భానోదయం: ఆహారం
ఆహారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆహారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మార్చి 2022, మంగళవారం

ప్లాస్టిక్ మనుషులు

 



     మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేసాడు అవి మానవాలికి ఉపయోగంతో పాటు కీడు కూడా చేస్తాయి. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ అయిన రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని సరియైన విధంగా ఉపయోగిస్తే అందరికి శ్రేయస్కరం. కాని వాటిని చాలా మట్టుకు వినాశనం ఉండే విధంగానే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తే మేధావులు తమ అతి తెలివితో వినాశనానికి దారితీస్తున్నారు.


ఏ ఆవిష్కరణ అయిన తరువాత వ్యాపారం అయిపోతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారాలతో ప్రకృతిని నాశనం చేస్తారు. 


మనిషి ఆవిష్కరించిన వాటిలో అత్యంత చెత్త ఆవిష్కరణ "ప్లాస్టిక్".  ఇది ఎంత చెత్త ఆవిష్కరణ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెత్తే కనిపిస్తుంది.

నేలపై, నదుల్లో, సముద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ చెత్తే కనిపిస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.. ఇన్ని రోజులు బయట మాత్రమే ఉండే ఈ చెత్త ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరంలో రక్తంలోకి కూడా చేరింది... ఇన్నాళ్లు పర్యావరణాన్ని చెత్తగా మార్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరాన్ని చెత్తగా మారుస్తుంది.


      ఆవిష్కరణలు మనిషి జీవన విధానాన్ని ఎంత సులభతరం చేస్తయో అంతకంటే ఎక్కువగా నాశనం కూడా చేస్తాయి. ఆవిష్కరణలు రెండు వైపుల పదును వున్న కత్తుల్లాంటివి వాటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది విచ్చలవిడిగా వాడితే ముప్పు తప్పదు.. 

     

    ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మానవ శరీరంలో రక్తంలోకి ఎలా చేరింది.?

    

 ఎలా చేరిందంటే మనిషి విచ్చలవిడిగా వాడడం వలనే.



 అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది.



అందులో కొన్ని నాకు తెలిసినవి:-


ఉదయం నుంచే మన పరుగు ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది.


ఉదయము కూరగాయలకు వెళ్తారు ఖాళీ చేతుల్తో. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు నింపుకుని వస్తారు.



పాలు ప్లాస్టిక్ కవర్లో.


కిరాణా సరుకులు ప్లాస్టిక్ కవర్లో.


బయట  ఎక్కడైన టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో నే.


భోజనం ప్లాస్టిక్ ప్లేట్లలో నే.


ఆహారం ప్యాక్ చేయడం ప్లాస్టిక్ కవర్లో నే.


టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు.


అసలు ప్లాస్టిక్ వాడకం అనేది మామూలుగా లేదు అవసరం ఉన్నా లేకపోయినా వాడడం మాత్రం పక్కా.


అంతలా వాడితే మనిషి రక్తంలో ఏంటి ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ అయిపోయి "ప్లాస్టిక్ మనుషులు" గా మారిపోయిన ఆశ్చర్యం లేదు..!!!



ఉదయం లేవగానే కూరగాయలకు ఒక సంచి తీసుకుని వెళ్తే ఏమవుతుంది.? చాలామందికి చేతిలో సంచి తీసుకుని బయిటకు వెళ్తే నామోషో లేక బద్ధకమో తెలియదు కాని అస్సలు తీసుకెళ్ళరు.


 ఖాలీ చేతుల్తో కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళి గంపెడు ప్లాస్టిక్ చెత్తను తీసుకువస్తారు. సరే తెచ్చారు వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా చేస్తారా అంటే అదిలేదు. ఇష్టం వచ్చినట్టు బయట పారేయడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఇలా కాల్చడం వలన ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసి ఆ గాలి పీల్చునప్పుడు శరీరం లోకి ప్రవేశిస్తున్నాయి.


ఇంకొందరు మహానుభావులు వేడి వేడి 'టీ' ని  కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు. టీ కొట్టు వాడికి తెలియక పోవచ్చు వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయోద్దని చదువుకున్న వాళ్ళుకూడా తెలియదా అలాగే తాగుతున్నారు. అంత వేడి టీ ని ప్లాస్టిక్ కవర్లో పోస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి టీలోకి వెళ్ళి అది తాగినవారి శరీరం లోకి వెళుతుంది.

అలా చేయకుండా ఒక ప్లాస్క్ వాడితే సరిపోతుంది కదా. ప్లాస్క్ వాడడానికి బద్దకం, ఆ ప్లాస్క్ ను కొట్టు వరకు తీసుకువెళ్ళడానికి నామోషి. 


ఇక నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో.

పల్లెటూళ్ళలో అయితే ఒకసారి తాగిపడేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ని పదే పదే నీళ్ళు నింపుకుని వాడుతుంటారు.  ఈ ప్లాస్టిక్ బాటిల్స్  లో ఎక్కువ రోజులు నీళ్ళు తాగితే అందులోని ప్లాస్టిక్ కణాలు అందులోని నీటిలోకి వెళ్తాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాడుతూ ఉంటారు. తెలిసిన 

ఎవరూ చెప్పరు, చెప్పిన ఎవరూ వినరు...




