భానోదయం: 2020

3, డిసెంబర్ 2020, గురువారం

మనదేశం ఎప్పుడు పరిశుభ్రంగా తయారవుతుంది.?

మనదేశం ఎప్పుడు పరిశుభ్రంగా మారుతుంది? కొన్ని దేశాలలో పరిశుభ్రత చూస్తే ఎంత బాగుంటుందంటే మన ఇళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ రాహాదారులు, అన్ని ప్రాంతాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఉదాహరణకి జపాన్ లో పరిశుభ్రత చూస్తే ఔరా అనిపిస్తుంది. అక్కడ రోడ్లపైనా భూతద్దం పెట్టి చూసినా ఎక్కడ చెత్త కనిపించదట.జపాన్ అంత పరిశుభ్రంగా ఉండడానికి కారణం అక్కడి ప్రజలు. వారు పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ద వహిస్తారు. రోడ్లపైనా కాని ఇతర ఏ ప్రదేశాలలో చెత్తను పారేయరు.ఎక్కడ డస్ట్ బిన్ ఉంటే అక్కడే వేస్తారు. బయట ఎక్కడ డస్ట్ బిన్ లేకుంటే తమ దగ్గర ఏదైనా చెత్త ఉంటే దానిని తమ ఇంటి వరకు తీసుకెళ్ళి చెత్త బుట్టలో వేస్తారే తప్ప ఈ చెత్తను ఇంటి వరకు ఎవరు తీసుకెళ్తారని ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళరు. ఇంత క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా అక్కడి ప్రజలు వ్యవహరిస్తారు కాబట్టి జపాన్ అంత పరిశుభ్రంగా ఉంటుంది. వీరికి ఇంత క్రమశిక్షణ, బాధ్యత ఎలా ఏర్పడిందంటే అక్కడి పాఠశాలల్లో పిల్లలకు పరిశుభ్రత గురించి బోధిస్తారు. అలాగే ఆ పిల్లల చేత క్లాస్ రూమ్స్ క్లీన్ చేయిస్తారు. ఇలా చిన్నప్పటి నుండి పిల్లల చేత చేయించడం వల్ల పెద్దయ్యాక వారికి పరిశుభ్రత ఒక అలవాటుగా మారుతుంది. అక్కడి నాయకులు, క్రీడాకారులు కూడా వారు ఉండే ప్రాంతాలను, క్రీడా మైదానా లను స్వయంగా శుభ్రపరుసరుస్తారు. కొన్ని స్వఛ్చంద సంస్థలు పరిశుభ్రత కోసం పనిచేస్తుంటాయి. ఇలా అందరి సమిష్టి కృషి వల్ల జపాన్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది. మనదేశం కూడా జపాన్ లా పరిశుభ్రంగా ఎప్పుడు మారుతుంది అంటే మారదనే చెప్పాలి. ఎందుకంటే మనదేశంలో ఎవ్వరికి పరిశుభ్రత పట్ల అవగాహన ఉండదు. పరిశుభ్రత అంటే అందరిని రోడ్లపైకి వచ్చి చెత్తను ఊడ్చమని చెప్పట్లేదు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుంటే చాలు పరిశుభ్రంగా ఉంటుంది. మనదేశం ఇంత అపరిశుభ్రంగా ఉండటానికి కారణం మన ప్రజలు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారేస్తుంటారు. ఉదాహరణకి మనలో చాలా మంది బిస్కెట్ ప్యాకెట్టో, చాక్లెట్ , చిప్స్ ప్యాకెట్టో కొంటారు అవి తిన్న తరువాత అక్కడ డస్ట్ బిన్ ఉన్నా సరే అందులో వేయరు. ఇష్టం వచ్చినట్టు బయట పారేస్తుంటారు. వారికి డస్ట్ బిన్ వద్దకు వెళ్ళే ఓపిక ఉండదు. ఇలా చిన్న చిన్న చిప్ప్ ప్యాకెట్సే కాదు నీళ్ళ బాటిళ్ళు కూల్ డ్రింక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ క్యారీబ్యాగులు ఇలా ఎలాంటి చెత్త అయినా సరే రోడ్లమీద పారవేస్తుంటారు. ఇలా చెత్త ఒక్కటే కాదు పాన్,గుట్కాలు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తుంటారు. ఇళ్ళల్లోని చెత్తను బయట పారబోస్తారు. ఇలాంటి చెత్త మనుషుల వల్లే మన పట్టణాలు, నగరాలు ఇంత చెత్తగా తయారయ్యాయి. ఇప్పడు తడి చెత్త పొడి చెత్త అని అవగాహన కల్పిస్తున్నా దాన్ని ఎవ్వరు పాటించటం లేదు. ఇంటింటికి చెత్త సేకరించి రీసైకిల్ చేయకుండా తగలబెడ్తున్నారు. దీని వల్ల గాలి కాలుష్యం ఏర్పడుంది. దీనిని ఎవరు పట్టించుకోరు. పరిసరాలను చెత్తగా చేయడం మన హక్కు అని మనప్రజలు భావిస్తారు అందుకే మన గ్రామాలు, పట్టణాలు, నగరాలు చెత్తగా, కాలుష్యమయంగా ఉంటాయి. మన దేశం పరిశుభ్రంగా ఉండటం అనేది ఓ కల.

