భానోదయం: 2023

25, ఆగస్టు 2023, శుక్రవారం

ఓవరాక్షన్ స్టార్ కి మరీ ఓవరాక్షన్ ఎక్కువయ్యింది

 ఖుషి సినిమా ఆడియో ఫంక్షనో ఏదో జరిగింది. అందులో విజయ్ దేవరకొండ అంగి విప్పేసి సమంతను ఎత్తుకుని తిప్పడం చూస్తే నాకైతే ఓవరాక్షన్ కే ఓవరాక్షన్ అనిపించింది. అసలు ఎందుకు అలా చేసారో అర్థం కాలేదు. కొండన్న , సమంత డ్రెస్సులు మామూలుగా లేవు. ఏంటో ఆ డ్రెస్సింగ్ స్టైల్.


ఇక కొండన్న అంగి విప్పేసి సమంతను ఎత్తుకుని తిప్పడం, సమంత కొండన్న పై ఎక్కడం చూస్తే అసలు అది ఆడియో ఫంక్షనా లేక ఫ్రీ వెడ్డింగ్ షూటా అని డౌటు...


విజయ్ దేవరకొండ కి ఓవర్ యాక్షన్ ఎక్కువ ఆయన ప్రతీ సినిమా ఫంక్షన్లో అతి చేస్తాడు. లైగర్ సినిమా అప్పుడు కూడా అతి చేసాడు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా కాని దేవరకొండ కి అతి తగ్గకపోగ మరీ ఎక్కువయ్యింది. ఖుషి ఆడియో ఫంక్షన్లో అది కనబడింది. అంగి విప్పేసి సమంతను ఎత్తుకుని తిప్పడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇండియాని షేక్ చేస్తా అనడం చూస్తుంటే కొండన్న కి ఓవరాక్షన్ మరీ ఎక్కువయ్యింది.


 ఇక్కడ ఆయన ఫ్యాన్స్ ఉంటే కోప్పడకండి మీ హీరోకి చెప్పండి కొంచెం తగ్గి ఉండమనండి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలి. ఎగిరెగిరి పడకూడదు. దేవరకొండ కంటే గొప్ప హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు వారెవరు ఇంత ఓవరాక్షన్ చేయరు. ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో వారు అలాగే మాట్లాడుతారు. చాలా హుందాగా ఉంటారు. అంతేకాని నా అంత మొగోడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే లేడు అన్నట్టు ఉంటుంది విజయ్ దేవరకొండ అతి... 


ఇక సమంత గురించి చెప్పాలంటే ఆడపిల్లలని విమర్శించడం నా ఉద్దేశం కాదు. కాని సమంత అలా చేయడం అస్సలు బాగోలేదు. ఇలా ఏ హీరోయిన్ సినిమా ఫంక్షన్లలో చేయరు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత మరీ ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తుంది. నాగచైతన్య మీద కోపంతోనో లేదా ఇంకా నేను హాలివుడ్ రేంజ్ యాక్టర్ కావాలనో తెలియదు కాని సమంత అలా చేయడం కరెక్ట్ కాదు.


సమంత ఇంకా చిన్న పిల్లల ప్రవర్తించడం ఏంటో మరో నాలుగేళ్ళ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రావు అప్పుడు ఏం చేస్తుంది. అప్పుడు హాలివుడ్ లో నటిస్తుందా. ఆశకంటూ హద్దు ఉండాలి సినిమాలు చేసింది చాలా హిట్టు సినిమాలు చేసి టాప్ హీరోయిన్ అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలు చేయ్యోద్దని అనడం లేదు. కాని ఎలాంటి సినిమాలు చేయాలి. హుందాగా ఉండే సినిమాలు చేయాలి. అంతేకాని మరీ జుగుప్సాకరమైన రీతిలో ఉండే సినిమాలు చేయడం దేనికి. డబ్బు లేకనా, గొప్ప పేరు లేకనా అలాంటి సినిమాలు చేయడం. ఫ్యామిలి మ్యాన్ అనే వెబ్ సిరీస్ ఉంటుంది అందులో నటించడం సమంతకు అవసరమా... 


ఇలాంటి వారు పెళ్లి ఎందుకు చేసుకోవాలి. అలాగే సినిమాలు చేసుకుంటూ జీవించాలి. అంతేకాని నాగచైతన్య లాంటి మంచి వ్యక్తిని బాధపెట్టడం దేనికి.


నాగచైతన్య లాంటి వ్యక్తిని సమంత దూరం చేసుకోవటం సమంత దురదృష్టం.. 


సరే ఎవరి జీవితం వారిది నచ్చలేదు విడిపోయారు. కాని ఇప్పుడు ఈ ఓవరాక్షన్ దేనికి...


అయినా వేరే ఏ హీరోయిన్ దొరికినట్టు సమంతానే దొరికిందా ఈ సినిమాకి.. 


మొత్తానికి  కొండన్న, సమంత లాంటి గొప్ప నటీనటుల అతి, ఓవరాక్షన్ వల్ల ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అవ్వడం గ్యారెంటీ...


ఏదైనా సినిమాలో ఏమి లేకుంటే ఆడియో ఫంక్షన్లో, సినిమా ప్రమోషన్లలో హీరో గారి అతి, ఓవరాక్షన్ ఎక్కువుంటుంది. అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని...


నాకైతే విజయ్ దేవరకొండ చేసిన ఓవరాక్షన్ అస్సలు నచ్చలేదు.. ఆయన వేసుకున్న డ్రెస్సు ఒక లంగా లాగా ఉంది. ఇక స్టేజీ మీద షర్ట్ విప్పి సమంతను ఎత్తుకుని తిప్పడం చూస్తుంటే నాకే కాదు తెలుగు ప్రేక్షకులకు ఎవ్వరికి నచ్చలేదు.. 


విజయ్ దేవరకొండ ఓవరాక్షన్ తగ్గించుకుంటే సమాజానికి బాగుంటుంది. ఎందుకంటే ఈయనను ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువత కూడా బయట అలాగే చేస్తారు. పెద్దలకు గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు.. 


సమాజంలో ఇలా ఉంటేనే హీరోయిజం అనుకుంటారు..

విజయ్ దేవరకొండ, సమంత లాంటి నటులు సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నారో.. ఇలాంటి నటుల సినిమాలు చూడకపోవడమే సమాజానికి శ్రేయస్కరం... 




