3, డిసెంబర్ 2020, గురువారం
మనదేశం ఎప్పుడు పరిశుభ్రంగా తయారవుతుంది.?
మనదేశం ఎప్పుడు పరిశుభ్రంగా మారుతుంది?
కొన్ని దేశాలలో పరిశుభ్రత చూస్తే ఎంత బాగుంటుందంటే మన ఇళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ రాహాదారులు, అన్ని ప్రాంతాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.
ఉదాహరణకి జపాన్ లో పరిశుభ్రత చూస్తే ఔరా అనిపిస్తుంది. అక్కడ రోడ్లపైనా భూతద్దం పెట్టి చూసినా ఎక్కడ చెత్త కనిపించదట.జపాన్ అంత పరిశుభ్రంగా ఉండడానికి కారణం అక్కడి ప్రజలు. వారు పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ద వహిస్తారు. రోడ్లపైనా కాని ఇతర ఏ ప్రదేశాలలో చెత్తను పారేయరు.ఎక్కడ డస్ట్ బిన్ ఉంటే అక్కడే వేస్తారు. బయట ఎక్కడ డస్ట్ బిన్ లేకుంటే తమ దగ్గర ఏదైనా చెత్త ఉంటే దానిని తమ ఇంటి వరకు తీసుకెళ్ళి చెత్త బుట్టలో వేస్తారే తప్ప ఈ చెత్తను ఇంటి వరకు ఎవరు తీసుకెళ్తారని ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళరు.
ఇంత క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా అక్కడి ప్రజలు వ్యవహరిస్తారు కాబట్టి జపాన్ అంత పరిశుభ్రంగా ఉంటుంది.
వీరికి ఇంత క్రమశిక్షణ, బాధ్యత ఎలా ఏర్పడిందంటే అక్కడి పాఠశాలల్లో పిల్లలకు పరిశుభ్రత గురించి బోధిస్తారు. అలాగే ఆ పిల్లల చేత క్లాస్ రూమ్స్ క్లీన్ చేయిస్తారు. ఇలా చిన్నప్పటి నుండి పిల్లల చేత చేయించడం వల్ల పెద్దయ్యాక వారికి పరిశుభ్రత ఒక అలవాటుగా మారుతుంది. అక్కడి నాయకులు, క్రీడాకారులు కూడా వారు ఉండే ప్రాంతాలను, క్రీడా మైదానా లను స్వయంగా శుభ్రపరుసరుస్తారు. కొన్ని స్వఛ్చంద సంస్థలు పరిశుభ్రత కోసం పనిచేస్తుంటాయి.
ఇలా అందరి సమిష్టి కృషి వల్ల జపాన్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది.
మనదేశం కూడా జపాన్ లా పరిశుభ్రంగా ఎప్పుడు మారుతుంది అంటే మారదనే చెప్పాలి. ఎందుకంటే మనదేశంలో ఎవ్వరికి పరిశుభ్రత పట్ల అవగాహన ఉండదు. పరిశుభ్రత అంటే అందరిని రోడ్లపైకి వచ్చి చెత్తను ఊడ్చమని చెప్పట్లేదు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుంటే చాలు పరిశుభ్రంగా ఉంటుంది.
మనదేశం ఇంత అపరిశుభ్రంగా ఉండటానికి కారణం మన ప్రజలు.
ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారేస్తుంటారు. ఉదాహరణకి మనలో చాలా మంది బిస్కెట్ ప్యాకెట్టో, చాక్లెట్ , చిప్స్ ప్యాకెట్టో కొంటారు అవి తిన్న తరువాత అక్కడ డస్ట్ బిన్ ఉన్నా సరే అందులో వేయరు. ఇష్టం వచ్చినట్టు బయట పారేస్తుంటారు.
వారికి డస్ట్ బిన్ వద్దకు వెళ్ళే ఓపిక ఉండదు. ఇలా చిన్న చిన్న చిప్ప్ ప్యాకెట్సే కాదు నీళ్ళ బాటిళ్ళు కూల్ డ్రింక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ క్యారీబ్యాగులు ఇలా ఎలాంటి చెత్త అయినా సరే రోడ్లమీద పారవేస్తుంటారు. ఇలా చెత్త ఒక్కటే కాదు పాన్,గుట్కాలు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తుంటారు. ఇళ్ళల్లోని చెత్తను బయట పారబోస్తారు. ఇలాంటి చెత్త మనుషుల వల్లే మన పట్టణాలు, నగరాలు ఇంత చెత్తగా తయారయ్యాయి.
