భానోదయం: డిసెంబర్ 2019

6, డిసెంబర్ 2019, శుక్రవారం

సెల్యూట్ సజ్జనార్ సార్. పోలీస్ అంటే మీలా ఉండాలి.. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది..


దిశ ఉదంతంలో నేరస్థులకు ఇంత త్వరగా శిక్ష పడుతుందని అస్సలు ఊహించలేదు. ఆ మృగాలను ఎన్కౌంటర్ చేయడం సరియైనదే. వారం రోజుల్లోనే న్యాయం జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేరం రుజువైతే నేరస్థులను కోర్టులు, ఆ పై కోర్టులు అని తిప్పకుండా ఇలా ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్.
ఇంత త్వరగా న్యాయం చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
   
    పోలీస్ కమీషనర్ సజ్జనార్ సార్ మానవ మృగాల పట్ల మీరు సింహ స్వప్నం.
2008 లో వరంగల్లో ఇప్పుడు హైదరాబాద్ లో మృగాలకు త్వరగా శిక్ష విధించి (ఎన్కౌంటర్ చేసి) బాధితులకు న్యాయం చేసారు. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది. వి సెల్యూట్ సజ్జనార్ సార్.. సరిలేరు నీకెవ్వరు... మీలాంటి పోలీసులే ఈ సమాజానికి కావాలి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నాను. 

5, డిసెంబర్ 2019, గురువారం

ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు. కానీ సామాన్యులపైనే మొత్తం భారం వేస్తున్నారు.

   


       రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. పప్పులు, కూరగాయలు, బియ్యం, డీజిల్, పెట్రోల్, రవాణా చార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి మనకు ప్రతీరోజు అవసరమే. వీటి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ఈ ధరల పెరుగుదల దల వల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలు. అంటే రోజు కూలీలు, చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కిరాణా షాపుల్లో, బట్టల షాపుల్లో పనిచేసే  వారికి నెలకు పదివేల దాటి జీతం రాదు.
 ఇప్పుడున్న ధరలకు నెలకు పదివేల రూపాయల జీతం ఏ మూలకు సరిపోతుంది. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చిన్న చితక పనులు చేసే వారికి జీతాలు మాత్రం పెరగవు.

   ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఎక్కువగా భారం పడేది సామాన్యులకు మాత్రమే.
ఇక మిగితా వారిపై ఈ ధరల ప్రభావం అంత ఉండదు ఎందుకంటే వీరికి వచ్చే నెల జీతాలు భారిగానే ఉంటాయి కాబట్టి వారిపై ధరల పెరుగుదల ప్రభావం ఏమాత్రం ఉండదు.

ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుంటే ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగకైనా తక్కువలో తక్కువ నెల జీతం 30,000 రూపాయలు ఉంటుంది ఇది కనీసం గరిష్టంగా లక్ష రూపాయల జీతం కూడా వచ్చే ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతంతో పాటు అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. PF, ESI, లాంటి సౌకర్యాలు ఉంటాయి.  మరియు ప్రతీ మూడూ నెలలకోసారి ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇలా మూడు నెలలకోసారి జీతాలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వీరికి ఏమాత్రం భారం పడదు.

 ఇక ప్రైవేటు ఉద్యోగాలకు కూడా జీతాలు భారీగానే ఉంటాయి. అలాగే అలవెన్సులు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధరలు పెరుగుదల వల్ల ఎలాంటి భారం పడదు.

వ్యాపారస్తులకు కూడా  ధరలు పెరుగుదల ఎలాంటి భారం పడదు. పైగా వీరికి ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను కొని ఎక్కువ మొత్తంలో నిలువ చేసుకుంటారు. వాటి ధరలు పెరిగినప్పుడు అధిక మొత్తానికి  విక్రయించి కోట్లు సంపాదించుకుంటున్నారు‌.

      ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరగడం సహజం.
కాని వ్యాపారస్తులు కృత్రిమంగా నిత్యవసర వస్తువల కొరత సృష్టించి ధరలు పెంచేసి కోట్లు సంపాదిస్తున్నారు.