15, జులై 2023, శనివారం

తెలంగాణలో ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే దర్శనమిస్తున్నారు



 

తెలంగాణలో ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే దర్శనమిస్తున్నారు. వ్యాపారాలు పెద్ద వ్యాపారాల నుండి చిన్న వ్యాపారాల వరకు వారే చేస్తున్నారు. ఇక్కడ స్థానిక వ్యాపారులకు వ్యాపారం లేకుండా పోయింది. అలాగే నిర్మాణ రంగంలో పనులు కూడా ఉత్తర భారతీయులే చేస్తున్నారు. ఇక్కడ కూలీలకు పనిలేకుండా పోయింది. మేస్త్రి పని, మార్బుల్,టైల్స్, ఫాల్ సీలింగ్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ ఇలా అన్ని పనులు వారే చేస్తున్నారు. స్థానిక ప్రజలకు పనిలేకుండా పోయింది. 


పరిశ్రమలలో కూడా వారే కార్మికులు. ఏ పని చూసినా ఉత్తర భారతీయులే చేస్తున్నారు. వీరివల్ల స్థానిక ప్రజలకు ఉపాధి లేకుండా పోతుంది. గ్రామాల్లో నిన్న, మొన్న వేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కూడా వారితోనే చేయిస్తున్నారు. 


వారు పని బాగా చేస్తారు, తక్కువ వేతనానికి పనిచేస్తారు, పని పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళరు అనే కారణంతో ఎక్కువగా వలస కూలీలతోనే పని చేయించుకుంటున్నారు ఇక్కడి కాంట్రాక్టులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు. ఇలాగే కొన్నేళ్లు గడిచాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఉత్తర భారతీయులే పెత్తనం చెలాయిస్తారు. 


హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది వలస కూలీలు చాలా అవసరం కాని ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతాల్లో చూసినా వలస కూలీలే ఉన్నారు. చివరకు పోలాల్లో పనిచేయడానికి కూడా వారితోనే చేయించుకుంటున్నారు. 


ఇలా ప్రతీ పనికి వలస కూలీలతోనే ఎందుకు చేయించుకుంటున్నారు అంటే. వారు తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేయడం, పని అయిపోయేంతవరకు ఎక్కడకు వెళ్ళరు అక్కడే ఉండి పని పూర్తిచేస్తారు. 


ఉదాహరణకు ఒక ఇల్లు కడితే తాపీ పనికోసం మేస్త్రిలు, కూలీలు ఆ ఇంటి పక్కనే చిన్న షెడ్ వేసుకుని ఇల్లు పూర్తిగా కట్టేంత వరకు అక్కడే ఉండి పనిచేస్తారు. పండుగలు, పెళ్ళిళ్ళు, దావత్ లు అని ఎక్కడికి వెళ్ళరు. అందుకే వారితోనే పనిచేయించుకుంటున్నారు.


మరి మన దగ్గర కూలీపని చేసేవారు లేరా అంటే ఉన్నారు. తక్కువ వేతనానికి మనవారు ఎక్కువ పనిచేయలేరు. మనవారికి పండుగలు, పెళ్ళిళ్ళు వంటివి వస్తే పనులకు వెళ్ళరు. ఇలాంటి కారణాలతో అన్ని పనులు వలస కూలీలతోనే చేయించుకుంటున్నారు.


తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. చాలామంది రైతులు తమ భూములను అమ్మేసారు ఒకప్పుడు లక్షల  రూపాయల ధర ఉన్న ఎకరం భూమి కోటి రూపాయలు అనేసరికి చాలా మంది రైతులు భూములు అమ్ముకొని కొందరు మారుమూల ప్రాంతాల్లో భూములు కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఒకప్పుడు పెంకుటిల్లు లో నివసించే వారు ఇప్పుడు అన్ని హంగులతో నగరాల్లోని ఇండ్లలో ఉండే సౌకర్యాలు తమ ఇంట్లో ఉండేలా చూస్తున్నారు. పాత ఇంటిని తీసేసి కొత్త కాంక్రీటు ఇల్లు నిర్మించుకుంటున్నారు అందులో గ్రానైట్ ఫ్లోరింగ్, బాత్రూం,కిచెన్ లో టైల్స్, గోడలకు  లప్పం, ఆకర్షనీయమైన రంగులు, ఫాల్సీంలింగ్, లైటింగ్ ఇలా అన్ని హంగులతో ఇల్లు నిర్మించుకుంటున్నారు. 


తాతలు సంపాదించిన భూములు అమ్ముకొని కొందరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇలా పక్కవాడు ఇల్లు కట్టుకుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి వాడికంటే గొప్పగా ఇల్లు కట్టాలని ఎకరం పొలం అయినా అమ్మేసి మరీ ఇల్లు కట్టుకుంటున్నారు. పొలం ఉన్నోడు పొలం అమ్మి ఇల్లు కట్టుకుంటే మరి పొలం లేనోడు ఏం చేస్తాడు చెప్పండి. కూలీ పనిచేసి ఇల్లు నిర్మించాలంటే అది జరగని పని రోజు కూలీ చేస్తే వచ్చే డబ్బులు తినడానికి,ఇంటి అవసరాలకే సరిపోతుంది. ఇక ఇల్లు ఎలా కట్టుకుంటాడు. అందుకే కూలీ పని చేస్తే డబ్బులు ఎక్కువ సంపాదించలేమని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గా మారి కొందరు బాగానే సంపాదిస్తున్నారు. వారిని చూసి మరికొందరు ఇలా గ్రామాల్లో చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గా మారిపోయారు. ఖరీదైన కార్లలో తిరగాలి, పెద్ద బంగళాల్లో ఉండాలి, రెస్టారెంట్లో తినాలి, బార్లలో తాగాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే ధోరణిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు. ఇలాంటి ఆశలు నెరవేరాలంటే కూలీ పనిచేస్తే కుదరదు కాబట్టి తెలంగాణ లో చాలామంది   కూలీ పనులు చేయడంలేదు అందువల్ల వలస కూలీలతోనే చాలా పనులు చేయించుకుంటున్నారు. 


ఇది ఇలాగే కొనసాగితే మనవారు ఇతర దేశాలకు వలస కూలీలుగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గల్ఫ్ దేశాల్లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.


తర్వాత కొన్నాళ్లకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల వారు ఇతర దేశాలకు వలస పోవాల్సిన పరిస్థితి వస్తుంది. 


