపు ఉండాలి. ఇంత పెద్ద నగరానికి నీటి సరఫరా కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ముందు చూపు ఉండాలి. ఎండాకాలంలో నీటి అవసరాలను ఎలా తీర్చాలి అని ప్రణాలిక ఉండాలి. ఎండాకాలం వచ్చేసరికి అన్ని జలశయాలను ఊడ్చేస్తే ఏంటి ప్రయోజనం.
నీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పడే నీటి కరువు ఉండదు.

నీళ్ళ కరువు రాకుండా ఉండాలంటే :

* ప్రతీ ఇంటిలో తప్పని సరిగా ఇంకుడు గుంత ఉండాలి.
* ప్రతీ ఇంటిలో బోరుబావులు తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వకూడదు.
* నీటిని వృధా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
*  విరివిగా మొక్కలు నాటాలి.
* నీటి పొదుపు గురించి అవగాహన కల్పించాలి.
* నీటిని ఎక్కువగా వినియోగించే బీరు, కూల్ డ్రింక్ లాంటి పరిశ్రమలను మూసివేయాలి.
*  మనిషికి ప్రాణాధారం అయిన నీటికంటే బీర్లు, కూల్ డ్రింకులు అవసరమా చెప్పండి.

ప్రజలకు పర్యావరణం పట్ల కనీస అవగాహన ఉండాలి లేకుంటే ముందు ముందు చుక్క నీరు కూడా దొరకదు..


16, మే 2019, గురువారం

ఇనుప రేకుల ఇళ్ళు

   

   ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. బయట తిరగలేం ఇంట్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతాం. ఇంట్లో ఏసీలు,  ఫ్యాన్ లు, కూలర్ లు ఆన్ చేసుకుని హాయిగా ఉంటాం. కాని అవి అందరికి సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్ళు కాంక్రీట్ తో నిర్మించినది కావు ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు ఇళ్ళను వివిధ రకాలుగా నిర్మించుకుంటారు. అప్పట్లో ఇళ్ళు తాటాకులతో గడ్డితో నిర్మించేవారు కొందరు నాపరాయితో ఇళ్ళ పైకప్పులు నిర్మించేవారు.  కొందరు  మిద్దెలు నిర్మించేవారు.ఈ ఇళ్ళల్లో ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది. మరియు అన్ని కాలాలకు అనుకూలంగా ఉండేవి.కాలక్రమేణ ఇలాంటి ఇళ్ళు మాయమైపోతున్నాయి. అందరు కాంక్రీట్ ఇళ్ళనే నిర్మించుకుంటున్నారు. కాంక్రీట్ ఇళ్ళు నిర్మించుకునే స్థోమతలేని వారు రేకులతో ఇంటి పైకప్పు నిర్మించుకుంటున్నారు.

  ఈ రేకుల ఇండ్లను కొందరు సింమెంటు రేకులతో నిర్మించుకుంటే మరికొందరు ఇనుప రేకులతో నిర్మించుకుంటున్నారు. కొంతవరకు సిమెంట్ రేకులు నయం కాని ఇనుపరేకుల ఇండ్లల్లో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు కూడా ఈ ఇనుప రేకుల ఇళ్ళళ్ళో పనిచేయవు. ఎందుకంటే ఈ రేకులతో నిర్మించిన ఇళ్ళు ఏ కాలానికి అనుకూలంగా ఉండవు. మొగలి రేకులు అనే సీరియల్ ను లక్షా ఎపిసోడ్ లు చూస్తాం కాని ఇనుప రేకుల ఇళ్ళళ్ళో ఒక్కరోజు కూడా ఉండలేం.

ఇనుప రేకులు అన్ని కాలాల వాతావరణాన్ని రెట్టింపు చేసి అందులో నివసించే వారికి చుక్కలేం ఖర్మ పాలపుతలను కూడా టెలిస్కోప్ లేకుండా చూపిస్తుంది.

ఎండాకాలంలో బయటి కంటే కూడా వేడి ఎక్కువగా ఉంటుంది.

బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే లోపల 45 డిగ్రీలు ఉంటుంది.

ఇక ఫ్యాన్ వేసుకుంటే బోనస్ గా మరో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి టోటల్ గా 50 డిగ్రీలవుతుంది.

