భానోదయం: మన కూరగాయలు మనమే పండిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.

13, మే 2021, గురువారం

మన కూరగాయలు మనమే పండిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.

   

    మనకు ప్రతిరోజు అవసరమయ్యే నిత్యావసరాలలో కూరగాయలు, ఆకుకూరలు మొదటి స్థానంలో ఉంటాయి.

ప్రతీవారం మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటాం. అలా కాకుండా మనమే కురగాయలు పండించుకుని తింటే ఎలా ఉంటుంది చెప్పండి?

     ఓ వందో రెండొందలో పెడితే వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి దీనికోసం కూరగాయలు పండించడం అవసరమా? అని మీరు అనొచ్చు. 

నిజమే వంద రొండొందలకి వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి కాని కోట్లు ఖర్చుపెట్టిన కాని ఆరోగ్యం, ఆనందం రావు.

  నేడు కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండిస్తున్నారో మనకు తెలుసు.కృత్రిమ ఎరువులు విపరీతంగా వాడుతున్నారు. అలాగే పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇంతలా కృత్రిమ ఎరువులు, పురుగు మందులు వాడిన కూరగాయలను తినడం ఆరోగ్యానికి మంచిదా చెప్పండి? వీటిని తినడం అంటే డబ్బులిచ్చి అనారోగ్యం కొనుక్కున్నట్టే. 

  ఈరోజుల్లో రైతు విత్తన కంపెనీలు, ఎరువులు పురుగుమందుల కంపెనీల చేతిలో కీలుబొమ్మల మారిపోయాడు. వారు చెప్పినట్టు విచ్చలవిడిగా ఎరువులు పురుగుమందులు వాడి పంటలు పండిస్తున్నారు. అలా చేయ్యకపోతే దిగుబడి రాదు. అందువల్ల రైతులు పంటలకు విపరీతంగా ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. వీటిని ఇంతలా వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని చాలామంది రైతులకు తెలియదు.

  మా తాతల కాలంలో వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయమే. సహజసిద్దంగా పంటలు పండించేవారు. విత్తనాలను వచ్చిన పంటలనుండే సేకరించేవారు.ఎరువుల విషయానికివస్తే పశువుల పేడ, ఎండుగడ్డిని సంవత్సరమంతా పెంటల్లో వేసి పంటలు వేసేముందు పొలంలో వేసుకునేవారు ఈ ఎరువు వేయడం వలన దిగుబడి బాగా వచ్చేది. ఇక పురుగుమందులు అసలు వాడేవారు కాదు ఎందుకంటే పశువుల ఎరువులు వాడటం వలన ఇన్ని పురుగులు పంటలకు ఆశించేవికావు. ఇలా పండించిన ఆహారం తిని వారు ఆరోగ్యంగా ఉండేవారు. 

మరీ నేడు ఆధునిక వ్యవసాయంలో పశువుల ఎరువులు వాడటం మానేశారు. అసలు ఇప్పుడు రైతుల వద్ద పశువులు లేకుండా పోయాయి. కృత్రిమ ఎరువులకు రైతులు అలవాటు పడిపోయారు. 'ఒకప్పుడు వ్యవసాయం అంటే పాడి పంట అనేవారు ఇప్పుడు వ్యవసాయం అంటే రసాయన పంట'.


 ఇప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సుభాష్ పాలేకర్ గారి లాంటి వారు. అయిన రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళడంలేదు. ఎందుకంటే ఈ విధానంలో కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఎరువులు విత్తనాలు సహజసిద్దంగా మనమే తయారు చేసుకోవాలి అంత ఓపిక ఇప్పటి రెతులకు లేదు మార్కెట్ కి వెళ్ళామా , విత్తనాలు కొన్నమా, రసాయన ఎరువులు, పురుగుమందులు తెచ్చామా పంటలకు వేశామా అంతే తేలికగా అయిపోయే. ప్రకృతి వ్యవసాయం చేసే ఓపిక ఇప్పటి రైతులకు లేదు. మరి వాళ్ళు పండించిన రసాయన పంటలే తిని అనారోగ్యం పాలవడం కంటే మనమే సొంతంగా ప్రకృతి సిద్దంగా కూరగాయలను పండించుకుని ఆరోగ్యంగా ఉందాం.

  మనం కూరగాయలను పండించేందుకు ఇంటిముందు కాని ఇంటిమీద కాని కొంచెం స్థలం ఉంటే సరిపోతుంది. ఈ పెరటి తోట ప్రారంబించేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. మడులు తయారు చేసుకోవడం, కుండీలు తెచ్చుకోవడం విత్తనాలు, మట్టి, వర్మీకంపోస్ట్, కోకోపీట్ , వేపపిండి లాంటివి తెచ్చి పెరటి తోట తయారు చేసుకోవడం వరకు కొంచెం కష్టమెన పనే. ఇష్టంగా చేస్తే ఏపని కష్టం అనిపించదు. పైగా ఇది మన ఆరోగ్యం కోసం చేసేపని. ఒక్కసారి మీ పెరటి తోట సిద్దమయ్యి కూరగాయలు కాయడం, ఆకుకూరలు పెరగడం చూస్తుంటే మీ చేతుల్తో పెంచారు కాబట్టి ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. మన పెరటి తోటలో కూరగాయలే కాకుండా పూల మొక్కలు, పండ్లమొక్కలు కూడా పెంచుకోవాలి. ఉదయం లేవగానే ఆ మొక్కల మద్యన తిరుగుతుంటే ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 

  మన పెరటి తోటలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బయట మార్కెట్లో కొన్న వాటికంటే రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా.

 

 మీరు పెరటి తోటలు పెంచాలనుకుంటే mad gardenar, noorjahan terrace garden అనే యూట్యూబ్ ఛానెల్ విడియోలు చూసి చక్కగా పెరటి తోటలు పెంచండి. మాధవి గారు, నూర్జహాన్ గారు పెరటి తోటల పెంపకం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు.

   వండుకోవడమే కష్టం అయ్యి స్విగ్గి, జోమాటో లో తెప్పించుకుని తినే ఈరోజుల్లో ఈ పెరటి తోటల్లో పండించి వండుకోవటం కష్టమంటారా.? ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం కష్టపడాల్సిందే. మరీ ఇంత బద్ధకం పనికిరాదు ఇంట్లో వండుకునే ఆహారాన్ని  బయట హోటళ్ళ నుండి కష్టపడకుండా ఇంటిదగ్గరకే తెప్పించుకుని తింటున్నారు. రేపు ఇంకో బొగ్గి సంస్థ వచ్చి ఆహారాన్ని తినిపిస్తాం అంటే ఆ సేవలను వినియోగించునేలా ఉన్నారు. మరీ ఇంత సోమరితనం అయితే ఎలా? డబ్బు డబ్బు అని పరిగెడుతూ ప్రకృతి జీవన విధానానికి దూరంగా జీవిస్తున్నారు. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు. ఆరోగ్యం లేకుంటే ఎంత డబ్బుంటే ఏం ప్రయోజనం. అవసరానికి తగినంత డబ్బుంటే చాలు. డబ్పుకోసమే జీవితం అన్నట్టు ఉండకూడదు. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి.

 

పెరటి తోటల పెంపకం వలన కూరగాయలు, పండ్లతో పాటు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇళ్ళు కూడా చల్లగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటిముందు వాతావరణం  ఆహ్లాదకరంగా ఉంటుంది.

అందరు పెరటి తోటలు పెంచి ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు తింటు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు.  

       ధన్యవాదాలు...


   

 

 

 

   


1 కామెంట్‌:

Siri చెప్పారు...

చాలా బాగాచెప్పారు..