భానోదయం: ప్రకృతి
ప్రకృతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రకృతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జులై 2022, గురువారం

ప్లాస్టిక్ నిషేధం విధించారు సరే, అమలు చేయడం సాధ్యమేనా??

    దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం శుభపరిణామం. నేను ఎప్పటినుంచో ఎదురుచుస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద మార్పుకు నాంది. 


నిషేధం విధించారు సరే అమలు జరగడం సాధ్యమేనా.. 


ఒకసారి వాడిపాడేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేదించామంటున్నారు అందులో వాటర్ బాటిల్స్ లేవు. పేపర్ ప్లేట్లు లేవు ఇవికూడా ఒకసారి వాడిపాడేసేవే కదా.. 


మరొకటి గాలి అమ్మే ప్యాకెట్లు అదేనండి చిప్స్ పాకెట్లు వాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు.. వీటివల్ల కూడా పెద్ద ఎత్తున కాలుష్యం అవుతుంది. ఈ ప్యాకెట్లో 95% గాలి మిగితా 5% మాత్రమే చిప్స్ అనే పదార్థం ఉంటుంది.. ఈ ప్యాకెట్లో ఉండే పదార్థం తక్కువ దాని ద్వారా వచ్చే కాలుష్యం ఎక్కువ.. ఇలాంటివి కూడా నిషేధించాలి.. నిషేధం అంటే నిషేదమే కఠినంగా ఉండాలి అప్పుడే మార్పు వస్తుంది..


నిషేధం అని మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో పెడితే బాగుంటుంది.. ఇదివరకు చాలా సార్లు నిషేదం విధించారు కాని మళ్ళీ వాడుతూనే ఉన్నారు...


వాటర్ బాటిల్స్, పేపర్ ప్లేట్లు, గ్లాసులు,చిప్స్ ప్యాకెట్స్ ఇలా వీటన్నింటినీ నిషేధించాలి..  అప్పుడే కాలుష్యం తగ్గి పరిసరాలు పరిశుభ్రంగా, అందంగా తయారవుతాయి.. లేదంటే మళ్ళీ కథ మొదటికే వస్తుంది...


ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడే విధంగా ప్రోత్సాహించాలి. 


నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నా ప్రతీ ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలకు వెళ్ళినప్పుడు వెంట కాటన్ సంచి లేదా జ్యూట్ బ్యాగులను వెంట తీసుకు వెళ్ళండి. అలాగే వాటర్ బాటిల్ బయట కోనే కంటే ఇంటినుండి స్టీల్ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్ళాలి. పిల్లలకు గాలి ప్యాకెట్లు అవే చిప్స్ ప్యాకెట్లు తినే అలవాటు చేయకండి.. మనం తినకుంటే కంపెనీ వాడు ఎందుకు చేస్తాడు.. కాబట్టి ముందు మనం మారాలి. 


ప్లాస్టిక్ నిషేధం బాధ్యత ప్రభుత్వానిది మనకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి... 


ప్లాస్టిక్ తరిమేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం...







17, ఏప్రిల్ 2022, ఆదివారం

నీటి వనరులను నాశనం చేస్తున్నారు..

    


    ప్రకృతి మానవ మనుగడకు అవసరమైన అన్ని వనరులను మనకు ప్రసాదిస్తుంది. కాని ప్రకృతి ప్రసాదించిన వనరులను ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారు చెప్పండి.? ప్రకృతి వనరులను నాశనం చేయడానికి ఉన్నంత శ్రద్ధ సద్వినియోగం చేసుకోవడంలో ఉండదు. ఏ జీవికైనా ప్రాణాధారం నీరు. నీరు లేనిదే జీవుల మనుగడ లేదు. అది అందరికీ తెలిసిందే కాని నీటి వనరులను మాత్రం విచ్చలవిడిగా కాలుష్యం చేసేసి మనుషులతో పాటు మూగజీవాలకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మానవుడు. ప్రకృతి లో తెలివైన వాడు మానవుడు తన తెలివితేటలతో ప్రకృతిని, ప్రకృతి ప్రసాదించిన వనరులను నాశనం చేసి ఇతర జీవులకు కూడా మనుగడ లేకుండా చేస్తున్నాడు. 


 ఇతర జీవుల సంగతి దేవుడెరుగు గాని ముందు ముందు మనిషి మనుగడకే ముప్పు తెస్తున్నాడు.

 నీరు అందరికి జీవనాధారం కాని నీటి విలువ ఎవరికి తెలియదు. ''మన దగ్గర ఏది ఉంటుందో దాని విలువ మనకు తెలియదు". లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. 


ఇప్పుడు మనకు త్రాగు నీరు పుష్కలంగా లభిస్తుంది. పుష్కలంగా అంటే మరీ మన తాతల నాటి కాలంలో కాకుండా కొంచెం తక్కువగానే స్వచ్చమైన నీరు లభిస్తుంది. అయినా కూడా నీటి వనరుల విలువ ఇంకా చాలామంది కి తెలియదు. ముందు ముందు తెలుస్తుంది. మా చిన్నప్పుడు రవాణా వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందలేదు ఏ ఊరికైనా వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మరీ దూరమైతే మెయిన్ రోడ్డు వరకు నడిచి అక్కడ ఏదైనా వాహనం ఎక్కి చిన్నపాటి సిటీలో దిగి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం. మొత్తంగా కాలినడకనే వెళ్ళేవాళ్ళం. ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం ఎందుకంటే వేసవిలో పిల్లలకు సెలవులు ఉండడం, పెద్దవారికి కూడా ఎలాంటి పనులు ఉండవు కాబట్టి ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం. వేసవిలో ఎక్కువగా ఏ బందువుల  ఇంటికి వెళతాం చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లే వెళ్తారు.  అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అంటే మాకు పండగే. అందరు వస్తారు కాబట్టి ఆ ఆనందంలో ఎంతదూరం అయిన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 

 వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు దాహం వేస్తే ఎక్కడ కూడా నీళ్ళు కోనేవారు కాదు అసలు అప్పట్లో నీళ్ళు అమ్మే వాళ్ళు కాదు మా ఊళ్ళళ్ళో. చిన్న చిన్న వాగులు ఉండేవి వానాకాలం పుష్కలంగా నీరు ప్రవహించే వాగులు వేసవిలో నీరు ఉండేది కాదు. అక్కడ అక్కడ గుంతల్లో కొద్దిగా నీరు ఉండేది. అవి పశువులు తాగడానికి ఉపయోగపడేవి. మేం తాగలంటే చెలిమలు తవ్వి నీరు త్రాగేవాళ్ళం. అప్పుడు ఎలాంటి కాలుష్యం లేదు చాలా స్వచ్ఛంగా ఉండేవి నీళ్ళు. 