30, ఆగస్టు 2020, ఆదివారం

నాకు నచ్చిన రెండు కామెడి సినిమాలు. ఈ సినిమాలు చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.

సినిమాలు చూసి చాలా రోజులయ్యింది కొత్త సినిమాల విడుదల ఈ సంవత్సరం లేనట్టే. ఒకవేళ విడుదల అయిన థియేటర్ వరకు వెళ్ళి సినిమాలు చూసే సాహసం అయితే చేయలేం. కొన్ని సినిమాలు OTTలో విడుదల అవుతున్నాయి. సినిమాలు చూసే వారంతా ఇప్పుడు OTT లోనే చూస్తున్నారు. ఇంతకు ముందు కూడా థియేటర్ లో సినిమాలు చూడటం జనాలు తగ్గించేసారు. ఏదైనా పెద్ద సినిమా లేదా మంచి సినిమా వస్తే థియేటర్ లో చూస్తున్నారు. ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమానా కాదు మంచి కథ ఉంటే చాలు సినిమా చుడటానికి. అలాగే ఆ సినిమా పాతదా కొత్తదా కాదు ఆ సినిమాలో కథే ముఖ్యం. మన తెలుగులో ప్రతీవారం ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యేది వీకెండ్ లో ఎంటర్టైన్ మెంట్ కోసం చాలామంది ఆ సినిమాలు చూసేవారు. ఇప్పట్లో సినిమాలు రిలీజ్ అవ్వవు కాబట్టి పాత సినిమాలే చూడాలి. ఇక్కడ పాత కొత్త ముఖ్యం కాదు కథే ముఖ్యం. అలాగే ఎంటర్టైధ్ మెంట్ ముఖ్యం. సినిమా బోర్ కొట్టకుండా పూర్తిగా చూసే విధంగా ఉండాలి. అలా మంచి కథ, కాలక్షేపంతో పాటు కడుపుబ్బా నవ్వించే రెండు సినిమాల గురించి చెబుతాను. నాకు కామెడి సినిమాలంటె చాలా ఇష్టం. కామెడి సినిమాలంటే ఒకప్పడు "నటకిరీటి" రాజేంద్రప్రసాద్ గారు గుర్తొచ్చేవారు. తన హాస్యభరితమైన నటనతో పేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. రాజేంద్రప్రసాద్ గారి సినిమా అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారంటీ. ఆయన సినిమాలంటే అందరికి ఇష్టమే. ప్రజలనుండి, ప్రదానమంత్రి వరకు రాజేంద్రుడి హాస్య నటనను ఆయన సినిమాలను అమితంగా ఇష్టపడేవారు. అప్పట్లో మనదేశ ప్రధాని పి.వి. నరసింహారావు గారు రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూసేవారట. చూసారా హాస్యభరితమైన చిత్రాలంటే అందరికి ఇష్టమే. అప్పట్లో కామెడి మూవీస్ అంటే రాజేంద్రప్రసాద్ గుర్తొస్తే ఇప్పుడు అల్లరి నరేష్ గుర్తొస్తారు. నాకు బాగా రెండు కామెడి మూవీస్ గురించి చెప్తాను. అందులో ఒకటి అల్లరి నరేష్ సినిమా అయితే మరొకటి కొత్త హీరోది. ముందుగా అల్లరి నరేష్ సినిమా గురించి చెప్తాను. అల్లరి నరేష్ సినిమాలంటే చాలా కామెడిగా ఉంటాయి. ఆయన నటించిన సినిమాలలో చాలా నవ్వు తెప్పించే సినిమాలలో ఒకటి 2008 లో వచ్చిన "బ్లేడ్ బాబ్జీ" సినిమా. చాలా పాత సినిమా అని మీరు అనుకోవచ్చు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే రాజమండ్రిలో అల్లరి నరేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతానాలు చేస్తూ గడిపేస్తుంటారు. ఒక రోజు వాళ్ళు ఉంటున్న ఏరియాకి ఒక పెద్ద మనిషి వచ్చి ఈ స్థలం నాది అందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపొమ్మంటాడు. లేదా 4కోట్ల రూపాయలు 3నెలలలోగా ఇవ్వమంటాడు. అక్కడ బ్లేడ్ బాబ్జీ (అల్లరి నరేష్) స్నేహితులతో పాటు చాలా పేద కుటుంబాల ప్రజలు నివసిస్తుంటారు. వాళ్ళందరికోసం ఆ 4కోట్ల రూపాయలను 3నెలల్లోగా ఇస్తానని ఆ పెద్దమనిషితో చెప్తాడు బ్లేడ్ బాబ్జి. అంత డబ్బు 3నెలల్లో సంపాదించడం కష్టం అని బ్యాంకులో దోచుకోవడానికి స్నేహితులతో కలిసి వైజాగ్ బయలుదేరుతాడు. వైజాగ్ వెళ్ళాక 4కోట్ల రూపాయలను ఎలా దోచుకున్నారు, ఎక్కడ దాచారు 3నెలల గడువులోగా ఆ డబ్బను తమ ఊరికి తెచ్చారా అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో హాస్యం విషయానికి వస్తే బ్యాంకులో దోచుకోవడం, ఆ డబ్పును పోలీస్ కంట్రోల్ రూంలోనే దాచడం, అక్కడ నుండి తీసుకురావడానికి బ్లేడ్ బాబ్జీ టీం వేసే స్కెచ్ లు కడుపుబ్బా నవ్విస్తాయి. 4కోట్ల రూపాయలను ఒక బొంతలో దాయడం చాలా నవ్వు తెప్పిస్తుంది. సినిమాా మొత్తానికి ఎక్కడా బోర్ కొట్టదు ప్రతీ సీన్ చాలా కామెడిగా ఉంటుంది. పాటలు ఒక్కటే బోర్ అనిపిస్తాయి. పాటలు లేకుంటే ఇంకా బాగుండేది. ఈ సినిమాలో చాలామంది సీనియర్ హాస్యనటులున్నారు.అందరు కూడా నవ్వుల పువ్వులు పూయించారు. ఈ సినిమా దర్శకుడు దేవి ప్రసాద్. ఈయన చాలా కామెడి సినిమాలు తీసారు. బ్లేడ్ బాబ్జీ సినిమా చూడకుంటే చూసి హాయిగా నవ్వుకోండి. నాకు నచ్చిన మరో కామెడి సినిమా ఏంటంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో చాలామందికి తెలియదు. ఈ పేరుతో ఓ సినిమా ఉందని కూడా నాక్కూడా తెలియదు. ఆ సినిమా పేరు "క్రేజీ క్రేజీ ఫీలింగ్" ఈ పేరు వింటే "నేను శైలజ" సినిమాలో హిట్టయిన క్రేజీ క్రేజీ ఫీలింగ్ అనే పాట గుర్తొస్తుంది కదా.? ఈ సినిమా మార్చి 2019లో రిలీజయ్యింది. ఈ సినిమా డైరెక్టర్ సంజయ్ కార్తిక్. ఇక ఈ సినిమా కథేంటంటే IAS అవ్వాలనునే అభి స్పందనను చూసి ఇష్టపడతాడు. ప్రేమించమని వెంటపడతాడు స్పందనకు లవ్ అంటే ఇష్టం ఉండదు. తనను తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడని వాడినే పెళ్ళి చేసుకుంటాను అంటుంది. ఈ రోజుల్లో అలాంటి వాడు ఉండడని అంటాడు అభి. అందుకు అలాంటి వాడు ఉన్నాడు అతనెవరో కాదు మా భావ అంటుంది స్పందన. అసలు అభి ప్రేమను స్పందన ఒప్పుకుంటుందా? వాళ్ళ బావ ఎవరు ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో హీరో హీరోయిన్ కొత్తవారు అయినా చాలా బాగా కామెడి చేసారు. కొంతమంది జబర్దస్త్ కమెడియన్ల కామెడి బాగుంటుంది. ఇక సినిమాకి హైలెట్ వెన్నెల కిషోర్ కామెడి. ఈ సినిమాల వెన్నెల కిషోర్ కామెడి చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. అసలు నేనీసినిమా చూసింది వెన్నెల కిషోర్ కామెడీ కోసమే. ఈ సినిమాలో పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూసిక్ బాగుంది. ఈ సినిమాలు మీరు చూడకుంటే వీలుంటే చూడండి. కాసేపు టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి హాయిగా నవ్వుకోండి. ఈ సినిమాలు చూసిన తర్వాత ఇందులో ఏ సినిమా చూసి బాగా నవ్వుకున్నారరో తెలియజేయండి.