 నిత్యవసర వస్తువల ధరలు ఏ విధంగా పెరిగిన చివరకు భారం పడేది సామాన్యులకు మాత్రమే.
వీళ్ళను పట్టించుకునే నాథుడే ఉండడు. వీళ్ళు ఎలాగోలా బతుకు బండిని ముందుకు లాగాల్సిందే..
అదే ప్రభుత్వ ఉద్యోగులయితే తమకు జీతం సరిపోవడం లేదని సమ్మెలు చేసి వారికి కావాల్సిన డిమాండ్లను సాదించుకుని ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నారు.


     ఉదాహరణకు మొన్నటి వరకు సమ్మె చేసిన ఆర్టీసి వారినే తీసుకుందాం. 55 రోజులు సమ్మె చేసి ఇటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసారు. సమ్మె చేసినప్పుడు ఇబ్బందులకు పడింది సామాన్యులే. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసింది ఇప్పుడు కూడా  భారం పడేది సామాన్యులకే. ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. పని చేయకుండా 55 రోజులు సమ్మె చేసిన వారికి జీతాలు ఇస్తున్నారు. ఇంకా వీరికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించారు. ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన డబ్బు ఎలా వస్తుందండి. సామాన్యుల ముక్కు పిండి వసూలు చేయాల్సిందే కదా??
ఆర్టీసీ ఉద్యోగులు తమకు జీతాలు సరిపోవడం లేదని సమ్మెలు చేసి వారి డిమాండ్లను సాధించుకున్నారు. మరీ చిన్న చితక ఉద్యోగులు, రోజు కూలీలు ఎవరిని అడిగి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ దేశంలో గూర్తింపు ఉన్న ఉద్యోగులు మాత్రమే బతకాలా?? సామాన్యుల బతుకులు ఏమైనా పరవాలేదా ? వీళ్ళ గోడు ఎవడు పట్డించుకుంటాడు? ఏ నాయకుడు వింటాడు?

ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ధరల పెరుగుదల భారం వారిపై పడనీయరు. సామాన్యులపై వేసి వారి నడ్డి విరిచి పాతాళానికి తొక్కే స్తున్నారు. వాళ్ళు మాత్రం పైకెదుగుతున్నారు.
ఇలాంటప్పుడు సమాజంలో ఆర్థిక అసమానతలు ఎలా తొలగిపోతాయి.

      నా విన్నపం ఏమిటంటే చిన్న చితక పనులు, రోజు కూలీలు,కిరాణా షాపులు, బట్టల షాపులు, చిన్న పరిశ్రమలలో పనిచేసే వారందరూ ఒక యూనియన్ గా ఏర్పడి  మన సమస్యలను పరిష్కరించుకోవాలి. మనకు కూడా ఇంక్రిమెంట్లు, అలవెన్సులు, PF, ESI వంటి సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, పెద్ద పెద్ద పరిశ్రమల ఉద్యోగులు తమ సమస్యల కోసం సమ్మెలు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. అలాంటిది ఎలాంటి గుర్తింపు లేని ఈ ఉద్యోగాలు చేస్తూ ఎన్ని రోజులు ఇలా చాలి చాలని జీతాలతో బ్రతుకుతారు. మనం లేనిదే అక్కడ పని జరగదు. ఏ యాజమాని కూడా పని వాళ్ళు లేనిదే వ్యాపారం చేయలేడు. అందువల్ల మనం కూడా సమ్మెలు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలి...

3, డిసెంబర్ 2019, మంగళవారం

తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుండి సంస్కారవంతంగా పెంచితేనే సమాజంలో నేరాలు,ఘోరాలు జరగవు.


    
      ఇప్పుడు సమాజంలో 14 నుండి 25 ఏళ్ళ యువకులకు విలువలు అంటే ఏమిటో తెలియదు. పెద్దలంటే గౌరవం లేదు. మహిళల పట్ల గౌరవం లేదు. తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వడం లేదు.
పాఠశాల స్థాయి నుంచే వీరు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పేది వినరు వారికి ఎదురు తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఉపాధ్యాయులు మాత్రం ఏం చేస్తారు. మొక్కుబడిగా తమ పాఠాలు తాము చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకు సార్ మాకు ఈ చదువులు అనే విద్యార్థులు ఉన్నారు. వీరికి తెలుగు కూడా సరిగా చదవడం రాదు. ఎలాగోలా పది వరకు చదివి బయటకు వచ్చి ఆటోలో, లారీలో నడుపుకుంటూ అన్ని అడ్డమైన అలవాట్లు నేర్చుకుని నేరాలు చేసే స్థాయికి ఎదుగుతున్నారు.
  