     ఇంకా పెళ్ళిళ్ళు, దావత్ లకు అప్పట్లో మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో భోజనం వడ్డించేవారు. ఆ విస్తరాకుల్లో  తృప్తి గా భోజనం చేసేవాళ్ళం. వాటిని తీసుకెళ్ళి పెంటలో వేసే వాళ్ళు అవి ఎరువుగా మారేవి... ఇప్పుడు పేపర్ ప్లేట్లో వడ్డిస్తున్నారు ఈ పేపర్ ప్లేటునుంచి ఏదో దుర్గంధం వస్తుంది. పైగా వాటిపై ప్లాస్టిక్ కవర్ ఉంటుంది వేడి పదార్థాలు అందులో తింటే  ప్లాస్టిక్ శరీరంలోకి చేరకుండా ఉంటుందా..?


ఎంత చక్కనివండి  అప్పట్లో మన పల్లెల్లో "మోదుగ ఆకులతో" తయారు చేసిన విస్తరాకులు. అందులో భోజనం చేస్తే అమోఘం. వీటి వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా అవి ఎరువుగా ఉపయోగపడుతాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ విస్తరాకుల వలన అన్ని విధాలుగా నష్టమే ఎక్కువ...


మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని మరిచిపోయి ప్లాస్టిక్ వెంట పరిగెత్తి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం...



ప్లాస్టిక్ వలన ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం ఎక్కువగా వాడుతున్నారు. కాని పరోక్షంగా దీని నష్టాలు గమనించడం లేదు.


ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది..


కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళినప్పుడు జనపనార (జ్యూట్ )బ్యాగులు కాని కాటన్ బ్యాగులు కాని వెంట తీసుకెళ్ళాలి.


పేపర్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాని, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకులు వాడాలి.


బయట నుండి పార్శిల్ తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకోవడం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.....








30, సెప్టెంబర్ 2019, సోమవారం

పల్లీలు నువ్వుల లడ్డు





పల్లీలు నువ్వుల లడ్డు

కేవలం మూడు పదార్థాలతోనె చాలా సులువుగా రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే లడ్డు తయారుచేసే విధానం..

కావలసిన పదార్థాలు:-

పల్లీలు       - 1 కప్పు
నువ్వులు  - 1 కప్పు
బెల్లం            - అరకప్పు


తయారి విధానం:-
పల్లీలు, నువ్వులను దోరగా వేయించుకోవాలి.వేయించిన పల్లీలు,నువ్వులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకోని ఉండలు కట్టుకోవాలి.
అంతే రుచికరమైన లడ్డు తయారవుతుంది.


నువ్వుల లడ్డు



ఈ లడ్డు చూడటానికి అంత ఆకర్షనీయంగా లేకపోయినా తింటే మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది.
పల్లీలు,నువ్వుల లడ్డులో కాల్షియం అధికంగా ఉంటుంది ఈ లడ్డు తినడం వలన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి.

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

గోధుమ గడ్డి



wheatgrass
గోధుమ గడ్డి

       



గోధుమ గడ్డి పెంచే విధానం:-

ఒక కప్పు గోధుమలు తీసుకుని కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి 12 గంటలు నానబెట్టాలి.

12 గంటలు నానిన తర్వాత నీళ్ళు ఒంపేసి ఒకసారి కడిగి ఒక కాటన్ గుడ్డలో మూటకట్టి ఒకరోజు ఉంచాలి.

తర్వాత ఒక ప్లాస్టిక్ ట్రే తీసుకుని దానికి అడుగు భాగంలో రంధ్రాలు చేయాలి. అందులో సగం వరకు  మట్టిని పోయాలి. ఈ మట్టిలో  వర్మీ కంపోస్టు ఎరువు కలుపుకుంటే గడ్డి బాగా వస్తుంది.

మట్టి పోసిన తర్వాత మొలకెత్తిన గోధుమలను ప్లాస్టిక్ ట్రే లో ఒత్తుగా వేయాలి. అలా వేసిన తర్వాత పైనుండి  గోధుమలు మునిగేలా మట్టిని పోసి నీళ్ళు పొయ్యాలి.

ఈ ట్రేను నీడలో ఉంచాలి.
ఉదయం సాయంత్రం వేళల్లో నీటిని చిలకరించాలి.