ఇప్పడు తడి చెత్త పొడి చెత్త అని అవగాహన కల్పిస్తున్నా దాన్ని ఎవ్వరు పాటించటం లేదు. ఇంటింటికి చెత్త సేకరించి రీసైకిల్ చేయకుండా తగలబెడ్తున్నారు. దీని వల్ల గాలి కాలుష్యం ఏర్పడుంది. దీనిని ఎవరు పట్టించుకోరు. పరిసరాలను చెత్తగా చేయడం మన హక్కు అని మనప్రజలు భావిస్తారు అందుకే మన గ్రామాలు, పట్టణాలు, నగరాలు చెత్తగా, కాలుష్యమయంగా ఉంటాయి. మన దేశం పరిశుభ్రంగా ఉండటం అనేది ఓ కల.
30, ఆగస్టు 2020, ఆదివారం
నాకు నచ్చిన రెండు కామెడి సినిమాలు. ఈ సినిమాలు చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.
సినిమాలు చూసి చాలా రోజులయ్యింది
కొత్త సినిమాల విడుదల ఈ సంవత్సరం లేనట్టే.
ఒకవేళ విడుదల అయిన థియేటర్ వరకు వెళ్ళి సినిమాలు చూసే సాహసం అయితే చేయలేం. కొన్ని సినిమాలు OTTలో విడుదల అవుతున్నాయి. సినిమాలు చూసే వారంతా ఇప్పుడు OTT లోనే చూస్తున్నారు. ఇంతకు ముందు కూడా థియేటర్ లో సినిమాలు చూడటం జనాలు తగ్గించేసారు. ఏదైనా పెద్ద సినిమా లేదా మంచి సినిమా వస్తే థియేటర్ లో చూస్తున్నారు.
ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమానా కాదు మంచి కథ ఉంటే చాలు సినిమా చుడటానికి. అలాగే ఆ సినిమా పాతదా కొత్తదా కాదు ఆ సినిమాలో కథే ముఖ్యం. మన తెలుగులో ప్రతీవారం ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యేది వీకెండ్ లో ఎంటర్టైన్ మెంట్ కోసం చాలామంది ఆ సినిమాలు చూసేవారు. ఇప్పట్లో సినిమాలు రిలీజ్ అవ్వవు కాబట్టి పాత సినిమాలే చూడాలి. ఇక్కడ పాత కొత్త ముఖ్యం కాదు కథే ముఖ్యం. అలాగే ఎంటర్టైధ్ మెంట్ ముఖ్యం. సినిమా బోర్ కొట్టకుండా పూర్తిగా చూసే విధంగా ఉండాలి. అలా మంచి కథ, కాలక్షేపంతో పాటు కడుపుబ్బా నవ్వించే రెండు సినిమాల గురించి చెబుతాను.
నాకు కామెడి సినిమాలంటె చాలా ఇష్టం.
కామెడి సినిమాలంటే ఒకప్పడు "నటకిరీటి" రాజేంద్రప్రసాద్ గారు గుర్తొచ్చేవారు. తన హాస్యభరితమైన నటనతో పేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. రాజేంద్రప్రసాద్ గారి సినిమా అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారంటీ. ఆయన సినిమాలంటే అందరికి ఇష్టమే. ప్రజలనుండి, ప్రదానమంత్రి వరకు రాజేంద్రుడి హాస్య నటనను ఆయన సినిమాలను అమితంగా ఇష్టపడేవారు. అప్పట్లో మనదేశ ప్రధాని పి.వి. నరసింహారావు గారు రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూసేవారట. చూసారా హాస్యభరితమైన చిత్రాలంటే అందరికి ఇష్టమే.
అప్పట్లో కామెడి మూవీస్ అంటే రాజేంద్రప్రసాద్ గుర్తొస్తే ఇప్పుడు అల్లరి నరేష్ గుర్తొస్తారు. నాకు బాగా రెండు కామెడి మూవీస్ గురించి చెప్తాను. అందులో ఒకటి అల్లరి నరేష్ సినిమా అయితే మరొకటి కొత్త హీరోది.
ముందుగా అల్లరి నరేష్ సినిమా గురించి చెప్తాను. అల్లరి నరేష్ సినిమాలంటే చాలా కామెడిగా ఉంటాయి. ఆయన నటించిన సినిమాలలో చాలా నవ్వు తెప్పించే సినిమాలలో ఒకటి 2008 లో వచ్చిన "బ్లేడ్ బాబ్జీ" సినిమా. చాలా పాత సినిమా అని మీరు అనుకోవచ్చు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే రాజమండ్రిలో అల్లరి నరేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతానాలు చేస్తూ గడిపేస్తుంటారు. ఒక రోజు వాళ్ళు ఉంటున్న ఏరియాకి ఒక పెద్ద మనిషి వచ్చి ఈ స్థలం నాది అందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపొమ్మంటాడు. లేదా 4కోట్ల రూపాయలు 3నెలలలోగా ఇవ్వమంటాడు. అక్కడ బ్లేడ్ బాబ్జీ (అల్లరి నరేష్) స్నేహితులతో
పాటు చాలా పేద కుటుంబాల ప్రజలు నివసిస్తుంటారు.