        ఇప్పుడున్న యువతకు పెద్దలు పట్ల, మహిళల పట్ల, సమాజం పట్ల గౌరవం లేకపోవడానికి మరో కారణం ఇప్పుడొస్తున్న చెత్త సినిమాలు. ఆ మధ్య ఓ సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని ఈ సినిమా పోస్టర్ అసభ్యకరంగా ఉందని పెద్దాయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు గారు ఇలాంటి సినిమాల వల్ల యువత చెడిపోతుందని ఇలాంటి సినిమాలను అడ్డుకోవాలని చెబితే ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ 'చిల్ తాతయ్య' అంటూ చీప్ గా తీసిపారేసాడు. ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ అంటూ మూసుకుని కూర్చో అనే విధంగా మాట్లడాడు. ఆ సినిమాలో ఏముందో నాకయితే అర్థం కాలేదు కానీ జనాలు మాత్రం అంత పెద్ద హిట్టు చేసారు.  ఈ సినిమాలో బూతులు,ముద్దులు, ఎప్పుడు మందు తాగుతూ,డ్రగ్స్  తీసుకుంటూ ,  కామంతో రగిలిపోతూ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మన హీరో విజయ్ దేవరకొండ.  ఇంత చెత్త మూవీ జనాలతో పాటు సెలబ్రిటీలకు  ఎలా నచ్చిందో   నాకిప్పటికీ అర్థం కాదు. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మనం ప్రేమించిన అమ్మాయి పై ఎవడైనా చెయ్యి వేస్తే ఊరుకుంటామా అంటూ బూతులు తిడతాం, కొడతాం అన్నాడు. అవును ఎవరమైనా ఇలాగే చేస్తాం. మరీ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఒక సీన్లో వేరే వాడి భార్యతో ఎంతో కామంతో హీనంగా ప్రవర్తిస్తాడో చూసాం. ఇంతలో ఆమె భర్త వచ్చే సరికి అతని ముందు నుంచే హీరో విజయ్ దేవరకొండ వెళ్ళిపోతాడు. మరీ అప్పుడు ఆమె భర్త ఏమి చేయాలి హీరోని??? అంటే నువ్వు వేరే ఆడవాళ్ళను ఏమైనా చేయవచ్చు మీ ఆడవాళ్ళను ఎవరు ఏమి అనవద్దు ఎందుకంటే నువ్వు హీరోవనా??? నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యోచ్చా??? నీలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసూకునే యువత పాడైపోతున్నారు. ఇలాంటి సినిమాలు చూసి ఎవడికి వాడు హీరోలా ఫీలయిపోతున్నారు. సమాజం పట్ల, స్త్రీల పట్ల గౌరవం లేకుండా తయారవుతున్నారు. 

     యువత చెడిపోవడానికి మరో కారణం స్మార్ట్ ఫోన్ లు పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. వారు ఫోన్లలో ఏమి చూస్తున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరు. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి మంచిగా చదువుకోవచ్చు కానీ ఎంతమంది దానిని చదువుకోసం ఉపయోగిస్తున్నారు. వాటిలో ఎక్కువగా బూతు సైట్లే చూస్తున్నారు.
  
     ప్ర‌స్తుతం యువత ఎవరు చెప్పినా వినే స్థితిలో లేరు. ఎవరి మాటలు మేమెందుకు వినాలి అనే దోరణిలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ చేయించుకుని తల్లిదండ్రులు కొనిచ్చిన బైకులపై అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపై పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వేగంగా వెలుతుంటారు.  మహిళలు కనిపిస్తే చాలు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. పదిమంది ఒక చోట చేరి రోడ్డుపై వచ్చిపోయే ఆడవారిని ఎగాదిగా చూస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తుంటారు. ఇది రోజు మా ఊర్లో జరిగేదే..... కాని ఏం చేస్తాం చూసి చూడనట్లు వెళుతున్నాను... ఎందుకంటే ఒకరు చెబితే వినే స్థితిలో లేరు వీళ్ళు. మొక్కై వంగనిదీ మానై వంగునా అన్నట్టు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను సభ్యతగా పెంచితే ఇలా ఆవారాగాళ్ళలా తయారవకుండా ఉంటారు.