27, ఆగస్టు 2020, గురువారం

ఇప్పుడు కూడా బయట టీ లు తాగడం, బిర్యాని తినడం అవసరమా.?

ఇప్పుడున్న పరిస్తితుల్లో ఇంటినుండి బయటకు రావడమే పేద్ద సాహసం అనుకుంటే బయట రోడ్ల పక్కన ఉండే హోటళ్ళలో టీలు తాగడం, ఆహారం తినడం చూస్తుంటే తెలిసి తెలిసి మురికి నీటిలో మొసలి పై కూర్చూని మురికి నీరు తాగినట్టు ఉంటుంది. రోడ్ల పక్కన హోటళ్ళు ఎంత శుభ్రంగా ఉంటాయో, అక్కడ ఆహారం ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మనకు తెలుసు. అది తెలిసి కూడా అక్కడ టీ తాగారు, బిర్యానీలు తిన్నారు అది ఒకప్పుడు అప్పుడు ఎంత అపరిశుభ్రంగా ఉన్న అక్కడ తినే వారికే ఆరోగ్యం పాడయితే ఇప్పడు అక్కడ తిని మీ కుటుంబ సభ్యులతో పాటు మీతో ఉండేవారిని కూడా అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నారు. కొన్ని రోజులు బయట ఫుడ్ తినకుండా ఉండలేరా? అసలు ఇప్పడు ఇంట్లో నుండి బయటకు వస్తే జేబులో సానిటైజర్, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎవరు దగ్గరకు రాకుండా భయం భ యంగా పనులు చేసుకుని ఇంటికి చేరుకుని వేడినీటిలో బట్టలు వేసి స్నానం చేసి ఇంట్లోకెళ్తేకాని మనసొప్పదు. అలాంటిది ఏ విధమైనా జాగ్రత్తలు పాటించని రోడ్లపక్కన ఉండే హోటళ్ళలో ఎలా తినాలనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి హోటళ్ళలో టీ లు తాగాలి, ఆహారం తినాలి అనిపిస్తుందంటే. అక్కడ ఉండే టేస్టు ఆ వాతావరణం చూస్తే కొందరికి అక్కడే తినాలనిపిస్తుంది. అక్కడఎలాంటి వాతావరణం ఉంటుందో చూద్దాం. టీ విషయానికి వస్తే ఒకరోజు ఫ్రెండ్స టీ తాగుదాం పదా అంటు ఒక హోటల్ కి తీసుకెళ్ళారు.ఇక్కట టీ చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నువ్వు ఒకసారి తాగావంటే మళ్ళీ మళ్ళీి తాగుతావు ఇది సిటీలో ఫేమస్ టీ అంటు ఆ టీ పేరు ఏదో చెప్పారు. అక్కడి వెళ్ళి ఆ వాతావరణం చుస్తే అక్కడ నిలపడాలంటేనే కష్టం అలాంటిది టీ తాగడం అంటే వాంతికొచ్చేలా ఉంది. మా ఫ్రెండు అక్కడ టీ చేసే అతనితో కాక తీన్ ఛాయ్ మలయ్ దాల్కే అని చెప్పిండు. వాడు ఏక్ మినట్ కాక అంటూ ఒక చేత్తో స్టౌ మీద గిన్నెలో పాలు కలుపుతు మరో చేతితో నోట్లో గూట్కా వేసుకుని మూడు ఛాయ్ లు కలిపి ఇచ్చాడు. మేం టీ తిసుకుని ేబుల్ దగ్గర నిలచుని టీ తాగుతున్నాం. ఇంతలో ఒకతను వచ్చి ఛార్ ఛాయ్ పార్సల్ కరో అన్నాడు. టీ చేసేవాడు ఫోన్లో మాట్లాడుతు టీ కలపుతుంటే వాడి నోటిలోని గుట్కా తుంపరలు అందులో పడుతున్నాయి అయినా ఆ టీ తీసుకువెళ్ళేవాడు ఏమీ అనట్లేదు ఎందుకంటే అది వాడు తాగడు