 వానాకాలంలో వర్షం పడుతుంటే భారి శబ్ధంతో ఏమి వినపడదు.

5 సెం.మీ. వర్షం పడితే లోపల మాత్రం 20 సెం.మీ. వర్షం కురిసినంత శబ్ధం వస్తుంది.

ఇక చలికాలంలో అయితే బయట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటే లోపల 10 డిగ్రీలు ఉంటుంది.

 సాదారణంగా చలికాలంలో మంచుకురుస్తుంది.
ఇనుప రేకుల ఇళ్ళల్లో మాత్రం పైనుండి చల్లని నీళ్ళు కురుస్తుంటాయి. ఇళ్ళంతా వర్షం పడుతున్నట్టు ఉంటుంది.

ఏమని చెప్పాలండీ ఇనుపరేకుల ఇళ్ళల్లో నివసించేవారి బాధలు ఏ కాలానికి కూడా ఈ రేకులు పనికి రావు పైగా ఆ కాలంలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. అందరికి నేను చెప్పేది ఏంటంటే  వీలుంటె కాంక్రీటుతో ఇళ్ళు నిర్మించుకోండి అంత స్థోమతలేని వారు కనీసం తాటాకులతోనైనా ఇళ్ళు నిర్మించుకోండి అంతేకాని ఇనుప రేకులతో నిర్మించుకోవద్దు. ఎందుకంటే ఇనుపరేకులు అన్నికాలాలకునకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

 ఎండాకాలంలో వేడిని రెట్టింపు చేస్తుంది.
వానాకాలంలో వాన శబ్ధాన్ని రెట్టింపు చేస్తుంది.
చలికాలంలో చలిని రెట్టింపు చేస్తుంది.

ఎందుకు ఈ రేకులను పైకప్పుగా వేసుకున్నామా అనిపిస్తుంది.
దీనికంటే గడ్డితో కప్పుకున్న గుడిసే ఇళ్ళు 100 రెట్లు నయం. ఎందుకంటే గుడిసెలో ఏ కాలంలో అయిన మనకు అనుకూలంగా ఉంటుంది. గుడిసె అని చిన్న చూపు చూస్తారుగాని ఇవి అన్ని కాలాలకు అనుకులం పర్యావరణ హితంగా ఉంటాయి.

ఇనుప రేకుల ఇళ్ళతో ఇన్ని అవస్థలు పడేకంటే సిమెంటు రేకులు వేయవచ్చు కదా అంటే సిమెంట్ రేకులంటే భయం. ఎందుకంటే ఎవరైన ఇంటిమీద రాళ్ళేస్తారని భయం. అందుకే ఎంత అసౌకర్యంగా ఉన్నా ఇనుప రేకులతోనే ఇంటి పైకప్పు నిర్మించుకుంటున్నారు.

                మరి ఇనుప రేకుల ఇళ్ళళ్ళో ఇన్ని అసౌకర్యాలు భరిస్తూ ఉండాల్సిందేనా దీనికి  పరిష్కారం లేదా అంటే ఉంది. అదేలాగంటే థర్మకోల్ సీలింగ్. ఈ థర్మకోల్ సీలింగ్ ని ఇంట్లో బిగించుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎండా,వానా,చలి కాలాలలో ఎలాంటి ఇబ్బందిలేకుండా రేకుల ఇంట్లో ఉండొచ్చు. దీనివల్ల ఇళ్ళు అందంగాను ఉంటుంది.
దీనిని తక్కువ ఖర్చుతో మనమే ఇంట్లో బిగించుకోవచ్చు.




28, ఫిబ్రవరి 2019, గురువారం

విందు భోజనాలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు

       
       విందు భోజనాలతో పర్యావరణ కాలుష్యం ఎలా ఏర్పడుతుంది అనుకుంటున్నారా.!! విందులో వాడే పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులతో పర్యవరణాన్ని కలుషితం చేస్తున్నారు.
 
