చాలామంది మనశ్శాంతి కోసం ఊర్లు తిరుగుతుంటారు, ఆశ్రమాలకు వెళ్తుంటారు. కానీ, బాహ్య ప్రపంచంలో మార్పులు వెతికినంత కాలం మనసు ప్రశాంతంగా ఉండదు. ఇదే విషయాన్ని రమణ మహర్షి ఒక చిన్న సంఘటన ద్వారా ఎలా వివరించారో ఈ కథలో చూద్దాం.
ఆశ్రమంలో జరిగిన సంఘటన
ఒక వ్యక్తి తన ఇంట్లో మనశ్శాంతి లేక, ప్రశాంతత కోసమని రమణ మహర్షి గారి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కొన్నాళ్లు ధ్యానం చేస్తూ గడుపుతున్నాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆశ్రమ వంటశాల వైపు వెళ్ళినప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. అక్కడ వంటవాడు 30 కిలోల కూరగాయలు తెచ్చి, లెక్కల్లో మాత్రం 50 కిలోలు అని రాసి, మిగిలిన 20 కిలోల సొమ్మును తన జేబులో వేసుకుంటున్నాడు. ఇది రోజువారీ జరుగుతున్న అవినీతి అని గమనించాడు.
మహర్షి మౌనం - భక్తుడి అసహనం
ఆ భక్తుడు ఈ విషయాన్ని రమణ మహర్షి గారికి వివరించాడు. "స్వామి, మీ ఆశ్రమంలో ఇలా అన్యాయం జరుగుతోంది, ఆ వంటవాడు దొంగతనం చేస్తున్నాడు" అని చెప్పాడు. కానీ మహర్షి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ధ్యానంలో ఉండిపోయారు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఆయనలో చలనం లేకపోవడంతో, ఆ వ్యక్తికి ఓపిక నశించింది.
ఒకరోజు కోపంతో, "స్వామి! ఇంటి వద్ద మనశ్శాంతి లేక ఇక్కడికి వస్తే, ఇక్కడ కూడా ఇంత అవినీతి జరుగుతుంటే మీరు పట్టించుకోరేంటి? అసలు మీకు ఇవేవీ పట్టవా?" అని గట్టిగా అడిగేశాడు.
మహర్షి ఇచ్చిన జ్ఞానబోధ
అప్పుడు రమణ మహర్షి నెమ్మదిగా కళ్లు తెరిచి ఇలా అన్నారు:
"చూడు నాయనా.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? నేను ఆరోజు ఎలా ఉన్నానో, ఈరోజు కూడా అలాగే ఉన్నాను. నేను నా మట్టుకు ధ్యానం చేసుకుంటుంటే, ఎవరో వచ్చి ఈ గోడలు కట్టారు, వంటలు చేస్తున్నారు. ఇందులో ఏది నాది? అసలు ఈ ఆశ్రమం నాది అని నీకు ఎవరు చెప్పారు?"
ఆయన ఇంకా కొనసాగిస్తూ.. "నీకు మనశ్శాంతి ఎందుకు లేదో తెలుసా? నువ్వు అక్కడ (ఇంట్లో) ఏం జరుగుతుందో వెతికావు, ఇక్కడ (ఆశ్రమంలో) ఏం జరుగుతుందో వెతుకుతున్నావు. నీ మనసు లౌకిక విషయాల మీద, ఎదుటివారి తప్పుల మీద ఉంది. మనసు అనేది నీ ఇంట్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా ఒకటే. ఎప్పుడైతే నీ మనసును పరమాత్మ వైపు మళ్ళించి, నీ లోపలికి నువ్వు చూసుకుంటావో.. అప్పుడే నీకు నిజమైన శాంతి లభిస్తుంది. లౌకిక విషయాల్లో పడి కొట్టుమిట్టాడితే నువ్వు ఎక్కడికి వెళ్లినా ప్రశాంతత దొరకదు." అని హితబోధ చేశారు.. అప్పుడు ఆ భక్తుడికి జ్ఞానోదయం కలిగింది..
మనం నేర్చుకోవాల్సిన పాఠం
మనం మనశ్శాంతిని ప్రదేశాల్లో వెతుకుతాం, కానీ అది మన ఆలోచనల్లో ఉంటుంది. ఎదుటివారు ఏం చేస్తున్నారు, సమాజం ఎలా ఉంది అనే విషయాల కంటే.. మన అంతరాత్మ ఏం చెబుతోంది, మనం దైవచింతనలో ఎంతవరకు ఉన్నాం అనేది ముఖ్యం. మనసు మారనంత కాలం, మనుషులు మారినా ప్రదేశాలు మారినా ప్రశాంతత అనేది దొరకదు.!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి