భానోదయం

16, మే 2021, ఆదివారం

భయపడకండి ధైర్యంగా ఉండండి అప్పుడే కరోనాను జయించగలరు.

 భయపడితే ఎంత బలవంతుడైన ఓడిపోతాడు. ధైర్యంగా ఉంటే సామాన్యుడు కూడా బలవంతుడౌతాడు.

  ఒక రాజ్యంలో రాజు భయపడితే ఎంతపెద్ద సైన్యం ఉన్న శత్రువు చేతిలో ఓడిపోతాడు. అదే రాజు ధైర్యంగా ఉండి ఎంత పెద్ద శత్రువైనా సరే   మన పరాక్రమం ముందు గడ్డిపోచతో  సమానం. ఈరాజ్యం మనది ఎవడో గొట్టం గాడు వచ్చి ఆక్రమిస్తానంటే ఊరుకుంటామా? తన్ని తరిమేద్దాం. అని సైన్యానికి ధైర్యం చెబితే సైనికులు వీరోచితంగా పోరాడి శత్రువును మట్టికరిపిస్తారు.  అలా కాకుండా శత్రువును చూసి భయపడి వారితో మనం గెలువలమా? అని సందిగ్ధం వ్యక్తం చేస్తే ఇక సైనికులు కూడా డీలా పడిపోయి దైర్యంగా యుద్దం చేయకుండా శత్రువు చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని  కోల్పోతారు. 

  ఇప్పుడు మనదేశంలో అందరు కనిపించని శత్రువు కరోనా తో యుద్దం చేస్తున్నారు. ఆ శత్రువును ఓడించాలంటే ముందుగా మనం దైర్యంగా ఉండాలి. అలాగే మాస్క్, సానిటైజర్ వంటి ఆయుధాలతో ఈ యుద్దంలో గెలవాలి. అలాగే పౌష్టికాహారం తింటూ బలంగా ఉండి శత్రువును తన్ని తరిమేయాలి. 

మీరు ధైర్యం కోల్పోయి నాకేమవుందోనని బయపడిపోతే మీలో ఉన్న  రక్షణవ్యవస్థ బలహీనపడి శత్రువును ఎదుర్కోలేక ఓడిపోతుంది. నాకేమి కాదు అని ధైర్యంగా  ఉండిపౌష్టికాహారం తీసుకుంటూ డాక్టర్ సూచించిన మందులు వాడుతుంటే మన రక్షణ వ్యవస్థ  వైరస్ తో పోరాడి వైరస్ ను అంతం చేస్తుంది.

 

  మన దేహం ఒక రాజ్యం అనుకుంటే మన  మనసు ఈ రాజ్యానికి రాజు. మనలో రక్షణ వ్యవస్థ ఈ రాజ్యానికి సైన్యం. మన మనసు ఏవిధంగా ఆలోచిస్తుందో శరీరం కూడా మనసుకు అనుగునంగానే పనిచేస్తుది. కాబట్టి మనం మనసులో ఏదనుకుంటే దాని ప్రభావం శరీరంపై పడుతుది. 

 నాకు ఏమవుతుందోనని మనసులో భయపడిపోయి ఆందోళన చెందారంటే దాని ప్రభావం శరీరంపై పడి లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ భయంలో బీపి పెరగడం , చెమటలు పట్టడం, గుండె దడ రావడం వంటివి జరిగి శరీరంలోని వ్యవస్థలన్ని అతలాకుతలం అయిపోతాయి తీవ్ర అనారోగ్యం పాలవుతారు. మన మనసు చెప్పినట్టే శరీరం వింటుంది. ఏ పని చేయాలన్న ముందు మనసులో అనుకుంటేనే చేస్తాం. మనసు రీమోట్ అయితే శరీరం టీవీ లాంటిది. అక్కడ  రిమోట్ నొక్కితేనె ఇక్కడ టీవీ పని చేసినట్టు మన మనసు ఎలా చెప్తే శరీరం అలా పని చేస్తుంది. కాబట్టి మనసులో నాకు ఏమికాదు అని ధైర్యంగా అనుకున్నారనుకోండి అప్పుడు మీకు ఏమికాదు. ఆరోగ్యంగా ఉంటారు.