     ఒకప్ఫుడు మోదుగ ఆకులతో తయారు చేసిన ఇస్తారాకులలో మరియు అరటి ఆకుల్లో వడ్డించేవారు. ఇవి కొన్ని రోజుల తర్వాత భూమిలో కలిసిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. కాని ప్లాస్టిక్ పేపర్ భూమిలో కలిసిపోవడాని ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. వీటిని తగలబెడితే పొగవల్ల గాలి కలుషితం అవుతుంది. డ్రైనేజీల్లో పారేస్తుంటారు అలా వర్షాకాలం వచ్చేసరికి నీరు కలుషితం అవుతుంది. అన్ని రకాలుగా కలుషితమే.

          ఇప్పుడు ఏ ఫంక్షన్ లో చూసిన పేపర్ ప్లేట్లు దర్శనమిస్తాయి. పెళ్ళిళ్ళు మొదలు చిన్న చిన్న ఫంక్షన్ల వరకు అందరూ వీటినే వాడుతున్నారు. పేపర్ ప్లేట్లు పేపరే అయిన పైన ఒక పొర మాత్రం ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. వేడి వేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లో తినవద్దని అందరికి తెలిసిన విషయమే అయిన సరే వాటినే ఉపయోగిస్తారు. వాటిని రిసైకిల్ పేపర్ తో తయారు చేస్తారు కాబట్టి దుర్వాసన కూడా వస్తుంటాయి కానీ వాటినే వాడుతుంటారు.వాటితో పాటు ప్లాస్టిక్ గ్లాసులను కూడా విచ్చలవిడిగా వాడుతుంటారు ఒకరు రెండు మూడు గ్లాసుల చొప్పున వృధా చేస్తుంటారు. తిన్న తర్వాత డ్రైనేజిల్లో వేస్తుంటారు. కొందరైతే కుప్పగా పోసి కాల్చేస్తుంటారు. అలా కాలుష్యాన్ని మరింత పెంచుతుంటారు. చదువుకోని వాళ్ళు తెలియక చేస్తుంటారు మరీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఇలా చేస్తే పర్యావరణానికి హానికరం అని చెప్పరు. కొంచెం కూడా పర్యావరణ స్పృహ లేని చదువులెందుకు. పర్యావరణ పరిరక్షణ భాద్యత ఎవరికి లేదు.

   ..  పేపర్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లు లేదా పింగాణీ ప్లేట్లు వాడాలి. ఇప్పుడు చాలా కార్పోరేట్ కంపెనీలు తమ సంస్థల్లో స్టీల్ ప్లేట్లనే ఉపయోగిస్తున్నారు. వీటిని కడగడానికి యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని కడిగేందుకు వేడి నీరు కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే ప్లాస్టిక్ గ్లాసులకి బదులు రాగి గ్లాసులు వాడండి పెళ్ళిలో రిచ్ గా ఉంటుంది. కుదరకపోతే టప్పర్ వేర్ ప్లాస్టిక్ గ్లాసులను వాడండి. వీటిని కూడా వేడి నీటితో శుభ్రపరుస్తారు కాబట్టి ఏ సమస్యలుండవు.

     ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు విందుభోజనం అంటే అందరూ నేలమీద కూర్చుని తృప్తిగా భోజనం చేసేవారు. వడ్డించేవారు అటు ఇటు తిరిగి వడ్డించేవారు. ఈ రోజుల్లో నిలబడి తినడం  ఫ్యాషనయిపోయింది. వడ్డించేవారు ఒకదగ్గర నిలబడి వడ్డిస్తున్నారు తినేవారు అటుఇటు తిరుగుతు తింటున్నారు. భోజనం చేసేటప్పుడు నిలబడి తినవచ్చా. పద్దతిగా కూర్చుని తినవచ్చుగా .? అంత ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేస్తారు భోజనానికి మాత్రం కూర్చుని తినే ఏర్పాటు చేయలేరా.?

   ఇప్పటికైనా ఆలోచించండి ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులను వాడడం మానేద్దాం. స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం.

అలాగే విందుభోజనం కూడా కూర్చుని తిందాం.

 మార్పు అనేది మన నుండే ప్రారంబిద్దాం మనం చేసి చూపుదాం ఇతరులు కూడా మనను చూసి మారుతారు.

