భానోదయం

17, మే 2023, బుధవారం

రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి...

  టెక్నాలజీ మారుతున్న కొద్ది కొన్ని రంగాలు కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. ఇప్పుడు సినిమా థియేటర్లు మూత పడుతున్నాయి. దాదాపుగా దాశాబ్ధం క్రితం నుండే చిన్న చిన్న పట్టణాల్లో థియేటర్లను తీసేసి వాటినే ఫంక్షన్ హాల్స్ గా మార్చేసారు. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు కూడా తమ థియేటర్లను మూసేస్తున్నాయి. కారణం టెక్నాలజీ లో వచ్చిన మార్పు.
   ఒకప్పుడు వినోదం అంటే సినిమా థియేటర్లలో సినిమా చూడటమే ఒక సినిమా ను నాలుగైదు సార్లు చూసేవారు అప్పుడు థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతూ ఉండేవి. మరి ఇప్పుడు ఒక సినిమాని చూడాలంటే పదిసార్లు ఆలోచిస్తూ ఉన్నారు జనం. రెండున్నర గంటలు సినిమా చూసే ఓపిక ఇప్పుడు ఎవరికిలేదు, ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సినిమా అయినా చూసే వీలుంది. అదికూడా నచ్చిన సన్నివేశాలు చూస్తూ నచ్చని సన్నివేశాలు దాటవేస్తూ చూసే అవకాశం ఉంది. ఇంత సౌలభ్యం ఉండగా సినిమా థియేటర్లలో ఎవరు సినిమా ఎవరు చూస్తారు. రెండున్నర గంటలు సమయం, డబ్బు వృథా అని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి కొత్త కొత్త సినిమాలు చూడడానికి ఓటిటి యాప్స్ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉండగా ఇంకా థియేటర్లో సినిమాలు ఎందుకు చూస్తారు. 

 ఒకప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చూడాలంటే థియేటర్ వరకు వెళ్లి పెద్ద పెద్ద లైన్లో నిల్చుని టికెట్ల కోసం తొక్కిసలాటలో యుద్ధం చేసి టికెట్లు సంపాదించి, అక్కడ దొరకకుంటే బ్లాక్ లో ఎంత ధర అయినా కొని థియేటర్ లోపలికి వెలితే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ డబుల్ రేట్లకు కొని జెబుకు చిల్లు పెట్టుకోవాలి. ఇంత చేసినా థియేటర్ లోపల పోకిరీల హంగామా మరో తలనొప్పి. ఫ్యామిలీ తో వెళ్తే అంతే చుక్కలు కనిపిస్తాయి. 

 ఇన్ని ఇబ్బందులు పడి ఈ రోజుల్లో సినిమాలు ఎవరు చూస్తారు. ఎంచక్కా ఇంట్లోనే చిన్న థీయేటర్ లాంటి టీవీలు, సౌండ్ సిస్టం ఉన్నాయి. ఏ ఇబ్బందీ లేకుండా ఇంట్లోనే సినిమాలు చూసేయోచ్చు మీ వీలున్నప్పుడు.

ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్కు వెళ్ళేవారు. ఇప్పుడు సినిమాలే ఇంటికి వస్తున్నాయి. అంతా టెక్నాలజీ వల్లే. 

ఇప్పుడు జనాలు సినిమాలు చూడటం తగ్గించేసారు. షార్ట్ ఫిలిమ్స్, వ్లాగులు ఇవ్వే ఎక్కువగా చూస్తున్నారు. అరచేతిలో ఎంటర్టైన్మెంట్ ఉండగా సినిమా థియేటర్లు ఎందుకు దండగా అన్నట్టు ఉంది. ఆ విడియోలు కూడా స్కిప్ చేస్తూ చూస్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం వీడియో చూడడం గొప్ప కేవలం 15 సెకండ్ల వీడియోలు చూస్తారు అంతే. 15 క్షణాలు ఎక్కడ, మూడు గంటలు ఎక్కడ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో థియేటర్ లో మూడు గంటలు సినిమాలు చూసే ఓపిక ఎవరికి లేదు.  కాబట్టి రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి...

23, జనవరి 2023, సోమవారం

ఏడుపాయల వన దుర్గామాత దేవాలయం

  ఏడుపాయల వన దుర్గామాత దేవాలయానికి ఈరోజు వెళ్ళాను. ఉదయం ఇంటినుండి  ఏడు గంటలకి బయలుదేరాను. సంగారెడ్డి, నర్సాపూర్, ఏడుపాయల ఒంటి గంట వరకు చేరుకున్నాను. ఏడుపాయల చేరుకున్నాక తో నీలాలు సమర్పించిన తర్వాత స్నానం చేయాలి మంజీర నదిలో నీరు అంతా ఆకుపచ్చ రంగులో ఉంది. చుట్టుపక్కల పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి అయినా అందరు భక్తులు అలాగే స్నానం చేస్తున్నారు. నేను కూడా అలాగే నదిలో మునిగాను. నదిలోకి దిగాక ఏమి అనిపించలేదు ఇంకా అందులోనే కాసేపు ఉండాలనిపించింది. నాకు అంతగా ఈత రాదు కాబట్టి నదిలో స్నానం చేసి బయటకు వచ్చేసా. నదిలో ఒడ్డున అపరిశుభ్రంగా ఉన్నా నదిలోకి దిగాక అందులోనే కాసేపు ఉండాలనిపించింది. భక్తులు అందరు పరిశుభ్రత పాటిస్తే ఇంకా బాగుంటుంది. కాని ఎవరు మన మాట వింటారు చెప్పండి. ప్రకృతే మనుషులు చేసిన కలుషితాన్ని కడిగి పారేస్తుంది. ఇప్పుడు నేను స్నానం చేసిన నదిలో వర్షాకాలంలో 20 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో మనుషులు చేసిన మలినాలన్ని కొట్టుకుపోతాయి. 