 గోధుమ గడ్డి  పది రోజులతర్వాత ఆరు అంగుళాలకు మించి పెరుగుతుంది.




wheatgrass

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఇంటి భోజనం కేరాఫ్ "హారిక మెస్"

       

              ఇంటి నుండి  పనిమీద బయటకు వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తామో తెలియదు. ఒకవైపు సమయానికి ఆకలి దంచేస్తుంటుంది. మనం వెళ్ళిన చోట మంచి ఆహారం అసలు ఆహారం దొరుకుతుందో లేదో తెలిదు. అలా ఒకరోజు అన్నయ్యకి హెల్త్ ప్రాబ్లం వల్ల  సొమాజిగూడలోని యశోద హాస్పిటల్ కి వెళ్ళడానికి నేను మాఅన్నయ్య, మా అల్లుడు ముగ్గురం వెళ్ళాం.
నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో ట్రైన్ దిగి అక్కడ నుండి యశోద హాస్పిటల్ దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాం. హాస్పిటల్ లో డాక్టర్ ను కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్లు తీసుకుని బయటకు వచ్చేసరికి మద్యాహ్నం రెండు అయ్యింది.
                  ఆకలి దంచేస్తుంది. రోడ్డు పక్కన ఏదైనా హోటల్ ఉంటే భోజనం చేద్దామని అనుకుంటు చుట్టూ చూసుకుంటు నడుస్తున్నాం ఆ దారి వెంబడి అంటే యశోద హాస్పిటల్ నుండి నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ వరకు ఒక్క హోటల్ లేదు. అలా నడుకుంటు వస్తుంటే ఒక కమాన్ పక్కన "హారిక మెస్" అని ఒక బోర్డు కనిపించింది. లోపలికి వెళ్ళాం అక్కడ ఒక రెండస్తుల ఇల్లు బాగా రద్దీగా ఉంది. దాని ముందు ఒక గుడి ఉంది.  కింద జనాలు ఎక్కువగా ఉన్నారు. మెట్లెక్కి పైకి వెళ్ళాం.
               
             మెస్ చాలా చిన్నగానే ఉంది. నాలుగైదు డైనింగ్ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. డైనింగ్ టేబుల్స్ సరిపోక చాలా మంది నిల్చునే తింటున్నారు. ఏం చేస్తాం ఇప్పుడు మనకు కుర్చొని తినడం ముఖ్యం కాదు ఆకలి ముఖ్యం కాబట్టి కౌంటర్లో మూడు ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాం. 80రూపాయలో  100రూపాయలో అనుకుంట ఫుల్ మీల్స్. ఈ మెస్ లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సర్వర్ ‌లు ఉండరు ఎవరికి వారే వడ్డించుకుని తినాలి. మేం కూడా వడ్డంచుకున్నాం ఇక్కడ భోజనం చేస్తున్న వారంతా చాలా పద్దతిగా భోజనం చేస్తున్నారు. అసలు  టేబుల్స్ లేవని  ఏమాత్రం విసుక్కోకుండా నిల్చునే తింటున్నారు.
మెను కూడా చాలా బాగుంది అన్నం తో పాటు రెండు రకాల కర్రీలు,పప్పు, సాంబారు, చట్నీలు , పెరుగు , దొండకాయ పకోడి మరియు చిప్స్ నాకైతే చాలా బాగా నచ్చేసాయి వంటలు. తృప్తిగా కడుపునిండా తిన్నాం.
     
               ఇక్కడ నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఎవ్వరు కూడా ఆహారం వేస్ట్ చేయడం లేదు.ఆహారం వడ్డించడానికి సర్వర్ లు ఉండరు కాబట్టి ఎవరికి వారే వడ్డించుకోవాలి. అందువలన ఎవ్వరు కూడా అన్నం వృథా చేయడం లేదు ఎందుకంటే ఎవరికి సరిపోయెంత వారు వడ్డించుకుంటారు కాబట్టి ఆహారం వృథా చేయడం లేదు. ఈ పద్దతి నాకు చాలా బాగా నచ్చింది ఇంట్లో భోజనం చేసినట్టే అనిపించింది. ఇక్కడ భోజనం చేసేవారిలో   అబ్బాయిలు ప్లస్ అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళంత సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ అనుకుంటా ఎందుకంటే ఇంత పద్దతిగా ఏ ఇబ్బంది లేకుండా అడ్జస్ట్ అయ్యి భోజనం చేస్తున్నారు. బయట ఎక్కడైనా హోటల్లో  ఇలా ఉంటుదా చెప్పండి ? బయటనుండి హోటల్లోకి కస్టమర్ వచ్చి రావడమే తరువాయి ఒరేయ్ ఇక్కడ "టేబుల్ లేవురా" నీళ్ళేవిరా 'కర్రీ ఏదిరా' అది ఏదిరా ఇది, ఏదిరా అంటూ, సర్వర్లకి ఓనర్ లకి చుక్కలు చూపిస్తారు. వాళ్ళెవరైనా ఎమోగాని.
 
          సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవడంలో వీళ్ళకు వీళ్ళేసాటి.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చిన్న మెస్ అయిన ఇంతమంది తినడానకి వస్తున్నారంటే దానికి కారణం ఇక్కడ పరిశుభ్రత, రుచికరమైన,  ఆరోగ్యకరమైన ఆహారం. ఇలా ఉంటే ఎంతదూరం నుండి అయిన వచ్చి భోజనం చేస్తారు.
ఇక నాకు ఈ "హారిక మెస్" ఎప్పటికి గుర్తుంటుంది మంచి భోజనం తో పాటు మంచి జ్ఞాపంకం మిగిల్చింది.