17, నవంబర్ 2018, శనివారం

మార్పు ఆరంభం

                       

                      పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలిగే ముప్పు అంత ఇంత కాదు అన్ని విదాలుగా కాలుష్యం కలిగించే ప్లాస్టక్ ను నిషేదించాలని నేను ఎన్నో రోజులుగా ఆకాంక్షిస్తున్నాను.
 ఇప్పుడిప్పుడే పాలకులు దీనిపై దృష్టి సారించినట్టున్నారు
ఈ రోజు మా మున్సిపాలిటీలో నోటీసు లు అందజేసారు.






          ప్లాస్టిక్ నిషేదాన్ని కఠినంగా  అమలు చేస్తారా లేదా కేవలం కాగితాలకే పరిమితం అవుతుందో చూడాలి.
        ఏది ఏమైనా  పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పు నుండి కాపాడే మార్పు ఆరంభం అయ్యిందని సంతోషిస్తున్నాను.

     ఇలా ప్రతీచోట ప్లాస్టిక్ నిషేదాన్ని అమలు పరచాలని కోరుకుంటున్నాను.
     కొంచెం బద్దకాన్ని వదిలి ప్రతీ ఒక్కరు ఇంటినుండి బజారుకి  కూరగాయలకి, కిరాణ కొట్టుకి వెళ్ళేటప్పుడు చేతిసంచులు తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదు.

   "ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేదిద్దాం                                                                    పర్యావరణాన్ని కాపాడుదాం"

20, ఆగస్టు 2018, సోమవారం

మొక్కలు నాటుదాం

   
  చెట్లు ప్రగతికి మెట్లు. అంతెకాదు మన జీవనాధారం చెట్లు లేనిదే మనిషి మనుగడ లేదు. ప్రాణవాయువును ప్రసాదించేది ఈ చెట్లే. మరియు కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని మనకు ఆక్సీజన్ ప్రసాదిస్తాయి.
అనేక రకాల పండ్లు,పువ్వులు, ఔషదాలు మనకు ప్రసాదిస్తాయి ఈ కల్పవృక్షాలు ఇలా అనేక రకాలుగా మనకు ఉపయోగపడే చెట్లను అభివృద్ది పేరిట నరికేస్తుఉన్నారు.
మనిషి వల్ల చెట్లకు ఏ ఉపయోగం లేదు కాని చెట్ల వల్లె మనిషి బ్రతుకుతున్నాడు. చెట్లు లేకుంటే మనిషే లేడు.

      అభివృద్ది పేరిట అడవులను నాశనం చేస్తున్నారు. కొండలను తొలచి క్వారీలుగా మార్చి అపురూపమైన వృక్షసంపదను నాశనం చేసి పచ్చని ప్రకృతిని వికృతంగా మార్చేస్తున్నారు. కొందరి స్వార్థపరుల అత్యాశ మూలంగా పచ్చని పర్యావరణాన్నీ నాశనం చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు అక్కడి ప్రజల జీవినాన్నీ దుర్భరం చేస్తున్నారు.

     పర్యావరణం ఎప్పుడు సమతుల్యంగ ఉంటేనే అంతా బావుంటుంది. అడవులను నాశనం చేసి కొండలను తవ్వేసి ఇష్టారాజ్యంగా ప్రకృతిని నాశనం చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అతివృష్టి అనావృష్టి లాంటి విపత్తులు ఎదుర్కోవలసి వస్తుంది.

      ఈ భూమి మీద మానవుడు బ్రతకడానికి అన్నీ విదాలుగా అనుకూలంగా ఉంది. మరే ఇతర గ్రహం మీద మానవుడు జీవించలేడు. ఈ భూమిపై ఉన్న సౌకర్యాలు ఏ గ్రహం మీద లేవు కనీసం నీరు కూడా లేదు. మనకు ఇన్నీ విదాలుగా మన మనుగడకు తోడ్పడే భూమిని మనం ఏం చేస్తున్నాం చేజేతులారా నాశనం చేస్తున్నాం. కొందరి అత్యాశల వల్ల ధన దాహం వల్ల ప్రకృతిని నాశనం చేసి పర్యావరణాన్నీ అసతుల్యం చేసి భూగ్రహంపై కూడా మనిషి జీవనానికి ప్రమాదకరంగా మరే రోజులు ఎంతో దూరంలో లేవు.