ఏడుపాయలు కొండలు, చెట్లు అడవులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంజీరా నది సింగూర్ ప్రాజెక్టు నుండి ప్రవహించి ఏడుపాయల వన దుర్గా ఆలయం చేరుకోగానే ఏడుపాయలుగా మారి ప్రవహిస్తుంది. ఒక నది ఏడు నదులుగా మారి ప్రవహిస్తుంది కాబట్టి ఏడుపాయల అనే పేరు వచ్చింది.

అమ్మవారు నది ఒడ్డున కొలువై ఉంటుంది. వర్షాకాలంలో అమ్మ వారి పాదాలను తాకుతూ మంజీర ప్రవహిస్తుంది. అప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళడానికి రాదు. గుడిముందు నుండి దాదాపు పదిహేను అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. 


ప్రజలు గుడికి వెళ్ళినప్పుడు చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తారు. అందువలన చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉంటుంది. ఆలయ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, చెత్త బుట్టలు పెట్టి అందులో వేసేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆలయానికి కిలోమీటరు దూరంలో మరుగుదొడ్లు కట్టించి అందులోకే వెళ్ళేలా అవగాహన కల్పిస్తే ఆలయం పరిసరాలలు పరిశుభ్రంగా ఉంటాయి. 


ఆలయానికి రావడానికి కొత్త రోడ్లు, పార్కింగ్  కోసం చుట్టుపక్కల చెట్లు నరికేసారు. వీలైన చోటల్లా చెట్లు నాటితే పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. చెట్లు అంటే మామూలు చెట్లు కాదు పండ్ల చెట్లు నాటాలి. వీటివలన ఇక్కడ కోతులకి ఆహారం లభిస్తుంది. 


ఇలా కొన్ని మంచి పనులు చేస్తే ఏడుపాయల ఆలయానికి వెళ్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఏ ఒక్కరి వల్ల కాదు అందరు  పరిశుభ్రత పాటిస్తే బాగుంటుంది. 


చదువుకున్న యువత ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పరిశుభ్రత పట్ల భక్తులకు అవగాహన కల్పిస్తే ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయని నాఅభిప్రాయం. ఈ స్వచ్ఛంద సంస్థలో చేరిన యువత ఒక్కొక్కరు   సంవత్సరంలో  రెండు రోజులు  ఇక్కడ పరిశుభ్రత పట్ల భక్తులకు అవగాహన కల్పించాలి. 


ఇది జరిగే పనేనా అంటే జరుగుతుంది. నేను స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడానికి సిద్ధం. ప్రకృతి ప్రేమికులు, దైవభక్తి కలవారు మంచివారు ఈ సంస్థలో చేరాలని నా ఆశ. ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తే చాలు వారు పాటిస్తారు. మనం చూసి చూడనట్లు ఉంటే ఇంకా కలుషితం అవుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణను కాంక్షించే వారు స్వచ్ఛందంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీనికోసం ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయాలి. పరిశుభ్రతే దైవం🙏🙏


 నా ఈ పోస్టు చదివిన వారు ఎవరైనా ఏడుపాయలకు తరచుగా వచ్చే వారు ఎవరైనా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. దైవభక్తి కలవారు, ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఏడుపాయల ఆలయానికి వచ్చి పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆశిస్తున్నాను... 


ఏడుపాయల వన దుర్గామాత అందరిని చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను. 


మనం మంచి చేస్తే దైవం మనకు అంతకు రెట్టింపు మంచి చేస్తుంది.


 మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే వంద అడుగులు ఆ దైవం మనవెంట ఉండి నడిపిస్తుంది.


మనం ధర్మం, న్యాయంగా జీవించాలి. అదే ఈ జీవితానికి సార్థకత.


పరిశుభ్రతే దైవం. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిద్దాం, మన దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుదాం. 


🙏🙏🙏🙏🙏

ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఇంటినుండి ఏడుపాయల దేవాలయానికి బయలు దేరాను, మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి చేరాను. మా ఊరి నుండి 100 కి.మీ ఉంటుంది. మొత్తం బస్సు ప్రయాణమే. మూడు బస్సులు మారాలి. ఒక్కడినే వెళ్ళాను చీకటి పడుతుందేమే రావడం ఆలస్యమైతే ఎలా అనుకున్నా. కాని సమయానికి ఇంటికి చేరుకున్నా. ఎక్కడ కూడా బస్సు కోసం వేచి చూడలేదు. వెంట వెంటనే బస్సులు దొరికాయి. అంతా అమ్మ వారి దయ... 


ఎవరైనా ఏడుపాయల దేవస్థానాన్ని  దర్శించే వారు ఉంటే మీ అభిప్రాయం తెలియజేయండి...