భానోదయం: ఏడుపాయల వన దుర్గామాత దేవాలయం

23, జనవరి 2023, సోమవారం

ఏడుపాయల వన దుర్గామాత దేవాలయం

  ఏడుపాయల వన దుర్గామాత దేవాలయానికి ఈరోజు వెళ్ళాను. ఉదయం ఇంటినుండి  ఏడు గంటలకి బయలుదేరాను. సంగారెడ్డి, నర్సాపూర్, ఏడుపాయల ఒంటి గంట వరకు చేరుకున్నాను. ఏడుపాయల చేరుకున్నాక తో నీలాలు సమర్పించిన తర్వాత స్నానం చేయాలి మంజీర నదిలో నీరు అంతా ఆకుపచ్చ రంగులో ఉంది. చుట్టుపక్కల పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి అయినా అందరు భక్తులు అలాగే స్నానం చేస్తున్నారు. నేను కూడా అలాగే నదిలో మునిగాను. నదిలోకి దిగాక ఏమి అనిపించలేదు ఇంకా అందులోనే కాసేపు ఉండాలనిపించింది. నాకు అంతగా ఈత రాదు కాబట్టి నదిలో స్నానం చేసి బయటకు వచ్చేసా. నదిలో ఒడ్డున అపరిశుభ్రంగా ఉన్నా నదిలోకి దిగాక అందులోనే కాసేపు ఉండాలనిపించింది. భక్తులు అందరు పరిశుభ్రత పాటిస్తే ఇంకా బాగుంటుంది. కాని ఎవరు మన మాట వింటారు చెప్పండి. ప్రకృతే మనుషులు చేసిన కలుషితాన్ని కడిగి పారేస్తుంది. ఇప్పుడు నేను స్నానం చేసిన నదిలో వర్షాకాలంలో 20 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో మనుషులు చేసిన మలినాలన్ని కొట్టుకుపోతాయి. 


ఏడుపాయలు కొండలు, చెట్లు అడవులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంజీరా నది సింగూర్ ప్రాజెక్టు నుండి ప్రవహించి ఏడుపాయల వన దుర్గా ఆలయం చేరుకోగానే ఏడుపాయలుగా మారి ప్రవహిస్తుంది. ఒక నది ఏడు నదులుగా మారి ప్రవహిస్తుంది కాబట్టి ఏడుపాయల అనే పేరు వచ్చింది.

అమ్మవారు నది ఒడ్డున కొలువై ఉంటుంది. వర్షాకాలంలో అమ్మ వారి పాదాలను తాకుతూ మంజీర ప్రవహిస్తుంది. అప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళడానికి రాదు. గుడిముందు నుండి దాదాపు పదిహేను అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. 


ప్రజలు గుడికి వెళ్ళినప్పుడు చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తారు. అందువలన చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉంటుంది. ఆలయ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, చెత్త బుట్టలు పెట్టి అందులో వేసేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆలయానికి కిలోమీటరు దూరంలో మరుగుదొడ్లు కట్టించి అందులోకే వెళ్ళేలా అవగాహన కల్పిస్తే ఆలయం పరిసరాలలు పరిశుభ్రంగా ఉంటాయి. 


ఆలయానికి రావడానికి కొత్త రోడ్లు, పార్కింగ్  కోసం చుట్టుపక్కల చెట్లు నరికేసారు. వీలైన చోటల్లా చెట్లు నాటితే పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. చెట్లు అంటే మామూలు చెట్లు కాదు పండ్ల చెట్లు నాటాలి. వీటివలన ఇక్కడ కోతులకి ఆహారం లభిస్తుంది. 


ఇలా కొన్ని మంచి పనులు చేస్తే ఏడుపాయల ఆలయానికి వెళ్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఏ ఒక్కరి వల్ల కాదు అందరు  పరిశుభ్రత పాటిస్తే బాగుంటుంది. 


చదువుకున్న యువత ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పరిశుభ్రత పట్ల భక్తులకు అవగాహన కల్పిస్తే ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయని నాఅభిప్రాయం. ఈ స్వచ్ఛంద సంస్థలో చేరిన యువత ఒక్కొక్కరు   సంవత్సరంలో  రెండు రోజులు  ఇక్కడ పరిశుభ్రత పట్ల భక్తులకు అవగాహన కల్పించాలి. 


ఇది జరిగే పనేనా అంటే జరుగుతుంది. నేను స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడానికి సిద్ధం. ప్రకృతి ప్రేమికులు, దైవభక్తి కలవారు మంచివారు ఈ సంస్థలో చేరాలని నా ఆశ. ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తే చాలు వారు పాటిస్తారు. మనం చూసి చూడనట్లు ఉంటే ఇంకా కలుషితం అవుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణను కాంక్షించే వారు స్వచ్ఛందంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీనికోసం ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయాలి. పరిశుభ్రతే దైవం🙏🙏


 నా ఈ పోస్టు చదివిన వారు ఎవరైనా ఏడుపాయలకు తరచుగా వచ్చే వారు ఎవరైనా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. దైవభక్తి కలవారు, ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఏడుపాయల ఆలయానికి వచ్చి పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆశిస్తున్నాను... 


ఏడుపాయల వన దుర్గామాత అందరిని చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను. 


మనం మంచి చేస్తే దైవం మనకు అంతకు రెట్టింపు మంచి చేస్తుంది.


 మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే వంద అడుగులు ఆ దైవం మనవెంట ఉండి నడిపిస్తుంది.


మనం ధర్మం, న్యాయంగా జీవించాలి. అదే ఈ జీవితానికి సార్థకత.


పరిశుభ్రతే దైవం. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిద్దాం, మన దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుదాం. 


🙏🙏🙏🙏🙏

ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఇంటినుండి ఏడుపాయల దేవాలయానికి బయలు దేరాను, మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి చేరాను. మా ఊరి నుండి 100 కి.మీ ఉంటుంది. మొత్తం బస్సు ప్రయాణమే. మూడు బస్సులు మారాలి. ఒక్కడినే వెళ్ళాను చీకటి పడుతుందేమే రావడం ఆలస్యమైతే ఎలా అనుకున్నా. కాని సమయానికి ఇంటికి చేరుకున్నా. ఎక్కడ కూడా బస్సు కోసం వేచి చూడలేదు. వెంట వెంటనే బస్సులు దొరికాయి. అంతా అమ్మ వారి దయ... 


ఎవరైనా ఏడుపాయల దేవస్థానాన్ని  దర్శించే వారు ఉంటే మీ అభిప్రాయం తెలియజేయండి...2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఏడు పాయల దగ్గరి కొన్ని ఫోటోలు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది కదా.

భానోదయం చెప్పారు...

కొన్ని ఫోటోలు ఉన్నాయి బాగా లేవని పెట్టలేదు. ఇప్పుడు పెడతాను.