భానోదయం: నీటి వనరులను నాశనం చేస్తున్నారు..

17, ఏప్రిల్ 2022, ఆదివారం

నీటి వనరులను నాశనం చేస్తున్నారు..

    


    ప్రకృతి మానవ మనుగడకు అవసరమైన అన్ని వనరులను మనకు ప్రసాదిస్తుంది. కాని ప్రకృతి ప్రసాదించిన వనరులను ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారు చెప్పండి.? ప్రకృతి వనరులను నాశనం చేయడానికి ఉన్నంత శ్రద్ధ సద్వినియోగం చేసుకోవడంలో ఉండదు. ఏ జీవికైనా ప్రాణాధారం నీరు. నీరు లేనిదే జీవుల మనుగడ లేదు. అది అందరికీ తెలిసిందే కాని నీటి వనరులను మాత్రం విచ్చలవిడిగా కాలుష్యం చేసేసి మనుషులతో పాటు మూగజీవాలకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మానవుడు. ప్రకృతి లో తెలివైన వాడు మానవుడు తన తెలివితేటలతో ప్రకృతిని, ప్రకృతి ప్రసాదించిన వనరులను నాశనం చేసి ఇతర జీవులకు కూడా మనుగడ లేకుండా చేస్తున్నాడు. 


 ఇతర జీవుల సంగతి దేవుడెరుగు గాని ముందు ముందు మనిషి మనుగడకే ముప్పు తెస్తున్నాడు.

 నీరు అందరికి జీవనాధారం కాని నీటి విలువ ఎవరికి తెలియదు. ''మన దగ్గర ఏది ఉంటుందో దాని విలువ మనకు తెలియదు". లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. 


ఇప్పుడు మనకు త్రాగు నీరు పుష్కలంగా లభిస్తుంది. పుష్కలంగా అంటే మరీ మన తాతల నాటి కాలంలో కాకుండా కొంచెం తక్కువగానే స్వచ్చమైన నీరు లభిస్తుంది. అయినా కూడా నీటి వనరుల విలువ ఇంకా చాలామంది కి తెలియదు. ముందు ముందు తెలుస్తుంది. మా చిన్నప్పుడు రవాణా వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందలేదు ఏ ఊరికైనా వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మరీ దూరమైతే మెయిన్ రోడ్డు వరకు నడిచి అక్కడ ఏదైనా వాహనం ఎక్కి చిన్నపాటి సిటీలో దిగి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం. మొత్తంగా కాలినడకనే వెళ్ళేవాళ్ళం. ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం ఎందుకంటే వేసవిలో పిల్లలకు సెలవులు ఉండడం, పెద్దవారికి కూడా ఎలాంటి పనులు ఉండవు కాబట్టి ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం. వేసవిలో ఎక్కువగా ఏ బందువుల  ఇంటికి వెళతాం చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లే వెళ్తారు.  అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అంటే మాకు పండగే. అందరు వస్తారు కాబట్టి ఆ ఆనందంలో ఎంతదూరం అయిన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 

 వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు దాహం వేస్తే ఎక్కడ కూడా నీళ్ళు కోనేవారు కాదు అసలు అప్పట్లో నీళ్ళు అమ్మే వాళ్ళు కాదు మా ఊళ్ళళ్ళో. చిన్న చిన్న వాగులు ఉండేవి వానాకాలం పుష్కలంగా నీరు ప్రవహించే వాగులు వేసవిలో నీరు ఉండేది కాదు. అక్కడ అక్కడ గుంతల్లో కొద్దిగా నీరు ఉండేది. అవి పశువులు తాగడానికి ఉపయోగపడేవి. మేం తాగలంటే చెలిమలు తవ్వి నీరు త్రాగేవాళ్ళం. అప్పుడు ఎలాంటి కాలుష్యం లేదు చాలా స్వచ్ఛంగా ఉండేవి నీళ్ళు. 

ఇక బావి నీరు ఎక్కువగా త్రాగే వాళ్ళు. బోర్లు అంతగా ఉండేవి కాదు. చెరువులు,కుంటలు ఎక్కడ కూడా కాలుష్యం ఉండేది కాదు. మరీ ఇప్పుడు నీళ్ళు త్రాగాలి అంటే కొనాల్సిందే ప్రకృతి ప్రసాదించిన నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. కారణం స్వచ్చమైన నీరు లభించక పోవడమే. నీటి వనరులను కాలుష్యం చేసి నీటి వ్యాపారం చేస్తున్నారు.


    పట్టణీకరణ, పరిశ్రమల స్థాపనతో నీటి వనరులను పూర్తిగా కలుషితం చేస్తున్నారు. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. ఆ నీటితో చెరువులోని నీరు తాగేందుకు కాదుకదా కనీసం తాకడానికి కూడా పనికి రాకుండా పోతుంది. మనుషులైతే డబ్బులు పెట్టి కొని నీళ్ళు త్రాగుతారు. మరి జంతువులు, పక్షులు ఎలా త్రాగుతాయి నీరు. మనిషి తన అత్యాశకు పోయి ఇతర జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. వాటికి కనీసం తాగేందుకు నీరు లేకుండా చేస్తున్నాడు.  ఆలోచించండి ఇకనైన మేల్కొని నీటి వనరులను కాపాడుకుందాం. మనతో పాటు ఇతర జీవుల మనుగడకు ఎలాంటి హాని తలపెట్టకుండా నీటి వనరులను కాలుష్యం చేయకుండా  కాపాడుకుందాం..


కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు..


ఎవరైతే నీటి వనరులను కాలుష్యం చేస్తారో వారికి త్రాగేందుకు నీరు దొరకదు..

కాని ఇప్పుడు బడా బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు చేసిన నీటి కాలుష్యం వల్ల పశుపక్ష్యాదులు, సామాన్య ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.


బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల ధన దాహానికి   నేల, నీరు కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమల వలన భూమిపై ఉన్న నీటి వనరులే కాకుండా భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. రసాయన పరిశ్రమల వారు కాలుష్య జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. అలాగే భూమిలోకి బోర్లు వేసి అందులోకి రసాయనాలను పంపిస్తారు దీనివలన భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఎక్కడ బోరు బావి తవ్విన రసాయనాలతో నిండిన నీరే వస్తుంది. ఎంత దారుణం అండి ఇది చుట్టుపక్కల వారికి ఈ పరిశ్రమల వలన ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి వారు కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ నేలని,నీటిని, పరిసరాలను కాలుష్యం చేసి స్థానికులకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు...


   

ఇంతవరకు మా వైపు అయితే ఈ దరిద్రపు గొట్టు రసాయన పరిశ్రమలు లేవు. రావొద్దనే కోరుకుంటున్నాను.


 రాను రాను మా వైపు కూడా అభివృద్ధి పేరిట ఈ రసాయన పరిశ్రమల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో విచ్చలవిడిగా పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు హైదరాబాదు చుట్టుపక్కల మాత్రమే ఉండే రసాయన పరిశ్రమలు ఇక పచ్చని పల్లెల వైపు వస్తాయి. ఇక్కడ నేల, నీటిని కాలుష్యం చేస్తాయి. ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తున్నారు. కంచె చేను మేసినట్టు ప్రభుత్వమే నీటి వనరులను నాశనం చేయడానికి చూస్తుంటే ఇంకా ఎవరు వాటిని కాపాడేది.

  ఇప్పటికైతే నేను చిన్నప్పుడు వేసవిలో చెలిమల్లో నీటిని తాగినా నది ఇప్పటికి స్వచ్చమైన నీటితోనే ప్రవహిస్తుంది.

ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిశ్రమలు లేవు. ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటా..

గత ఏడాది అక్టోబరులో మా నదిలో నేను  తీసిన వీడియోలు. ఇప్పటికి స్వచ్చమైన నీటితో ప్రవహిస్తుంది.







 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

జనాలని చేతగాని వాళ్ళలా ఉంచడానికి ఈ కర్మ సిద్ధాంతం . బడా బాబులు , నాయకులూ చేసే అవక పనులకి అడ్డులేకుండా , ఈ కర్మ సిద్ధాంతం . అంతే .