అభివృద్ది అనేది అవసరమే కాని పర్యావరణ సమతుల్యత అనేది ఎంతో ముఖ్యం.

       అభివృద్ది అంటే ఒక దగ్గర పచ్చని ప్రకృతిని నాశనం చేసి మరో చోట  ఎత్తైన భవనాలు నిర్మించడం కాదు. పర్యావరణాన్నీ సమతులంగా ఉంచడం. అంటే ఒక చెట్టును కొట్టేస్తే రెండు చెట్లు నాటాలి, వాటిని పెద్దగా అయ్యేవరకు కాపాడాలి.

       నేడు కోట్లాది వాహనాలు,ఫ్యాక్టరీల వల్ల విపరీతమైన గాలి కాలుష్యం పెరిగిపోయింది. ప్రధాన నగరాలల్లో గాలి కాలుష్యం మరి ఎక్కవ పీల్చే గాలి కూడా కరువే అక్కడ.
ఇప్పటికే మనం నీటిని కొనుక్కోని తాగుతున్నాం ముందు ముందు గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చినా ఆశ్చ్యర్య పోవలసిన అవసరం లేదు. ప్రకృతి ప్రసాదించిన నీరు గాలి ఎక్కడైనా ఉచితంగా లభించాలి కాని ఇప్పుడు కొనుక్కోవలసి వస్తుంది. ముందు ముందు ఇంకా దారుణంగా ఉంటుందేమో.

      మనిషి బ్రతకడానికి అన్నివిదాలుగా ప్రకృతి ఉంది. కానీ అత్యాశకు మాత్రం ఎంత ఉన్నా సరిపోదు.

      . మనిషి వల్ల ప్రకృతికి ఎలాంటి ఉపయోగం లేదు కాని ప్రకృతి వల్లే మనిషి బ్రతుకుతున్నాడు. అది తెలిసి కూడా తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా వుంటుందో మనకు తెలుసు ..



           కాబట్టి  పర్యావరణాన్నీ నాశనం చేయకుండా వీలైనన్నీ మొక్కలు నాటీ ప్రకృతిని కాపాడుదాం ఆనందంగా జీవిద్దాం.

     ఒక మొక్క నాటండి దానికి నీరు పోసి కొంచెం పేడ కాని వీలయితే కంపోస్టు ఎరువు వేసి చూడండి అది పూల మొక్క లేదా పండ్ల మొక్క కానివండి కొన్ని రోజుల తర్వాత వాటికి పూలు పండ్లు కాస్తుంటే అ ఆనందం మాటల్లో చెప్పలేనిది. 

దయచేసి ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండి పర్యావరణాన్నీ కాపాడండీ...


13, జులై 2018, శుక్రవారం

విశ్వనగరంలో మూసీనది

హైదరాబాద్ నాలుగువందల ఏళ్ళ చారిత్రక నగరం. మనం ఇప్పుడు విశ్వనగరం అంటున్నాం నిజంగా హైదరాబాద్ విశ్వనగరమేనా?? శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరం అంతకంటే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టించే నగరం.

ఒకప్పుడు గోదావరిలా స్వచ్ఛమైన నీరు ప్రవహించే మూసీ నది ఇప్పుడు ఒక పేద్ద మురికి కాలువలా తయారయింది
ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు ప్రవహించేదంటే ఆశ్ఛ్యర్యం కలుగక మానదు. హైదరాబాద్ లో మూసి నది అంటే భరించలేనంత కంపు అటువైపు వెళ్ళాలంటే ఓకింత సాహసం చేయాల్సిందే. విశ్వనగరంలో నదులు  ఇలా ఉంటాయా???

ఇతర దేశాల్లో పెధ్ద నగరాల్లో ప్రవహించే నదులు ఎంత ఆహ్లాదకరంగా అందంగా స్వచ్ఛంగా ఉంటాయో చూడండి
మరి మన నగరంలో ఏంటీ దుస్థితి దీనికి కా‌రణం ఎవరంటే 99‌% ప్రజలే..... విఛ్ఛలవిడిగా కాలుష్యకారకాలను నదిలో పడేసి మురికి కూపంలా మార్చారు మన ఇల్లు ఒకటే శుభ్రంగా ఉంటే సరిపోద్ది అనే దోరణిలో విశ్వనగర ప్రజలు ఉన్నారు ఇక్కడ గోదావరి ప్రవహించిన కేవలం ఒక వారంలో మురికి కూపంలా మార్చేస్తారు.