నేటి యువత కష్టపడకుండా డబ్బు సంపాదించే ఆలోచనల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్నాళ్ళు నడుస్తుంది మహా అయితే మరో పదేళ్లు ఆ తర్వాత భూమి అమ్మడానికి ఎవ్వరూ ఉండరు. రియల్ ఎస్టేట్ వల్ల వ్యవసాయ భూములు చాలావరకు వెంచర్లు, ఫ్లాట్లుగా మారాయి. వ్యవసాయ భూమి తగ్గిపోయింది. వ్యవసాయం చేసేవారు తగ్గిపోయారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంత ధరలు పెట్టి కొనాలంటే చాలా డబ్బు కావాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఇల్లు, పిల్లల చదువులు కోసం చాలా డబ్బు కావాలి సామాన్య ప్రజలకు  అంత డబ్బు సంపాదించడం ఇక్కడ ఉండదు కాబట్టి ఇతర దేశాలకు వలస కూలీలుగా వెళ్ళాల్సి వస్తుంది... 




14, జులై 2023, శుక్రవారం

కూరగాయలు, ఆకుకూరలు బయట కొనడం కంటే ఇంట్లోనే పెంచుకుంటేనే ఆరోగ్యం.

 



కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఇలా అయితే ఎలా కొనేది అని భయపడుతుంటారు సామాన్యులు. ఇప్పుడు టమాటా ధర చూడండి కిలో 200 రూపాయలకు చేరింది. మార్కెట్లో ఏ కూరగాయలు అయినా కిలో 60 రూపాయలకు తక్కువ ధరలో లేవు. దీనికి కారణం ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణం అయితే మరో కారణం కూరగాయలు పండించే వారు తక్కువయ్యారు. అందువలన కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.


అంత ధర పెట్టి కొన్న కూడా అవి రసాయనాలు వేసి పండించిన కూరగాయలే. వాటిని తినడం మూలాన దీర్ఘకాలంలో రోగాలు రావడం ఖాయం. ఇక ఆకుకూరల విషయానికి వస్తే పురుగుమందులు కొట్టందే అవి పండవు అలాంటి ఆకుకూరలు మనం కొని తింటున్నాం. 

నేను ఒక ఊరిలో చూసాను ఒక ఆకుకూరలు పండించే వ్యక్తి ఆకుకూరలు కోసిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఆ ఊరినుండి వచ్చే డ్రైనేజీ నీటిలో వాటిని ముంచి తీస్తున్నాడు. ఆ డ్రైనేజీలో కడిగిన ఆకుకూరలను అలాగే మార్కెట్లో అమ్ముతాడు. చూడండి ఎంత దారుణం ఇది. మనుషులు తినే ఆకుకూరలను ఇలా డ్రైనేజీ మురికి నీటిలో కడగడం చూస్తే చాలా అసహ్యం వేసింది. ఇలా నేను  చూసింది ఒక్కటే చూడనివి ఎన్నో ఉంటాయి. 


కాబట్టి డబ్బులిచ్చి కలుషితమైన కూరగాయలు, ఆకుకూరలు కొని అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు.



 కొంచెం కష్టపడతే మన కూరగాయలు, ఆకుకూరలను మనమే పండించుకుంటే అటు డబ్బు ఆదా అవుతుంది, ఇటు ఆరోగ్యంగా ఉంటాం.


మనం పండించిన కూరగాయలు ఎప్పటికప్పుడు తాజాగా వాడుకుంటాం. 


రసాయనాలు వాడం కాబట్టి చాలా రుచిగా కూరలు ఉంటాయి.


ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఇంటిపెరట్లో కూరగాయలు పండిస్తే.


ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో కుండీలు పెట్టి కూరగాయలు పెంచండి.


వర్మీకంపోస్టు, కొబ్బరి పొడి, మట్టి మిశ్రమంతో కుండీలు నింపి కూరగాయలు పెంచాలి.


మొక్కలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు అందించాలి.


మన పెరటితోటలో పురుగుల బెడద ఉండదు కాబట్టి పురుగుమందుల అవసరం ఉండదు. 


మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టును కంపోస్టుగా మార్చి కూరగాయల మొక్కలకు అందించాలి. 


ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బయట కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు.


బయట కూరగాయలు, ఆకుకూరలు అధిక ధరలకు కొని అనారోగ్యం తెచ్చుకుని, హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బు,సమయం,ఆరోగ్యం పాడుచేసుకునే బదులు మన ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుని ఆరోగ్యంగా ఉందాం.




11, జులై 2023, మంగళవారం

ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే అది ఎన్నికల ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది

 రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని ఓ పాఠశాలను ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు హీమాన్షు దత్తత తీసుకుని కోటి రూపాయలు వెచ్చించి పాఠశాలో కొత్త బెంచీలు, మరుగుదొడ్లు, డైనింగ్ గది, ఆటస్థలం ఏర్పాటు చేసినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలియజేసారు. 


ఈ పాఠశాల మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని విధ్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగుంటుంది.


 ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే కేవలం ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది. 


రాష్ట్రంలోని ప్రతి ఇంచు నాదే అని చెప్పే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతీ మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలను అభివృద్ధి  పరచాలి.


ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే అది ఎన్నికల ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది. 


21, జూన్ 2023, బుధవారం

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక బంధు పథకం. ఆ బంధు, ఈ బంధు ,రాబందు పథకాలు..

 ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ లో పాలకులకు ప్రజలు గుర్తుకు వస్తారు. ఎన్నికలు అయిపోగానే  ఏ ఒక్కడు ప్రజల గురించి పట్టించుకోడు. వీళ్ళకు కావలసింది ప్రజల ఓట్లు మాత్రమే. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా వారితో ఓటు వేయించుకోవాలి అని ఆలోచించి ఏవో కొన్ని పథకాలు ప్రవేశపెడతారు. మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దలితబంధు అనే పథకం తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న దలితులందరికి పదిలక్షలు ఇస్తాం అన్నారు. ఆ పథకం ఏమైంది ఎక్కడో కొద్ది మందికి అదికూడా అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే ఏమి అర్థం అవుతుందంటే ఏదో ఒక హామీ ఇస్తే జనాలు మనకు ఓటు వేస్తారు గెలిచికా ఎవడు అడిగేవాడు ఉండడు అడిగిన అధికారం మనది అనగదొక్కేస్తాం అనే ధీమా తో ఉంటారు మన పాలకులు..


 మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరో పథకం తెరపైకి వచ్చింది. ఆ పథకం పేరు బీసి బంధు అనుకుంటా. రాష్ట్రంలో ఉన్న బీసిలందరికి లక్ష రూపాయలు ఇస్తాం అని ప్రకటించారు. ఇంకేముంది మన జనాలు తండోపతండాలుగా లక్ష రూపాయల పథకం కోసం,  ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జనాలు ఇలా ఉన్నారు కాబట్టే నాయకులు జనాలను గొర్రెల్లా భావించి ఆడుకుంటున్నారు. లక్ష రూపాయిలు ఇచ్చే పథకం అనగానే ఆఫీసుల చుట్టూ పరిగెడుతున్నారు. ప్రజల్లో చైతన్యం లేదు. నాయకుడు తన అధికారం కోసం ఏదో తాయిలం ఆశ చూపుతున్నాడని వెర్రి జనానికి అర్థం కాదు.

  

 దలితులకు పది లక్షలు ఇచ్చాడా, 

   రైతులకు రుణమాఫీ చేసాడా, 

   డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చాడా, 

   నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడా,

   ప్రతీ ఎకరానికి సాగునీరు ఇచ్చాడా.

   

ఇన్ని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఏ హామీ నేరవేర్చలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే మళ్లీ కొన్ని తాయలాలు ఆశచూపి మళ్ళీ అధికారంలోకి రావాలి రాష్ట్రాన్ని దోచుకోవాలి...


జనాలు ఈ హామీల గురించి పశ్నించరు. లక్ష రూపాయిల పథకం అనగానే ఆఫీసుల చుట్టూ పరిగెడుతారు. నిజంగా లక్షరూపాయలతో మీ జీవితంత  మారిపోతుందా ఆలోచించండి. సరే లక్ష్ రూపాయలతో జీవితంలో పైకి వస్తాం అంటే ఆ లక్ష రూపాయలు అందరికి ఇస్తాడా మరీ... మన రాష్ట్రంలో జనాభా 4 కోట్లు అనుకుంటే ఒక నలబై లక్షల కుటుంబాలు బీసీ కుటుంబాలు ఉన్నాయనుకుంటే 40 లక్షలు× 1లక్ష=40 వేల కోట్లు ఎక్కడ నుండి వస్తాయి. 


ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ బంధు,ఈ బంధు, రాబందు అని కొత్త కొత్త తాయిలాలతో జనాలను ఆకట్టుకొని ఓట్లు రాబట్టుకుని గెలిచినాక ఏ ఒక్క నాయకుడు జనాలను పట్టించుకున్న పాపాన పోడు..


కాబట్టి మనకు కావలసింది ఇలాంటి పనికి మాలిన తాయిలాలు, నేరవేర్చాలేని హామీలు కాదు. మనకు కావలసింది నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం. ఇవి చాలు అంతే.. పనికిమాలిన బంధులు అవసరం లేదు. విద్య , వైద్యం కోసమే సామాన్యుడు తాను సంపాదించిన దాంట్లో ఎక్కవగా ఖర్చు చేస్తున్నాడు, అప్పుల పాలు అవుతున్నాడు.


రాజకీయ నాయకుడెవడు ప్రజల అభివృద్ధి కోరుకోడు. వాడికి కావలసింది అధికారం అంతే. అందుకోసం ఏవో కొన్ని పథకాలు అని డబ్బు ఆశచూపి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వస్తాడు. ఆ తర్వాత తరతరాలకు తరగని సంపద పోగేసుకుంటాడు.. 


మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పథకం అని డబ్బు ఇస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకుంటారు.. గెలిచాక హామిలుండవు ఆవకాయ ఉండదు. ఎన్ని వేల ఎకరాలు ఎలా సంపాదించాలి, ఎన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాలి ఈ ఐదు ఏళ్ళలో అని దోచుకునే పనిలో బిజీ అయిపోతారు. ఐదు ఏళ్ళ వరకు అందిన కాడికి దోచుకుంటారు...


వీళ్ళకు ప్రజల కష్టాలు తెలియవు. ప్రజలను ఓటు బ్యాంకు గానే చూస్తారు అంతే తప్పా మనుషులుగా చూడరు. ఇలాంటి వారిని గెలిపిస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే.. 


మరీ ఎవరిని గెలిపించాలి అంటే రాజకీయ నాయకులు అంటేనే దోపిడి.. ఈ పార్టీ ఆపార్టీ అని తేడా ఉండదు. అందరూ అందరే. 


ఈ దోపిడిని ఆపి ప్రజలు అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి....

7, జూన్ 2023, బుధవారం

చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించింది...

 ఒడిశా లో జూన్ 2 న జరిగిన రైలు ప్రమాదానికి కారణం స్టేషన్ లో జరిగిన తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని నా అభిప్రాయం. 


• ఆ రైల్వేస్టేషన్ లో మూడు ట్రాకులు ఉన్నాయి. ఒక ట్రాకులో గూడ్స్ రైలు ఆగింది దాన్ని లూప్ లైన్ అంటారు. మెయిన్ లైన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్ళాలి కాని అది లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. అప్పుడు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు వేగం గంటకు దాదాపుగా 130 కి.మీ. వేగంతో వచ్చి ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం వలన కోరమాండల్ ఇంజన్ గూడ్స్ రైలు పైకి ఎక్కింది కొన్ని బోగీలు మరో రెండు ట్రాక్ లపై పడ్డాయి. ఇంతలో మరో ఎక్స్ ప్రెస్ రైలు యస్వంత్ పూర్ 130 కి.మీ. వేగంతో వచ్చి ట్రాక్ పై పడిఉన్న కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఇలా వెంటవెంటనే రెండు ప్రమాదాలు నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. 


ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తే ఇందులో రైలు డ్రైవర్ తప్పిదం ఏమి ఉండదు. ఎందుకంటే రైలును ఒక లైన్ నుండి మరో లైనుకు మళ్ళించే వీలు రైలు డ్రైవర్ కు ఉండదు. కాబట్టి అతని తప్పిదం ఏమి ఉండదు. అతను చేయవలసిందల్లా సిగ్నల్ ను అనుసరించి రైలును నడపడం వరకే. 


స్టేషన్ మాష్టర్ తప్పిదం లేదా సాంకేతిక లోపం వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు.


రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలును లూప్ లైన్ కి మళ్ళించి అక్కడ ఆపేశారు. ఆ తర్వాత కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆ స్టేషన్ మీదుగా వెళ్ళాలి సిగ్నల్ వచ్చింది రైలు డ్రైవర్ 130 కి.మీ. వేగంతో రైలు ను నడుపుతున్నాడు. మెయిన్ లైన్ లో వెళ్ళాల్సిన కోరమాండల్ లూప్ లైన్ లో కి వెళ్ళి గూడ్స్ రైలును ఢీకొట్టింది.


ఇక్కడ గూడ్స్ రైలును లూప్ లైన్ లోకి మళ్ళించిన తర్వాత ట్రాక్ ను మెయిన్ లైన్ కి మళ్ళించి ఉండకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. అందుకు కారణం అక్కడ స్టేషన్ లో గమనించి ఉండకపోవచ్చు. లేదా సాంకేతిక లోపం వల్ల ట్రాక్ మారక పోవచ్చు.


ఇలాంటి చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించింది.


ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను తొలగించాలి. 


అప్పట్లో సినిమాల్లో చూసే వాళ్ళం రైలు ట్రాకులపై హీరోయిన్ కాలు రైలు పట్టాలు క్రాస్ చేసే చోట ఇరుక్కుపోయేది. ఇంతలో అటునుంచి వేగంగా రైలు వచ్చేది అప్పుడు అందరికి ఒకటే ఆత్రుత హీరోయిన్ ను రైలు డీకొడుతుందేమోనని ఇంతలో హీరో ఆ రైలు పట్టాలపై, కంకరలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద హ్యాండిల్ లాంటి దాన్ని లాగితే రైలు వేరే ట్రాక్ పై వెళ్ళేది ఆ విధంగా హీరోయిన్ ను కాపాడుతాడు అప్పుడు మా ఆత్రుత, కథ సుఖాంతం అవుతాయి.


ఇలా సినిమాలు చూసినప్పుడు తెలిసేది రైలు ఒక ట్రాక్ నుండి మరో ట్రాక్ కు మారాలంటే పట్టాలపై ఉండే ఒక పెద్ద హ్యాండిల్ లాంటి దాన్ని లాగితే మారుతుందని.


ఇప్పుడు కూడా అలాంటి వ్యవస్థ ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా.


సరే ఇది పాత పద్ధతి కొత్త సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించుకోవాలి అని ఒక బటన్ నొక్కగానే ట్రాక్ మారిపోయే వ్యవస్థ ఇప్పుడు ఉంది. అలాంటి వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందా లేదా అని పర్యవేక్షించాలి కదా మొత్తం దానిపైనే ఆధారపడితే ఎలా వాటిలో సాంకేతిక లోపాలు వస్తుంటాయి లేదా ఈ సాంకేతికతను ఉపయోగించే ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.


అదే పాత పద్ధతి లో అయితే ట్రైన్ ట్రాక్ దగ్గర ఒక ఉద్యోగి ఉండి స్వయంగా ట్రాక్ మార్చి ట్రైన్ వెళ్ళాక మళ్ళీ వేరే ట్రైన్ కి వెళ్ళే విధంగా ట్రాక్ ను అమర్చేవాడు ఈ పద్ధతిలో ప్రమాదాలు జరగవు. సాంకేతికత పేరుతో ఉద్యోగాలను తొలగించి రెండు మూడు పనులను ఒక ఉద్యోగిపై వేస్తే పనిభారం వల్ల మతిమరుపు వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.


సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించుకోవాలి అనుకుంటే మొత్తంగా సాంకేతికత పైనే ఆధారపడాలి ఇందులో మనుషుల ప్రమేయం ఉండకూడదు. ఉదాహరణకు రైల్వే ట్రాకు మార్పు సంబంధించి ఆటోమేటిక్ గా రైలు రాకపోకలకు తగ్గట్టుగా వాటంతటా అవే మారిపోయే విధంగా ఉండాలి. లూప్ లైన్ లోకి గూడ్స్ రైలు వెళ్లి ఆగిన వెంటనే ట్రాక్ మెయిన్ లైన్ కి ఆటోమేటిక్ గా కలిపే విధంగా ఉండాలి. 


ఈ విధానం సాధ్యపడదు అనుకుంటే స్టేషన్ లో ట్రాక్ మారిందో లేదో చూడడానికి ట్రాక్ చేంజింగ్ వద్ద ఒక కెమెరా ఏర్పాటు చేయాలి ట్రాక్ మారింది లేనిది అందులో తెలుస్తుంది ఒకవేళ మారకపోతే వెంటనే లోపాన్ని సరిచేయటమో లేదా రైలు ను ఇపుడేమో చేసి ప్రమాదాలు నివారించవచ్చు.



ఈ ప్రమాదానికి కారణం లూప్ లైన్లో కి గూడ్స్ రైలును మళ్ళించడానికి ట్రాక్ చేంజ్ చేసి మొయిన్ లైన్ కి మళ్ళించి ఉండకపోవడం వల్ల మెయిన్ లైన్ లో వెళ్ళాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది అని నేను అనుకుంటున్నాను...





20, మే 2023, శనివారం

స్వామి వివేకానంద సూక్తులు

హైదరాబాద్ కు మరో రెండు హుస్సేన్ సాగర్ లు రాబోతున్నాయి.

 హైదరాబాద్ కు అభివృద్ధిలో భాగంగా మరో రెండు హుస్సేన్ సాగర్ లు రాబోతున్నాయి. అందులో ఒకటి గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువులు హుస్సేన్ సాగర్ లా అభివృద్ధి చెందబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జలాశయాల‌ నీరు స్వచ్ఛంగా ఉంది. ఇకపై హుస్సేన్ సాగర్ నీటిలా పవిత్రంగా మార్చేస్తారు. 


111 జీవో రద్దుతో ఈ రెండు జలాశయాలు మురికి కూపంలా మారబోతున్నాయి. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ జీవోను రద్దు చేస్తున్నట్లు పాలకులు చెబుతున్నారు. పాలకులకు ప్రజలపై ఎంత ప్రేమ ఉందో కదా. ప్రజల కష్టాలను తీర్చడం కోసం మీ పాలకులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 111 జీవో వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు అందుకోసం ఈ జీవోను రద్దు చేశారు. ఇక్కడ భూముల విలువలు తక్కువగా ఉండటంతో రైతులు నష్టపోతున్నారు అని చెబుతున్నారు. అక్కడ  ఇదివరకే తక్కువ  ధరకు భూములు కొన్న పెద్ద రైతులు నష్టపోతున్నారు. అలాగే అక్కడ ఫామ్ హౌస్ లు కట్టుకున్న రైతులు నష్టపోతున్నారు అందుకోసం ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి 111 జీవోను రద్దు చేస్తుంది. ప్రభుత్వానికి రైతులంటే ఎనలేని ప్రేమ. 

2000 రూపాయల నోట్లను రద్దు చేయడం మంచిదే. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బంది ఉండదు.

 2000 రూపాయలు నోటు ఉపసంహరణ వలన సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర 2000 రూపాయల నోటు లేదు. అసలు ఈ నోటు చూసి చాలా రోజులైంది. బ్యాంకుల్లో, ఏటిఎమ్ లో కూడా ఈ నోటు రావడం లేదు. ఎవరో ఈ నోట్లను ఇంట్లో దాచుకుంటే తప్ప ఎవరి వద్ద ఈ నోట్లు లేవు. పెద్ద మొత్తంలో డబ్బును ఎవరు ఇంటిలో దాచుకోరు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకుంటారు కాబట్టి సామాన్య ప్రజలకు 2000 రూపాయల నోటు రద్దు వలన ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 


2016 లో లాగా బ్యాంకుల్లో వరుసలో నిలబడి నోట్లను మార్చుకునేందుకు పడిన అవస్థలు ఇప్పుడు ఉండవు. ఎందుకంటే అప్పుడు 1000, 500 నోట్లు రద్దు చేసారు తమ డబ్బు ఎక్కడ చెల్లుబాటు కాదో అని తమ దగ్గర ఉన్న నోట్లను ప్రజలు మార్చుకునేందుకు బ్యాంకులకు పరిగెత్తారు.అప్పుడు కూడాఏలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఎవరు కూడా పెద్ద మొత్తంలో డబ్బును తమ ఇంట్లో ఉంచుకోరు. బ్యాంకులోనే దాచుకుంటారు. 


ఇక అప్పుడు బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో జనాలు పరిగెత్తి ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచుకున్న బడాబాబుల వల్లే బ్యాంకుల వద్ద హడావిడి పెరిగింది.

తమ వద్ద ఉన్న కోట్ల రూపాయల నోట్లను సామాన్య ప్రజలకు ఇచ్చి మార్చుకునే ప్రయత్నం చేసారనిపిస్తుంది. అందువల్ల కొంత ఇబ్బంది కలిగింది. సామాన్యుల వద్ద మహా అయితే ఓ పదివేలు ఉంచుకుంటారు లక్షలు, కోట్లు ఇంట్లో ఉంచుకోరు కదా.

ఇబ్బందులు కలిగేదల్లా అక్రమార్కుల వల్లే ఎలాగైనా నోట్లు మార్చుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అందుకు సామాన్య ప్రజలకు కొంత డబ్బు ఆశ చూపించి పాతనోట్లను వారి ఖాతాల్లో జమ చేయించడం వలన బ్యాంకుల వద్ద జనాలు బారులు తీరారు. 


ఇప్పుడు కూడా 2000 రూపాయల నోటు రద్దుతో  ఇలాంటి ఘటనలు జరుగుతాయి. కోట్ల రూపాయల నల్లధనాన్ని సామాన్య ప్రజలకు ఇచ్చి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కాని అందుకు పరిమితి ఉంది రోజుకు ఇరవై వేలు మాత్రమే ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది జనాల చేత నోట్ల మార్పిడి చేయించే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఎవరి దగ్గర కూడా ఒక్క 2000 రూపాయల నోటు లేదు. ఉంటే రాజకీయ నాయకుల వద్ద మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద మాత్రమే ఈ నోట్ల కట్టలు ఉంటాయి.


2019  నుండే 2000 రూపాయల నోటును ముద్రించడం ఆపేసారు. అలాగే బ్యాంకులకు  డిపాజిట్ రూపంలో వచ్చిన నోట్లను తిరిగి జనాలకు ఇవ్వలేదు. అప్పటి నుంచి జనాల్లో 2000 నోటు అందుబాటులో లేకుండా పోయింది. కేవలం వందల కోట్లు అక్రమంగా సంపాదించిన వారివద్దే ఈ నోట్ల కట్టలు  ఉంటాయి. 


వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో ఈ నోట్లను పంచడానికి రాజకీయ నాయకులు దాచి ఉంటారు. ఇలాంటి వారికి పెద్ద సమస్యే. కాని ఎలాగోలా వారు నోట్లను మార్చుకుంటారు. ఎలాగంటే రాజకీయ నాయకులు అంటే అవినీతికి నిలువెత్తు నిదర్శనం. ఏ రూపంలో అయినా అవినీతి చేస్తూనే ఉంటాడు. అసలు రాజకీయం చేసేదే అవినీతి అక్రమ సంపాదన కోసం. వారికి ఎన్నో దారులు ఉంటాయి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసైనా తమ అవినీతి కొనసాగిస్తారు.  ఇక నోట్ల మార్పిడి వారికి సులువే తమ పలుకుబడి ఉపయోగించి చేసుకుంటారు. లేదంటే కార్యకర్తలకు, జనాలకు తలా ఇంత డబ్బు ఇచ్చి మార్చుకుంటారు అది వీలుకాకుంటే  దౌర్జన్యం చేసి అయినా మార్చుకుంటారు.


ఇక మొత్తానికి 2000 రూపాయల నోటను రద్దు చేయడం మంచి పనిచేసారు. అదికూడా ఈ సమయంలో. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేదు. అక్రమంగా సంపాదించిన అవినీతి పరులకే ఇబ్బంది..


నల్లధనాన్ని అరికట్టాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. చాలామంది అక్రమార్కులు 2016 నోట్లు రద్దు తర్వాత జాగ్రత్తలు పడుతున్నారు డబ్బును నిలువ ఉంచుకోకుండా భూములు కొనడం మొదలు పెట్టారు. ఇలా తమ అక్రమ సంపాదనతో వందల ఎకరాల భూమి కొంటున్నారు. ఇలా వందల ఎకరాల భూమి కొనే వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అసలు ఒక వ్యక్తికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కొనే హక్కు ఇవ్వకూడదు. అప్పుడే నల్లధనాన్ని కొంతవరకు అరికట్టగలం...


19, మే 2023, శుక్రవారం

ఏమి ఎండలు దేవుడా! దీనికి కారణం ఎవరు?

 ఎండలు మండిపోతున్నాయి ఏం ఎండలు దేవుడా ఇవి అని అంటున్నారు. బయట తిరగాలంటేనే భయం వేస్తుంది. మా గ్రామంలోనే 38 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇక నగరాల్లో అయితే 45 నుండి డీగ్రీలు ఉంటుంది.

 మరో పది ఏళ్ళలో 50 నుండి 55డిగ్రీలు దాటిపోతుంది. ఇందుకు కారణం ఎవరో కాదు అందరు కారణమే.  చెట్లు, అడవులను నరికేస్తున్నారు. కొండలు, గుట్టలు తవ్వేస్తున్నారు. సామాన్య ప్రజలు ఎవరు కొండలు, గుట్టలు తవ్వేయ్యరు కదా అనొచ్చు.

 

 కొండలను తవ్వేది ఇప్పుడు సామాన్యుల కోసమే. ఇంటి నిర్మాణంలో ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు ఇంటి ఫ్లోరింగ్ కి గ్రానైట్ వాడాల్సిందే. డబ్బు ఎంతైనా పర్వాలేదు. అప్పు చేసైనా గ్రానైట్ వాడాల్సిందే. మరి ఆ గ్రానైట్ కావాలంటే కొండలను కోయాల్సిందే. కంకర, డస్ట్ ఇలా అన్ని ఈ కొండలనుండే తయారు అవుతాయి కదా. ఒకప్పుడు ఈ కొండలు పచ్చని చెట్లతో అంత్తెత్తునా ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ ప్రాంతంలో ఎంత ఎండాకాలంలో అయినా చల్లగా ఉండేది. మరి ఇప్పుడో ఆ ప్రాంతంలో క్రషర్లతో కొండలను పిండి చేస్తున్నారు. పచ్చని ప్రాంతం అంతా వెలవెలబోతోంది దుమ్ము ధూళితో విపరీతమైన వేడితో అక్కడ చుట్టు పక్కల నిలవలేని పరిస్థితి.


ఇళ్ళు కట్టుకోవాలంటే కొండలను తవ్వాల్సిందే వేరే దారి లేదంటే అక్కడ జరుగుతున్న విద్వంసానికి మరోచోట చేట్లను పెంచితే కొంతవరకైనా పర్యావరణం కాపాడవచ్చు. 


ఎక్కడ చూసినా కాంక్రీటు మయం అయిపోయింది ఎండాకాలం వచ్చిందంటే కాంక్రీటు వలన  వేడి ఇంకా పెరిగిపోతుంది. వానాకాలం నీరు భూమిలోకి ఇంకిపోక వరదలు వస్తున్నాయి అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి కరువు ఏర్పడుతుంది.



మనకు ఎవరికి ఇవి  పట్టవు మనకు కావలసింది అభివృద్ధి మాత్రమే. ప్రకృతి ఏమైతే మాకేంటి. ఎండలు మండిపోయి, త్రాగడానికి నీరులేని దుస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది పర్యావరణం విలువ.


ఇలా పచ్చని ప్రకృతి అందాలు ద్వంసం అవడానికి కారణం ఏ ఒక్కరో కాదు అందరు కారణమే. మనం వాడుతున్నాం కాబట్టి వాడు కొండలు తవ్వేస్తున్నాడు. మరీ ఇప్పుడు ఇళ్ళు కాంక్రీటుతో కట్టకుండా ఎలా కడతాం అనుకోవచ్చు. ఇప్పుడు ఇళ్ళు కట్టుకోవడానికి కాంక్రీటు తప్ప వేరే దారిలేదు కాబట్టి అలా కొండలను తవ్వుతూ వెళ్ళాల్సిందే చివరకు ఎప్పుడో అప్పుడు ప్రకృతే సమతుల్యం చేస్తుంది. 

17, మే 2023, బుధవారం

రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి...

  టెక్నాలజీ మారుతున్న కొద్ది కొన్ని రంగాలు కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. ఇప్పుడు సినిమా థియేటర్లు మూత పడుతున్నాయి. దాదాపుగా దాశాబ్ధం క్రితం నుండే చిన్న చిన్న పట్టణాల్లో థియేటర్లను తీసేసి వాటినే ఫంక్షన్ హాల్స్ గా మార్చేసారు. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు కూడా తమ థియేటర్లను మూసేస్తున్నాయి. కారణం టెక్నాలజీ లో వచ్చిన మార్పు.
   ఒకప్పుడు వినోదం అంటే సినిమా థియేటర్లలో సినిమా చూడటమే ఒక సినిమా ను నాలుగైదు సార్లు చూసేవారు అప్పుడు థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతూ ఉండేవి. మరి ఇప్పుడు ఒక సినిమాని చూడాలంటే పదిసార్లు ఆలోచిస్తూ ఉన్నారు జనం. రెండున్నర గంటలు సినిమా చూసే ఓపిక ఇప్పుడు ఎవరికిలేదు, ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సినిమా అయినా చూసే వీలుంది. అదికూడా నచ్చిన సన్నివేశాలు చూస్తూ నచ్చని సన్నివేశాలు దాటవేస్తూ చూసే అవకాశం ఉంది. ఇంత సౌలభ్యం ఉండగా సినిమా థియేటర్లలో ఎవరు సినిమా ఎవరు చూస్తారు. రెండున్నర గంటలు సమయం, డబ్బు వృథా అని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి కొత్త కొత్త సినిమాలు చూడడానికి ఓటిటి యాప్స్ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉండగా ఇంకా థియేటర్లో సినిమాలు ఎందుకు చూస్తారు. 

 ఒకప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చూడాలంటే థియేటర్ వరకు వెళ్లి పెద్ద పెద్ద లైన్లో నిల్చుని టికెట్ల కోసం తొక్కిసలాటలో యుద్ధం చేసి టికెట్లు సంపాదించి, అక్కడ దొరకకుంటే బ్లాక్ లో ఎంత ధర అయినా కొని థియేటర్ లోపలికి వెలితే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ డబుల్ రేట్లకు కొని జెబుకు చిల్లు పెట్టుకోవాలి. ఇంత చేసినా థియేటర్ లోపల పోకిరీల హంగామా మరో తలనొప్పి. ఫ్యామిలీ తో వెళ్తే అంతే చుక్కలు కనిపిస్తాయి. 

 ఇన్ని ఇబ్బందులు పడి ఈ రోజుల్లో సినిమాలు ఎవరు చూస్తారు. ఎంచక్కా ఇంట్లోనే చిన్న థీయేటర్ లాంటి టీవీలు, సౌండ్ సిస్టం ఉన్నాయి. ఏ ఇబ్బందీ లేకుండా ఇంట్లోనే సినిమాలు చూసేయోచ్చు మీ వీలున్నప్పుడు.

ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్కు వెళ్ళేవారు. ఇప్పుడు సినిమాలే ఇంటికి వస్తున్నాయి. అంతా టెక్నాలజీ వల్లే. 

ఇప్పుడు జనాలు సినిమాలు చూడటం తగ్గించేసారు. షార్ట్ ఫిలిమ్స్, వ్లాగులు ఇవ్వే ఎక్కువగా చూస్తున్నారు. అరచేతిలో ఎంటర్టైన్మెంట్ ఉండగా సినిమా థియేటర్లు ఎందుకు దండగా అన్నట్టు ఉంది. ఆ విడియోలు కూడా స్కిప్ చేస్తూ చూస్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం వీడియో చూడడం గొప్ప కేవలం 15 సెకండ్ల వీడియోలు చూస్తారు అంతే. 15 క్షణాలు ఎక్కడ, మూడు గంటలు ఎక్కడ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో థియేటర్ లో మూడు గంటలు సినిమాలు చూసే ఓపిక ఎవరికి లేదు.  కాబట్టి రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి...