ఇక బావి నీరు ఎక్కువగా త్రాగే వాళ్ళు. బోర్లు అంతగా ఉండేవి కాదు. చెరువులు,కుంటలు ఎక్కడ కూడా కాలుష్యం ఉండేది కాదు. మరీ ఇప్పుడు నీళ్ళు త్రాగాలి అంటే కొనాల్సిందే ప్రకృతి ప్రసాదించిన నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. కారణం స్వచ్చమైన నీరు లభించక పోవడమే. నీటి వనరులను కాలుష్యం చేసి నీటి వ్యాపారం చేస్తున్నారు.


    పట్టణీకరణ, పరిశ్రమల స్థాపనతో నీటి వనరులను పూర్తిగా కలుషితం చేస్తున్నారు. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. ఆ నీటితో చెరువులోని నీరు తాగేందుకు కాదుకదా కనీసం తాకడానికి కూడా పనికి రాకుండా పోతుంది. మనుషులైతే డబ్బులు పెట్టి కొని నీళ్ళు త్రాగుతారు. మరి జంతువులు, పక్షులు ఎలా త్రాగుతాయి నీరు. మనిషి తన అత్యాశకు పోయి ఇతర జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. వాటికి కనీసం తాగేందుకు నీరు లేకుండా చేస్తున్నాడు.  ఆలోచించండి ఇకనైన మేల్కొని నీటి వనరులను కాపాడుకుందాం. మనతో పాటు ఇతర జీవుల మనుగడకు ఎలాంటి హాని తలపెట్టకుండా నీటి వనరులను కాలుష్యం చేయకుండా  కాపాడుకుందాం..


కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు..


ఎవరైతే నీటి వనరులను కాలుష్యం చేస్తారో వారికి త్రాగేందుకు నీరు దొరకదు..

కాని ఇప్పుడు బడా బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు చేసిన నీటి కాలుష్యం వల్ల పశుపక్ష్యాదులు, సామాన్య ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.


బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల ధన దాహానికి   నేల, నీరు కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమల వలన భూమిపై ఉన్న నీటి వనరులే కాకుండా భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. రసాయన పరిశ్రమల వారు కాలుష్య జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. అలాగే భూమిలోకి బోర్లు వేసి అందులోకి రసాయనాలను పంపిస్తారు దీనివలన భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఎక్కడ బోరు బావి తవ్విన రసాయనాలతో నిండిన నీరే వస్తుంది. ఎంత దారుణం అండి ఇది చుట్టుపక్కల వారికి ఈ పరిశ్రమల వలన ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి వారు కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ నేలని,నీటిని, పరిసరాలను కాలుష్యం చేసి స్థానికులకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు...


   

ఇంతవరకు మా వైపు అయితే ఈ దరిద్రపు గొట్టు రసాయన పరిశ్రమలు లేవు. రావొద్దనే కోరుకుంటున్నాను.


 రాను రాను మా వైపు కూడా అభివృద్ధి పేరిట ఈ రసాయన పరిశ్రమల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో విచ్చలవిడిగా పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు హైదరాబాదు చుట్టుపక్కల మాత్రమే ఉండే రసాయన పరిశ్రమలు ఇక పచ్చని పల్లెల వైపు వస్తాయి. ఇక్కడ నేల, నీటిని కాలుష్యం చేస్తాయి. ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తున్నారు. కంచె చేను మేసినట్టు ప్రభుత్వమే నీటి వనరులను నాశనం చేయడానికి చూస్తుంటే ఇంకా ఎవరు వాటిని కాపాడేది.

  ఇప్పటికైతే నేను చిన్నప్పుడు వేసవిలో చెలిమల్లో నీటిని తాగినా నది ఇప్పటికి స్వచ్చమైన నీటితోనే ప్రవహిస్తుంది.

ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిశ్రమలు లేవు. ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటా..

గత ఏడాది అక్టోబరులో మా నదిలో నేను  తీసిన వీడియోలు. ఇప్పటికి స్వచ్చమైన నీటితో ప్రవహిస్తుంది.







 

29, మార్చి 2022, మంగళవారం

ప్లాస్టిక్ మనుషులు

 



     మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేసాడు అవి మానవాలికి ఉపయోగంతో పాటు కీడు కూడా చేస్తాయి. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ అయిన రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని సరియైన విధంగా ఉపయోగిస్తే అందరికి శ్రేయస్కరం. కాని వాటిని చాలా మట్టుకు వినాశనం ఉండే విధంగానే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తే మేధావులు తమ అతి తెలివితో వినాశనానికి దారితీస్తున్నారు.


ఏ ఆవిష్కరణ అయిన తరువాత వ్యాపారం అయిపోతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారాలతో ప్రకృతిని నాశనం చేస్తారు. 


మనిషి ఆవిష్కరించిన వాటిలో అత్యంత చెత్త ఆవిష్కరణ "ప్లాస్టిక్".  ఇది ఎంత చెత్త ఆవిష్కరణ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెత్తే కనిపిస్తుంది.

నేలపై, నదుల్లో, సముద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ చెత్తే కనిపిస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.. ఇన్ని రోజులు బయట మాత్రమే ఉండే ఈ చెత్త ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరంలో రక్తంలోకి కూడా చేరింది... ఇన్నాళ్లు పర్యావరణాన్ని చెత్తగా మార్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరాన్ని చెత్తగా మారుస్తుంది.


      ఆవిష్కరణలు మనిషి జీవన విధానాన్ని ఎంత సులభతరం చేస్తయో అంతకంటే ఎక్కువగా నాశనం కూడా చేస్తాయి. ఆవిష్కరణలు రెండు వైపుల పదును వున్న కత్తుల్లాంటివి వాటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది విచ్చలవిడిగా వాడితే ముప్పు తప్పదు.. 

     

    ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మానవ శరీరంలో రక్తంలోకి ఎలా చేరింది.?

    

 ఎలా చేరిందంటే మనిషి విచ్చలవిడిగా వాడడం వలనే.



 అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది.



అందులో కొన్ని నాకు తెలిసినవి:-


ఉదయం నుంచే మన పరుగు ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది.


ఉదయము కూరగాయలకు వెళ్తారు ఖాళీ చేతుల్తో. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు నింపుకుని వస్తారు.



పాలు ప్లాస్టిక్ కవర్లో.


కిరాణా సరుకులు ప్లాస్టిక్ కవర్లో.


బయట  ఎక్కడైన టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో నే.


భోజనం ప్లాస్టిక్ ప్లేట్లలో నే.


ఆహారం ప్యాక్ చేయడం ప్లాస్టిక్ కవర్లో నే.


టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు.


అసలు ప్లాస్టిక్ వాడకం అనేది మామూలుగా లేదు అవసరం ఉన్నా లేకపోయినా వాడడం మాత్రం పక్కా.


అంతలా వాడితే మనిషి రక్తంలో ఏంటి ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ అయిపోయి "ప్లాస్టిక్ మనుషులు" గా మారిపోయిన ఆశ్చర్యం లేదు..!!!



ఉదయం లేవగానే కూరగాయలకు ఒక సంచి తీసుకుని వెళ్తే ఏమవుతుంది.? చాలామందికి చేతిలో సంచి తీసుకుని బయిటకు వెళ్తే నామోషో లేక బద్ధకమో తెలియదు కాని అస్సలు తీసుకెళ్ళరు.


 ఖాలీ చేతుల్తో కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళి గంపెడు ప్లాస్టిక్ చెత్తను తీసుకువస్తారు. సరే తెచ్చారు వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా చేస్తారా అంటే అదిలేదు. ఇష్టం వచ్చినట్టు బయట పారేయడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఇలా కాల్చడం వలన ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసి ఆ గాలి పీల్చునప్పుడు శరీరం లోకి ప్రవేశిస్తున్నాయి.


ఇంకొందరు మహానుభావులు వేడి వేడి 'టీ' ని  కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు. టీ కొట్టు వాడికి తెలియక పోవచ్చు వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయోద్దని చదువుకున్న వాళ్ళుకూడా తెలియదా అలాగే తాగుతున్నారు. అంత వేడి టీ ని ప్లాస్టిక్ కవర్లో పోస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి టీలోకి వెళ్ళి అది తాగినవారి శరీరం లోకి వెళుతుంది.

అలా చేయకుండా ఒక ప్లాస్క్ వాడితే సరిపోతుంది కదా. ప్లాస్క్ వాడడానికి బద్దకం, ఆ ప్లాస్క్ ను కొట్టు వరకు తీసుకువెళ్ళడానికి నామోషి. 


ఇక నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో.

పల్లెటూళ్ళలో అయితే ఒకసారి తాగిపడేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ని పదే పదే నీళ్ళు నింపుకుని వాడుతుంటారు.  ఈ ప్లాస్టిక్ బాటిల్స్  లో ఎక్కువ రోజులు నీళ్ళు తాగితే అందులోని ప్లాస్టిక్ కణాలు అందులోని నీటిలోకి వెళ్తాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాడుతూ ఉంటారు. తెలిసిన 

ఎవరూ చెప్పరు, చెప్పిన ఎవరూ వినరు...




     ఇంకా పెళ్ళిళ్ళు, దావత్ లకు అప్పట్లో మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో భోజనం వడ్డించేవారు. ఆ విస్తరాకుల్లో  తృప్తి గా భోజనం చేసేవాళ్ళం. వాటిని తీసుకెళ్ళి పెంటలో వేసే వాళ్ళు అవి ఎరువుగా మారేవి... ఇప్పుడు పేపర్ ప్లేట్లో వడ్డిస్తున్నారు ఈ పేపర్ ప్లేటునుంచి ఏదో దుర్గంధం వస్తుంది. పైగా వాటిపై ప్లాస్టిక్ కవర్ ఉంటుంది వేడి పదార్థాలు అందులో తింటే  ప్లాస్టిక్ శరీరంలోకి చేరకుండా ఉంటుందా..?


ఎంత చక్కనివండి  అప్పట్లో మన పల్లెల్లో "మోదుగ ఆకులతో" తయారు చేసిన విస్తరాకులు. అందులో భోజనం చేస్తే అమోఘం. వీటి వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా అవి ఎరువుగా ఉపయోగపడుతాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ విస్తరాకుల వలన అన్ని విధాలుగా నష్టమే ఎక్కువ...


మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని మరిచిపోయి ప్లాస్టిక్ వెంట పరిగెత్తి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం...



ప్లాస్టిక్ వలన ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం ఎక్కువగా వాడుతున్నారు. కాని పరోక్షంగా దీని నష్టాలు గమనించడం లేదు.


ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది..


కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళినప్పుడు జనపనార (జ్యూట్ )బ్యాగులు కాని కాటన్ బ్యాగులు కాని వెంట తీసుకెళ్ళాలి.


పేపర్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాని, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకులు వాడాలి.


బయట నుండి పార్శిల్ తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకోవడం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.....








28, మార్చి 2022, సోమవారం

అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.

 





అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. 

  పచ్చటి పంటపొలాలను నాశనం చేసి ఫ్లాట్లు చేస్తున్నారు. 

ఒకప్పుడు మా ఊరి భూముల్లో పంటలు

పండేటివి.కాని ఇప్పుడు ఫ్లాట్లు పండుతున్నాయి. 

హైదరాబాద్ కు చుట్టుపక్కల 100 కి.మీ దూరంలో ఎక్కడ చూసినా పొలాలు లేవు ఫ్లాట్లు, వెంచర్లే కనిపిస్తాయి. అక్కడక్కడ కొంత పొలాలు ఉన్న ఇంకొన్ని రోజుల్లో అవి కనుమరుగైపోతాయి.


ఎవరి నోట విన్న వెంచర్లు,ప్లాట్లు,కోట్లు ఇవే మాటలు.


    రైతులకు లక్షలు,కోట్లు ఆశ చూపించి భూములు కొనుగోలు చేయడం వెంచర్లు వేయడం ఇదేపని.

పాపం రైతులు ఎప్పుడు అంతడబ్బు చూసి ఉండరు ఒకేసారి ఎకరం కోటి రూపాయలు అనేసరికి ఎగిరిగంతేసి భూములు అమ్మేసుకుంటున్నారు.

భూములు అమ్మని రైతులను ఎలాగోలా అమ్మేలా చేస్తున్నారు. రైతుల భూములకు దారిలేకుండా చేసి భూములు అమ్ముకునేలా చేస్తున్నారు.