ప్రపంచంలో వివిధ దేశాలలో ఉండే నగరాలలో నదులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చూడండి..

నది                            నగరం             దేశం

థేమ్స్                         లండన్            బ్రిటన్
టైబర్                         రోమ్               ఇటలీ
లాస్ ఎంజిల్               లాస్ ఎంజిల్    అమెరికా
చార్లెస్                        బోస్టన్             అమెరికా
బ్రిస్బేన్                        బ్రిస్బేన్            ఆస్ట్రేలియా
కెలాని                         కొలంబో          శ్రీలంక
ఊక                           యోకోహామ     జపాన్
వియన్నా                    దనుబే            ఆస్ట్రియా
పియర్ల్                       హాంగ్ కాంగ్      చైనా
పొటొమాక్                  వాషింగ్టన్         అమెరికా



ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నదులే ఉన్నాయి వాటిలో ఎక్కడ కూడా కాలుష్యం అనేదే కనిపించదు.
అక్కడి ప్రజలు ఎంత అదృష్ట వంతులో కదా.
వీటిలో మనకంటే అబివృద్ది చెందిన నగరాలే ఉన్నాయి మరి ఇంత కాలుష్యం అక్కడ లేదే?? అదేలా సాద్యం??? అది అక్కడి ప్రజల పరిసరాల పరిశుభ్రతపై ఉన్న అవగాహన ..  మరి మనకు ఎందుకు లేదు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు అంటారు ప్రజల సహకారం లేనిదే ప్రభుత్వాలు ఎంత చేసిన ఫలితం శూన్యం ..

మన బాధ్యతగా చెత్తను మూసీలో వేయకుండా నివారిద్దాం.ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త కుండీల్లోనే వేద్దాం.  అప్పుడే స్వఛ్ఛ హైదరాబాద్ సాద్యం.
మూసీ నది హైదరాబాద్ కు మరో మణిహారం అవుతుంది..

ఒక్క సారి ఊహించండి ..... మూసీ నదిలో స్వఛ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది అందులో చిన్న చిన్న పడవలు,బోట్లు విహరిస్తూ ఉంటే అందులో మనం ప్రయాణిస్తూ ఉంటే మరో థేమ్స్ నదిలా ఉంటుంది కదా!!???
ఈ ఊహ ఎప్పుడు నిజమయ్యేనో వేచి చూద్దాం...

7, జులై 2018, శనివారం

పర్యావరణం నుండి ప్లాస్టిక్ ను తరిమేద్దాం

తెలుగు వారందరికి నమస్కారం

పర్యావరణానికి హాని కలిగించే వాటిలో ప్లాస్టిక్ ముందు వరుసలో ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ని వాడేస్తున్నం. ఉదయం కూరగాయలు,పాలు ఏవస్తువు కొనన్న ప్లాస్టక్ లేనిదే మన ఇంటి వరకు రాదు.
వీధుల్లో ‌‌,రోడ్ల వెంబడి బజార్లు ఎక్కడ చూసిన ప్లాస్టిక్ దర్శనమిస్తుంది.
అవసరం లేకున్నా ప్లాస్టిక్ వాడేస్తాం!
దానివల్ల అనర్థాలు తెలిసిన వాడేస్తూనే ఉంటాం.
చదువుకోని వాళ్ళు అంటే తెలియక చేస్తారు‌,
చదువుకున్న వాళ్ళు కూడానా.
పది మందికి ప్లాస్టిక్ పై అవగాహనశ కల్పించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడండి.
ఉదయం లేవగానే కూరగాయల మార్కెట్ వెళ్తాం సంచి తీసుకెళ్ళం లేక కాదు ఉన్నా తీసుకెళ్ళం. ఎలాగు ఓ పది ప్లాస్టిక్ కవర్లు ఇంటికి రావాలి లేక పోతే నిద్ర పట్టదు.
తర్వాత పాలు, పెరుగు,పప్పులు ఉప్పులు అన్నీ ను ప్లాస్టిక్ లో తేవలసిందే ఎందుకంటే పర్యావరాణాన్నీ నాశనం చేయాలి కదా.