23, జనవరి 2023, సోమవారం

ఏడుపాయల వన దుర్గామాత దేవాలయం

  ఏడుపాయల వన దుర్గామాత దేవాలయానికి ఈరోజు వెళ్ళాను. ఉదయం ఇంటినుండి  ఏడు గంటలకి బయలుదేరాను. సంగారెడ్డి, నర్సాపూర్, ఏడుపాయల ఒంటి గంట వరకు చేరుకున్నాను. ఏడుపాయల చేరుకున్నాక తో నీలాలు సమర్పించిన తర్వాత స్నానం చేయాలి మంజీర నదిలో నీరు అంతా ఆకుపచ్చ రంగులో ఉంది. చుట్టుపక్కల పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి అయినా అందరు భక్తులు అలాగే స్నానం చేస్తున్నారు. నేను కూడా అలాగే నదిలో మునిగాను. నదిలోకి దిగాక ఏమి అనిపించలేదు ఇంకా అందులోనే కాసేపు ఉండాలనిపించింది. నాకు అంతగా ఈత రాదు కాబట్టి నదిలో స్నానం చేసి బయటకు వచ్చేసా. నదిలో ఒడ్డున అపరిశుభ్రంగా ఉన్నా నదిలోకి దిగాక అందులోనే కాసేపు ఉండాలనిపించింది. భక్తులు అందరు పరిశుభ్రత పాటిస్తే ఇంకా బాగుంటుంది. కాని ఎవరు మన మాట వింటారు చెప్పండి. ప్రకృతే మనుషులు చేసిన కలుషితాన్ని కడిగి పారేస్తుంది. ఇప్పుడు నేను స్నానం చేసిన నదిలో వర్షాకాలంలో 20 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో మనుషులు చేసిన మలినాలన్ని కొట్టుకుపోతాయి. 


ఏడుపాయలు కొండలు, చెట్లు అడవులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంజీరా నది సింగూర్ ప్రాజెక్టు నుండి ప్రవహించి ఏడుపాయల వన దుర్గా ఆలయం చేరుకోగానే ఏడుపాయలుగా మారి ప్రవహిస్తుంది. ఒక నది ఏడు నదులుగా మారి ప్రవహిస్తుంది కాబట్టి ఏడుపాయల అనే పేరు వచ్చింది.

అమ్మవారు నది ఒడ్డున కొలువై ఉంటుంది. వర్షాకాలంలో అమ్మ వారి పాదాలను తాకుతూ మంజీర ప్రవహిస్తుంది. అప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళడానికి రాదు. గుడిముందు నుండి దాదాపు పదిహేను అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. 


ప్రజలు గుడికి వెళ్ళినప్పుడు చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తారు. అందువలన చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉంటుంది. ఆలయ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, చెత్త బుట్టలు పెట్టి అందులో వేసేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆలయానికి కిలోమీటరు దూరంలో మరుగుదొడ్లు కట్టించి అందులోకే వెళ్ళేలా అవగాహన కల్పిస్తే ఆలయం పరిసరాలలు పరిశుభ్రంగా ఉంటాయి. 


ఆలయానికి రావడానికి కొత్త రోడ్లు, పార్కింగ్  కోసం చుట్టుపక్కల చెట్లు నరికేసారు. వీలైన చోటల్లా చెట్లు నాటితే పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. చెట్లు అంటే మామూలు చెట్లు కాదు పండ్ల చెట్లు నాటాలి. వీటివలన ఇక్కడ కోతులకి ఆహారం లభిస్తుంది. 


ఇలా కొన్ని మంచి పనులు చేస్తే ఏడుపాయల ఆలయానికి వెళ్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఏ ఒక్కరి వల్ల కాదు అందరు  పరిశుభ్రత పాటిస్తే బాగుంటుంది. 


చదువుకున్న యువత ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పరిశుభ్రత పట్ల భక్తులకు అవగాహన కల్పిస్తే ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయని నాఅభిప్రాయం. ఈ స్వచ్ఛంద సంస్థలో చేరిన యువత ఒక్కొక్కరు   సంవత్సరంలో  రెండు రోజులు  ఇక్కడ పరిశుభ్రత పట్ల భక్తులకు అవగాహన కల్పించాలి. 


ఇది జరిగే పనేనా అంటే జరుగుతుంది. నేను స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడానికి సిద్ధం. ప్రకృతి ప్రేమికులు, దైవభక్తి కలవారు మంచివారు ఈ సంస్థలో చేరాలని నా ఆశ. ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తే చాలు వారు పాటిస్తారు. మనం చూసి చూడనట్లు ఉంటే ఇంకా కలుషితం అవుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణను కాంక్షించే వారు స్వచ్ఛందంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీనికోసం ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయాలి. పరిశుభ్రతే దైవం🙏🙏


 నా ఈ పోస్టు చదివిన వారు ఎవరైనా ఏడుపాయలకు తరచుగా వచ్చే వారు ఎవరైనా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. దైవభక్తి కలవారు, ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఏడుపాయల ఆలయానికి వచ్చి పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆశిస్తున్నాను... 


ఏడుపాయల వన దుర్గామాత అందరిని చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను. 


మనం మంచి చేస్తే దైవం మనకు అంతకు రెట్టింపు మంచి చేస్తుంది.


 మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే వంద అడుగులు ఆ దైవం మనవెంట ఉండి నడిపిస్తుంది.


మనం ధర్మం, న్యాయంగా జీవించాలి. అదే ఈ జీవితానికి సార్థకత.


పరిశుభ్రతే దైవం. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిద్దాం, మన దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుదాం. 


🙏🙏🙏🙏🙏

ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఇంటినుండి ఏడుపాయల దేవాలయానికి బయలు దేరాను, మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి చేరాను. మా ఊరి నుండి 100 కి.మీ ఉంటుంది. మొత్తం బస్సు ప్రయాణమే. మూడు బస్సులు మారాలి. ఒక్కడినే వెళ్ళాను చీకటి పడుతుందేమే రావడం ఆలస్యమైతే ఎలా అనుకున్నా. కాని సమయానికి ఇంటికి చేరుకున్నా. ఎక్కడ కూడా బస్సు కోసం వేచి చూడలేదు. వెంట వెంటనే బస్సులు దొరికాయి. అంతా అమ్మ వారి దయ... 


ఎవరైనా ఏడుపాయల దేవస్థానాన్ని  దర్శించే వారు ఉంటే మీ అభిప్రాయం తెలియజేయండి...