కాబట్టి. ఇంకా నయం ఇంకొంచెం ఆలస్యంగా మేము వచ్చుంటే ఆ పవిత్రమైన, రుచికరమైన స్పెషల్ గుట్కా తుంపరల టీ మేం తాగేవాళ్ళం. ఇక్కడి ఛాయ్ గురించి గొప్ఫగా చెప్పిన మా ఫ్రెండ్ గాడి దురదృష్టం ఇంత రుచికరమైన ఛాయ్ మిస్సయ్యాడు అది కాని వీడు తాగుంటే ఇంకెంత గొప్పగా చెప్పేవాడో. ఇక మా పక్కన మరో ముగ్గురు టీ తాగుతున్నారు అందులో ఒకడు ఒక చేత్తో టీ తాగుతు మరో చేతితో సిగరెట్ కాలుస్తున్నాడు. ఇంకొకడు టీ తాగుతు సమోస తింటున్నాడు.మరొకడు గుట్కా నములుతు పక్కనే ఉమ్మి వేస్తున్నాడు. ఏమీ కాంబినేషన్ రా సామి టీ తాగుతు సిగరెట్ తాగడం, టీ తాగుతు సమోస తినడం ఇలాంటి వింతలు నేను చూడటం ఇదే మొదటిసారి.!ఇవేమి పట్టించుకోకుండా టీ తాగుతున్నారు నా ఇద్దరు మిత్రులు. వాళ్ళు నావైపు చూసి ఎలా ఉంది శేఖరం ఛాయ్ అన్నారు. ఒకవైపు సిగరెట్ పొగ మరోవైపు గుట్కా వాసనలు ఘుమఘుమలాడుతుంటే ఏం చెప్తం. బాగుందిరా అన్నాను. చూసావా ఇక్కడ టీ తాగితే మళ్ళి మళ్ళి వచ్చి టీ తాగుతావు అన్నాడు. ఇక్కడ టీ తాగితే మళ్ళీ మళ్ళీ కాదురా మళ్ళొకసారి తాగాలంటేనే విరక్తి పుడుతుంది అని మనసులో అనుకుంటు అక్కడ నుండి వచ్చేసా.అప్పటి నుండ అక్కడే కాదు ఎక్కడ టీ తాగలేదు. అసలు ఇంత చెత్త ప్రదేశాలలో అంత చెత్త టీ ఎలా తాగుతారో నాకార్థం కాదు.పైగా గొప్పలు చేప్పుకుంటు ఇతరులను అక్కడ టీ తాగడానికి తీసుకెళ్తుంటారు. అక్కడ వాడు టీ తయారు చేసే వాడు పరిశుభ్రంగా ఉన్నాడా? టీ తయారు చేయడానికి ఏ పాలు వాడుతుతున్నాడు?, ఏ నీళ్ళు , ఏ టీ పొడి వాడుతున్నాడు?, అక్కడ ఎంత పరిశుభ్రంగా ఉంది? అని ఇవేవి పట్టించుకోకుండా టేస్ట్ బాగుంది కదా అని తాగితే అంతే అనారోగ్యం పాలవడం ఖాయం.ఇక్కడ టీ చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో టీ ఇంత రుచిగా ఉండదు అంటారు. నిజమే మరి ఇంటిలో తయారు చేసిన టీ రుచిగా ఉండదు ఎందకంటే హోటళ్ళలో వేలమంది తాగిన టీ గ్లాసులను ఒకసారి నీటిలో ముంచి కడగకుండా అలాగే అందులో టీ ఇస్తారు.మరియు చుట్టు పక్కల సిగరెట్ పొగలు, గుట్కా వాసనల ఇన్ని ఉంటాయి కాబట్టె బయట టీ బాగుంటుంద. వారం కిందట మావాళ్ళు పని మీద హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ టీ తాగి బిర్యాని తిని వచ్చారు. అక్కడకు వెళ్ళడమే సాహసం అనుకుంటే ఇలాంటి చెత్త హోటళ్ళలో టీ తాగి, బిర్యాని తినడం అంటే చాలా పెద్ద తప్పు. చాలామంది ప్రజలు ఇలా హోటళ్ళు తెరిచారో లేదో అలా వెళ్ళిపోతున్నారు ఆ చెత్త తినడానికి. కొన్ని రోజులు ఇలాంటి చెత్త టీ లు బిర్యానిలు తినకుండా ఉండలేరా? .