రోడ్డు ప్రక్కన భూమి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ గ్రద్దలు అక్కడ వాలిపోతాయి. ఆభూమిని ఎలాగోలా ఎన్ని డ్రామాలు ఆడైనా కొనేస్తారు.  ముందుగా రోడ్డు ప్రక్కన ఉన్న భూమిని కొనేస్తే వెనకాల ఉన్న పొలాలను కొనడం వారికి తేలికవుతుంది. ఎందుకంటే వారికి దారి ఇవ్వకుండా చేసి భూములు అమ్మేలా చేస్తారు. పచ్చని పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకోవడం. మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారు,అవుతున్నారు. వేలిముద్రలు (అంగూటి) వేసేవాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. 

మద్యలో బ్రోకర్లు అబ్బో వీళ్ళగురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారులదైతే ఆచరణ బ్రోకర్లది. వీళ్ళు ఏలాగైనా సరే రైతులను భూములు అమ్ముకునేలా చేస్తారు. ఎలాగైనా సరే....!

 వాళ్ళ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు...



నా చిన్నప్పుడు పంటపొలాల్లో అన్నిరకాల పంటలు పండేవి. రాను రాను పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు అవికూడా లేవు 50% పంటపొలాలు ప్లాట్లుగా మారాయి. ఎందుకు ఈపరిస్థితి దాపురించింది అంటే.నా చిన్నప్పుడు పంటలు బాగా పండేవి పాడిపశువులు ప్రతీ ఇంటికి ఉండేవి. వాటి పేడ ఎరువుతోనే పంటలు పండేవి. చీడపీడలు ఉండేవి కావు. రసాయన మందులు అసలు ఎవరికి తెలియదు.కృత్రిమ ఎరువులు, విత్తనాలు వాడలేదు. అప్పుడు రెైతులు అన్నిరకాల అపరాలు,జొన్నలు,వరి,  మిరప, కొర్ర, సజ్జలు, రాగులు,పసుపు వంటి ఆహార పంటలే పండించేవారు.

వ్యవసాయం అంటే పెట్టుబడి ఉండేదే కాదు కేవలం రైతు శ్రమే వ్యవసాయానికి పెట్టుబడి. విత్తనాలు సొంతంగా తయారు చేసుకునేవారు,ఎరువులు పశువుల పేడ. అలా వ్యవసాయం చేసారు కాబట్టి దిగుబడులు బాగా వచ్చేవి. 

ఎవరి ఇంట్లో చూసినా గుమ్ములకు, గుమ్ములు జొన్నలు,బియ్యం,కందులు,కొర్రలు, పెసలు ఉండేవి. 

డబ్బు ఎక్కువగా ఉండేదికాదు. అయినా సంతోషంగా ఉండేవాళ్ళు. 


ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి వ్యవసాయం నాశనం అవుతూ వచ్చింది. డబ్బు ఆశ చూపించి ఈ పంటలు వేస్తే  ఇంత దిగుబడి వస్తుంది ఇంత ధర ఉంటుంది అంటు రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్ళేలా చేసారు. ముఖ్యంగా పత్తిపంట. మొదట్లో దిగుబడులు బాగా వచ్చే సరికి చాలామంది రైతులు పత్తిపంట వేయడం ప్రారంభించారు. పత్తి విత్తనాలు రైతులు తయారు చేసుకోలేరు విత్తన కంపేని వారు తయారు చేసే విత్తనాలే వాడాలి. అలా విత్తన కంపెనీలు విత్తనాన్ని తమగుప్పిట్లోకి తీసుకుని వ్యాపారం మొదలెట్టాయి.

ఏం భూమిలో అయినా ఎన్ని రోజులు దిగుబడులు వస్తాయి ఒకే పంట వేస్తుంటే? మొదట్లో దిగుబడులు వచ్చినా రాను రాను దిగుబడులు తగ్గాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యాపారం మొదలైంది ఎరువుల వ్యాపారం ఈ ఎరువులు వాడండి దిగుబడి పెరుగుతుంది అని ఎరువులు కొనేలా చేసారు. తరువాత పురుగుమందులు ఇలా మొత్తం వ్యవసాయాన్ని పెట్టుబడి లేనిదే చేయలేమనే స్థాయికి తీసుకొచ్చారు. 


ఒకప్పుడు రైతులు స్వయంగా తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసుకునేవారు. పురుగుమందుల వాడకం అసలే ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడి లేనిదే చేయలేని స్థితికి తీసుకొచ్చారు.

వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొచ్చారు.

ఒకప్పుడు ఆహారం పంటలు మనదగ్గరే పండేవి కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి ఆహార పంటలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గాయి.పశుసంపద తగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్ని కొనుక్కోవలసిందే.విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనిదే ఏమి తినలేం. పంటలు ఎలాగు పండవు అందుకని భూములు అమ్ముకొంటున్నారు.



అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు తిని హాయిగా ఆరోగ్యంగా జీవించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, పురుగుమందులు వేసి పండించిన పంటలు  తిని రోగాల పాలు అవుతున్నారు. 


ఇదా అభివృద్ధి అంటే...???



  మనిషికి కావలసింది ఏంటి కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యకరమైన జీవితం. అంతే కాని డబ్బు కాదు. 

  

కాని డబ్బు డబ్బు అని ఆశ చూపించి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని నాశనం చేస్తున్నారు.

దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చేను కంచె చేసినట్టు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నరు. ఎందుకు ఈ కోట్లు డబ్బులు తింటారా, ఆరోగ్యం పాడైనాక ఎన్నికోట్లు ఉండి ఏం లాభం. పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నాశనం చేసే కోట్ల రూపాయల డబ్బు ఎందుకు...? పర్యావరణం నాశనం అయ్యాక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి మునుపటి స్థితికి రాదు. 


 111 జీవోను ఎత్తేసి రెండు నదుల పరివాహక ప్రాంతంలోని రైతులను కోటీశ్వరులను చేస్తాం  అని సారు చెప్తున్నాడు. జీవో ఎత్తేస్తే ఏమవుతుంది ఆ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలు, అపార్ట్ మెంట్లు పరిశ్రమలు వస్తాయి.పరిశ్రమలనుండి విడుదలయ్యే కాలుష్యం తో రెండు నదులు, రెండు జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో గాలి,నీరు,నేల అన్నిరకాలుగా కలుషితమే. ఇప్పుడు జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుంది. జీవో ఎత్తేస్తే అటుపక్కకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది.

 ఎలాగంటారా ఆ సుగంధాన్ని భరించలేం మరి....!!!