     సమాజంలో పెద్దల పట్ల, ఆడపిల్లలు, మహిళల పట్ల యువకులు గౌరవంగా ఉండాలంటే తల్లి దండ్రులు తమ పిల్లలను చిన్నప్పటినుండే సంస్కారవంతంగా పెంచాలి.

ఉపాధ్యాయులు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఒక లక్ష్యం ఏర్పరుచుకునేలా చేసి లక్ష్యం సాధించే విధంగా ప్రోత్సహించాలి.

సినిమాలు తీసేవారికి సామాజిక బాధ్యత ఉండాలి.
యువత చెడిపోయే విదంగా సినిమాలు తీయకూడదు.

డైరెక్టర్ సందీప్ వంగా లాంటి వారు బూతు సినిమాలు తీయకుండా ఉండాలి.

 మద్యపానం నిషేదించాలి.

అప్పుడే సమాజంలో నేరావు ఘోరాలు జరగకుండా ఉంటాయి.

2, డిసెంబర్ 2019, సోమవారం

మొన్నటిదాకా రాక్షసుడు అన్నారు నేడు దేవుడంటూ పొగుడుతున్నారు

 
        మొన్నటి వరకు రాక్షసుడు అంటూ బూతులు తిట్టారు. నేడు దేవుడంటూ పొగుడుతున్నారు.



ఆర్టీసీ కార్మికులు సారీ ఇప్పుడు వీళ్ళు కార్మికులు కాదు ఉద్యోగులుగా పరిగణించాలని సీఎం చెప్పారు. వీళ్ళు గత 55 రోజులు 26  డిమాండ్ల కోసం  సమ్మె చేసి  వాటిని సాదించకపోగా అలసిపోయి  చివరకు తమకు ఏ డిమాండ్లను వద్దు కనీసం మా ఉద్యోగం మాకు ఇవ్వండని వేడుకున్నారు. ఇక మమ్మల్ని ఉద్యోగం లోకి తీసుకుంటారో లేదోనని కన్నీరుమున్నీరయ్యారు.
సమ్మె చేస్తున్నప్పుడు కొందరు మహిళ ఉద్యోగులు లు సీఎం కెసీఆర్ ని బూతులు తిట్టారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. నిన్న కేసిఆర్ ఆర్టీసి ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి వరాలు కురిపించినప్పుడు ఆనందంతో దేవుడంటూ చప్పట్లు కొట్టారు.

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కెసీఆర్ అందించిన వరాలు:

:-  ఉద్యోగ భద్రత
:- పదవి విరమణ వయసు 58 నుండి 60 ఏళ్ళకు పెంపు
:- కార్మికులు కాదు ఉద్యోగులుగా
పరిగణించాలి
:- ఉద్యోగుల తల్లి దండ్రులకు వైద్య సదుపాయం
:- ఉద్యోగుల తల్లి దండ్రులకు ఉచిత బస్సు పాసులు
:- ఉద్యోగుల పిల్లలకు ఫిజు రీయింబర్స్మెంట్
:- ఉద్యోగుల పిఎఫ్ బకాయిల చెల్లింపు
:- తాత్కాలిక ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం
:- ప్రతీ ఏట బడ్జెట్లో  వెయ్యి కోట్ల రూపాయలు ఆర్టీసీ కి కెటాయింపు
:- మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటలు వరకే డ్యూటీ.
:- ఉద్యోగులకు గృహ నిర్మాణ పథకం
:- మహిళ ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు శిశు సంరక్షణ సెలవులు
:- ఇంక్రిమెంట్లు
:- ప్రతీ ఏటా ప్రతీ ఉద్యోగి లక్ష రూపాయల బోనస్ తీసుకునేలా చర్యలు
:- ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉండదు
:- మహిళ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ
:- చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడం
:- సమ్మె చేసిన 55 రోజుల వేతనం వెంటనే చెల్లించడం