వాళ్ళందరికోసం ఆ 4కోట్ల రూపాయలను 3నెలల్లోగా ఇస్తానని ఆ పెద్దమనిషితో చెప్తాడు బ్లేడ్ బాబ్జి. అంత డబ్బు 3నెలల్లో సంపాదించడం కష్టం అని బ్యాంకులో దోచుకోవడానికి స్నేహితులతో కలిసి వైజాగ్ బయలుదేరుతాడు.
వైజాగ్ వెళ్ళాక 4కోట్ల రూపాయలను ఎలా దోచుకున్నారు, ఎక్కడ దాచారు 3నెలల గడువులోగా ఆ డబ్బను తమ ఊరికి తెచ్చారా అన్నదే ఈ సినిమా కథ.
ఈ సినిమాలో హాస్యం విషయానికి వస్తే బ్యాంకులో దోచుకోవడం, ఆ డబ్పును పోలీస్ కంట్రోల్ రూంలోనే దాచడం, అక్కడ నుండి తీసుకురావడానికి బ్లేడ్ బాబ్జీ టీం వేసే స్కెచ్ లు కడుపుబ్బా నవ్విస్తాయి. 4కోట్ల రూపాయలను ఒక బొంతలో దాయడం చాలా నవ్వు తెప్పిస్తుంది. సినిమాా మొత్తానికి ఎక్కడా బోర్ కొట్టదు ప్రతీ సీన్ చాలా కామెడిగా ఉంటుంది. పాటలు ఒక్కటే బోర్ అనిపిస్తాయి. పాటలు లేకుంటే ఇంకా బాగుండేది.
ఈ సినిమాలో చాలామంది సీనియర్ హాస్యనటులున్నారు.అందరు కూడా నవ్వుల పువ్వులు పూయించారు. ఈ సినిమా దర్శకుడు దేవి ప్రసాద్. ఈయన చాలా కామెడి సినిమాలు తీసారు.
బ్లేడ్ బాబ్జీ సినిమా చూడకుంటే చూసి హాయిగా నవ్వుకోండి.
నాకు నచ్చిన మరో కామెడి సినిమా ఏంటంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో చాలామందికి తెలియదు. ఈ పేరుతో ఓ సినిమా ఉందని కూడా నాక్కూడా తెలియదు. ఆ సినిమా పేరు "క్రేజీ క్రేజీ ఫీలింగ్" ఈ పేరు వింటే "నేను శైలజ" సినిమాలో హిట్టయిన క్రేజీ క్రేజీ ఫీలింగ్ అనే పాట గుర్తొస్తుంది కదా.? ఈ సినిమా మార్చి 2019లో రిలీజయ్యింది. ఈ సినిమా డైరెక్టర్ సంజయ్ కార్తిక్.
ఇక ఈ సినిమా కథేంటంటే IAS అవ్వాలనునే అభి స్పందనను చూసి ఇష్టపడతాడు. ప్రేమించమని వెంటపడతాడు స్పందనకు లవ్ అంటే ఇష్టం ఉండదు. తనను తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడని వాడినే పెళ్ళి చేసుకుంటాను అంటుంది. ఈ రోజుల్లో అలాంటి వాడు ఉండడని అంటాడు అభి. అందుకు అలాంటి వాడు ఉన్నాడు అతనెవరో కాదు మా భావ అంటుంది స్పందన. అసలు అభి ప్రేమను స్పందన ఒప్పుకుంటుందా? వాళ్ళ బావ ఎవరు ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇందులో హీరో హీరోయిన్ కొత్తవారు అయినా చాలా బాగా కామెడి చేసారు. కొంతమంది జబర్దస్త్ కమెడియన్ల కామెడి బాగుంటుంది. ఇక సినిమాకి హైలెట్ వెన్నెల కిషోర్ కామెడి. ఈ సినిమాల వెన్నెల కిషోర్ కామెడి చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. అసలు నేనీసినిమా చూసింది వెన్నెల కిషోర్ కామెడీ కోసమే. ఈ సినిమాలో పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూసిక్ బాగుంది.
ఈ సినిమాలు మీరు చూడకుంటే వీలుంటే చూడండి. కాసేపు టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి హాయిగా నవ్వుకోండి.
ఈ సినిమాలు చూసిన తర్వాత ఇందులో ఏ సినిమా చూసి బాగా నవ్వుకున్నారరో తెలియజేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)