 

  మనసు చెప్తే శరీరం ఎలా వింటుందో ఒక ఉదాహరణ - మీరు ఉదయం  5 గంటలకు నిద్ర లేవాలి అనుకుని అలారమ్ పెట్టుకున్నారు. ఏదో లేవాలి అంతే అనుకుని పడుకున్నారు. ఉదయం అలారమ్ మోగినా మీరు నిద్ర లేవలేరు. ఎందుకంటే మీరు గట్టిగా అనుకోలేరు కాబట్టి అలారమ్ మోగినా గాని ఆఫ్ చేసి మళ్ళి పడుకుంటారు. అదే మీకు చాలా ముఖ్యమైన జాబ్ ఇంటర్వూ ఉంది అక్కడకు వెళ్ళాలంటే ఉదయం 4 గంటలకే నిద్ర లేచి బయలు దేరాలి. అప్పుడు మీరు గట్టిగా మనసులో అనుకుంటారు ఉదయం 4 గంటలకే నిద్రలేవాలని మైండ్ లో  ఫీక్సయిపోతారు. ఆశ్ఛర్యంగా మీరు 4 గంటలకే నిద్ర లేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఆరోజు మీరు అలారమ్ పెట్టడం మర్చిపోతారు అయినా మీరు అనుకున్న సమాయానికే మేలుకుంటారు. ఇది ఎలా జరిగిందంటే మీరు మనసులో గట్టిగా అనుకున్నారు కాబట్టి. మీ ఊరినుండి ఇంటర్వూ కు వెళ్ళే పట్టణం చాలా దూరం మీ దగ్గర బైక్ లేదు అయినా అక్కడకు వెళ్ళాల్సిందే అని గట్టిగా మనసులో అనుకున్నారు. అంతే ఆటోలనో బస్సులోనో వెళ్ళి ఇంటర్యూకు అటెండ్ అవుతారు. నేను వెళ్తాను అనే గట్టి సంకంల్పం ఉంటే తప్పకుండా వెళ్తావు. నీ సంకల్పానికి ప్రకృతి కూడా తోడవుతుంది, దైవం కూడా తోడయ్యి నీవు ఒక్క అడుగు ముందుకేస్తే వెనక నుండి దైవం పది అడుగులు నడిపిస్తాడు. అందుకే ధైర్యంగా ఉంటే ఏదైనా సాదించగలం.

  అదే ఇంటర్వూకు వెళ్ళాలి మీ దగ్గర బైక్ ఉంది కాని మనసులో గట్టి సంకల్పం లేదు వెళ్తానో లేదో అంత దూరం వెళ్తే మద్యలో ఏమన్న అయితే అనుకుంటూ వెళ్తే నిజంగానే ఏదో ఒకటి అవతుంది. 

ఏమవుతుందోనని భయపడొద్దు భయపడితే ఏది సాదించలేము. 

ధైర్యంగా ఉండండి తప్పకుండా విజయం సాదిస్తారు.

ఇప్పుడు చాలా మంది కరోనాకు భయపడి ఏమవుతుందో ఆని ఆందోళన చెందతున్నారు.  అలా భయపడి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ముందు భయాన్ని వదిలేసి నాకేమి కాదు అని  ధైర్యంగా ఉంటే తొందరగా కోలుకుంటారు. 

 దైర్యంగా ఉన్న వాళ్ళకు దైవం కూడా తోడుంటాడు. 

యత్భావం తథ్భవతి అని శ్రీకష్ణ పరమాత్మ చెప్పినట్టు మనం ఏది తలచుకుంటే అదే జరుగతుతుంది. మంచి తలచుకుంటే మంచి జరుగుతుంది.  చెడుగా తలుచుకుంటే చెడే జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడు మంచినే కోరుకోండి అంతా మంచే జరుగతుంది. 

భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండండి అప్పుడే దేన్నైనా జయించగలరు.

 

13, మే 2021, గురువారం

మన కూరగాయలు మనమే పండిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.

   

    మనకు ప్రతిరోజు అవసరమయ్యే నిత్యావసరాలలో కూరగాయలు, ఆకుకూరలు మొదటి స్థానంలో ఉంటాయి.

ప్రతీవారం మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటాం. అలా కాకుండా మనమే కురగాయలు పండించుకుని తింటే ఎలా ఉంటుంది చెప్పండి?

     ఓ వందో రెండొందలో పెడితే వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి దీనికోసం కూరగాయలు పండించడం అవసరమా? అని మీరు అనొచ్చు. 

నిజమే వంద రొండొందలకి వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి కాని కోట్లు ఖర్చుపెట్టిన కాని ఆరోగ్యం, ఆనందం రావు.

  నేడు కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండిస్తున్నారో మనకు తెలుసు.కృత్రిమ ఎరువులు విపరీతంగా వాడుతున్నారు. అలాగే పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇంతలా కృత్రిమ ఎరువులు, పురుగు మందులు వాడిన కూరగాయలను తినడం ఆరోగ్యానికి మంచిదా చెప్పండి? వీటిని తినడం అంటే డబ్బులిచ్చి అనారోగ్యం కొనుక్కున్నట్టే. 

  ఈరోజుల్లో రైతు విత్తన కంపెనీలు, ఎరువులు పురుగుమందుల కంపెనీల చేతిలో కీలుబొమ్మల మారిపోయాడు. వారు చెప్పినట్టు విచ్చలవిడిగా ఎరువులు పురుగుమందులు వాడి పంటలు పండిస్తున్నారు. అలా చేయ్యకపోతే దిగుబడి రాదు. అందువల్ల రైతులు పంటలకు విపరీతంగా ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. వీటిని ఇంతలా వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని చాలామంది రైతులకు తెలియదు.

  మా తాతల కాలంలో వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయమే. సహజసిద్దంగా పంటలు పండించేవారు. విత్తనాలను వచ్చిన పంటలనుండే సేకరించేవారు.ఎరువుల విషయానికివస్తే పశువుల పేడ, ఎండుగడ్డిని సంవత్సరమంతా పెంటల్లో వేసి పంటలు వేసేముందు పొలంలో వేసుకునేవారు ఈ ఎరువు వేయడం వలన దిగుబడి బాగా వచ్చేది. ఇక పురుగుమందులు అసలు వాడేవారు కాదు ఎందుకంటే పశువుల ఎరువులు వాడటం వలన ఇన్ని పురుగులు పంటలకు ఆశించేవికావు. ఇలా పండించిన ఆహారం తిని వారు ఆరోగ్యంగా ఉండేవారు. 

మరీ నేడు ఆధునిక వ్యవసాయంలో పశువుల ఎరువులు వాడటం మానేశారు. అసలు ఇప్పుడు రైతుల వద్ద పశువులు లేకుండా పోయాయి. కృత్రిమ ఎరువులకు రైతులు అలవాటు పడిపోయారు. 'ఒకప్పుడు వ్యవసాయం అంటే పాడి పంట అనేవారు ఇప్పుడు వ్యవసాయం అంటే రసాయన పంట'.


 ఇప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సుభాష్ పాలేకర్ గారి లాంటి వారు. అయిన రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళడంలేదు. ఎందుకంటే ఈ విధానంలో కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఎరువులు విత్తనాలు సహజసిద్దంగా మనమే తయారు చేసుకోవాలి అంత ఓపిక ఇప్పటి రెతులకు లేదు మార్కెట్ కి వెళ్ళామా , విత్తనాలు కొన్నమా, రసాయన ఎరువులు, పురుగుమందులు తెచ్చామా పంటలకు వేశామా అంతే తేలికగా అయిపోయే. ప్రకృతి వ్యవసాయం చేసే ఓపిక ఇప్పటి రైతులకు లేదు. మరి వాళ్ళు పండించిన రసాయన పంటలే తిని అనారోగ్యం పాలవడం కంటే మనమే సొంతంగా ప్రకృతి సిద్దంగా కూరగాయలను పండించుకుని ఆరోగ్యంగా ఉందాం.

  మనం కూరగాయలను పండించేందుకు ఇంటిముందు కాని ఇంటిమీద కాని కొంచెం స్థలం ఉంటే సరిపోతుంది. ఈ పెరటి తోట ప్రారంబించేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. మడులు తయారు చేసుకోవడం, కుండీలు తెచ్చుకోవడం విత్తనాలు, మట్టి, వర్మీకంపోస్ట్, కోకోపీట్ , వేపపిండి లాంటివి తెచ్చి పెరటి తోట తయారు చేసుకోవడం వరకు కొంచెం కష్టమెన పనే. ఇష్టంగా చేస్తే ఏపని కష్టం అనిపించదు. పైగా ఇది మన ఆరోగ్యం కోసం చేసేపని. ఒక్కసారి మీ పెరటి తోట సిద్దమయ్యి కూరగాయలు కాయడం, ఆకుకూరలు పెరగడం చూస్తుంటే మీ చేతుల్తో పెంచారు కాబట్టి ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. మన పెరటి తోటలో కూరగాయలే కాకుండా పూల మొక్కలు, పండ్లమొక్కలు కూడా పెంచుకోవాలి. ఉదయం లేవగానే ఆ మొక్కల మద్యన తిరుగుతుంటే ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 

  మన పెరటి తోటలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బయట మార్కెట్లో కొన్న వాటికంటే రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా.

 

 మీరు పెరటి తోటలు పెంచాలనుకుంటే mad gardenar, noorjahan terrace garden అనే యూట్యూబ్ ఛానెల్ విడియోలు చూసి చక్కగా పెరటి తోటలు పెంచండి. మాధవి గారు, నూర్జహాన్ గారు పెరటి తోటల పెంపకం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు.

   వండుకోవడమే కష్టం అయ్యి స్విగ్గి, జోమాటో లో తెప్పించుకుని తినే ఈరోజుల్లో ఈ పెరటి తోటల్లో పండించి వండుకోవటం కష్టమంటారా.? ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం కష్టపడాల్సిందే. మరీ ఇంత బద్ధకం పనికిరాదు ఇంట్లో వండుకునే ఆహారాన్ని  బయట హోటళ్ళ నుండి కష్టపడకుండా ఇంటిదగ్గరకే తెప్పించుకుని తింటున్నారు. రేపు ఇంకో బొగ్గి సంస్థ వచ్చి ఆహారాన్ని తినిపిస్తాం అంటే ఆ సేవలను వినియోగించునేలా ఉన్నారు. మరీ ఇంత సోమరితనం అయితే ఎలా? డబ్బు డబ్బు అని పరిగెడుతూ ప్రకృతి జీవన విధానానికి దూరంగా జీవిస్తున్నారు. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు. ఆరోగ్యం లేకుంటే ఎంత డబ్బుంటే ఏం ప్రయోజనం. అవసరానికి తగినంత డబ్బుంటే చాలు. డబ్పుకోసమే జీవితం అన్నట్టు ఉండకూడదు. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి.

 

పెరటి తోటల పెంపకం వలన కూరగాయలు, పండ్లతో పాటు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇళ్ళు కూడా చల్లగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటిముందు వాతావరణం  ఆహ్లాదకరంగా ఉంటుంది.

అందరు పెరటి తోటలు పెంచి ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు తింటు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు.  

       ధన్యవాదాలు...