ఇన్ని ప్రయోజనాలు ఆర్టీసి ఉద్యోగులకు సీఎం ప్రకటించినప్పుడు ఉద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇలాంటివి ముందే ప్రకటించి ఉండొచ్చు కదా అని అందరూ అనొచ్చు. కాని ఆర్టీసీ ఉద్యోగులు చేసిన తప్పు ఏంటంటే తెలంగాణ లో పెద్ద పండుగా దసరా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించి సమ్మె చేయడం సీఎం కెసీఆర్ గారికి ఆగ్రహం తెప్పించింది. యూనియన్ నాయకుల మాటలు విని సామాన్యులకు ఇబ్బందులకు గురిచేయడం అది పండగ పూట సమ్మె చేయడం మరింత ఆగ్రహం తెప్పించింది. అందుకే ఆర్టీసి ఉద్యోగుల పట్ల  సీఎం ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించారు. సీఎం కెసీఆర్ గారికి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల  ఇన్ని రోజులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం యూనియన్ నాయకులు.  ముఖ్యంగా అశ్వత్థామ రెడ్డి లాంటి నాయకుల పైనే సీఎం ఆగ్రహం అంతేకాని ఉద్యోగులపై కాదు. ఇలాంటి నాయకుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందని ఇలాంటి యూనియన్ నాయకులు ఉండకూడదనే సీఎం కోరుకుంటున్నారు. అశ్వత్థామ రెడ్డి లాంటి యూనియన్ నాయకుల వల్లే కొందరు ఆర్టీసీ ఉద్యోగులు బలైపోయారు. యూనియన్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికుల చేత సమ్మెలు చేయించి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. కొందరి కార్మికుల ప్రాణాలు తీసుకునెలా చేస్తున్నారు. ఇలాంటి యూనియన్ నాయకుల తీరు ఎలా ఉంటుందంటే వీరికి నిజంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉండదు. కేవలం యూనియన్ ఎన్నికల్లో గెలవాలనో లేదా ముడుపుల కోసమో సమ్మె లు చేయిస్తారే తప్ప కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాదు. కేవలం వారి స్వార్థ  ప్రయోజనాల కోసమే ఇలా సమ్మెలు చేయిస్తున్నారు. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు జీతాలు పెంచాలని ఇలాంటి యూనియన్ నాయకులే సమ్మెలు చేయించారు. నెల రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.ఆ నెల రోజులు జీతం రాక కుటుంబ పోషణ కోసం నానా అగచాట్లు పడ్డారు. నెల రోజుల తర్వాత యాజమాన్యం యూనియన్ నాయకులను చర్చలకు పిలిచింది ఆ చర్చల్లో ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు.  యూనియన్ నాయకులు వచ్చి సమ్మె విరమించండి కంపెనీ నష్టాల్లో ఉంది లాభాలు వచ్చినపుడు పెంచుతారని ఏవో మాటలు చెప్పి సమ్మె విరమింప చేసారు. ఈ నెల రోజులు యూనియన్ నాయకుల మాటలు విని  కార్మికులు నానా అవస్థలు పడ్డారు.
తర్వాత తెలిసింది ఏంటంటే కంపెనీ యాజమాన్యం యూనియన్ నాయకులకు డబ్బులు ముట్టజెప్పే సరికి సైలెంట్ అయిపోయారు. అప్పటి వరకు చిన్న ఇంట్లో నివసించే యూనియన్ లీడర్లు  ఆ తర్వాత కొన్ని నెలల్లోనే పెద్ద పెద్ద  భవంతులు నిర్మించుకున్నారు. ఇది యూనియన్ నాయకుల నిర్వాకం తాము బాగు పడడం కోసం కార్మికులను పావులుగా వాడుకుంటారు. అంతేకాని నిజంగా కార్మికుల పై ప్రేమతో కాదు...

 ఎక్కడైనా యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. డబ్బుల కోసం, రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే కార్మికుల సమస్యల పై పోరాటం చేస్తున్నట్టు నటిస్తారు. డబ్బు ఆశ చూపగానే సైలెంట్ అయిపోతారు. అందుకే కార్మికులు ఇలాంటి  యూనియన్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు.