భానోదయం: 2022

26, అక్టోబర్ 2022, బుధవారం

పొట్లం యాప్ ఆన్లైన్ కూరగాయలు

 

పొట్లం యాప్ 

ఈ స్టార్టప్ ఆలోచన చాలా బాగుంది. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందుతాయి. మరియు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పొట్లం యాప్ రూపకర్త శ్రీనివాస్ గారు. ఈ 'పొట్లం' అన్ని నగరాలకు విస్తరించాలి.






4, అక్టోబర్ 2022, మంగళవారం

ఆదిపురుష్ కూడా డిజాస్టర్? ప్రభాస్ సినిమాలు ఎందుకు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి..

 బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది.

ప్రభాస్ ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ ప్రభాస్ వెంట పడ్డారు. ఏడాదికి ఒక సినిమా చొప్పున సినిమాలు తీస్తున్నాడు ప్రభాస్. 

బాహుబలి, బాహుబలి 2  ఈ రెండు సినిమాలు చేయడానికి ఐదు సంవత్సరాల పట్టింది. మరి తీసింది ఎవరు రాజమౌళి. అందుకే ఈ సినిమా ఆ రేంజ్ లో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది.


ఇక ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు పెద్దగా హిట్టు అవ్వటం లేదు. 'సాహో' రిచ్ గా ఉంటుంది పిల్ల డైరెక్టర్ తో తీసాడు ఏమయ్యింది ఫ్లాప్ అయ్యింది. తర్వాత "రాధే శ్యామ్" ఇది పెద్ద డిజాస్టర్. ఇప్పుడు "ఆదిపురుష్"  ఈసినిమా పేరు వినగానే అనుకున్నా ఇది కూడా పెద్ద డిజాస్టర్ అని. మొన్న టీజర్ చూడగానే ఇది కూడా పెద్ద డిజాస్టర్ అని అర్థం అవుతుంది. 


ఆదిపురుష్ కంటే సాహో, రాధే శ్యామ్ సినిమాలు 100 శాతం ఉత్తమం. ఎందుకంటే అందులో ప్రభాస్ నటించాడు. ఇందులో ప్రభాస్ కార్టూన్ క్యారెక్టర్ ఉంది. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్సే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆదిపురుష్ కథ రామాయణం. ఈ సినిమాలో కథ ఉంది తీసే విధానమే బాగాలేదు. ఏదో కార్టూన్ సినిమా తీసినట్టు ఉంది. దీనికంటే కార్టూన్ సినిమానే చాలా బాగుంటుంది. 500 వందల కోట్ల సినిమా అంటున్నారు. 5 కోట్లు కూడా సినిమాకు పెట్టినట్లు లేదు. ఈ ఆదిపురుష్ టీజర్ చూస్తుంటే మొబైల్ ఫోన్ లో ఇంతకంటే బాగా యానిమేషన్ క్రియేట్ చేయోచ్చు అనిపిస్తుంది. ఇందుకు 500 కోట్లు అవసరమా అనిపిస్తుంది. బహుశా ఆ 500 కోట్లు నటీనటులకు, డైరెక్టర్ల రెమ్యునరేషన్ కే సరిపోయినట్టుంది. అందుకే ఇక బడ్జెట్ లేక యానిమేషన్ సినిమా తీసినట్టు ఉంది..


ఎందుకిలా ప్రభాస్ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నాడు. 


ఎందుకిలా ??

ప్రభాస్ కు ఏమయ్యింది అనుకుంటాం.


కాని ప్రభాస్ రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా తీసుకుంటూ పోతే తనకు నష్టమే కదా..


బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు వేరే సినిమాలు ఏవి చేయలేదు. సంపాదన పరంగా ఆయనకి నష్టమే. బాహుబలి రిలీజ్ అయ్యింది 5 సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కింది. తన రేంజ్ పెరిగిపోయింది, రెమ్యునరేషన్ కూడా ఆటోమెటిక్ గా పెరిగిపోతుంది. దీనినే ప్రభాస్ క్యాష్ చేసుకోవడానికి కథ ఎలా ఉన్నా, డైరెక్టర్ ఎవరైనా సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. అందుకే ఇలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.‌ 


 కథ లేకుండా కేవలం హీరో వల్ల మాత్రమే సినిమాలు హిట్టవుతాయంటే కుదరదు.  సినిమాలో ఎంత పెద్ద పాన్ ఇండియా హిరో ఉన్న ముందు కథ ఉండాలి, తీసే విధానం బాగుండాలి అంతేకాని హీరో ఒక్కడే ఉంటే సరిపోదు.


ఎంతైనా రాజమౌళి రాజమౌళే ఆయన సినిమాలు తీసే విధానం వల్లే సినిమాలు హిట్టు అవుతున్నాయి. అంతేకాని హీరోల వల్ల సినిమాలు హిట్టు అవ్వవు.




26, ఆగస్టు 2022, శుక్రవారం

ఓవరాక్షన్ స్టార్ల ఓవర్ యాక్షన్-లిగర్

 ఏమి ఓవరాక్షన్ అది మామూలుగా కాదు బాహుబలి, అవతార్ రికార్డులను బద్దలు కొడుతుంది అన్నట్టు బిల్డప్ లు ఇచ్చారు. నగ్నంగా బోకె పట్టుకుని పోస్టర్స్. ఇది చూసి కొందరు హీరోయిన్స్ అదిరిపోయిందంటూ పోస్టులు. ఆహా ఏమి ప్రమోషన్స్ అవి తెలుగు సినిమా రికార్డులే కాదు అసలు ప్రపంచ సినిమా చరిత్రలోనే రికార్డులను తిరగరాస్తుంది అన్నట్టు ఫోజులు కొట్టారు. ఇప్పుడు ఏమయ్యింది ఓవరాక్షన్ కి దిమ్మతిరిగిపోయి సినిమా ఫ్లాప్ అయ్యింది. 


ఏ సినిమా గురించి అనుకుంటున్నారా అదేనండి మన ఓవరాక్షన్ స్టార్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ సినిమా లిగర్ గురించి. 

లిగరా.. లైగర్ అనుకుంటా.. ఏదోటి ఫ్లాప్ సినిమా టైటిల్ ఎలా ఉంటే ఏంటి?. అర్థం పర్థం లేని పేర్లు..


అసలు వీళ్ళు ఎందుకు సినిమాలు తీస్తారో అర్థం కాదు.

పూరీ సినిమాల్లో అసలు కథ తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ దీనికి తోడు విజయ్ దేవరకొండ ఇద్దరు ఇద్దరే. ఇద్దరు ఉద్దండులు కలిసి సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది. 


ఈ సినిమా ఎలా ఉంటుందంటే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా+లోఫర్  ఈ రెండు సినిమాలను మిక్స్ చేసి ఒక కొత్త కళాఖండాన్ని తీసాడు. 

ఈ కళాఖండాన్ని ప్రచారం చేయడానికి నగ్న ప్రదర్శనలు చేయడం. అసలు సినిమాలో ఏమి లేదని తెలిసే ఇలాంటి చెత్త ప్రచారాలు చేసి సినిమాలో ఏదో ఉందని గొప్పలు చెప్పడం.



విజయ్ దేవరకొండ ఈయన గురించి అందరికీ తెలిసిందే. నేనే గొప్ప నేను చేసేదే కరెక్టు, నేను నాఇష్టం వచ్చినట్టు చేస్తేనే జనాలకు ఇష్టం అనుకుంటాడు. అర్జున్ రెడ్డి ఎలా హిట్టు అయ్యిందో కాని అప్పటి నుండి ఈయన యాక్షన్ ఓవరాక్షన్ మామూలుగా లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవ్వరిని లెక్క చేయకుండా, నేనే గొప్ప నటుడిని నా అంత గొప్ప నటుడు ఎవరు లేరన్నట్టు ఫీలవుతుంటాడు..


ఇక పూరీ గారు ఈయనకెందుకో ఈ సమాజం అన్నా ఈ దేశం అన్నా చాలా కోపం అనుకుంటా ఈయన సినిమాల్లో డైలాగులు చూస్తే అర్థమవుతుంది.

సమాజం చాలా భయంకరమైనది అన్నట్టు డైలాగులు చెబుతాడు. ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు  నాకే  ఉన్నాయి అంటు చెబుతూ ఆయన అభిమానులను ఏడిపిస్తుంటాడు. ఈయనకు తోడు ఛార్మీ గారు మామూలుగా ఉండదు వీళ్ళతో...

ప్రపంచంలో వీళ్ళకె కష్టాలు ఉన్నట్లు కెమెరాల ముందు ఏడుస్తుంటారు. పబ్బులు, ఫారిన్ టూర్లు తిరిగుతూ ఎంజాయ్ చేస్తు చాలా కష్టపడుతున్నాం జీవితంలో అన్ని కోల్పోయాం అంటారు‌. ఏంటో వీళ్ళ కష్టాలు..?

వీళ్ళవే కష్టాలు అంటే రైతులవి, రోజువారి కూలీలవి ఏంటో మరి??


చెత్త సినిమాలు తీసి యువతను చెడగొడుతున్నారు.

పైగా మేము చాలా కష్టపడుతున్నాం అంటారు.

ఎందుకు అండీ మీ కష్టం మీ సినిమాల ద్వారా సమాజాన్ని రెచ్చగొట్టడం, చెడగొట్టడం కోసమా?..


నాకు ఆ లిగర్ గలీజు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే అనుకున్నా ఈ సినిమాలో ఏమి లేదని. అట్టర్ ఫ్లాఫ్ అవుతుందని. అలాగే జరిగింది..


ఆ పేరొకటి లిగర్ సాలా క్రాస్ బీడ్ అంటా. ఏంట్రా ఈ టైటిల్ అనుకున్నా..  దీని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు.. గూగుల్ ట్రాన్స్ లేట్ చేస్తే తెలిసింది ఆడపులికి మగ సింహనికి పుట్టిన జంతువుట.. ఏంటో ఈ పేర్లు..

క్రాస్ బీడ్ లేంటో, ఈ జంతువులేంటో,ఈ సినిమాలేంటో నాకైతే అర్థం కాలేదు..


పూరీ గారు సమాజానికి పనికొచ్చే ఒక్క సినిమా అయినా తీసారా.. ఇడియట్, పోకిరి, దేశముదురు, లోఫర్, లిగర్ క్రాస్ బ్రీడ్ మొత్తం ఇవే సినిమాలు. ఇలాంటి సినిమాలు తీసి యువతను రెచ్చగొట్టడం, సమాజాన్ని నిందించడం. ఏంటో ఈ సినిమాలు..


సినిమాలంటే బింబిసారా, కార్తికేయ-2, సీతారామం లా ఉండాలి. ఈ సినిమాలకు పెద్దగా ప్రచారం చేయలేదు కదా. అయినా పెద్ద విజయం సాధించాయి.. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద విజయం సాధించాయి.


సినిమాలో కథ ఉండాలి ప్రేక్షకులే పబ్లిసిటీ చేస్తారు.

అంతేకాని కథ లేకుండా ఎంత పెద్ద తోపు డైరెక్టర్, తోపు హీరో ఉన్నా సినిమాలు చూడరు.







11, జులై 2022, సోమవారం

కోనోకార్పస్ లాంటి పనికి రాని మొక్కలు పెంచే కంటే పళ్ళమొక్కలు పెంచవచ్చు కదా..


కోనోకార్పస్ మొక్క







కోనోకార్పస్ మొక్క ఇప్పుడు పల్లెలో, పట్టణాల్లో రోడ్ల వెంబడి విరివిగా కనిపించే మొక్క. అలా నాటించారు మీ పాలకులు...

 నెలల వ్యవధిలోనే ఏపుగా పెరిగుతుంది ఈ మొక్క..
 ఒక్కసారి నాటితే చాలు పెద్దగా దీని సంరక్షణ అంతగా చూసుకోవాల్సిన అవసరం లేకుండా పెరుగుతుంది.

ఇతర మొక్కలైతే ప్రతిరోజు నీరు అందించాలి, పశువులు తినకుండా కాపాడాలి. అందుకే ఈ మొండిజాతి మొక్కలు నాటారు అనిపిస్తుంది..

ఇప్పుడు కోనోకార్పస్ మొక్కలు ఏపుగా పెరిగి రోడ్ల వెంట పచ్చదనంతో నిండిపోయింది.. కాని ఇప్పుడు ఈ మొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా వీటివల్ల మనుషులకు ఎలర్జీలు వస్తాయని చెబుతున్నారు.
వీటి ఆకులను పశువులు కూడా తినవు, పక్షులు కూడా వీటిపై గూళ్ళు పెట్టవట.. 

ఇది నిజమేనా? అంటే నిజమే అనిపిస్తుంది.. నేను మా ఊరిలో గమనించాను వీటి ఆకులను పశువులు తినడం లేదు, పక్షులు కూడా వీటిపై గూళ్ళు పెట్టడం లేదు.. మనుషులకు ఎలర్జీలు అంటే ఇంకా ఏమి తెలీదు.. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో..

ఈ మొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, వీటివల్ల నష్టాలు ఉన్నాయని తెలిసే వీటిని నాటించారా, లేక తెలియక నాటించారా??

వీటి బదులు పనికి వచ్చే మొక్కలు చాలానే ఉన్నాయి కదా వాటిని పెంచవచ్చుగా..?

ఉదాహరణకు జామ, మామిడి, దానిమ్మ, నిమ్మ, నేరేడు, వేప, చింత, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు పనికి వచ్చే మొక్కలు చాలానే ఉన్నాయి అలాంటి మొక్కలను రోడ్లకు ఇరువైపులా పెంచవచ్చు కదా...
వీటివల్ల మనుషులకు చాలా ఉపయోగం ఉంటుంది కదా..

గ్రామాల్లో అభివృద్ధి పనులకు తాగిపడేసిన బీరు సీసాలు, లిక్కరు సీసాలు ఏరుకుని ఆ డబ్బులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని మన గౌరవ మంత్రి గారు సెలవిచ్చారు...

ఇలా తాగి పడేసిన లిక్కరు సీసాలకు బదులు, ఆ పండ్ల మొక్కలు పెంచి వాటి పండ్లను అమ్మి గ్రామంలో అభివృద్ధి పనులు చేయోచ్చు కదా...

ఎందుకు పనికిరాని మొక్కలు పెంచడం ఎందుకు.. పండ్లమొక్కలు, ఔషద మొక్కలు నాటితే ఎంతో ఉపయోగం కదా...

పాలకులు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేయాలి, ఎలా దోచుకోవాలి అని చూస్తారే తప్ప, ప్రజలకు మంచి చేయాలని చూడరు.. ఇక్కడ రాజకీయాలు ఇంతే...








10, జులై 2022, ఆదివారం

ఈ సన్నివేశం ఎంతో రియాలిటీ గా ఉంటుంది. డైరెక్టర్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే..!




 


   ఈ సన్నివేశం చూస్తే ఎంత రియాలిటీ గా తీశారు అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడికి హాట్సాప్ చెప్పాలనిపిస్తుంది.

ఆ డైలాగులు మాత్రం చాలా సహజంగా ఉంటాయి..


      ఈ సినిమాలో హీరో పేపర్ బాయ్ హీరోయిన్ ధనవంతుడి కూతురు ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమిస్తే సరిపోతుందా వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా. హీరోయిన్ కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. హీరో తల్లి దండ్రులు ఒప్పుకుంటారు ఎందుకంటే ధనవంతుల అమ్మాయి మనలాంటి పేదవాడి అబ్బాయిని ప్రేమించిందని గొప్పగా భావిస్తారు. మరీ డబ్బున్న వాళ్ళు తమ అమ్మాయి ఒక పేదవాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకుంటారా ససేమిరా ఒప్పుకోరు. ఆ స్థానంలో ఎవరున్నా ఒప్పుకోరు.  ఈ సినిమాలో కూడా హీరోయిన్ కుటుంబ సభ్యులకు తమ అమ్మాయిని ఒక పేపర్ బాయ్ కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. కాని హీరోయిన్ మాత్రం అతన్నే పెళ్ళి చేసుకుంటానని పట్టుబడుతుంది. దింతో కూతురి మీద ప్రేమతో హీరోయిన్ తండ్రి అతనితో పెళ్లికి  ఒప్పుకుంటాడు.. 


కాని హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు. ఆఫ్ట్రాల్ ఒక పేపర్ బాయ్ కి నా చెల్లినిచ్చి పెళ్ళి చెయ్యాలా అంటూ కోపంతో ఊగిపోతారు.  ఇలాంటి సన్నివేశాల్లో వేరే ఏ సినిమాలో అయిన పెద్ద పెద్ద ఫైట్లు భారీ భారీ డైలాగులు ఛాలెంజ్ లు ఉంటాయి. కాని ఇక్కడ అవేమి ఉండవు. కేవలం హీరోయిన్ అన్నయ్యలు ఇద్దరు హీరో ఇంటికి వెళ్ళి నాలుగు మాటలు చెబుతూ బాధ పడుతుంటారు అంతే హీరోకి ఒక్క మాట కూడా రాదు. అవును ఇది నిజం రియాలిటీ ఇలాగే ఉంటుంది. 


వాళ్ళు ఏమాట్లాడుతారంటే...


హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలు హీరో ఇంటికి వస్తారు.

వాళ్ళు రాగానే హీరో అమ్మానాన్నలు కంగారు పడుతూ రండిబాబు మీరా రండి రండి కూసోండి, కూసోండి అంటు అదరా బాదరా పడుతుంటారు.


  ఈ టైం లో వచ్చారు ఏంటండీ.? అంటుంది హీరో అమ్మగారు.

  పొద్దున్నుండి పెళ్ళి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయ్యిందాంటీ అంటాడు హీరోయిన్ అన్నయ్య. అలా అంటూనే నాన్న గారు ఇది ఇమ్మాన్నారని చేతిలో ఒక కవర్ పెడతాడు. దాన్ని చూసి ఏంటి బాబు ఇది అని అంటారు హీరో తండ్రి. 


''డబ్బండీ'' అంటారు హీరోయిన్ అన్నయ్యలు.

మా పద్దతి ప్రకారం  మగపెళ్ళి వారి బట్టలకు ఆడపెళ్ళి వారే డబ్బులు ఇస్తారు అంటారు.

 అందుకు వద్దు బాబు ఉన్నంతలో మేం కొనుక్కుంటాం అంటు,  ఇంత బరువు మేం మోయలేమని అంటుంది హీరో అమ్మగారు.


"5లక్షలే మేయలేమని అంటున్నారు రేపు మీ ఇంటికి మా ఇంటి మహాలక్ష్మి రాబోతుంది ఎలా మోస్తారు" అంటాడు హీరోయిన్ అన్నయ్య.


"నా కూతురులా చూసుకుంటాను అయ్యా" అంటుంది హీరో అమ్మగారు.


ఇంతలో మాటల సంగతి తర్వాత ముందు పొయ్ ఛాయ్ పెట్టు అంటాడు హీరో నాన్న..


ఈ టైంలో ఛాయ్ ఏంటీ అంకుల్ పదవుతుంది పొద్దన్నుండి షాపింగ్ లో పడి అన్నమే తినలేదు ఉంటే అన్నమే పెట్టండి అంటారు హీరోయిన్ అన్నయ్యలు.


ఉండండి రెండు నిమిషాల్లో తయారు చేస్తాను అంటుంది హీరో అమ్మగారు..


"ఆంటీ ఉన్నదే పెట్టండి రేపు పెళ్లయ్యాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా" అంటారు.


ఇదంతా చూస్తూ హీరో ఒక్క మాట కూడా మాట్లాడడు.


ఇక వాళ్ళిద్దరికి రెండు కంచాల్లో అన్నం, పప్పు చారు వడ్డిస్తుంది హీరో అమ్మగారు.


అది చూస్తే మనకే అనిపిస్తుంది డబ్బున్న వాళ్ళు ఇలా అన్నం చారు తింటారా అని..? 


నాకు తెలిసి ధనవంతుల ఇళ్ళల్లో డైనింగు టేబుల్ మీద ప్రతిరోజు నాలుగైదు కూరలు, సాంబారు, పెరుగు, నెయ్యి, అప్పడాలు, నాలుగు రకాల పచ్చళ్లు, వేపుళ్లు ఇలా మెను పేద్దగా ఉంటుంది. ఇలాంటి ఆహారం పేదవారికివిందుభోజనం... కాని ధనవంతులకుమాత్రం రోజు సాధారణ భోజనమే... అలాంటిది కేవలం అన్నం చారు తినాలంటే వాళ్ళు తింటారా... ముద్ద దిగదు కదా...




 ఇక వాళ్ళు అన్నాన్ని కలుపుతూ ఉంటారు. ఇంతలో ఒకడు ఏంట్రా అలా కలుపుతున్నావ్ ఆంటీ నాలుగు ఇళ్ళల్లో వంట పని చేస్తుందని నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? అని అంటాడు అది చూసి హీరో ఫ్యామిలీ తెల్ల మోహం వేస్తారు ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు అని.


మళ్ళీ ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువగా వేసుకుంటారు అని అంటాడు.. ఇలాంటి గొడ్డు కారం ముద్ద తినడం నాకు అలవాటు లేదురా. ఇది తింటుంటే గొంతులో మంటగా ఉందిరా కాని మన చెల్లి కి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి అంటాడు.. దాంతో హీరో అవమానంతో ఏమి అనకుండా అలా చూస్తుండిపోతాడు..


 హీరోయిన్ అన్నయలు ఒకరినొకరు చూసుకుంటూ హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ హేలనగా మాట్లాడుతుంటారు.

 

 ఏంట్రా అలా చూస్తున్నావు ఒకటే రూం ఉందనా..?

ఇక్కడే పడుకుంటారు. 


 ఫస్ట్ నైట్ ఎలా అనా? వాళ్ళు బయట పడుకుంటారు. ఆ తర్వాత అందరు కలిసే పడుకుంటారు.  వీళ్ళు ఇటు తిరిగి వాళ్ళు అంటు తిరిగి...


అలా అనేసరికి హీరో ఫ్యామిలీ నోటివెంట మాటరాదు కదా అయోమయంలో పడిపోతారు.


మన చెల్లి అపోలో హాస్పిటల్ లో పుట్టింది.


 ఇప్పుడు మనం చెల్లి పిల్లలు ఆ గాంధీ హాస్పిటల్ లో పుడతారు.


మన పిల్లలు ఆక్రిడ్జ్ లో చదువుతారు. 

మన చెల్లి పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అని హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ  హేళనగా మాట్లాడుతాడు...


ఆ మాటలకు హీరో ఫ్యామిలీ అవమానంతో ఏం అనాలో అర్థం కాక అలానే చూస్తుండి పోతారు..


అలాగే హీరోని ఉద్దేశిస్తూ "రవి నీకే గనుక ఒక చెల్లి ఉంటే తానొక చిత్తు కాగితాలు ఏరుకునే వాడ్ని ప్రేమిస్తే పరువలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారు అని పెళ్ళి చేస్తావా" అని అంటాడు.


మరియు" ప్రేమంటే ఇద్దరు వ్యక్తుల ప్రమాణం. పెళ్ళంటే రెండు కుటుంబాల ప్రయాణం".  ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికొస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వచ్చేస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే భవిష్యత్తులో రెండువైపులా ఉంటుంది..

నాలుగు ఇళ్ళల్లో పని చేసుకుని బతికేవారు గద్వాల్ రెడ్డి గారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతిలో ఉంది. అంటూ బాధపడుతూ పరోక్షంగా హెచ్చరించి 5 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టి వెళ్లి పోతారు.


ఆ 5 తీసుకుని వాళ్ళ చెల్లిని మర్చిపొమ్మని పరోక్షంగా చెప్తారు...


వాళ్ళు వెళ్ళిపోయాక హీరో అమ్మగారు హీరోని చూస్తు రవి నీకు అర్ధం అయ్యిందారా..?  ఆ పిల్లాడు అడిగాడు చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి మీ పిల్లను ఇస్తారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీ తో పోలిస్తే  మన స్థాయి అదే కాదరా? మరీ వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి కాదరా? అని అంటుంది.


ఈ పెళ్లి జరిగితే నీకు గొప్ప జీవితం వస్తుందని ఊహించామే కాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేక పోయాం రా.. అని అంటాడు హీరో నాన్న..


 ఈ పెళ్లి చేయడం ఇష్టం లేక పోతే మన ఆటోకు యాక్సిడెంట్ చేయోచ్చు, ఇంకా ఏమైనా చేయోచ్చు కాని వాళ్ళు అలా ఏమి చేయలేదురా. రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళిపోయారు. ఆ కన్నీటికి విలువనిద్దాం రా అంటుంది హీరో అమ్మగారు.. దాంతో హీరో బాధతో సరేనంటు తలూపుతాడు.. 


ఈ సన్నివేశం లో హీరో కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు..


వాళ్ళు చెప్పిందాంట్లో తప్పు లేదు కాబట్టి హీరో ఏమీ అనడు. ప్రేమంటే ప్రేమించడానికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక జీవితం ఉంటుంది. అది సాగాలంటే డబ్బు ఉండాలి. ఒక ధనవంతుల అమ్మాయి అప్పటి వరకు ఏ కష్టం తెలియకుండా పెరిగింది ఇప్పుడు ప్రేమ పేరుతో పేదరికంలోకి వెళ్లి కష్టాలు పడటమే తప్ప మరోటి కాదు. 


చాలా సినిమాల్లో హీరోయిన్ అన్నయ్యలు ఇలాంటి సన్నివేశాల్లో హీరో ఇంటికి వెళ్ళి దాడి చేయడం, దాడిని హీరో తిప్పి కొట్టడం పదిమందిని గాల్లోకి ఎగరేసి కొట్టడం లాంటి సీన్స్ ఉంటాయి. అలాగే హీరో శపథాలు చేసి నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి నీ చెల్లిని పెళ్ళి చేసుకుంటా..!! అంటూ భారీ డైలాగులు, ఛాలెంజ్ లు ఉంటాయి. అలా నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి కూడా చూపిస్తారు మన హీరోలు. కాని ఇక్కడ అవేమి ఉండవు హీరో అసలు ఒక్క మాట కూడా మాట్లాడడు. వాళ్ళు అన్నది నిజమే కదా అని అర్థం చేసుకుని తను చేసేది తప్పు అని తెలుసుకుని  ఫ్యామిలీ తో సహా ఊరొదిలి వెళ్లి పోతారు..


 ఇది చాలి రియాలిటీ గా ఉంటుంది.. సీనిమా వేరు జీవితం వేరు సినిమాలో ఏదైనా జరుగుతుంది కానీ జీవితంలో అలా జరగదు ఎన్నో అడ్డంకులు, బాధలు ఉంటాయి. ఇక్కడ ప్రేమిస్తే సరిపోదు దానికి ఒక స్థాయి ఉండాలి అని అదిలేకుంటే తర్వాత ఏమవుతుందో చెప్పారు. చాలా బాగుంది ఈ సన్నివేశం..


చాలా మంది ప్రేమికులను ఆలోచింప చేసేలా ఉంటుంది.


ప్రేమి ఇద్దరు వ్యక్తుల ప్రమాణం, పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం. 


ఆ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా.


అలా కుటుంబంలోని వారికి వీళ్ళ ప్రేమలు నచ్చక పోతే ఏమవుతుందో మనం నేడు సమాజంలో చూస్తూనే ఉన్నాం. తమ కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని, తమ పరువు పోయిందని, అమ్మాయి వాళ్ళ నాన్నలు, అన్నయ్యలు తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడిని అంతం చేస్తున్నారు.


కాబట్టి ఎవరైనా ప్రేమించే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే మనం అమ్మాయి ప్రేమించాలంటే ఆ అమ్మాయి స్థాయి కి తగ్గట్టు ఉండాలా?? అని అడగొద్దు. తప్పకుండా అలా ఉండాల్సిందే. లేదంటే ఒక పేదవాడు ధనవంతుల అమ్మాయి ని ప్రేమించి ఏ ధనవంతుల కూతుర్లకు పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా అంటు సినిమా డైలాగులు కొడితే బయట పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సినిమాలు చూసి ప్రేమ ప్రేమ అని పాకులాడే వారికి నేను చెప్పేది ఏంటంటే..


ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేకాని ప్రేమే జీవితం కాదు. నిన్ను నమ్మి నీకుటుంబ సభ్యులు ఉంటారు ముందు వారి గురించి అలోచించి ప్రేమల గురించి అలోచించండి..


ప్రేమ లేకుండా బతకొచ్చు కాని డబ్బు లేకుండా బతకలేం..


చదువుకునే వయసులో ప్రేమించడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత జీవితం చాలా కష్టంగా ఉంటుంది.


ఎందుకంటే చదువుకుని ఒక స్థాయి కి వెళ్ళకుండా ప్రేమ అంటు పార్కుల వెంబడి తిరిగితే పెళ్ళైయ్యాక ఒకరి చేతికింద జీవితాంతం వెట్టిచాకిరి చేసి కుటుంబాన్ని పోషించాల్సి ఉంటుంది..


అందుకే ప్రేమ అనేది అంత ముఖ్యం కాదు మన కేరీర్ ముఖ్యం. ఈ వయసులో ప్రేమ అంటు తిరిగితే జీవితాంతం బాధ పడుతూ బతకాల్సి ఉంటుంది.


అలాగే మీపై ఆధారపడిన మీక కుటుంబ సభ్యులను బాధ పడేలా చేయకండి...


ఇక ప్రేమ చాలా గొప్పది విలువైనది అంటారు నిజమే ప్రేమ అనేది చాలా గొప్పది అమ్మ నాన్నల ప్రేమ గొప్పది,తోట బుట్టిన వాళ్ళ ప్రేమ గొప్పది. ఈ ప్రేమను ఎవరు పట్టించుకోరు కేవలం అమ్మాయి ప్రేమ మాత్రమే గొప్పది అని తెగ ఎమోషన్స్ చేస్తూ  విరహ  గీతాలు పాడుతూ, ప్రేమ లేకపోతే జీవితమే లేదు అన్నట్టు సినిమా వాళ్ళు చూపిస్తుంటారు.  దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొందరు జీవితాలను పాడుచేసుకుంటారు. సినిమా వాళ్ళు సినిమాలో మాత్రమే ప్రేమ గురించి గొప్పగా నీతులు చెబుతుంటారు. కాని వాళ్ళ నిజ జీవితాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అది రోజు మనకు కనపడుతూనే ఉంది... 


కాబట్టి సినిమా వేరు జీవితం వేరు. సినిమాల్లో మాదిరి జీవితంలో జరుగుతుందనుకుంటే ఇక అంతే జీవితం తలకిందులుగా అవుతుంది...


ఈ సినిమాలో ఈ సన్నివేశం చాలా రియాలిటీ గా అనిపించింది.. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో మార్పు వస్తుంది అని నేను భావిస్తున్నాను..


అలా కాకుండా ప్రేమ గొప్పది ప్రేమించిన అమ్మాయిని లేపుకపోయి పెళ్ళి చేసుకోవాలని చెబితే ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. తమ కుటుంబం పరువు కోసం ఎంతకైనా తెగించే వాళ్ళను చూస్తున్నాం..


వాళ్ళు రాక్షసులు అనొచ్చు కాని వాళ్ళు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ అమ్మాయిని ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి మూడు నెలలు ప్రేమించిన అనే ఒకే ఒక్క అధికారంతో లేపుకపోయి పెళ్ళి చేసుకుంటే ఎవరి ఫ్యామిలీ కైనా కోపం రాక మంచి పని చేసారని సన్మానం చేస్తారా....? ఇరవై ఏళ్ల ప్రేమ కంటే మూడు నాలుగు నెలల ప్రేమ గొప్పదా..!!






 అందుకే ఇంత పెద్ద పోస్టు రాస్తూ లెక్చర్ ఇచ్చాను. ఇంత ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు

..



అవును సినిమా పేరు చెప్పడం మర్చిపోయాను. 

సినిమా పేరు "పేపర్ బాయ్".








 





 




7, జులై 2022, గురువారం

ప్లాస్టిక్ నిషేధం విధించారు సరే, అమలు చేయడం సాధ్యమేనా??

    దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం శుభపరిణామం. నేను ఎప్పటినుంచో ఎదురుచుస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద మార్పుకు నాంది. 


నిషేధం విధించారు సరే అమలు జరగడం సాధ్యమేనా.. 


ఒకసారి వాడిపాడేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేదించామంటున్నారు అందులో వాటర్ బాటిల్స్ లేవు. పేపర్ ప్లేట్లు లేవు ఇవికూడా ఒకసారి వాడిపాడేసేవే కదా.. 


మరొకటి గాలి అమ్మే ప్యాకెట్లు అదేనండి చిప్స్ పాకెట్లు వాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు.. వీటివల్ల కూడా పెద్ద ఎత్తున కాలుష్యం అవుతుంది. ఈ ప్యాకెట్లో 95% గాలి మిగితా 5% మాత్రమే చిప్స్ అనే పదార్థం ఉంటుంది.. ఈ ప్యాకెట్లో ఉండే పదార్థం తక్కువ దాని ద్వారా వచ్చే కాలుష్యం ఎక్కువ.. ఇలాంటివి కూడా నిషేధించాలి.. నిషేధం అంటే నిషేదమే కఠినంగా ఉండాలి అప్పుడే మార్పు వస్తుంది..


నిషేధం అని మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో పెడితే బాగుంటుంది.. ఇదివరకు చాలా సార్లు నిషేదం విధించారు కాని మళ్ళీ వాడుతూనే ఉన్నారు...


వాటర్ బాటిల్స్, పేపర్ ప్లేట్లు, గ్లాసులు,చిప్స్ ప్యాకెట్స్ ఇలా వీటన్నింటినీ నిషేధించాలి..  అప్పుడే కాలుష్యం తగ్గి పరిసరాలు పరిశుభ్రంగా, అందంగా తయారవుతాయి.. లేదంటే మళ్ళీ కథ మొదటికే వస్తుంది...


ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడే విధంగా ప్రోత్సాహించాలి. 


నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నా ప్రతీ ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలకు వెళ్ళినప్పుడు వెంట కాటన్ సంచి లేదా జ్యూట్ బ్యాగులను వెంట తీసుకు వెళ్ళండి. అలాగే వాటర్ బాటిల్ బయట కోనే కంటే ఇంటినుండి స్టీల్ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్ళాలి. పిల్లలకు గాలి ప్యాకెట్లు అవే చిప్స్ ప్యాకెట్లు తినే అలవాటు చేయకండి.. మనం తినకుంటే కంపెనీ వాడు ఎందుకు చేస్తాడు.. కాబట్టి ముందు మనం మారాలి. 


ప్లాస్టిక్ నిషేధం బాధ్యత ప్రభుత్వానిది మనకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి... 


ప్లాస్టిక్ తరిమేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం...







5, జులై 2022, మంగళవారం

సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారి పోవాలా...!

      

      

          సినిమా అంటే సామాజిక స్పృహ ఉండి సమాజానికి మంచి సందేశం అందించాలి. కాని ఇప్పుడు సినిమా అనేది వ్యాపారం. ఇప్పుడనే కాదు పౌరాణిక సినిమాల నుండి సాంఘిక సినిమాలకు ఎప్పుడైతే సినిమా ప్రవేశించిందో అప్పటి నుండి సినిమా వ్యాపారమే కాని అప్పటి దర్శక నిర్మాతలు మరీ ఇంత దిగజారిపోయి సినిమాలు తీసేవారు కాదు. అలాగే  సినిమాలు ప్రచారం చేసుకోవడానికి ఇంత దిగజారిపోయెవారు కాదు.



 పూరీ జగన్నాథ్, విజయ్ దెవరకొండ ఇద్దరు టాలీవుడ్లో ఉద్దండులే. ఒకరు పోకిరి, దేశముదురైతే ఇంకొకరు అర్జున్ రెడ్డి.. 


ఒకాయన సినిమాలో డ్రగ్స్, డాన్లు, గన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి.


ఇంకొకాయన అర్జున్ రెడ్డి ఈయన ఆయనకంటే ఒక డోసు ఎక్కువే. మందు, డ్రగ్స్, రొమాన్స్, పవర్ ఫుల్ బూతులు..


వీళ్ళ సినిమాలు పెద్ద హిట్స్ ఉన్నాయి.. 


ఇంత పెద్ద హిట్టు సినిమాలు తీసిన ఈ ఉద్దండులు ఇద్దరు కలిసి సినిమా తీస్తే టాలీవుడ్, బాలివుడ్, కోలివుడ్ ఆ వుడ్ ఈ వుడ్ అన్ని వుడ్లు  సాలా ఉ...

పోసుకోవల్సిందే...  


అలాంటిది ఏంటిది మరీ ఇంత చీప్ గా ప్రమోషన్స్ ఆ పోస్టర్ ఏంటీ.?  ఈ లైగర్ సినిమాలో అదొక్కటే ఉందా..

బాక్సింగ్ నేపథ్యం అంటున్నారు బాక్సింగ్ లో ఇలా మొత్తం నగ్నంగా ఉంటారా..ఏంది?  


 ఇలాంటి బాక్సింగ్, కబడ్డీ లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి మళ్ళీ ఎందుకో ఈ సినిమా..


నాకు తెలిసి ఇది ఫ్లాప్ సినిమా జనాల్లో పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలాంటి చెత్త, కాంట్రవర్సీ పోస్టర్స్ రిలీజ్ చేసినట్లున్నారు..


టాలెంట్ ఉంటే మంచి సినిమాలు తీయండి ఇలాంటి చెత్త ప్రచారాలు చేసి సినిమాలు పబ్లిసిటీ చేయకండి...


ఇలా దరిద్రపు ప్రచారం వల్ల సినిమాలు హిట్లు కావు సినిమాలో మంచి కథ ఉండాలి. నువ్వు ప్రచారం చేయకపోయినా సినిమా హిట్టవుతుంది. 


నాకు అనిపిస్తుంది అసలు పూరి జగన్నాథ్ సినిమాల్లో కథ ఉంటుందా అని... ఆయన సినిమాలు ఎలా హిట్టు అయ్యాయో అర్థం కాదు..


ఈ సినిమాలో కూడా కథ ఉండదు అర్జున్ రెడ్డి ని, మైక్ టైసన్ ని పెట్టిన సినిమా ఆడదు..


ఆ విషయం ముందే పూరీ కి తెలిసి ఇలాంటి చెత్త పోస్టర్స్ ని రిలీజ్ చేసి పబ్లిసిటీ చేస్తున్నాడు.


సినిమా విజయం సాధించాలంటే ఇలాంటి చెత్త పబ్లిసిటీ కాదు. కథ బాగుంటే ప్రేక్షకులే పబ్లిసిటీ చేస్తారు.


కె.జి.ఎఫ్ సినిమా విడుదలకు ముందు అసలు ఎవరికి అంతగా తెలియదు విడుదలైన తర్వాత ప్రేక్షకుల పబ్లిసిటీ తో ఘన విజయం సాధించింది. సినిమా అంటే  కెజిఎఫ్ లా ఉండాలి.  అంతేకాని సరైన కథ లేదు తోటకూర కట్ట లేదు అన్నట్టు  ఇలాంటి సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు అందుకే ఈ నగ్న పోస్టర్స్ విడుదల చేసి చీప్ పబ్లిసిటీ చేస్తున్నారు.. 


ఏమయ్యా పూరి ఎందుకయ్యా నీ సినిమాలు ఎవడికి ఉపయోగం....


సమాజాన్ని రెచ్చగొట్టే సినిమాలు కాదు, సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయ్యు. ఎందుకంటే సినిమా అనేది ఒక బలమైన ప్రచార సాధనం దాన్ని ఇలా చెత్తగా ఉపయోగించకండి. యువత మీరు తీసే సినిమా హీరోల మాదిరి తయారవుతారు. మీ సినిమాల్లో హీరోలు చేసినట్లు బయట ప్రపంచంలో చేస్తుంటారు హీరోయిజం చూపిస్తుంటారు... మీరు చూపించే వెర్రి వెకిలి చేష్టలనే హీరోయిజం అనుకుని బయట జనాలను ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు పడుతుంటారు... 


 కాబట్టి చేతనైతే మంచి సినిమాలు తియ్ లేదంటే....

 

 నీ ఇష్టం ఇగా... నేనేం చెప్పలేను ఎందుకంటే ఎవ్వడి మాట వినద్దు మనిషి మాట అస్సలు వినద్దు అంటావ్....  


ఇప్పుడు ఇలాంటి pk లాంటి పోస్టర్స్ అదేనండి అమీర్ ఖాన్ పీకే సినిమా పోస్టర్స్ లా విడుదల చేసారు.


ఇక ముందు ముందు ఎలాంటి చిత్రాలు చూపిస్తారో...




20, ఏప్రిల్ 2022, బుధవారం

నియంతలు, సామ్రాజ్యవాదులు ఉన్నంతకాలం ప్రపంచంలో శాంతి ఉండదు.

  ప్రపంచంలో ఏ మూలన ఏ సంక్షోభం వచ్చిన అందుకు కారణం కొందరు నియంతల సామ్రాజ్యవాదం వలనే.

 ఉక్రెయిన్ యుద్దానికి కారణం సామ్రాజ్యవాదుడైన నియంత పుతిన్. రష్యా పేరుకు ప్రజాస్వామ్య దేశమైన పుతిన్ దానిని నియంత్రుత్వ పాలన కింద మార్చేసాడు.

నియంతల్లో రెండు రకాల నియంతలు ఉంటారు. ఒకరు సామ్రాజ్యవాద నియంతలు. మరొకరు వారసత్వ పాలన నియంతలు.


    పుతిన్ సామ్రాజ్యవాద నియంత. తన లక్ష్యం పూర్వపు సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలన్నిటిని కలిపి సోవియట్ యూనియన్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆరాటపడుతున్నాడు. వయసు మీద పడుతోంది సోవియట్ యూనియన్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడు. అందుకే  ఉక్రెయిన్ పై ఈ యుద్దానికి దిగాడు. సైనిక పరంగా బలహీనమైన దేశం నాలుగు రోజుల్లో స్వాదీనం  చేసుకుందాం అనుకున్నాడు. కాని 50 రోజులైన ఉక్రెయిన్ లొంగిపోవడం లేదు. 50 రోజుల నుండి ఉక్రెయిన్ సంక్షోభం అలానే ఉంది. రష్యా నియంత లక్ష్యం కోసం, సామ్రాజ్య విస్తరణ కోసం ఉక్రెయిన్ లో అశాంతి నెలకొంది. కొన్ని లక్షల మంది  ఉక్రెయిన్ ప్రజలు బతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ఈ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటోలో చేరకుండా సోవియట్ యూనియన్లో చేరతానని ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోతుంది కాని అది జరగదు. దేశం అంటే అధ్యక్షుడు ఒక్కడే కాదు కదా ప్రజలందరూ ఒప్పుకోవాలి. రష్యా కంటే పశ్చిమ దేశాల వైపే ఉక్రెయిన్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏ దేశ ప్రజలైనా నియంత్రుత్వ పాలన కోరుకోరు కదా.

 అందుకే నాటో వైపే ఉక్రెయిన్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా యుద్ధం చేస్తున్నారు.



    ఉక్రెయిన్ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ లొంగిపోవాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం లో హీరో ఎవరంటే ఆ దేశ సైనికులు, ప్రజలు, అధ్యక్షుడు జెలెన్ స్కీ అని చెప్పొచ్చు. చిన్న దేశం సైనిక పరంగా, ఆయుధాల పరంగా రష్యాకు ఏ మూలకు సరితూగని దేశం. అణ్వాయుధాల లేవు అయినా కూడా ఇన్ని రోజులగా యుద్ధం చేస్తూనే ఉంది అంటే దానికి కారణం జెలెన్ స్కీ నే.  ఆయన స్థానంలో వేరే ఎవరున్నా దేశం విడిచి పారిపోయేవారు. నాటో దేశాలు తన తరపున యుద్ధం చేస్తాయనుకున్నాడు కాని అది జరగలేదు. నాటో రాలేదు, ఆయుధాలు లేవు,ఈ పరిస్థితుల్లో కూడా శక్తి వంతమైన రష్యాతో పోరడడానికే సిద్దపడ్డాడు. అందుకే జెలెన్ స్కీ నిజమైన హీరో. అసలు సిసలైన దేశభక్తుడు, నాయకుడు.. తను రష్యాతో యుద్దం గెలవలేక పోవచ్చు గాని తన పోరాటం ఎన్నో చిన్న దేశాలకు స్పూర్తి నిస్తుంది. శత్రువు ఎంత బలవంతుడైనా సరే ధైర్యంగా ఉండి పోరాడితే విజయం సాధించవచ్చు అని నిరూపించాడు. పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప..

 

       అందమైన ఉక్రెయిన్ నగరాలు బాంబు మోతలతో కళావిహీనంగా మారాయి, లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు వలసలు వెళ్లిపోయారు, అమాయక ప్రజలు, సైనికులు యుద్ధంలో చనిపోతున్నారు. ఈ హృదయం విదారక దృశ్యాలను, ఈ వినాశనాన్ని చూసి జెలెన్ స్కీ వెనక్కి తగ్గి రష్యాకు తలొగ్గితే ఈ సంక్షోభం ముగుస్తుంది.  లేదు ఇలాగే ముందుకు వెళ్తే వినాశనమే అణు యుద్ధం వరకు వెళ్ళవచ్చు.  నియంతలు ఓటమి ఒప్పుకోరు అందులో పుతిన్ లాంటి వారు అసలు ఒప్పుకోరు. జెలెన్ స్కీ నే తన దేశ ప్రజల కోసం ఓడిపోయి శాంతి నెలకోల్పుతాడని అనుకుంటున్నాను.



  ఇక శ్రీలంక సంక్షోభానికి కారణం చైనా. చైనా కూడా సామ్రాజ్యవాద దేశమే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ది కూడా నియంత్రృత్వ పాలనే. శ్రీలంకలో పాగా వేసి హిందూ మహాసముద్రంలో పట్టు సాధించాలని చూస్తున్నాడు. దాని ఫలితమే శ్రీలంకతో ఆర్థిక సంక్షోభం. ఇటు పాకిస్థాన్, అటు శ్రీలంకను ఆక్రమించి చైనాను విస్తరించాలని చూస్తున్నాడు. అందుకోసమే ఆ దేశాలకు అభివృద్ధి పేరిట రూణాలిచ్చి ఆర్థికంగా దెబ్బతీసి ఆక్రమించుకోవాలని జిన్ పింగ్ ఆలోచన. 


     ఇక మరో  రకం నియంత  ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జోన్ ఉన్. వారసత్వ పాలన నియంత. ఇతను సామ్రాజ్యవాదుడు కాకపోయినా ప్రపంచంలో అశాంతికి కారణం అవుతాడు.  అణ్వాయుధాలు, క్షిపణులు తయారు చేస్తూ పెద్ద దేశాలను హెచ్చరిస్తూ ఉంటాడు.  దేశ ప్రజలను బానిసలుగా చేసి పరిపాలిస్తున్నాడు. పక్క దేశం  దక్షిణ కొరియా LG, SAMSUNG వంటి  ఎలక్ట్రానిక్స్, HUNDAI,KIA  వాహనాలు ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందుతుంటే, కింగ్ జోన్ ఉన్  వంటి  నియంతలు వినాశకర ఆయుధాలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి నియంతలు ఉన్నంత కాలం ప్రపంచంలో శాంతి నెలకొనడం అసాధ్యం..



  


17, ఏప్రిల్ 2022, ఆదివారం

నీటి వనరులను నాశనం చేస్తున్నారు..

    


    ప్రకృతి మానవ మనుగడకు అవసరమైన అన్ని వనరులను మనకు ప్రసాదిస్తుంది. కాని ప్రకృతి ప్రసాదించిన వనరులను ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారు చెప్పండి.? ప్రకృతి వనరులను నాశనం చేయడానికి ఉన్నంత శ్రద్ధ సద్వినియోగం చేసుకోవడంలో ఉండదు. ఏ జీవికైనా ప్రాణాధారం నీరు. నీరు లేనిదే జీవుల మనుగడ లేదు. అది అందరికీ తెలిసిందే కాని నీటి వనరులను మాత్రం విచ్చలవిడిగా కాలుష్యం చేసేసి మనుషులతో పాటు మూగజీవాలకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మానవుడు. ప్రకృతి లో తెలివైన వాడు మానవుడు తన తెలివితేటలతో ప్రకృతిని, ప్రకృతి ప్రసాదించిన వనరులను నాశనం చేసి ఇతర జీవులకు కూడా మనుగడ లేకుండా చేస్తున్నాడు. 


 ఇతర జీవుల సంగతి దేవుడెరుగు గాని ముందు ముందు మనిషి మనుగడకే ముప్పు తెస్తున్నాడు.

 నీరు అందరికి జీవనాధారం కాని నీటి విలువ ఎవరికి తెలియదు. ''మన దగ్గర ఏది ఉంటుందో దాని విలువ మనకు తెలియదు". లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. 


ఇప్పుడు మనకు త్రాగు నీరు పుష్కలంగా లభిస్తుంది. పుష్కలంగా అంటే మరీ మన తాతల నాటి కాలంలో కాకుండా కొంచెం తక్కువగానే స్వచ్చమైన నీరు లభిస్తుంది. అయినా కూడా నీటి వనరుల విలువ ఇంకా చాలామంది కి తెలియదు. ముందు ముందు తెలుస్తుంది. మా చిన్నప్పుడు రవాణా వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందలేదు ఏ ఊరికైనా వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మరీ దూరమైతే మెయిన్ రోడ్డు వరకు నడిచి అక్కడ ఏదైనా వాహనం ఎక్కి చిన్నపాటి సిటీలో దిగి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం. మొత్తంగా కాలినడకనే వెళ్ళేవాళ్ళం. ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం ఎందుకంటే వేసవిలో పిల్లలకు సెలవులు ఉండడం, పెద్దవారికి కూడా ఎలాంటి పనులు ఉండవు కాబట్టి ఎక్కువగా వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్ళం. వేసవిలో ఎక్కువగా ఏ బందువుల  ఇంటికి వెళతాం చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లే వెళ్తారు.  అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అంటే మాకు పండగే. అందరు వస్తారు కాబట్టి ఆ ఆనందంలో ఎంతదూరం అయిన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 

 వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు దాహం వేస్తే ఎక్కడ కూడా నీళ్ళు కోనేవారు కాదు అసలు అప్పట్లో నీళ్ళు అమ్మే వాళ్ళు కాదు మా ఊళ్ళళ్ళో. చిన్న చిన్న వాగులు ఉండేవి వానాకాలం పుష్కలంగా నీరు ప్రవహించే వాగులు వేసవిలో నీరు ఉండేది కాదు. అక్కడ అక్కడ గుంతల్లో కొద్దిగా నీరు ఉండేది. అవి పశువులు తాగడానికి ఉపయోగపడేవి. మేం తాగలంటే చెలిమలు తవ్వి నీరు త్రాగేవాళ్ళం. అప్పుడు ఎలాంటి కాలుష్యం లేదు చాలా స్వచ్ఛంగా ఉండేవి నీళ్ళు. 

ఇక బావి నీరు ఎక్కువగా త్రాగే వాళ్ళు. బోర్లు అంతగా ఉండేవి కాదు. చెరువులు,కుంటలు ఎక్కడ కూడా కాలుష్యం ఉండేది కాదు. మరీ ఇప్పుడు నీళ్ళు త్రాగాలి అంటే కొనాల్సిందే ప్రకృతి ప్రసాదించిన నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. కారణం స్వచ్చమైన నీరు లభించక పోవడమే. నీటి వనరులను కాలుష్యం చేసి నీటి వ్యాపారం చేస్తున్నారు.


    పట్టణీకరణ, పరిశ్రమల స్థాపనతో నీటి వనరులను పూర్తిగా కలుషితం చేస్తున్నారు. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. ఆ నీటితో చెరువులోని నీరు తాగేందుకు కాదుకదా కనీసం తాకడానికి కూడా పనికి రాకుండా పోతుంది. మనుషులైతే డబ్బులు పెట్టి కొని నీళ్ళు త్రాగుతారు. మరి జంతువులు, పక్షులు ఎలా త్రాగుతాయి నీరు. మనిషి తన అత్యాశకు పోయి ఇతర జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. వాటికి కనీసం తాగేందుకు నీరు లేకుండా చేస్తున్నాడు.  ఆలోచించండి ఇకనైన మేల్కొని నీటి వనరులను కాపాడుకుందాం. మనతో పాటు ఇతర జీవుల మనుగడకు ఎలాంటి హాని తలపెట్టకుండా నీటి వనరులను కాలుష్యం చేయకుండా  కాపాడుకుందాం..


కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు..


ఎవరైతే నీటి వనరులను కాలుష్యం చేస్తారో వారికి త్రాగేందుకు నీరు దొరకదు..

కాని ఇప్పుడు బడా బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు చేసిన నీటి కాలుష్యం వల్ల పశుపక్ష్యాదులు, సామాన్య ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.


బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల ధన దాహానికి   నేల, నీరు కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమల వలన భూమిపై ఉన్న నీటి వనరులే కాకుండా భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. రసాయన పరిశ్రమల వారు కాలుష్య జలాలను నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. అలాగే భూమిలోకి బోర్లు వేసి అందులోకి రసాయనాలను పంపిస్తారు దీనివలన భూగర్భ జలాలు కూడా కాలుషితం అవుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఎక్కడ బోరు బావి తవ్విన రసాయనాలతో నిండిన నీరే వస్తుంది. ఎంత దారుణం అండి ఇది చుట్టుపక్కల వారికి ఈ పరిశ్రమల వలన ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి వారు కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ నేలని,నీటిని, పరిసరాలను కాలుష్యం చేసి స్థానికులకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు...


   

ఇంతవరకు మా వైపు అయితే ఈ దరిద్రపు గొట్టు రసాయన పరిశ్రమలు లేవు. రావొద్దనే కోరుకుంటున్నాను.


 రాను రాను మా వైపు కూడా అభివృద్ధి పేరిట ఈ రసాయన పరిశ్రమల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో విచ్చలవిడిగా పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు హైదరాబాదు చుట్టుపక్కల మాత్రమే ఉండే రసాయన పరిశ్రమలు ఇక పచ్చని పల్లెల వైపు వస్తాయి. ఇక్కడ నేల, నీటిని కాలుష్యం చేస్తాయి. ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తున్నారు. కంచె చేను మేసినట్టు ప్రభుత్వమే నీటి వనరులను నాశనం చేయడానికి చూస్తుంటే ఇంకా ఎవరు వాటిని కాపాడేది.

  ఇప్పటికైతే నేను చిన్నప్పుడు వేసవిలో చెలిమల్లో నీటిని తాగినా నది ఇప్పటికి స్వచ్చమైన నీటితోనే ప్రవహిస్తుంది.

ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిశ్రమలు లేవు. ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటా..

గత ఏడాది అక్టోబరులో మా నదిలో నేను  తీసిన వీడియోలు. ఇప్పటికి స్వచ్చమైన నీటితో ప్రవహిస్తుంది.







 

2, ఏప్రిల్ 2022, శనివారం

వ్యవసాయం మీద ప్రేమతో ఎకరం విస్తీర్ణంలో బావిని తవ్వించిన రైతు భగీరథుడు.


 ఆలోచన అంటే ఇది, అభివృద్ధి అంటే ఇది, పర్యావరణ పరిరక్షణ అంటే ఇది..


   


    ఒక సామాన్య రైతు గొప్ప పని చేసాడు కాదు కాదు భగీరథ ప్రయత్నం చేశాడు. చేసి సాధించాడు. 


మహారాష్ట్ర బీడ్ జిల్లా పదల్షింగి గ్రామానికి చెందిన రైతు  మారుతి బాజ్గుడే సాధించిన విజయం చూస్తే గర్వంగా ఉంది.. 


బీడ్ జిల్లా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండడం వలన నీళ్ళ కరువుతో పంటలు పండేవి కావు.  మారుతి అనే రైతుకు 12 ఎకరాలు పొలం ఉంది ఎంత పొలం ఉంటే ఏంటి లాభం నీళ్ళు లేకుంటే..


అప్పుడు ఆ రైతు ఆలోచన ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే తన పొలంలో నీళ్ళ కరువే లేకుండా చేయాలనుకుని ఒక ఎకరం విస్తీర్ణంలో, నలబై అడుగుల లోతుగా  బావిని తవ్వాలనుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం అంటే మామూలు విషయం కాదు అదికూడా ఒక రైతు.


 ఇది జరిగే పనేనా!


ఇంత విశాలమైన బావిని తవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది. 


తవ్వినాక నీళ్ళు రాకుంటే పరిస్థితి ఏంటి?



ఇవేవి మారుతి పట్టించుకోలేదు.

కేవలం తాను అనుకున్నది సాధించాలి అంతే.

తన పొలం ఎప్పుడు పంటలతో  కళకళలాడుతూ ఉండాలి. 


తను అనుకున్నట్టుగానే బావిని తవ్వించాడు. బావిచుట్టు కాంక్రీటు తో గోడ నిర్మించాడు.

 అందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర రూపాయలు..

అంత ఖర్చా ..! అది నీళ్ళ కోసం..!


అని అందరూ నోరెళ్ళబెడతారు. ఇది పిచ్చి పని అనికూడా అంటారు.

అదే కోటిన్నర తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అంటారు..


కాని మారుతి గారు ఇవేమి పట్టించుకోకుండా వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేసాడు.


తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఎకరం విస్తీర్ణంలో ఉన్న బావిలో పుష్కలంగా నీరు ఉంది. ఆ నీటితో తన పదకొండు ఎకరాల పొలానికి నీరు అందుతుందని అంటున్నాడు. అందులో అన్నిరకాల పండ్ల మొక్కలు, అన్నిరకాల పంటలు వేస్తానంటున్నాడు.


"నీవు ప్రయత్నం చేయి ఫలితం భగవంతుడు చూసుకుంటాడు అన్నట్టు"..

మన ఆలోచన మంచిదైతే మన ప్రయత్నంతో ఏ పని చేసిన ఫలితం సాధించవచ్చు అని నిరూపించారు మారుతి గారు. ఆయన పేరు మారుతి అంటే హనుమాన్. ఆనాడు ఆ హనుమాన్ కొండను పెకిలించి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మారుతి బీడు భూముల్లో బావిని తవ్వి గంగమ్మను తీసుకొచ్చాడు.. తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు.




చాలా మంది అనుకుంటారు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం ఎందుకు.

అదే డబ్బు తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అని..


అదే మనదగ్గర అయితే ఈ పాటికి అలాంటి భూమి ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకునేవాళ్ళు.

ఉన్న నీటి వనరులను కాలుష్యం చేస్తారు.


కాని మారుతి గారు వ్యవసాయం మీద ప్రేమతో ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా తాను అనుకున్నది సాధించాడు.


మారుతి గారు కోటిన్నర ఖర్చు పెట్టిన దానికి ఆయన పొందే ఆనందానికి ఎన్ని వేల కోట్ల డబ్బుతో వెలకట్టలేనిది.


అప్పటి వరకు బీడుగా ఉన్న పొలం తన ప్రయత్నంతో పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంది. విశాలమైన బావిలో పుష్కలంగా నీరు ఉంది. తను పెంచుకున్న వివిధ రకాల పండ్లు మొక్కలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో తన పొలం గట్టు మీద నీటి కాలువ పక్కన ఉన్న ఒక పచ్చని చెట్టుకింద నులక  మంచం వేసుకుని ఒక కునుకు తీస్తుంటే ఆ ఆనందం ఎన్ని లక్షల కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి..


 చుట్టూ పచ్చని పంటపొలాలు,

 పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, 

 పొలం గట్టున కాలువలో  చిన్నగా పారే నీటి సవ్వడి, ఆకాలువ నీటితో తడిసిన మట్టి సువాసన,

 ఈ వేసవిలో   మద్యాహ్నం వీచే పిల్లగాలులు. వీటన్నింటిని ఆస్వాదిస్తూ ఆ చెట్టు కింద కూర్చుని ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఆనందానికి ఎన్ని కోట్లు వెల కట్టగలం.


మారుతి గారు ఏడాది పొడవునా పంటలు పండిస్తూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. 


 ఆయన తను పెట్టిన ఖర్చు తిరిగి సంపాదిస్తాడా అంటే? సంపాదిస్తాడు. 

  

ఎందుకంటే మనదగ్గర వ్యవసాయం తగ్గిపోయింది త్వరలో ఆహార సంక్షోభం తలెత్తుతుంది. అప్పుడు మారుతి లాంటి రైతులు వద్దే ఆహార ధాన్యాల ఉంటాయి కాబట్టి వారు అప్పుడు కోట్లు సంపాదిస్తారు.


ఆయన కోట్లు సంపాదించడం కంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాడు అది చాలు ఆయనకు ఈ జన్మకు సంతృప్తి..












 

29, మార్చి 2022, మంగళవారం

ప్లాస్టిక్ మనుషులు

 



     మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేసాడు అవి మానవాలికి ఉపయోగంతో పాటు కీడు కూడా చేస్తాయి. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ అయిన రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని సరియైన విధంగా ఉపయోగిస్తే అందరికి శ్రేయస్కరం. కాని వాటిని చాలా మట్టుకు వినాశనం ఉండే విధంగానే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తే మేధావులు తమ అతి తెలివితో వినాశనానికి దారితీస్తున్నారు.


ఏ ఆవిష్కరణ అయిన తరువాత వ్యాపారం అయిపోతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారాలతో ప్రకృతిని నాశనం చేస్తారు. 


మనిషి ఆవిష్కరించిన వాటిలో అత్యంత చెత్త ఆవిష్కరణ "ప్లాస్టిక్".  ఇది ఎంత చెత్త ఆవిష్కరణ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెత్తే కనిపిస్తుంది.

నేలపై, నదుల్లో, సముద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ చెత్తే కనిపిస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.. ఇన్ని రోజులు బయట మాత్రమే ఉండే ఈ చెత్త ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరంలో రక్తంలోకి కూడా చేరింది... ఇన్నాళ్లు పర్యావరణాన్ని చెత్తగా మార్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరాన్ని చెత్తగా మారుస్తుంది.


      ఆవిష్కరణలు మనిషి జీవన విధానాన్ని ఎంత సులభతరం చేస్తయో అంతకంటే ఎక్కువగా నాశనం కూడా చేస్తాయి. ఆవిష్కరణలు రెండు వైపుల పదును వున్న కత్తుల్లాంటివి వాటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది విచ్చలవిడిగా వాడితే ముప్పు తప్పదు.. 

     

    ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మానవ శరీరంలో రక్తంలోకి ఎలా చేరింది.?

    

 ఎలా చేరిందంటే మనిషి విచ్చలవిడిగా వాడడం వలనే.



 అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది.



అందులో కొన్ని నాకు తెలిసినవి:-


ఉదయం నుంచే మన పరుగు ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది.


ఉదయము కూరగాయలకు వెళ్తారు ఖాళీ చేతుల్తో. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు నింపుకుని వస్తారు.



పాలు ప్లాస్టిక్ కవర్లో.


కిరాణా సరుకులు ప్లాస్టిక్ కవర్లో.


బయట  ఎక్కడైన టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో నే.


భోజనం ప్లాస్టిక్ ప్లేట్లలో నే.


ఆహారం ప్యాక్ చేయడం ప్లాస్టిక్ కవర్లో నే.


టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు.


అసలు ప్లాస్టిక్ వాడకం అనేది మామూలుగా లేదు అవసరం ఉన్నా లేకపోయినా వాడడం మాత్రం పక్కా.


అంతలా వాడితే మనిషి రక్తంలో ఏంటి ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ అయిపోయి "ప్లాస్టిక్ మనుషులు" గా మారిపోయిన ఆశ్చర్యం లేదు..!!!



ఉదయం లేవగానే కూరగాయలకు ఒక సంచి తీసుకుని వెళ్తే ఏమవుతుంది.? చాలామందికి చేతిలో సంచి తీసుకుని బయిటకు వెళ్తే నామోషో లేక బద్ధకమో తెలియదు కాని అస్సలు తీసుకెళ్ళరు.


 ఖాలీ చేతుల్తో కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళి గంపెడు ప్లాస్టిక్ చెత్తను తీసుకువస్తారు. సరే తెచ్చారు వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా చేస్తారా అంటే అదిలేదు. ఇష్టం వచ్చినట్టు బయట పారేయడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఇలా కాల్చడం వలన ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసి ఆ గాలి పీల్చునప్పుడు శరీరం లోకి ప్రవేశిస్తున్నాయి.


ఇంకొందరు మహానుభావులు వేడి వేడి 'టీ' ని  కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు. టీ కొట్టు వాడికి తెలియక పోవచ్చు వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయోద్దని చదువుకున్న వాళ్ళుకూడా తెలియదా అలాగే తాగుతున్నారు. అంత వేడి టీ ని ప్లాస్టిక్ కవర్లో పోస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి టీలోకి వెళ్ళి అది తాగినవారి శరీరం లోకి వెళుతుంది.

అలా చేయకుండా ఒక ప్లాస్క్ వాడితే సరిపోతుంది కదా. ప్లాస్క్ వాడడానికి బద్దకం, ఆ ప్లాస్క్ ను కొట్టు వరకు తీసుకువెళ్ళడానికి నామోషి. 


ఇక నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో.

పల్లెటూళ్ళలో అయితే ఒకసారి తాగిపడేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ని పదే పదే నీళ్ళు నింపుకుని వాడుతుంటారు.  ఈ ప్లాస్టిక్ బాటిల్స్  లో ఎక్కువ రోజులు నీళ్ళు తాగితే అందులోని ప్లాస్టిక్ కణాలు అందులోని నీటిలోకి వెళ్తాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాడుతూ ఉంటారు. తెలిసిన 

ఎవరూ చెప్పరు, చెప్పిన ఎవరూ వినరు...




     ఇంకా పెళ్ళిళ్ళు, దావత్ లకు అప్పట్లో మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో భోజనం వడ్డించేవారు. ఆ విస్తరాకుల్లో  తృప్తి గా భోజనం చేసేవాళ్ళం. వాటిని తీసుకెళ్ళి పెంటలో వేసే వాళ్ళు అవి ఎరువుగా మారేవి... ఇప్పుడు పేపర్ ప్లేట్లో వడ్డిస్తున్నారు ఈ పేపర్ ప్లేటునుంచి ఏదో దుర్గంధం వస్తుంది. పైగా వాటిపై ప్లాస్టిక్ కవర్ ఉంటుంది వేడి పదార్థాలు అందులో తింటే  ప్లాస్టిక్ శరీరంలోకి చేరకుండా ఉంటుందా..?


ఎంత చక్కనివండి  అప్పట్లో మన పల్లెల్లో "మోదుగ ఆకులతో" తయారు చేసిన విస్తరాకులు. అందులో భోజనం చేస్తే అమోఘం. వీటి వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా అవి ఎరువుగా ఉపయోగపడుతాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ విస్తరాకుల వలన అన్ని విధాలుగా నష్టమే ఎక్కువ...


మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని మరిచిపోయి ప్లాస్టిక్ వెంట పరిగెత్తి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం...



ప్లాస్టిక్ వలన ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం ఎక్కువగా వాడుతున్నారు. కాని పరోక్షంగా దీని నష్టాలు గమనించడం లేదు.


ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది..


కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళినప్పుడు జనపనార (జ్యూట్ )బ్యాగులు కాని కాటన్ బ్యాగులు కాని వెంట తీసుకెళ్ళాలి.


పేపర్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాని, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకులు వాడాలి.


బయట నుండి పార్శిల్ తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకోవడం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.....








28, మార్చి 2022, సోమవారం

అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.

 





అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. 

  పచ్చటి పంటపొలాలను నాశనం చేసి ఫ్లాట్లు చేస్తున్నారు. 

ఒకప్పుడు మా ఊరి భూముల్లో పంటలు

పండేటివి.కాని ఇప్పుడు ఫ్లాట్లు పండుతున్నాయి. 

హైదరాబాద్ కు చుట్టుపక్కల 100 కి.మీ దూరంలో ఎక్కడ చూసినా పొలాలు లేవు ఫ్లాట్లు, వెంచర్లే కనిపిస్తాయి. అక్కడక్కడ కొంత పొలాలు ఉన్న ఇంకొన్ని రోజుల్లో అవి కనుమరుగైపోతాయి.


ఎవరి నోట విన్న వెంచర్లు,ప్లాట్లు,కోట్లు ఇవే మాటలు.


    రైతులకు లక్షలు,కోట్లు ఆశ చూపించి భూములు కొనుగోలు చేయడం వెంచర్లు వేయడం ఇదేపని.

పాపం రైతులు ఎప్పుడు అంతడబ్బు చూసి ఉండరు ఒకేసారి ఎకరం కోటి రూపాయలు అనేసరికి ఎగిరిగంతేసి భూములు అమ్మేసుకుంటున్నారు.

భూములు అమ్మని రైతులను ఎలాగోలా అమ్మేలా చేస్తున్నారు. రైతుల భూములకు దారిలేకుండా చేసి భూములు అమ్ముకునేలా చేస్తున్నారు.


రోడ్డు ప్రక్కన భూమి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ గ్రద్దలు అక్కడ వాలిపోతాయి. ఆభూమిని ఎలాగోలా ఎన్ని డ్రామాలు ఆడైనా కొనేస్తారు.  ముందుగా రోడ్డు ప్రక్కన ఉన్న భూమిని కొనేస్తే వెనకాల ఉన్న పొలాలను కొనడం వారికి తేలికవుతుంది. ఎందుకంటే వారికి దారి ఇవ్వకుండా చేసి భూములు అమ్మేలా చేస్తారు. పచ్చని పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకోవడం. మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారు,అవుతున్నారు. వేలిముద్రలు (అంగూటి) వేసేవాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. 

మద్యలో బ్రోకర్లు అబ్బో వీళ్ళగురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారులదైతే ఆచరణ బ్రోకర్లది. వీళ్ళు ఏలాగైనా సరే రైతులను భూములు అమ్ముకునేలా చేస్తారు. ఎలాగైనా సరే....!

 వాళ్ళ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు...



నా చిన్నప్పుడు పంటపొలాల్లో అన్నిరకాల పంటలు పండేవి. రాను రాను పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు అవికూడా లేవు 50% పంటపొలాలు ప్లాట్లుగా మారాయి. ఎందుకు ఈపరిస్థితి దాపురించింది అంటే.నా చిన్నప్పుడు పంటలు బాగా పండేవి పాడిపశువులు ప్రతీ ఇంటికి ఉండేవి. వాటి పేడ ఎరువుతోనే పంటలు పండేవి. చీడపీడలు ఉండేవి కావు. రసాయన మందులు అసలు ఎవరికి తెలియదు.కృత్రిమ ఎరువులు, విత్తనాలు వాడలేదు. అప్పుడు రెైతులు అన్నిరకాల అపరాలు,జొన్నలు,వరి,  మిరప, కొర్ర, సజ్జలు, రాగులు,పసుపు వంటి ఆహార పంటలే పండించేవారు.

వ్యవసాయం అంటే పెట్టుబడి ఉండేదే కాదు కేవలం రైతు శ్రమే వ్యవసాయానికి పెట్టుబడి. విత్తనాలు సొంతంగా తయారు చేసుకునేవారు,ఎరువులు పశువుల పేడ. అలా వ్యవసాయం చేసారు కాబట్టి దిగుబడులు బాగా వచ్చేవి. 

ఎవరి ఇంట్లో చూసినా గుమ్ములకు, గుమ్ములు జొన్నలు,బియ్యం,కందులు,కొర్రలు, పెసలు ఉండేవి. 

డబ్బు ఎక్కువగా ఉండేదికాదు. అయినా సంతోషంగా ఉండేవాళ్ళు. 


ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి వ్యవసాయం నాశనం అవుతూ వచ్చింది. డబ్బు ఆశ చూపించి ఈ పంటలు వేస్తే  ఇంత దిగుబడి వస్తుంది ఇంత ధర ఉంటుంది అంటు రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్ళేలా చేసారు. ముఖ్యంగా పత్తిపంట. మొదట్లో దిగుబడులు బాగా వచ్చే సరికి చాలామంది రైతులు పత్తిపంట వేయడం ప్రారంభించారు. పత్తి విత్తనాలు రైతులు తయారు చేసుకోలేరు విత్తన కంపేని వారు తయారు చేసే విత్తనాలే వాడాలి. అలా విత్తన కంపెనీలు విత్తనాన్ని తమగుప్పిట్లోకి తీసుకుని వ్యాపారం మొదలెట్టాయి.

ఏం భూమిలో అయినా ఎన్ని రోజులు దిగుబడులు వస్తాయి ఒకే పంట వేస్తుంటే? మొదట్లో దిగుబడులు వచ్చినా రాను రాను దిగుబడులు తగ్గాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యాపారం మొదలైంది ఎరువుల వ్యాపారం ఈ ఎరువులు వాడండి దిగుబడి పెరుగుతుంది అని ఎరువులు కొనేలా చేసారు. తరువాత పురుగుమందులు ఇలా మొత్తం వ్యవసాయాన్ని పెట్టుబడి లేనిదే చేయలేమనే స్థాయికి తీసుకొచ్చారు. 


ఒకప్పుడు రైతులు స్వయంగా తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసుకునేవారు. పురుగుమందుల వాడకం అసలే ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడి లేనిదే చేయలేని స్థితికి తీసుకొచ్చారు.

వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొచ్చారు.

ఒకప్పుడు ఆహారం పంటలు మనదగ్గరే పండేవి కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి ఆహార పంటలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గాయి.పశుసంపద తగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్ని కొనుక్కోవలసిందే.విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనిదే ఏమి తినలేం. పంటలు ఎలాగు పండవు అందుకని భూములు అమ్ముకొంటున్నారు.



అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు తిని హాయిగా ఆరోగ్యంగా జీవించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, పురుగుమందులు వేసి పండించిన పంటలు  తిని రోగాల పాలు అవుతున్నారు. 


ఇదా అభివృద్ధి అంటే...???



  మనిషికి కావలసింది ఏంటి కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యకరమైన జీవితం. అంతే కాని డబ్బు కాదు. 

  

కాని డబ్బు డబ్బు అని ఆశ చూపించి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని నాశనం చేస్తున్నారు.

దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చేను కంచె చేసినట్టు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నరు. ఎందుకు ఈ కోట్లు డబ్బులు తింటారా, ఆరోగ్యం పాడైనాక ఎన్నికోట్లు ఉండి ఏం లాభం. పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నాశనం చేసే కోట్ల రూపాయల డబ్బు ఎందుకు...? పర్యావరణం నాశనం అయ్యాక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి మునుపటి స్థితికి రాదు. 


 111 జీవోను ఎత్తేసి రెండు నదుల పరివాహక ప్రాంతంలోని రైతులను కోటీశ్వరులను చేస్తాం  అని సారు చెప్తున్నాడు. జీవో ఎత్తేస్తే ఏమవుతుంది ఆ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలు, అపార్ట్ మెంట్లు పరిశ్రమలు వస్తాయి.పరిశ్రమలనుండి విడుదలయ్యే కాలుష్యం తో రెండు నదులు, రెండు జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో గాలి,నీరు,నేల అన్నిరకాలుగా కలుషితమే. ఇప్పుడు జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుంది. జీవో ఎత్తేస్తే అటుపక్కకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది.

 ఎలాగంటారా ఆ సుగంధాన్ని భరించలేం మరి....!!!


  2018 లో  హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, బుద్దుని విగ్రహం చూద్దామని నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగాను. అక్కడ నుండి ప్రారంభం అయ్యింది ఏదో దుర్గంధం ఎంటీ వాసన అనుకుంటూ  ముందుకు నడుస్తున్నాను. అప్పటికే ఆ వాసనకి తల పట్టేసింది ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సువాసన పెరిగిపోయింది. ఈ లోపు హుస్సేన్ సాగర్ కనబడింది. అందులో నీళ్ళు చూసేసరికి అర్థం అయింది ఆ దుర్గంధం ఈ సాగర్ నుండే వస్తుందని. ఆ నీళ్ళల్లో కూడా బోటు షికారు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుండే ఆ వాసన భరించలేక తల తిరుగుతోంది అలాంటిది హుస్సేన్ సాగర్ మద్యలో   బోటు షికారు చేస్తున్నారు అంటే నిజంగా మీకు దండం పెట్టాలి..🙏🙏🙏🙏

 అంతటి దుర్గంధభరితమైన నీటిలో బోటు షికారు చేసే వారిని చూసినపుడు నాకు ఆశ్చర్యం,జాలి, అసహ్యం, అన్ని ఒకేసారి అనిపించాయి..

 అతిపెద్ద సాహసం అది.....!!!

 5నిమిషాలు కూడా అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కు వెళితే అక్కడకు కూడా సాగర్ సువాసన వస్తూనే ఉంది..

 నేను చాలా సార్లు విన్నా ట్యాంక్ బండ్,బుద్దుని విగ్రహం ఆ చుట్టుపక్కల పార్కులు బాగుంటాయి అని  గొప్పలు చెప్పెవారు. నాకు అక్కడకు వెళ్ళి చూడాలని కుతూహలంగా ఉండేది. ఇక్కడకు వచ్చి చూసాక తెలిసింది ఈ కాలుష్యం గురించా ఇంత గొప్పగా చెప్పారని.  ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో నిండిన ఆ ప్రాంతంలో10నిమిషాలు కూడా ఉండలేం.. అందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని... 

 ఇది చూసిన తర్వాత నేను ఒకటి బలంగా చెప్పగలను

 దీనికంటే లక్షరెట్లు మా ఊరి చెరువులు గొప్పవని..

స్వచ్చమైన గాలి, నీరు, నింగి,నేల ఉన్న నా పల్లెటూరు గొప్పది...


ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి సరస్సే కదా మరి ఇప్పుడు కాలుష్య సాగర్ గా మారింది. దీనికి కారణం అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వ్యర్థాలను సాగర్ లోకి వదిలి పెట్టి, కనీసం ఆనీటిని తాకడానికి కాదుకదా చూస్తేనే, అటునుండి వెళ్తేనే వాంతికొచ్చెలా చేసారు....

అభివృద్ధి వద్దనడం లేదు కాని ప్రణాలిక లేని అభివృద్ధి మానవాళికి చేటు.. ప్రపంచంలో హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు నదుల పక్కనే ఉన్నాయి అక్కడ ఇలాంటి కాలుష్యం లేదే... మరి మన దగ్గర ఎందుకిలా అంటే మన నాయకుల స్వార్థ రాజకీయాల వలన ఇలా ఉంది..


ఎందుకు ఇది చెబుతున్నానంటే  రోడ్లు, బిల్డింగ్స్ కట్టేసి   సహజ వనరులను మురికి కూపంగా మార్చడం అభివృద్ధి కాదు.. హుస్సేన్ సాగర్ బాగు చేయడం ఈ జన్మలో జరగదు. సరే వదిలేద్దాం.. ఇప్పుడు 111 జీవో ఎత్తేసి   జంట జలాశయాలను కూడా హుస్సేన్ సాగర్ లా మార్చాలనుకుంటున్నారు.... సారు..

ఇప్పుడు రెండు జలాశయాలు స్వచ్చమైన నీటితో శుభ్రంగా ఉన్నాయి.. వాటి చుట్టుపక్కల పరిశ్రమలు, బిల్డింగ్స్ కట్టేసి వాటిని కూడా మురికి కూపంగా మార్చేయాలి... ఇదేందయ్యా ఇది అంటే అభివృద్ధి..

అప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను హుస్సేన్ సాగర్ 2, హుస్సేన్ సాగర్ 3అని అనాలి...

ఇప్పటికీ మూసీ నది గండిపేట చెరువు వరకు స్వచ్ఛమైన నీటితో జూన్ లో వర్షాలు ప్రారంభం నుండి డిసెంబర్ వరకు ప్రవహిస్తుంది. మన నాయకుడు అభివృద్ధి చేసిన తర్వాత మురికి కూపంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది వ్యర్ద జలాలతో.


ఎవరు 111 రద్దు చేయమని చెప్పింది. ఈ జీవో వలన భూముల ధరలు లేక రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. రైతుల నష్టం ఏమో కాని నాయకుల లాభం కోసం అని అందరికి తెలిసిందే... నిజంగా ఏ నాయకుడికి రైతులపై, ప్రజలకు మంచి చేయాలని ఉండదు.    కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇన్ని డ్రామాలు. ఆ ఓట్లను నోట్లతో కొనాలి. మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇలా అభివృద్ధి పేరిట దోచుకుంటే వస్తుంది..


అయ్యా మీరు ప్రజలను కోటీశ్వరులను చేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను నాశనం చేయకుంటే చాలు అదే పదివేలు....🙏🙏😌😌..


సొంత లాభం కొంత మానుకోని

పరుల సేవకు పాటుపడవోయ్.


ప్రజల సేవకు పాటు పడకపోయినా పర్వాలేదు.

పర్యావరణాన్ని నాశనం చేయకండి..







30, జనవరి 2022, ఆదివారం

రైతుల పొట్ట కొడుతున్న రాజు...

 



ఏమైంది తమ్మీ బాధపడుతున్నవ్``.


రరర గురించి అన్నా ..


ఏంది" రరర రహాదారి..గురించా..


అవును...


దానికి బాధ ఎందుకు..


భూములు పోతున్నయ్ అన్నా"


పరిహారం ఇస్తడు గదా"


ఎంత ఇస్తడు అన్నా" కోట్లలో ఉన్న భూమికి లక్ష రూపాయల ఇస్తరంట.ఆ లక్షతో ఏమోస్తది అన్నా.

 సార్ రెైతుల నోట్లో మట్టి కొడుతుండు".


గట్ల అంటవెంది తమ్మి. సార్ ఎంత మందికి మేలు చేస్తుండో తెలుసా. ఈ రహాదారి వేస్తే నీ పొలం నుండే నేరుగా,త్వరగా రాజధానికి వెళ్ళి నీ పంట ఎక్కువ ధరకు కు అమ్ముకోవచ్చు. 


పంటనా భూములే లేనప్పుడు ఇంకా ఏం పంటలన్నా"


తమ్మి నీ భూమి పోయిందేమో చుట్టుపక్కల ఉన్న భూముల రైతులకు లాభం కదా"


ఇంకెక్కడా చుట్టుపక్కల రైతులన్నా రహదారి వస్తుందని భయపెట్టి రైతుల నుండి తక్కువ ధరకు భూములు కోనేసుకున్నరు" ఇంకా రైతులకు ఏం లాభం.


తమ్మి  రైతులంటే ఎండనకా వాననకా కష్టపడి పంటలు పండించే వారు కాదు తమ్మి. తక్కువ ధరకి భూములు కొని కష్టపడకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యేవారు" 


అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులా అన్నా...


కాదు తమ్మి మన రాజు దృష్టిలో రెైతులు వాళ్ళు...


ఏమో రాజ్యం సాధిస్తే బతుకులు బాగు పడుతాయి అనుకున్నా ఇలా బజారునా పడుతాయనుకోలేదు. రాజ్యం కోసం రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తే ఇలా జీవితం రోడ్లపాలు అవుతదనుకోలేదు.


"ఏ పల్లె పిల్లాడో  ఏ తల్లి బిడ్డోడో అయ్య కడుపు నింపుకోడానికి రాజ్యము తెచ్చాడో..

పేద ప్రజల కడుపు కొట్టి బాధలు పెడుతుండో...



గట్ల అంటవెంది తమ్మి సారూ రాజ్యం సాధిస్తే ఏమోస్తదని చెప్పిండు.


అప్పుడు ఏమోస్తదని చెప్పిండోగాని ఇప్పుడు మాత్రం చిప్ప చేతికోస్తుందన్నా...


అబ్బా నీకు అర్థం కావట్లేదు తమ్మి...

సార్ రాజ్యం వస్తే మన నీళ్ళు మనకు వస్తాయి, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయి  అన్నాడు. 


వచ్చినయా మరీ...


వచ్చినయ్ గదా పీళేశ్వరం నుంచి ఏళేశ్వరం, ఏళేశ్వరం నుంచి పీళేశ్వరం ఎత్తిపోసుకునుడు. 


ఎత్తిపోసుకునేడే ఉన్నది. ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు...


తమ్మీ మన నీళ్ళు మనకే అన్నడు గాని మన పంటలకు అనలేదు కదా...


మరీ నిధుల సంగతేమిటి అన్నా"


ఇప్పుడు రోడ్లేసి చుట్టుపక్కల భూముల ధరలు పెంచి జేబులు నింపుతున్నడు కదా...


ఎవరీ జేబులన్నా రియల్ ఎస్టేట్ రైతులవా" 


అంతేగా అంతేగా"


మరీ నియామకాల సంగతేమిటి అన్నా..


రాజు పదవి, మంత్రి పదవి, మంత్రి పదవి, ఎమ్ ఎల్ సీ  పదవి..


అన్నా నేనడిగింది మీ పదవుల గురించి కాదు. మా ఉద్యోగాల గురించి..


అరే మీ ఉద్యోగాల గురించా.. 


మన కోసం పోరాడి సాధించుకున్న మన రాజ్యంలో మనం ఆత్మగౌరవంగా భావించే ఉద్యోగాలు మన కోసం తీసుకొచ్చాడు సారు..


ఏం ఉద్యోగాలన్నా..


ఇన్ని రహాదారులు ఏసి ఇంత అభివృద్ది చేసేది ఎవరికోసం"


మన కోసమా అన్నా"


కాదు మల్టీ నేషనల్ కంపెనీల రాకకోసం"

అందులో మనకు ఉద్యోగాల కోసం"..


మనం ఆత్మగౌరవంగా భావించే ఉద్యోగాలు అందులోనే ఉంటాయి..


ఏం ఉద్యోగాలన్నా"


సెక్యూరిటీ గార్డులు"!

హౌస్ కీపింగ్"

పాయఖానలు కడిగే గొప్ప గొప్ప ఉద్యోగాలు మన కోసం తెచ్చాడు  మన అందరి సారు...


అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలో పాయఖాన కడిగే ఉద్యోగం. ఎంత మందికి వస్తుంది ఈ అద్భుతమైన అదృష్టం. ఇది మన సార్ వల్లే సాధ్యం.


అన్నా అంత అద్భుతమైన ఉద్యోగం నాకు వద్దన్నా..


మూర్ఖుడా! "పందికేం తెలుసు పెర్ఫ్యూమ్ వాసన" అన్నట్టుంది నీ యవ్వారం. ఇంత మంచి ఉద్యోగం ఇస్తే వద్దంటావా..


అందుకే వద్దన్నా ఆ పర్ర్ ఫ్యూమ్ వాసన...


సరే ఉద్యోగం వద్దయితే సారూ ఇంకో స్కీం తెచ్చాడు.


ఎందన్నా అది"?


బర్రెలు, గొర్రెలు..!!


ఏం చేయాలి కోసుకొని తినాలా"?


కాదు.


మేపాలి"


ఎక్కడ మేపాలన్నా...?


చుట్టుపక్కల రోడ్లు, ఫ్లాట్లు ఇంకెక్కడా మేపేది..?


సారు ఫాం హౌస్ లా మేపు. నీ 🐑...


ఇప్పుడు ఒకటి నాకు ఒకటి అర్థం అయ్యిందన్నా"!


ఏంది తమ్మీ"!?


గొర్రె కసాయి వాడినే నమ్ముతుందని..


అంటే ఈ రాజ్యంలో ప్రజలు""!!??


గొప్పోలన్నా...