వాడిన కవర్లు చెత్త బుట్టీలో వేయం ‌రోడ్డు పైనే పారేస్తొం మన ఇళ్ళు శుభ్రంగి ఉంటే చాలు పర్యావరణం నాశనం ఐతే నాకేంటీ అంటారు..

అవి వెల్లి డ్రైనేజీలో అడ్డుపడి రోడ్లన్నీ జలమయం ఇళ్ళల్లోకి నీరు చేరడం ప్రభుత్వాన్నీ తిట్టుకోవడం మీరు చేసిన పనికి ప్రభుత్వాన్నీ నిందిస్తారు.

ఒక సారి ఆలోచించండి వీలైనంతవరకు ప్లాస్టిక్ ని తగ్గించండి ప్లాస్టిక్ లేని సమాజాం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆలోచించండి.

ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు:

ఇది భూమిలో కలిసిపోడానికి వేల సంవత్సరాాలు పడుతుంది
డ్రైనేజీలలో అడ్డుపడి వరదలకు తద్వార రోగాలకు కారణమవుతుంది.
ప్లాస్టిక్ ను తగలబెట్టడం వల్ల విషవాయువులు వెలువడి శ్వాసకోశ,చర్మ,క్యాన్సర్ ఇంకా అనేక వ్యాదులకు కారణమవుతుంది.
పర్యావరణం దెబ్బతింటుంది
మిగిలిపోయిన ఆహారపదార్థాలు కవర్లలో చుట్టి పారవేయడం వాటిని తిన్న జంతువులు చనిపోవడం
రాగి కంచాలు రాగి చెంబులు మర్చిపోయాం ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ బాటిల్సనే వాడుతున్నాం చవకగా వస్తున్నాయని వీటీనే వాడుతున్నాం అనారోగ్యాన్నీ కొని తెచ్చుకుంటున్నాం.

కాబట్టి ప్లాస్టిక్ ని పారద్రోలదాం పర్యావరణాన్నీ కాపాడుకుందాం .

ప్లాస్టిక్ ను నివారింంచే మార్గాలు:

కూరగాయలకి , పండ్లు కొనడానికి వెళ్ళేటపుడు చేతి సంచి తీసుకెళ్ళాలి.
ఆహార పదార్థాలు ఇడ్లీ,దోశ లాంటి పదార్థాలు పార్శిల్ తెచ్చేటపుడు స్టీల్ గిన్నెలు తీసుకెళ్ళాలి.
ప్లాస్టిక్ నీళ్ళ బాటీల్ కి బదులు రాగి బాటిల్ వాడాలి..
పెపర్ ప్లేట్లకి బదులు స్టీల్ గిన్నెలు వాడాలి.
ప్రతీచోట ప్లాస్టిక్ అవసరాన్ని తగ్గించాలి.
స్కూల్లల్లో పిల్లలకి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించి అవగాహణ కల్పించి ప్లాస్టిక్ ను ముందు తరాలు వాడకుండా నియంత్రిద్దాం.

మొక్కలు నాటుదాం పర్యావరణాన్నీ సమతుల్యం చేద్దాం.

నా ఒక్కడి వల్ల ఏం అవుతుంది అనుకోవద్దు ఒక్క అడుగు పడితేనే వేయి అడుగులు నడవగలం.
మార్పు అనేది ఒక్కడితోనే ఆరంభం అవుతుంది.

పచ్చని ప్రకృతితో చాలా అందంగా ఉండే దేశాలు మనం సినిమాలలో చూస్తూ ఉంటాం మనకు అలాంటి ప్రదేశాలలో ఉండాలనిపిస్తుంది అవేవి కూడా ఆకాశం నుండి ఊడిపడలేదు ఆ దేశ ప్రజల పర్యావరణ ప్రేమ.

మనం కూడా అలాంటి ప్రదేశాలను సృష్టించవచ్చు మొక్కలు నాటి. నార్వే,స్వీడన్ లాంటి దేశాల సరసన చేరుదాం.
మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ ను తరిమేద్దాం పర్యావారణం కాపాడుదాం.