  2018 లో  హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, బుద్దుని విగ్రహం చూద్దామని నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగాను. అక్కడ నుండి ప్రారంభం అయ్యింది ఏదో దుర్గంధం ఎంటీ వాసన అనుకుంటూ  ముందుకు నడుస్తున్నాను. అప్పటికే ఆ వాసనకి తల పట్టేసింది ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సువాసన పెరిగిపోయింది. ఈ లోపు హుస్సేన్ సాగర్ కనబడింది. అందులో నీళ్ళు చూసేసరికి అర్థం అయింది ఆ దుర్గంధం ఈ సాగర్ నుండే వస్తుందని. ఆ నీళ్ళల్లో కూడా బోటు షికారు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుండే ఆ వాసన భరించలేక తల తిరుగుతోంది అలాంటిది హుస్సేన్ సాగర్ మద్యలో   బోటు షికారు చేస్తున్నారు అంటే నిజంగా మీకు దండం పెట్టాలి..🙏🙏🙏🙏

 అంతటి దుర్గంధభరితమైన నీటిలో బోటు షికారు చేసే వారిని చూసినపుడు నాకు ఆశ్చర్యం,జాలి, అసహ్యం, అన్ని ఒకేసారి అనిపించాయి..

 అతిపెద్ద సాహసం అది.....!!!

 5నిమిషాలు కూడా అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కు వెళితే అక్కడకు కూడా సాగర్ సువాసన వస్తూనే ఉంది..

 నేను చాలా సార్లు విన్నా ట్యాంక్ బండ్,బుద్దుని విగ్రహం ఆ చుట్టుపక్కల పార్కులు బాగుంటాయి అని  గొప్పలు చెప్పెవారు. నాకు అక్కడకు వెళ్ళి చూడాలని కుతూహలంగా ఉండేది. ఇక్కడకు వచ్చి చూసాక తెలిసింది ఈ కాలుష్యం గురించా ఇంత గొప్పగా చెప్పారని.  ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో నిండిన ఆ ప్రాంతంలో10నిమిషాలు కూడా ఉండలేం.. అందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని... 

 ఇది చూసిన తర్వాత నేను ఒకటి బలంగా చెప్పగలను

 దీనికంటే లక్షరెట్లు మా ఊరి చెరువులు గొప్పవని..

స్వచ్చమైన గాలి, నీరు, నింగి,నేల ఉన్న నా పల్లెటూరు గొప్పది...


ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి సరస్సే కదా మరి ఇప్పుడు కాలుష్య సాగర్ గా మారింది. దీనికి కారణం అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వ్యర్థాలను సాగర్ లోకి వదిలి పెట్టి, కనీసం ఆనీటిని తాకడానికి కాదుకదా చూస్తేనే, అటునుండి వెళ్తేనే వాంతికొచ్చెలా చేసారు....

అభివృద్ధి వద్దనడం లేదు కాని ప్రణాలిక లేని అభివృద్ధి మానవాళికి చేటు.. ప్రపంచంలో హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు నదుల పక్కనే ఉన్నాయి అక్కడ ఇలాంటి కాలుష్యం లేదే... మరి మన దగ్గర ఎందుకిలా అంటే మన నాయకుల స్వార్థ రాజకీయాల వలన ఇలా ఉంది..


ఎందుకు ఇది చెబుతున్నానంటే  రోడ్లు, బిల్డింగ్స్ కట్టేసి   సహజ వనరులను మురికి కూపంగా మార్చడం అభివృద్ధి కాదు.. హుస్సేన్ సాగర్ బాగు చేయడం ఈ జన్మలో జరగదు. సరే వదిలేద్దాం.. ఇప్పుడు 111 జీవో ఎత్తేసి   జంట జలాశయాలను కూడా హుస్సేన్ సాగర్ లా మార్చాలనుకుంటున్నారు.... సారు..

ఇప్పుడు రెండు జలాశయాలు స్వచ్చమైన నీటితో శుభ్రంగా ఉన్నాయి.. వాటి చుట్టుపక్కల పరిశ్రమలు, బిల్డింగ్స్ కట్టేసి వాటిని కూడా మురికి కూపంగా మార్చేయాలి... ఇదేందయ్యా ఇది అంటే అభివృద్ధి..

అప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను హుస్సేన్ సాగర్ 2, హుస్సేన్ సాగర్ 3అని అనాలి...

ఇప్పటికీ మూసీ నది గండిపేట చెరువు వరకు స్వచ్ఛమైన నీటితో జూన్ లో వర్షాలు ప్రారంభం నుండి డిసెంబర్ వరకు ప్రవహిస్తుంది. మన నాయకుడు అభివృద్ధి చేసిన తర్వాత మురికి కూపంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది వ్యర్ద జలాలతో.


ఎవరు 111 రద్దు చేయమని చెప్పింది. ఈ జీవో వలన భూముల ధరలు లేక రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. రైతుల నష్టం ఏమో కాని నాయకుల లాభం కోసం అని అందరికి తెలిసిందే... నిజంగా ఏ నాయకుడికి రైతులపై, ప్రజలకు మంచి చేయాలని ఉండదు.    కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇన్ని డ్రామాలు. ఆ ఓట్లను నోట్లతో కొనాలి. మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇలా అభివృద్ధి పేరిట దోచుకుంటే వస్తుంది..


అయ్యా మీరు ప్రజలను కోటీశ్వరులను చేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను నాశనం చేయకుంటే చాలు అదే పదివేలు....🙏🙏😌😌..


సొంత లాభం కొంత మానుకోని

పరుల సేవకు పాటుపడవోయ్.


ప్రజల సేవకు పాటు పడకపోయినా పర్వాలేదు.

పర్యావరణాన్ని నాశనం చేయకండి..







10, మార్చి 2021, బుధవారం

బంగారు తెలంగాణ కాదు కాలుష్య తెలంగాణ.

        

                మనిషి ప్రశాంతంగా,ఆరోగ్యంగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి,నీరు ఎంతో అవసరం. స్వచ్ఛమైన గాలి,నీరు ఎక్కడ లభిస్తుంది అంటే పల్లెటూర్లో లభిస్తుంది అని అందరూ చెబుతారు. ఎందుకంటే పట‌్ట‌ణాల్లో గాలి,నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పట‌్ట‌ణాల్లో,నగరాల్లో నివసించే ప్రజలు వారాంతాల్లో నగర కాలుష్యానికి దూరంగా పల్లెల వైపు వచ్చి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తుం‌టారు.  పల్లెటూళ్ళంటే పచ్చని ప్రకృతితో, స్వచ్చమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండేవి.  ఉండేవి అని ఎందుకన్నానంటే అది గతంలో ఇప్పుడు కాదు. ఎందుకంటే  ఇప్పుడు        పల్లెటూళ్ళు కాలుష్యంలో  పట‌్ట‌ణాలతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కాలుష్యంలో పట‌్నంకు, పల్లెకు తేడా లేదు. 

               

              ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండే పల్లెల్లో ఇప్పుడు కాలుష్యంతో విలవిల ాడుతున్నాయి. పట‌్ట‌ణాల్లో  వాహనాల పొగ, ప్లాస్టిక్ వ్యర్ధాలు, డ్రైనేజీల వలన కాలుష్యాం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉం‌టారు. వీరికి కాలుష్యం పట‌్ల అవగాహన కూడా ఉంటుంది. అయిన పర్యావరణ కాలుష్యం గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అందువలన పట‌్ట‌ణాలెప్పుడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పల్లెలు కూడా కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం విపరీతంగాపెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి చదువుకున్న వాళ్ళే పట‌్టించుకోరు. ఇక పల్లెల్లో ఉండే చదువుకోని ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండదు. అందువల్ల పల్లెల్లో కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా గాలి  కాలుష్యం పెరిగిపోయింది. ఎలా అంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తగల పెట‌్ట‌డం వలన గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది.  ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం విపరీతంగాపెరిగిపోయింది. క్యారీబ్యాగ్, కూల్ డ్రింక్స్ బాటిల్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్,    ప్లాస్టిక్ విస్తరాకులు, చిప్స్ ప్యాకెట్స్ ఇలా అన్ని ప్లాస్టిక్ మయమే వీటిని వాడిన తర్వాత ఒక దగ్గర వేసి కాల్చి వేస్తున్నారు. దీని వలన ఏర్పడిన పొగ వలన పర్యావరణ ానికి ఎంత ప్రమాదమో వారికి తెలియదు, ఆ పొగ పీల్చటం వలన ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో వారికి తెలియదు. ఇది తెలియక చాలామంది ప్లాస్టిక్ వ్యర్ధాలను తగలబెడుతుంట ారు. ఇదివరకు ఎవరి ఇళ్ళముందు వారు తగలబెట్టెవారు. దీని వలన కొంత సమయం గాలి కాలుష్యం ఆ చుట్టు పక్కల ఉండేది. కానీ ఇప్పుడు  ఈ గాలి కాలుష్యం, పొగ రోజంతా పల్లెలను పట్టి పీడిస్తోంది. ఇలా రోజంతా గాలి కాలుష్యం, పొగ రావడానికి కారణం ప్రభుత్వాల అతి తెలివి వల్ల నేడు గ్రామాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది.


              ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం నడుస్తుంది. తడిచెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని కొన్ని గ్రామాల్లో రెండు చెత్త బుట్టలను ఇవ్వడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. ఇక్కడ వరకు ప్రభుత్వం చేసిన పని మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ చెత్త డబ్బాలు కొన్ని గ్రామాల్లోనే ఇచ్చారు. చాలా గ్రామాల్లో ఇవి ఇవ్వలేదు. సరే ఇవ్వలేకున్నా సరే మేమే తెచ్చుకుంటాం చెత్తను   వేరు చేసి ఇస్తాం ఈ చెత్తను ప్రభుత్వం ఏమి చేయాలి? పర్యావరణ ానికి హాని కలిగించకుండా రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా తడి చెత్త, పొడి చెత్త , ఆ చెత్త ఈ చెత్త అని తెడా లేదు అన్ని చెత్తలు ఒకటే అన్నట‌్టు ఒకే చోట‌ వేస్తున్నారు. ఈ చెత్త  సేకరించే వారు ఉదయం ఒక ట‌్రాక్ట‌ర్ తో గ్రామంలో మొత్తం తిరిగి అన్ని రకాల చెత్తలు అందులో వేసుకుని ఊరి బయట‌ ఉన్న చెత్త డంప్ యార్డ్ లో వేస్తున్నారు.  ఇక్కడ వరకు బాగానే ఉంది కదా?  తెలంగాణ గ్రామాలు దీని వలన స్వచ్ఛంగా వెలిగిపోతున్నాయి అని మీరు అనొచ్చు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని కూడా అనొచ్చు. కాని నేను మాత్రం ఇది పరమ దరిద్రమైన చెత్త పని అని అంటాను.... ఎందుకంటే ఒకపని చేస్తే ప్రజలకు మేలు కలగాలి కాని ఈ చెత్త సేకరించే పని వలన ప్రజలకు నష్ట‌మే తప్ప మేలు జరగడం లేదు.


           ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో చెత్త డంప్ యార్డులు నిర్మించారు. దాంట‌్లో చెత్తను వేరు చేయడానికి అన్నట‌్టు చిన్న చిన్న గదులు నిర్మించారు. అందులో  గ్రామాల్లో సేకరించిన చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పడు ఏం చేస్తున్నారంటే డంపు యార్డ్ ముందు ఒక పెద్ద గుంత తీసి గ్రామంలో సేకరించిన చెత్తను అందులో వేసి తగలబెడుతున్నారు. దీని వలన 24/7 365 రోజులు అది మండుతూనే ఉంటుంది. ఆ పొగ పగటి పూట‌ పైకి వెళుతుంది. అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాని సాయంత్రం పూట‌ చుట్టు పక్కల మొత్తం పొగతో నిండిపోయి నరకం కనిపిస్తుంది. గాలి పీల్చాం‌టేనే భయం వేస్తుంది. దగ్గు, ఆయాసం, కళ్ళ మంట‌లు నరకయాతన.

       అసలు ప్రభుత్వాలకు ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకొస్తాయో..? 😭😭😭 మా గ్రామంలో అయితే సాయంత్రం అయ్యిందం‌టే చాలు ఈ చెత్త డంపు యార్డ్ వల్ల దానికి దగ్గరగా ఉన్న ఇళ్ళ ప్రజలు    చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకు ఉదాహరణ నేనే... సాయంత్రం నుండి ఉదయం వరకు ఆ పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నా. నా పక్కన ఎవరైన సిగరెట‌్ తాగితేనే నాకు పడదు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అలాంటిది లక్షల సిగరెట్లు  కాల్చినంత పొగ వస్తే ఏం చేయాలి. ఉపాది లేక  దశాబ్దం పాటు ఊరు వదిలి వెళ్ళిపోయాం.అక్కడ నానా కష్టాలు పడ్డాం. తెలంగాణ వచ్చాక మన బతుకులు బాగు పడతాయని సొంత ఊరికి వస్తే ఇక్కడేమే స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.????

        బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందో అందరికి తెలిసిందే. ఒక కుటుంబం బాగు పడితే చాలా...???


ఇది చాలా చిన్న సమస్య ఇంత పెద్ద రాద్దాంతం చేయడం అవసరమా అని మీరు అనొచ్చు. ఆ కష్టం అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ భాదేమిటో.  ఎక్కడైన పొగ వస్తేనే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాం అలాంటిది మన ఇంటికి దగ్గర 24 గంట‌లు పొగ అది కూడా ప్లాస్టిక్ ను తగలబెట్టిన పొగ వస్తే ఎలా ఉం‌టుందో ఆలోచించండి. ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చి అనారోగ్యాల పాలయితే ఆసుపత్రుల చుట‌్టు తిరిగే స్తోమత మాకు లేదు. నాకు ఆసుపత్రులంటే మహా భయం.. అక్కడకు వెళ్ళాలంటే ఇంట‌్లో డబ్బులు కాసే చెట్లు ఉండాలి. అయినా ఆసుపత్రుల చుట‌్ట‌్టు తిరగడం కం‌టే ఆరోగ్యంగా ఉండట‌మే మేలు కదా..  


            కెసిఆర్ సార్ అంటే నాకు ఎంతో అభిమానం... నా చుట్టూ ఉండే వాళ్ళు ఎందరు కెసిఆర్ సార్ ను విమర్శించిన

 సార్ గొప్పవాడు  విమర్శించడం తప్పు అనేవాడిని . నేనే తప్పు అని ఇప్పుడు అర్థం అయ్యింది.. ఒక పని చేసే ట‌ప్పుడు అది పూర్తిగా  అమలు జరిగేలా చూడాలి అది వారి బాధ్యత. కాని ఆ పనిని  సగంలోనే వదిలేస్తే   బాధ్యతారాహిత్యం అంటారు.. ఈ చెత్త డంప్ యార్డులు ఎందుకు కట‌్ట‌డం జరిగింది అక్కడ జరుగుతున్నదేమిటి. అది పూర్తిగా నిర్దేశించిన పని జరుగుతుందా లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి లేదా....??  కెసిఆర్ సార్ బంగారు తెలంగాణ అంటాడు సార్ మాకు బంగారు తెలంగాణ అవసరం లేదు. మాకు స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు నీ బంగారు తెలంగాణలో...


నా తెలంగాణ ఇప్పుడు కాలుష్యానికి చిరునామా. 

కెసిఆర్ సారూ నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏

మీరు ఈ రాష్ట‌్రాన్ని బంగారు తెలంగాణ చేయకపోయిన పరవలేదు కానీ కాలుష్య తెలంగాణగా మాత్రం చేయకండి..


ఇక చివరగా ఒక మాట‌.. కెసిఆర్ సార్ చెప్పిన బంగారు తెలంగాణ ఎక్కడుందంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం హాయిగా ఆయన నివసిస్తున్నారు. సార్..... మీరు ముఖ్యమంత్రి అయ్యింది మీ కు‌టుంబం మాత్రమే హాయిగా ప్రశాంతంగా,ఆరోగ్యంగా జీవించడానికి కాదు. తెలంగాణ ప్రజలు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలి. దాన్ని అం‌టారు బంగారు తెలంగాణ అని.. నీ ఫామ్ హౌస్ పక్కన ఒక చెత్త డంపు యార్డ్ ఉండి ఊరి చెత్తనంతా అక్కడ వేసి తగలబెడితే తేలుస్తుంది మా బాధేమిటో. ఈ మాట‌ మీకు కోపం కలిగిస్తే, మాట‌ అన్నందుకే మీకు కోపం వస్తే మీరు గ్రామాల్లో కట‌్టించిన చెత్త డంపు యార్డుల   పొగ వల్ల నరకం అనుభవిస్తున్న మాకు ఎంత రావాలి మీపై కోపం..😠😠😠😠😠😠😠😠😠😠


ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి.  కొండలు తవ్వేయడం, పచ్చని పంట‌ పొలాల్లో కంపెనీలు,  వెంచర్లు వేయడం వలన పర్యావరణం నాశనం అవుతుంది.. ఇక ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటీ అవసరాలు తీర్చిన జంట‌ జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కాలుష్యం కాకుండా 111 జీవో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పడు కెసిఆర్ ప్రభుత్వం వచ్చింది కదా బంగారు తెలంగాణ చేయాలి కదా ... అందుకే కెసిఆర్ సార్ 111 జీవోను కూడా ఎత్తి పడేస్తా అని చెప్పాడు.. నాకు తెలుసి కెసిఆర్ సార్  తెలంగాణ రాష్ట‌్రాన్ని కాలుష్యంగా మార్చడానికే కంకణం కట‌్టుకున్నట్టున్నాడు..

ఈ రెండు జలాశయను కూడా హూస్సేన్ సాగర్ లాగా  సుగంధభరితమైన జలాశయాలుగా మార్చాలనుకుంటున్నాడు. సారూ మీరు బంగారు తెలంగాణ చేస్తాను అం‌టే ఈ విధంగా చేస్తావనుకోలేదు..

సారూ కెసిఆరూ ఇలాంటి బంగారు తెలంగాణ మాకు వద్దు..... నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏��











              






                 












          

10, అక్టోబర్ 2019, గురువారం

ప్రకృతి పండుగ దసరా




  దసరా పండుగకు ఊరెళితే  కనిపించిన అందమైన ప్రకృతి దృశ్యాలు..‌

చామంతి పూలు


చామంతి
చామంతి

చెక్ డ్యాం


29, సెప్టెంబర్ 2019, ఆదివారం

గోధుమ గడ్డి



wheatgrass
గోధుమ గడ్డి

       



గోధుమ గడ్డి పెంచే విధానం:-

ఒక కప్పు గోధుమలు తీసుకుని కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి 12 గంటలు నానబెట్టాలి.

12 గంటలు నానిన తర్వాత నీళ్ళు ఒంపేసి ఒకసారి కడిగి ఒక కాటన్ గుడ్డలో మూటకట్టి ఒకరోజు ఉంచాలి.

తర్వాత ఒక ప్లాస్టిక్ ట్రే తీసుకుని దానికి అడుగు భాగంలో రంధ్రాలు చేయాలి. అందులో సగం వరకు  మట్టిని పోయాలి. ఈ మట్టిలో  వర్మీ కంపోస్టు ఎరువు కలుపుకుంటే గడ్డి బాగా వస్తుంది.

మట్టి పోసిన తర్వాత మొలకెత్తిన గోధుమలను ప్లాస్టిక్ ట్రే లో ఒత్తుగా వేయాలి. అలా వేసిన తర్వాత పైనుండి  గోధుమలు మునిగేలా మట్టిని పోసి నీళ్ళు పొయ్యాలి.

ఈ ట్రేను నీడలో ఉంచాలి.
ఉదయం సాయంత్రం వేళల్లో నీటిని చిలకరించాలి.


 గోధుమ గడ్డి  పది రోజులతర్వాత ఆరు అంగుళాలకు మించి పెరుగుతుంది.




wheatgrass

2, ఏప్రిల్ 2019, మంగళవారం

గిజిగాడు గూడు

       సాదారణంగా పక్షులు గుడ్లు పెట్టడానికి గూళ్ళు కట్టుకుంటాయి. అందులో ప్రత్యేకమైనది గిజిగాడు గూడు అసలు ఈ గిజిగాడు పక్షి గూడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేం.
అందంతో పాటు రక్షణ పరంగానే కాకుండా గిజిగాడు గూడు అన్ని విధాలుగా సౌకర్య వంతంగా నిర్మిస్తుంది.



                      అన్ని పక్షి గూళ్ళు మామూలుగా గంప మాదిరి పైన తెరుచుకొని ఉంటుంది వర్షం వచ్చిన గాలి వచ్చిన పక్షి పిల్లలకు రక్షణ ఉండదు అలాగే ఇతర ప్రాణుల నుండి కూడా రక్షణ ఉండదు.
కాని గిజిగాడు గూడు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. గిజిగాడు పక్షి గూడు నిర్మించే సమయంలో ముందుగా రక్షణ పరంగా ఉండేందుకు ముళ్ళ చెట్టును ఎంపిక చేసుకుంటుంది. తుమ్మ లేదా  ఈత చెట్ల కొమ్మల అంచున గూడును నిర్మింస్తుంది. చిన్న చిన్న పుల్లలతో ఎంతో ఓపికగా చాలా పటిష్టంగా గూడును అల్లుతుంది. ఈ గూడును బోర్లించిన కూజాలాగా నిర్మిస్తుంది. గూడులోకి వెళ్ళే మార్గం కిందినుండి ఉంటుంది. దాని లోపల ఇంకెంత అందంగా మలుస్తుందో, అందులో ఎన్ని గదులు ఉంటాయో! ఎంత మెత్తని పరుపులు నిర్మింస్తుందో కదా! మగపక్షి మాత్రమే గూడుని నిర్మిస్తుందట. తన పిల్లలని కంటికి రెప్పల కాపాడుకుంటాయి. ఆడపక్షి పిల్లల పోషణ చూస్తుందట.





ఈ గిజిగాడు పక్షులు అన్ని ఒకే చోట చాలా గుళ్ళు నిర్మించుకుంటాయి ఎందుకంటే ఇతర పక్షుల నుండి కాపాడుకోవడానికి అన్ని కలిసి కట్టుగా ఒక సమూహంలా ఒకే చోట గూళ్ళు నిర్మించుకుంటాయి.
ఏదైన ఆపద వస్తే అన్ని కలిసి వెళ్ళిపోతాయి.
ఎంత అద్భుతం కదా ఈ గిజిగాడు గూడు. అంత చిన్న పక్షి ఇంత అద్భుతంగా ఎంతో అందంగా మరియు చాలా పటిష్టంగా తన గూడును నిర్మింస్తుందంటె ఆశ్చర్యం వేస్తుంది.
 మనుషుల్లాగా అది డ్రాయింగులు వేయదు ఎలాంటి పనిముట్లు వాడదు ఏ కంపెనీల నుండి గూడుకు సరిపోయే పుల్లలను తీసుకురాదు. అయిన ప్రకృతిలో దొరికే సహజ సిద్దమైన వాటితోనే గూడును నిర్మించి ప్రకృతికి ఏలాంటి నష్టం కలుగజేయకుండా తన నైపుణ్యంతో గూడుని నిర్మించి ప్రకృతికి కొత్త అందాన్ని సంతరిస్తుంది.
గిజిగాడు గూడు నిర్మాణం ఇంజనీరింగ్ లకు సైతం అర్థం కానంతలా అద్భుతంగా  ఉంటుంది.



  గిజిగాడు గూడు ప్రకృతిలో ఓ అందమైన  అద్భుతమైన వింత.

ఓ గిజిగాడు గూడు కట్టడంలో నీవే మొనగాడు.

29, జనవరి 2019, మంగళవారం

పావురాల హారం

హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో చార్మీనార్, గోల్కొండ, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, కె. బి. ఆర్ పార్క్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇవే కాకుండా ఇంకో అధ్భు తమైన, ఆహ్లదకరమైన చోటు ఒకటుంది ఈ ప్రదేశాన్ని టూరిస్ట్ లీస్ట్ లో చేర్చాలి అని అనుకుంటున్నాను. అదే నెక్లెస్ రోడ్ ఎం ఎం టీ ఎస్ రైల్వే స్టేషన్. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ఉంది ఈ స్టేషన్ చాలా చిన్నది పెద్దగా రైల్లు కూడా ఎక్కువగా తిరగవు. దీని ప్రత్యేకత ఏమిటంటే పావురాలు ఎక్కువగా ఈ ప్రదేశంలో ఉంటాయి. స్టేషన్ పైకప్పు పై కరెంట్ తీగలపై చాలా పావురాలు ఎంతో అందంగా వాలుతాయి. కేవలం ఈ స్టేషన్ పరిదిలో మాత్రమే సందడి చేస్తాయి. చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. మరియు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
నాలాంటి ప్రకృతి ప్రేమికులు, ముఖ్యంగా పక్షి ప్రేమికులు ఇక్కడకు వస్తే ఈ పక్షుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఈ బిజీ నగరంలో ఈ ప్రకృతి సోయగాన్ని ఆస్వాదించే సమయం గాని అభిరుచి గాని ఎవ్వరికి ఉండవు. ఎందుకంటే నేడు మనిషి జీవితం యాంత్రికమైపోయింది.
ఒక పావురం చూడడానికి చాలా బావుంటుంది. అలాంటిది వేల పావురాలు ఒక దగ్గర చేరి సందడి చేస్తే కనువిందుగా ఉంటుంది.ఆ రైల్వే తీగలపై పావురాల హారంలా చూడముచ్చటగా ఉంటాయి.