1, జనవరి 2020, బుధవారం

నా స్టార్టప్ ఆలోచన

బ్లాగు మిత్రులందరికీ

    💐ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐

         ఈ నూతనసంవత్సరం లో ఒక  చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కిరాణా వస్తువులను హోమ్ డెలివరీ చేసే స్టార్టప్.
అదికూడా చిన్న పట్టణాల్లో, మరియు గ్రామాల్లో మాత్రమే. ఎందుకంటే పెద్ద నగరాల్లో బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు కిరాణా వస్తువులను హోమ్ డెలివరీ సర్వీసులను అందిస్తున్నాయి. కాని చిన్న పట్టణాల్లో మరియు గ్రామాల్లో ఇలాంటి సేవలు అందించడానికి ఏ కంపెనీ లేదు. గ్రామాల్లో మరియు చిన్న పట్టణాల్లో హోమ్ డెలివరీ చేయడానికి పెద్ద కంపెనీలు ఎందుకు ముందుకు రావంటే గ్రామీణ ప్రాంతాలవారికి ఇంటర్నెట్ గురించి అవగాహన ఉండదు అలాగే ఎవరు కూడా తమ సేవలను వినియోగించుకోరని ఏ కంపెనీ కూడా చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో హోమ్ డెలివరీ సర్వీసులను అందించడం లేదు.
         గ్రామీణ ప్రాంతాలవారికి ఇంటర్నెట్ గురించి అవగాహన లేకపోవడం ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రతీ మారుమూల ప్రాంతాల్లోను ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. Jio వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరు మినిమం 1GB డాటా వినియోగిస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ కిరాణా వస్తువులను హోమ్ డెలివరీ సర్వీసులను అందిస్తున్నాం అని తెలిస్తే తప్పకుండా ఈ సర్వీసులను వినియోగించుకుంటారు‌.

ఎవరెవరు ఈ సర్వీసులను వినియోగించుకుంటారు‌ అంటే
 వృద్దులు
ఉద్యోగులు
యువత

వృద్దుల విషయానికి వస్తే కిరణా వస్తువులను కొనడానికి ఎక్కువగా వచ్చేది వృద్ధులే ఎందుకంటే యువకులు పనులకు వెళ్ళడం వలన కిరాణా వస్తువులను కొనడానికి ఇంట్లో పెద్దవారే ఎక్కువగా కిరాణా దుకాణాలకు వచ్చి వస్తువులను కొని తీసుకెళ్తుంటారు. ఇలా వస్తువులను తీసుకెళ్ళే క్రమంలో ఇబ్బందులు పడుతుంటారు. షాపువారిని  ఇంటి వరకు వస్తువులను తీసుకురమ్మని బతిమాలుతుంటారు. ఒక్కోసారి షాపువారు కూడా తీసుకెళ్ళరు. ఇలాంటి వారికి కిరాణా వస్తువులను హోమ్ డెలివరీ చేస్తున్నాం అని తెలిస్తే తప్పకుండా ఈ సేవలను వినియోగించుకుంటారు.

     ఉద్యోగాలు చేసేవారికి కూడా తీరిక లేక  పనివారినో  తెలిసిన వారికో చెప్పి కిరాణా వస్తువులను తెప్పిస్తుంటారు. ప్రతి సారీ ఇలా చెప్తే ఎవరైనా విసుక్కుంటూ ఉంటారు. వారికేమో తీరిక ఉండదు. ఇలాంటి వారికి కిరాణా వస్తువులను హోమ్ డెలివరీ సర్వీసులను అందిస్తున్నాం అని తెలిస్తే తప్పకుండా ఆర్డర్ చేస్తారు.

యువత విషయానికి వస్తే యువకులు కిరణా దుకాణాలకు వెళ్ళి వస్తువులను తీసుకురావడానికి వెళ్ళరు. ఎందుకంటే గంటలు గంటలు కిరాణా దుకాణాల్లో వస్తువులు కొనాలంటే చిరాకు పడుతుంటారు. పైగా వస్తువులను ఇంటికి తీసుకు రావడానికి నమోషిగా ఫీలవుతుంటారు. ఇలాంటి వారు కూడా ఇంటికే కిరాణా వస్తువులను డెలివరీ చేస్తున్నాం అని తెలిస్తే తప్పకుండా ఆర్డర్ చేస్తారు.

   నేను కిరాణా షాపులో పనిచేసాను కాబట్టి నాకు ఈ విషయాలు తెలుసు.

ఇప్పటి వరకు మనకు కస్టమర్ల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఎలా ఈ స్టార్టప్ ను స్టార్ట్ చేయాలో చూద్దాం. ముందుగా మన స్టార్టప్ గురించి అందరికి తెలిసేలా ప్రచారం చేయాలి. ముందుగా తక్కువ ఆర్డర్ లు వచ్చిన క్రమంగా పెరగవచ్చు. వాట్సాప్,కాల్స్ ద్వారా ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేయాలి. ఏ ప్రాంతం నుండి ఆర్డర్లు వస్తాయో తెలుసుకుని అక్కడకు దగ్గరలో ఉన్న కిరాణా షాపుల్లో వస్తువులను తీసుకుని వారికి డెలివరీ చేస్తాం. వాట్సాప్ లో వస్తువుల లిస్ట్ ను పంపిస్తే దాని ప్రకారం మనం వస్తువులను షాపులో తీసుకుని కస్టమర్లకు డెలివరీ చేస్తాం. డెలివరీ చేసిన తర్వాతనే డబ్బులు తీసుకుంటాం అందులో డెలివరీ ఛార్జీలు అదనంగా తీసుకుంటాం. దుకాణ యజమానులకు కస్టమర్లు ఇచ్చిన తర్వాతనే డబ్బులు ఇస్తాం.

ఇందులో మనకు రెండు విధాలుగా ఆదాయం వస్తుంది. ఎలాగంటే ఒకటి కస్టమర్ల నుండి డెలివరీ చార్జీలు తీసుకుంటాం. మరియు దుకాణా యాజమానుల నుండి కూడా కమీషన్ లభిస్తుంది. వారికి ఎక్కువగా ఆర్డర్లను ఇస్తే దుకాణాదారులు కమీషన్ ఇస్తుంటారు.

ఇక మనం వస్తువులను ఎలా డెలివరీ చేస్తాం:-

 కిరాణా వస్తువులంటే బియ్యం బస్తాలు, మంచి నూనె డబ్బాలు, పప్పులు, పిండి ఇలాంటి బరువైన వస్తువులు ఉంటాయి. బియ్యం బస్తా 25 కిలోల బరువు ఉంటుంది. మంచి నూనె డబ్బా 15 కిలోల బరువు ఉంటుంది. ఇంత బరువును బైక్ పై పెట్టుకుని తీసుకెళ్ళడానికి రాదు. ఆటో వంటి వాహనాల్లో తీసుకెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. వస్తువులను డెలివరీ చేయడానికి బైకులు, ఆటోలు కాకుండా  TVS XL వంటి వాహనాలను వాడితే సరిపోతుంది. దీనిపై దాదాపుగా 50 కిలోల వరకు బరువు తీసుకెళ్ళవచ్చు. ఈ ఎక్సెల్ వాహనం ముందు కాళ్ళ దగ్గర బియ్యం బస్తాలు, నూనె డబ్బాలు పెట్టుకుని సులభంగా తీసుకెళ్ళవచ్చు. మరియు వెనక సీటు కూడా తీసివేసి అక్కడ ఒక డబ్బా లాంటిది తయారు చేస్తే అందులో కూడా వస్తువులను తీసుకెళ్ళవచ్చు. దీనిద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ బరువులను తీసుకెళ్ళవచ్చు.

మొదట తక్కువ గా ఆర్డర్లు వచ్చిన తర్వాత పెరగవచ్చు. అప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఆర్డర్లు తీసుకోవచ్చు. కస్టమర్లు పెరిగేకొద్ది మనం ఆఫీస్ స్టాఫును పెంచుకోవడం, డెలివరీ బాయ్స్ ను ఆర్డర్లకు తగ్గట్టు రిక్రూట్ చేసుకోవాలి. ఈ స్టార్టప్  ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. దీని ద్వారా మనతో పాటు పదిమందికి ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుంది.


నా ఈ స్టార్టప్ ఆలోచన పై మీ అభిప్రాయాలు తెలియజేయండి..